ఒత్తిడి లేని చదువులు కావాలి

నేడు విద్యార్థి పరిసరాలతో మమేకమైన జ్ఞానానికి దూరమై మార్కుల మోజులో పడి బట్టీ చదువులను ఆశ్రయిస్తున్నాడు. ప్రస్తుత విద్యావిధానం ప్రాధమిక స్థాయి నుండే విద్యార్థులకు పోటీ ప్రపంచాన్ని అలవాటు చేయాలనే తపనతో ఎక్కువ శాతం విద్యా సంస్థలు పిల్లలను ఆట,పాటలకు కూడా తీరిక లేకుండా చేస్తూ విద్యార్థులకు ఒత్తిడి పెంచే విధంగా రూపుదిద్దుకుంది.ఈ ఒత్తిడితో కూడిన విద్య వల్ల ఆశించిన మార్కులు వస్తున్నాయనే భ్రమలో ఉన్నారే గాని ఆ మార్కులు విద్యార్థుల ఆలోచన విధానాన్ని మెరుగుపరిచేలా చేయలేవని గమనించే స్థితిలో  చదువు అర్థం కానప్పుడు బట్టీ సాధనం అవుతుంది ఇంగ్లీషుమీడియం బడుల్లో భాష మీద పట్టురాకమునుపే ఆ భాషలో చదువుచెప్పటం వల్ల అర్థం కాదు. అర్థంకాని చదువుతో మార్కులు తెచ్చుకోవాలి అంటే పిల్లలకు బట్టీనే దారి. అర్థం చేసుకుని చదివితే అరగంటలో అయ్యే పాఠానికి బట్టీ పెట్టటం కోసం కొన్ని గంటలు కుస్తీ పడాలి. పైగా బట్టీ పెట్టింది ఎక్కువ కాలం గుర్తుండదు కనుక సేన పు మళ్ళీ దాన్ని తిరగతోడుతూ ఉండాలి. ఇందువల్ల చదువుకోసం మామూలుగా వెచ్చించాల్సిన సమయం కంటే అదనపు సమయం కావాలి.

వ్యక్తిత్వ వికాస విద్య అవసరం
బట్టి చదువు వల్ల బుద్ధి వికాసానికి, వ్యక్తిత్వ ఎదుగుదలకు ఉపయోగపడే చదువేతర కార్యక్రమాలకు కోత పడుతుంది. ఇందువల్ల పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోయే నైపుణ్యాలు ఈ తరం పిల్లల్లో పెంపొందటం లేదు. అవి కొంతమందిలో పెంపొందినా బడితో సంబంధం లేకుండా వారి తల్లిదండ్రులు తీసుకున్న అదనపు జాగ్రత్తలవల్ల అయి ఉంటుంది.మార్కులతో సంబంధం లేని ఇలాంటి నైపుణ్యాలను నేర్పే తీరికా, అవసరమూ ప్రస్తుత బడులకు లేదు. మార్కులు వస్తున్నాయా లేదా అన్నదే వారికి గీటురాయి.

గుది బండలా చదువు ఒత్తిడి
బిడ్డలు ఎదిగాక, జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఎదుర్కొనే చేవలేనివారుగా, సామాజిక చైతన్యం లేనివారుగా తయారు అవుతున్నారు. అందుకనే పాతికేళ్ళకు మునుపు కనీ వినీ ఎరగని ‘‘చదువు ఒత్తిడి’’ అనే గుదిబండ ఇపుడు పిల్లల మెడలో వేలాడుతోంది.

ఇంకా బ్రిటిష్‌ ‌వారి విద్యావిధానాలే
విద్య వంటి అనేక విషయాల్లో బ్రిటిష్‌ ‌వారి విధానాలనే ఇప్పటికీ అవలంబిస్తున్నాం.గుమస్తా గిరికిఅవసరం వచ్చే చదివే నేర్చుకుంటున్నాం.వీటికి తోడు ఇప్పటి జీవనానికి దూరంగా, మామూలు జీవితానికి సంబంధం లేని పాఠాలు, బయటికి వచ్చాక తరగతి గదిలో నేర్చుకున్నది నిజజీవితంలో ఎక్కడ ఉపయోగపడ్తుందో తెలియక ఎంతో మంది విద్యార్థులు అయోమయానికి గురి అవుతున్నారు.

స్వేచ్ఛ లేని చదువు
ఫ్యూచర్‌ ‌లో ఏమవ్వాలి అని ఆలోచించుకొనే స్వేచ్చ తల్లిదండ్రులు ఇవ్వడం లేదు. విద్యాసంస్థలు ఆ చిన్నపాటి కలల్ని వీక్లీ టెస్ట్ ‌లు, స్పెషల్‌ ‌క్లాసులు అంటూ చంపేస్తున్నారు.  పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా విషయజ్ఞానాన్ని పిల్లలపై రుద్దడం జరుగుతుంది. నేటి విద్యాసంస్థలు బట్టీ చదువులతో ర్యాంకులను, మార్కులను చూపెడుతూ సమాజాన్ని మెప్పించే సంస్కృతినీ పెంచి పోషిస్తున్నారు.

ఒత్తిడితో ఆత్మహత్యలు
ప్రతి ఏడాది వందల సంఖ్యలో విద్యార్ధులు మార్కుల టెన్షన్‌ ‌తో, ఇంట్లో/కాలేజ్‌ ‌ప్రెజర్‌ ‌తో మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మార్పు రావాలి
ఈ విద్యార్ధుల బలవంతపు చావులు ఆపాలంటే మార్పు రావాల్సింది విద్యార్ధుల్లో మాత్రమే కాదు. లక్షల మొత్తం ఫీజులు దొబ్బేసి.. విద్యార్ధులను గంటలకు గంటలు క్లాస్‌ ‌రూమ్స్ ‌లో ఉంచేసి వారి బుర్ర టెక్సట్ ‌బుక్స్ ‌తప్ప మరో విషయం గురించి ఆలోజింపనివ్వని విద్యాసంస్థల్లో రావాలి.ఎక్కువ మార్కులు రావాలని తమ బిడ్డలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న తల్లిదండ్రులలో మార్పు రావాలి.ధనార్జనే ధ్యేయంగా విద్యా సంస్థలను నడుపుతున్న యజమానుల్లో మార్పురావాలి.మార్కులతోవిద్యార్థిని అంచనావేసే పరీక్షా విధానంలోమార్పు రావాలి.ప్రభుత్వ కరికులం లో మార్పు రావాలి.

తగిన విశ్రాంతి అవసరం
తగినంత నిద్ర విశ్రాంతి కూడా లేకుండా గంటల తరబడి చదివితే ఆరోగ్యం పాడయి తగిన నిద్ర లేకపోవడంవలన బుర్ర మొద్దుబారి చదివిన విషయాలు గుర్తురాక చివరికి చదివిన ప్రయోజనం కూడా దక్కకుండా పోయే ప్రమాదం ఉంది.

సరళం నుండి క్లిష్టమైనవి నేర్చుకోవాలి
విద్యార్థులు పెరిగేకొద్దీ వాళ్లు నేర్చుకోవలసిన వ్ఞిన, నైపుణ్య విధానాలను కూడా విద్యావేత్తలు క్రోడీకరించారు. అంటే చిన్నప్పుడు సరళమైనవిధంగా పెరిగేకొద్దీ క్లిష్టమైనవిధంగా నేర్చుకోవాలి. చదువు ముగిసే సమయానికి సంక్లిష్టమైన విషయాలను అర్థంచేసుకోవడమేకాక అంతకంటే సంక్లిష్టమైనవి రూపొందించాల్సిన బాధ్యతకూడా ఎప్పటికప్పుడు విద్యార్థుల మీద ఉంటుంది. ఉదాహరణకు వేదకాలంలోనే పిల్లలు ఒక చదువుకునే విషయాన్ని 25% ఉపాధ్యాయుడి (తల్లిదండ్రులుకూడా కావచ్చు) ద్వారా, 25% ఇతరపిల్లలతో చర్చించడం ద్వారా, 25% స్వంతంగా, చివరి 25% ఉత్తరోత్తర కాలంలో (లోతుగా ఆలోచించడం, అనుభవాలు, పరిశోధనలద్వారా) నేర్చుకుంటారని ప్రమాణీకరించారు. ఇప్పుడు మొత్తం విషయాన్ని (100%) స్కూల్లో టీచరుద్వారానే నేర్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంత అసమంజసమో వేరే చెప్పక్కర్లేదు.

వివిధ పద్ధతుల్లో అభ్యసనం అవసరం
ఆధునిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం పిల్లలు వివిధ పద్ధతుల్లో నేర్చుకుంటారు. కొంత మాటల ద్వారా, మరికొంత బొమ్మలద్వారా (చిత్రాలు, గ్రాఫులు వీడియోలు), కొంత సమాచారం ద్వారా మరికొంత ఆలోచన ద్వారా, కొంత వెంటనే, మరికొంత నిదానంగా.. ఇలా వివిధరకాలుగా. కాబట్టి చదువునేర్పే  ఇవన్నీ ఉన్నప్పుడే నేర్చుకోవడం సంపూర్ణమౌతుంది.

పిల్లల మానసిక స్థితి ఆధారంగా విద్య అందివ్వాలి
పిల్లల మానసిక పరిపక్వత ఆధారంగా విద్యనందించే సంస్కృతి ప్రతి పాఠశాలలో కొనసాగాలి. ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న శాస్త్రీయ కరికులాన్ని నేడు పిల్లలకు అందించవలసిన అవసరం ఉంది. విద్య అనేది విషయ పరిజ్ఞానానికి పరిమితం కాకుండా ఆటలు, పాటలు లాంటి వినోద కార్యక్రమాల ద్వారా పిల్లల్లోని ప్రతిభను వెలికితీయాలి. పిల్లలకు పాఠ్యాంశాలు బోధించేటప్పుడు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ విద్యలో ఉన్న బోధనా పద్ధతులను అవలంబిస్తూ విద్య సామర్థ్యాలను సాధించాల్సిన అవసరం ఉంది. ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యారంగ నిపుణులు సూచించిన శాస్త్రియ కరికులంతో కూడుకున్న ప్రభుత్వ పుస్తకాలను వినియోగిస్తూ ప్రైవేట్‌ ‌పాఠ్యపుస్తకాలను నిషేధించాలి. అప్పుడు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గి సృజనాత్మకతతో కూడుకున్న విద్యావిధానానికి బాటలుపడతాయి.

–  పిన్నింటి బాలాజీ రావు, వరంగల్‌ ‌జిల్లా అధ్యక్షులు, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టి పి యు ఎస్‌). 9866776286

Need stress-free studiesprajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment