పౌష్టికాహారమే దేశ ప్రగతికి సోపానం

జాతీయ పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణిలో వచ్చే ‘మన్‌ ‌కీ బాత్‌’ ‌కార్యక్రమంలో గత ఏడాది ఆగస్టు 30న మాట్లాడుతూ పౌష్టికాహార ప్రాధాన్యతను గురించి వివరించారు. ‘‘ఆహారాన్ని బట్టి మన మానసిక, భౌతిక వికాసం ఉంటుంది. విభిన్న రంగాల్లో పిల్లల శక్తి సామర్ధ్యాల ప్రదర్శనలో పౌష్టికాహారానిది ప్రధాన పాత్ర. గర్భంలో ఉన్నప్పటి నుంచి అందిన పోషకాహారాన్ని బట్టే చిన్నారుల్లో మానసిక వికాసం, ఆరోగ్యం ఉంటాయి. తల్లికి మంచి పౌష్టికాహారం లభించడం కూడా పిల్లలకు ముఖ్యమే. పోషకాహార ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి అన్నారు. పోషకాహార మాసోత్సవం సందర్భంగా సెప్టెంబర్‌ ‌నెలలో ‘మై గవ్‌ ‌పోర్టల్‌‘ ‌ద్వారా ఈ అంశం పై క్విజ్‌, ‌మీమ్‌ ‌పోటీ నిర్వహిస్తామని తెలిపారు. ఇంకా విశాల భారత్‌ ‌లో విభిన్న ప్రాంతాల్లో తీసుకొనే ఆహారంలో ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. సీజన్‌ ‌ను బట్టి ఆయా ప్రాంతాల్లో పండే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార వస్తువులతో పౌష్టికాహార ప్రణాళికను రూపొందిస్తున్నామని, దేశంలోని ఏయే జిల్లాల్లో ఏయే పంటలు పండిస్తున్నారని, వాటి పౌష్టికాహార విలువ ఎంత అన్న సంపూర్ణ సమాచారాన్ని అందించేలా భారతీయ ‘వ్యవసాయ కోశాన్ని’ తయారు చేస్తున్నామని ప్రధాన మంత్రి ‘మన్‌ ‌కీ బాత్‌’ ‌లో వివరించారు. పౌష్టికాహార ప్రధాన్యం గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది సెప్టెంబరు నెలలో పోషణ్‌ ‌మాసోత్సవం నిర్వహిస్తోంది.

ఈ ఏడాది అందరి భాగస్వామ్యంతో ఆరోగ్యవంతమైన జీవితంలోకి పయనిద్దాం అనే నినాదంతో ఈ ఏడాది పోషణ మాసోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ‘‘ఆరోగ్యం అంటే శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధి అంశాలలో పరిపూర్ణంగా ఉండి, ఎటువంటి రుగ్మతలు లేకుండా ఉండటం’’. ‘‘ఈ రోజు నా పళ్ళెంలో’’ (‘మై ప్లేట్‌ ‌ఫర్‌ ‌ది డే’) పేరుతో ప్రజలు ఏ ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, దానివల్ల ఎన్ని కేలరీల శక్తి వస్తుందనే వివరాలను భారత వైద్య పరిశోధనా మండలి(ఐ.సి.ఎమ్‌.ఆర్‌.) ‌వెల్లడించింది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రజలలో ముఖ్యంగా జనాభాలో 70 శాతం పైగా ఉన్న మహిళలు, చిన్నారులకు ఉచితంగా పౌష్టికాహారాన్ని ప్రాథమిక వైద్య, ఆరోగ్య సేవలు అందించి, వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తోంది. ఇంకా పౌష్టికాహారం పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ ‌నెలలో ‘‘జాతీయ పౌష్టికాహార మాసోత్సవాలు’’ పెద్ద ఎత్తున (రాష్ట్రీయ పోషక్‌ ‌మహా) నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పౌష్టికాహారం ప్రాధాన్యత, ఈ సమస్య నివారణకు ప్రభుత్వం అమలు పరుస్తున్న వివిధ పథకాల గురించి తెలుసుకుందాం.

ప్రధానమంత్రి పోషణ్‌ అభియాన్‌
2015-16‌లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక పౌష్టికాహార లోపం కారణంగానే తక్కువ బరువుతో శిశువులు జన్మిస్తున్నారని, ఆరేళ్ళలోపు చిన్నారులలో ఎదుగుదల సరిగా ఉండటం లేదని, మహిళలు, కిశోర బాలికలలో చిన్నారులలో రక్తహీనత సమస్య అధికంగా ఉన్న మూలంగా శిశు, మాతృ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం, ‘‘జాతీయ న్యూట్రిషన్‌ ‌మిషన్‌’’(‌పోషణ్‌ అభియాన్‌) ‌ను ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌ ‌రాష్ట్రంలోని ఝుంఝునులో 2018 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘‘పోషణ్‌ అభియాన్‌’’ ‌పథకాన్ని ప్రారంభించారు. భావి భారత పౌరులైన ఆరేళ్ళలోపు చిన్నారులు, గర్భవతులు, బాలింతలలో పోషకాహార లోపం సమస్యను 2022 నాటికి గణనీయంగా తగ్గించాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆరేళ్ళలోపు పిల్లలలో వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేకపోవటం సమస్యను మూడేళ్ళలో ఏడాదికి రెండు శాతం చొప్పున ఆరు శాతానికి తగ్గించాలని, కిశోర బాలికలలో రక్త హీనత సమస్యను తగ్గించటం, పుట్టిన వెంటనే కనీస బరువు కంటే తక్కువ బరువు ఉన్న (2.5 కిలోల కంటె తక్కువ) శిశివుల జననాలను తగ్గించటం, ఆరేళ్ళలోపు పిల్లలలో వయస్సుకు తగిన ఎత్తు పెరగకపోవటం లోపాన్ని2022 నాటికి 25 శాతానికి తగ్గించటం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. తల్లి గర్భం దాల్చిన రోజు నుంచి ఆ పిండం ఎదిగి, ప్రసవించి రెండేళ్లు అంటే మొదటి వెయ్యి రోజులలో తగిన పౌష్టికాహారం, టీకాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదిగేందుకు ఈ పథకం ద్వారా ప్రత్యేక చర్యలు చేపడతారు. ప్రస్తుతం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యా శాఖ, త్రాగునీరు, పారిశుధ్య శాఖ,గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ ‌శాఖలు అమలుచేస్తున్న ‘స్వచ్ఛ భారత్‌ ‌మిషన్‌’, ‌సార్వత్రిక టీకాల కార్యక్రమం, పి.ఎం. మాతృవందన యోజన, మధ్యాహ్న భోజన పథకం, నరెగా, నులి పురుగుల నివారణ పథకాలతో సమన్వయం చేసుకొంటూ, పోషణ అభియాన్‌ ‌ను అమలు చేస్తున్నారు.

సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్‌)
‌ప్రపంచంలోనే అతి పెద్దదైన ఐసిడిఎస్‌ ‌పథకాన్ని నాలుగున్నర దశాబ్దాల కిందట 1975 అక్టోబర్‌ 2‌వ తేదీ గాంధీ మహాత్ముని జయంతి రోజున మన దేశంలో ప్రారంభించారు. తొలుత 33 ఐసిడిఎస్‌ ‌ప్రాజెక్టులతో 4891 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించారు. గత ఏడాది నవంబరు ఆఖరుకు దేశవ్యాప్తంగా7075 ఐసిడిఎస్‌ ‌ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి ఆధీనంలో 13,77,995 అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. మొత్తం 11 కోట్ల 41 లక్షల 34 వేల మంది ఆరేళ్ళ లోపు చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు ప్రతి రోజు పౌష్టికాహారం అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 149 ఐసిడిఎస్‌ ‌ప్రాజెక్టుల ఆధీనంలో 31,711 అంగన్‌వాడీ కేంద్రాలు, 369 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రతి రోజు 13,95,566 ఆరేళ్ళలోపు చిన్నారులకు, 3,38,202 గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఇవే కాకుండా, ‘ఆరోగ్య లక్ష్మి’ పథకం ద్వారా గర్భవతులు, బాలింతలకు ప్రతి రోజూ మధ్యాహ్నం ఒక పూట భోజనం అంగన్‌ ‌వాడీ కేంద్రంలోనే పెడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మొత్తం ఆరు రకాల సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు, ఆరేళ్ళలోపు చిన్నారులకు అదనపు పోషకాహారం అందిస్తారు. 3-6 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను బోధిస్తారు.

కిశోర బాలికల పథకం
రేపటి తల్లులైన కిశోర బాలికలలో పోషకాహార లోపం సమస్య నివారణకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుంది. ఎన్‌.ఎఫ్‌.‌హెచ్‌.ఎస్‌-4 ‌సర్వే నివేదిక ప్రకారం దేశంలో 11-14 సంవత్సరాల వయస్సులో అమ్మాయిలలో 43 శాతం మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. దేశంలో మాతృ మరణాల రేటు నేటికి 122 (లక్ష జననాల్లో ప్రసవించే సమయంలో మరణించే మహిళలు) ఉండటానికి కిశోర బాలికలలో రక్త హీనత సమస్య కూడా ఒక ముఖ్య కారణం. రేపటి తల్లుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 2010-11 నుంచే దేశంలో కిశోర బాలికలకు అదనపు పోషకాహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలుత 205 జిల్లాల్లో ప్రారంభించిన ఈ పథకాన్ని 2018-19లో అన్ని జిల్లాలకు విస్తరించారు. ముఖ్యంగా కిశోర బాలికలకు అదనపు పౌష్టికాహారం అందించి మానసికంగా ఎదుగుదలతోపాటు, ఆహార అలవాట్లు, పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు, ఈ వయస్సులో వచ్చే భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలి, సమాజంలో, కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎలా పరిష్కరించుకోవాలని, వివిధ ప్రభుత్వ విభాగాలు అందిస్తున్న సేవలను ఎలా వినియోగించుకోవాలి, విద్య ఆవశ్యకత, ప్రాముఖ్యత తదితర విషయాల పట్ల కిశోర బాలికలకు అవగాహన కల్పించటం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం..

మధ్యాహ్న భోజన పథకం
విద్యార్థులకు అదనపు పౌష్టికాహారాన్ని అందించి మధ్యలో పాఠశాల మానేయకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండున్నర దశాబ్దాల కిందట1995 ఆగస్టు 15వ తేదీన మధ్యాహ్న భోజన పథకాన్ని దేశవ్యాప్తంగా 2408 బ్లాక్స్ ‌లో ప్రారంభించింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 11.59 కోట్ల మంది విద్యార్థులకు సంవత్సరానికి 200 రోజులు అదనపు పౌష్టికాహారాన్ని, మధ్యాహ్న భోజనం రూపంలో అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి, గత ఆర్థిక సంవత్సరంలో రూ. 11 వేల కోట్ల వ్యయం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఈ పథకం అమలుకు రూ. 11, 500 కోట్లు కేటాయించింది.

(మిగతా రేపటి సంచికలో ..)
-వర్గంటి గాయిత్రి, మీడియా కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌
‌పత్రికా సమాచార కార్యాలయం

National Nutrition Festival
Comments (0)
Add Comment