‌ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలి: మంత్రి హరీష్‌ ‌రావు

ములుగులో ఇంటింటికి తిరిగి జాతీయ జెండాలను అందజేసిన మంత్రి హరీష్‌ ‌రావు

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం  సిద్దిపేట జిల్లాలోని ములుగు మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మహాత్మా గాంధీ, డాక్టర్‌ ‌బిఆర్‌అం‌బేద్కర్‌, ‌చాచా నెహ్రూ, స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి  ఇంటింటికి తిరిగి జాతీయ జెండాలను అందజేశారు. ఈ సందర్భంగా  దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో  రగిలించేందుకు, దేశ స్వాతంత్రం కోసం పోరాడి తమ జీవితాలను దేశ స్వాతంత్య్రానికి అంకితం చేసిన మహాత్మా గాంధీ, సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌, ‌సుభాష్‌ ‌చంద్రబోస్‌, ‌జవహర్లాల్‌  ‌నెహ్రూ, డాక్టర్‌ ‌బి.ఆర్‌  అం‌బేద్కర్‌ ‌లాంటి గొప్పవారి సేవలను ప్రజలకు తెలియజేసేందుకు, జాతీయ జెండా ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి జాతీయ పతాకాలను పంపిణీ చేస్తుందని 15వ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజు ఉదయం ప్రతి ఇంటి పై తప్పకుండా జాతీయ పతాకమును ఎగుర వేయాలని, జాతీయ జెండా ప్రాముఖ్యత గురించి చిన్నారులకు వివరించాలని ప్రజలకు తెలిపారు.

అనంతరం ఫారెస్ట్ ‌కళాశాలలో జిల్లా పరిషత్‌ ‌చైర్పర్సన్‌ ‌రోజా రాధాకృష్ణశర్మ, జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జే పాటిల్‌, ‌కమిషనర్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌శ్వేత లతో కలిసి  సిద్దిపేట జిల్లా స్థాయి భారత స్వాతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలు నిర్వహణ కమిటీ సభ్యులతో జిల్లాలో 15 రోజుల పాటు స్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణపై  సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం  జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, రానున్న రెండు, మూడు రోజులలో జిల్లాలోని అన్ని గ్రామాలు, అన్ని మున్సిపాలిటీలలో గల 3 లక్షల ఇళ్లకు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, మున్సిపల్‌ ‌కమిషనర్లు, వార్డ్ ‌కౌన్సిలర్‌ ‌ల ద్వారా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో  జాతీయ జెండాల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. 10వ తేదీన వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించి ప్రతి గ్రామంలో మొక్కలను నాటాలని, మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలని, జిల్లావ్యాప్తంగా వీలైనన్ని ఫ్రీడమ్‌ ‌పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. 11 వ తేదీన జిల్లా కేంద్రంతో పాటు దుబ్బాక, గజ్వేల్‌, ‌హుస్నాబాద్‌ ‌నియోజకవర్గ కేంద్రాలలో, చేర్యాల పట్టణంలో వివిధ  కాలేజీల విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజాప్రతినిధులతో ఉదయం 6:30 గంటలకు ఫ్రీడమ్‌ ‌రన్‌ ‌నిర్వహించాలని అన్నారు. సిద్దిపేట పట్టణంలో ఓల్డ్ ‌బస్టాండ్‌ ‌నుండి కోమటి చెరువు వద్ద గల జాతీయ జెండా వరకు రన్‌ ‌నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమాలను ఆర్డీవోలు, మున్సిపల్‌ ‌చైర్మన్లు పర్యవేక్షించాలని అన్నారు.

12 వ తేదీన జాతీయ సమైక్యత రక్షాబంధన్‌ ‌కార్యక్రమాన్ని నిర్వహించి అనాధ శరణాలయాలలలో అనాధ బాలలకు కొత్త బట్టలను అందజేసి ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ ‌మరియు ఇతర  అధికారులు, వారితో కలిసి భోజనం చేయాలని అన్నారు. 13 వ తేదీన విద్యాశాఖ ద్వారా సిద్దిపేట పట్టణంలో  కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, ‌స్కౌట్స్ అం‌డ్‌ ‌గైడ్స్ ‌వాలంటరీలు యూత్‌ ‌క్లబ్‌ ‌సభ్యులతో ఉదయం 10 నుండి 11 గంటల వరకు పాత బస్టాండ్‌ ‌నుండి కోమటి చెరువు  జాతీయ జెండా వరకు జాతీయ జెండాలను, దేశభక్తి నినాదాలతో కూడిన ప్లకార్డులను  చేతబట్టి  ర్యాలీ నిర్వహించాలని, ఈ ర్యాలీలో పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో, మండల కేంద్రాలలో పాఠశాల విద్యార్థులుచే ర్యాలీ నిర్వహించాలన్నారు. 14 వ తేదీన సాయంత్రం కోమటిచెరువులోని నెక్లెస్‌ ‌రోడ్‌ ‌వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్‌, ‌సాంస్కృతికశాఖ  డైరెక్టర్‌ ‌మామిడి హరికృష్ణల సహకారంతో  ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని, పెద్ద మొత్తంలో బాణాసంచ పేల్చాలని అన్నారు.

ఇదే సమయంలో  దుబ్బాక, గజ్వేల్‌, ‌హుస్నాబాద్‌ ‌నియోజకవర్గ  కేంద్రాలలో సాంస్కృతిక సారధి కళాకారుల సమన్వయంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.15 వ తేదీన సిద్దిపేట పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి స్వాతంత్ర సమరయోధులను కొత్త బట్టలతో సన్మానించాలని, ఉత్తమ సేవలందించిన  అధికారులు, ఇతర రంగాల ప్రముఖులను సన్మానించాలని అన్నారు. 16 తేదీన ఉదయం సామాజిక జాతీయ గీతాలాపన చేయాలని, ఎక్కడి వారు అక్కడే 58 సెకన్లపాటు నిలబడి జాతీయ గీతాలాపన చేయాలని అన్నారు. సాయంత్రం విపంచి కళా నిలయంలో స్వతంత్ర వజ్రోత్సవాల పై  కవిసమ్మేళనం నిర్వహించాలని అన్నారు.17 న వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాలలో బ్లడ్‌ ‌డొనేషన్‌ ‌క్యాంపు నిర్వహించాలాన్నారు.18 న ఫ్రీడమ్‌ ‌కప్‌ ‌క్రీడా పోటీలను నిర్వహించి  గ్రామ,మండల, జిల్లాస్థాయి  గ్రామీణ ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్‌, ‌లాంగ్జంప్‌, ‌హైజంప్‌, ‌రన్నింగ్‌  ‌తదితర క్రీడలను నిర్వహించి బహుమతులు అందజేయాలని, పోలీస్‌ ‌సిబ్బందికి, టీఎన్జీవోలకు, ఉపాధ్యాయులకు విడివిడిగా క్రీడలను నిర్వహించి బహుమతులు అందజేయాలన్నారు.19 న అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఓల్డ్ ఏజ్‌ ‌హోమ్స్, అనాధ శరణాలయాలు, జైళ్లలో ఖైదీలకు పండ్లు, మిఠాయిలు పెట్టాలని అన్నారు. 20 తేదీన గ్రామీణ మరియు పట్టణ  ప్రాంతాలలో మహిళలకు ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు (రంగోలి)  ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతులను అందజేయాలని అన్నారు.

21 వ తేదీ నాడు అన్ని గ్రామ పంచాయతీలు, ఎంపీపీలు, మార్కెట్‌ ‌కమిటీలు, పిఎసిఎస్‌ ‌లు, మున్సిపాలిటీలు, డిసిసిబిలు, డిసిఎంఎస్‌ ‌లు, జిల్లా పరిషత్‌ ‌లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా స్వాతంత్ర పోరాట స్ఫూర్తి పై తీర్మానాలు చేయాలని అన్నారు. 22న స్వాతంత్ర వజ్రోత్సవాల చివరి రోజు హైదరాబాదులోని ఎల్బీ నగర్‌ ‌లో నిర్వహించే ముగింపు కార్యక్రమానికి జిల్లా నుండి ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు.అనంతరం మంత్రివర్యులు  ప్రెస్‌ ‌మీట్‌ ‌నిర్వహించి…. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గల మూడున్నర కోట్ల మంది ప్రజలలో  ప్రజల్లో దేశభక్తి భావం పెంపొందించే విధంగా స్వాతంత్ర వజ్రోత్సవ  కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులు పవర్‌ ‌లూమ్‌ ‌పై నేచిన జాతీయ జెండాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అందజేస్తున్నామని అన్నారు.

పదిహేను రోజులపాటు  షెడ్యూల్‌ ‌ప్రకారం జాతీయ జెండాల పంపిణీ, వనమహోత్సవం, ఫ్రీడం రన్‌, ‌జాతీయ సమైక్యత రక్షాబంధన్‌, ‌ఫ్రీడమ్‌ ‌ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, సామూహిక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనం, రక్తదాన శిబిరాలు, ఫ్రీడమ్‌ ‌కప్‌  ‌క్రీడాపోటీలు, వృద్ధులకు, అనాథలకు, రోగులకు, ఖైదీలకు పండ్లు, స్వీట్స్ ‌పంపిణీ, రంగోలి పోటీలు, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, స్వాతంత్ర పూర్తి పై ప్రత్యేక తీర్మానాలు, చివరి రోజు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో  ముగింపు కార్యక్రమం చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ‌ముజామిల్‌ ‌ఖాన్‌, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డిసి చైర్మన్‌ ‌వంటేరు ప్రతాపరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌ప్రభాకర్‌ ‌రెడ్డి, గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, గజ్వేల్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌మాదాసు శ్రీనివాస్‌, ‌జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, డిఆర్డిఓ గోపాలరావు, డిఈఓ శ్రీనివాస్‌ ‌రెడ్డి, డిపిఆర్‌ఓ ‌రవికుమార్‌, ‌డిపిఓ దేవకీదేవి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

National flag should be hoisted on every house
Comments (0)
Add Comment