కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు

‘‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో… భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టు కొమ్మగా, హైందవ సనాతన సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసి ఆస్తిక ప్రపంచానికి వరదాయిగా, భక్తి, ముక్తి ప్రదాయినిగా  విరాజిల్లుతున్నది… సుప్రసిద్ధ ప్రాచీన ధర్మపురి పుణ్యతీర్ధం. కరీంనగర్‌ ‌కు 71 కిలోమీటర్ల ఉత్తరాన, జగిత్యాలకు 27 కిలోమీ టర్ల ఈశాన్యాన తెలంగాణ లోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా, దక్షిణ కాశీగా, నవనారసింహ క్షేత్రాలలో ఉత్కృష్టమైనదిగా, పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్నదీ క్షేత్ర రాజం. ప్రధానంగా శివకేశవుల నిలయమై, శ్రీల క్ష్మీనరసింహ, రామలింగేశ్వర ఆలయాలు, మసీదు పక్కపక్కనే కలిగి అనాదిగా వైష్ణవ, శైవ ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా నిలచి ఉన్నదీ పుణ్యతీర్ధం. బ్రహ్మండ, స్కంధ పురాణాలలో, మడికె సింగన పద్మ పురాణంలో, చెరి కొండ ధర్మన్న చిత్ర భారతంలో, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలో, ఏకామ్రనాధుని ప్రతాపరుద్ర చరిత్రలో, నృసింహదాసు మైరావణ చరిత్రలో, పోతనామాత్యుని నారాయణ శత కంలో, పింగళి సూరనార్యుని కళాపూర్ణో దయంలో, శేషాచలదాసు – నరహరి, నృసింహ, నృకేసరి శతకాలలో, కాకతీయానంతర శాసనాలలో, మధ్యయుగ దానపత్రాలలో ధర్మపురి క్షేత్ర ప్రాశస్త్యం ప్రశంసించ బడింది. పూర్వం ధర్మవర్మ మహారాజు ధర్మదేవత భక్తుడై, ప్రజలను ధర్మ కార్యోన్ముఖులను చేయడానికి చేసిన తపస్సు ఫలితంగా ‘‘ధర్మపురి’’ నామాంకిత, నృసిం హుడు భక్తుల కోర్కెలు తీర్చేందుకై ఇచ్చట వెలసి యున్నాడని, పురాణాలు స్పష్ట పరుస్తున్నాయి. గౌతమ మహర్షి, తన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకునేందుకు పరమశివుని గూర్చి తపస్సు చేసి, ఆయన జటాజూటం నందు గల ‘‘గంగా దేవి’’ని ధర్మపురికి రప్పించినందున ‘‘గౌతమి, గోదావరి’’ అని నదీ పేర్లు వచ్చినట్లు స్థల పురాణం విశద పరుస్తున్నది.

శ్రీరామచంద్ర స్థాపిత రామేశ్వరాలయం, అక్కపెల్లి రాజేశ్వరాలయం, శ్రీరామాలయం, దత్తాత్రేయ, గౌతమేశ్వర, శ్రీసాయి శివ బాలాజీ , అయ్యప్ప, ప్రసన్నాంజనేయ, భక్తాంజనేయ, యమ ధర్మరాజ, సంతోషిమాత, సత్యవతీ, మహాలక్ష్మి మందిరాలు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. రామాయణ, భారత, భాగవతాది పురాణ ఘట్టాలు చెక్కబడిన నృసింహాల యపు కాకతీయుల శిల్పకళకు అద్దం పట్టే కళ్యాణ మంటపం, శివాలయంలోని గణేష, చండిక, సప్తమాతృకలు, నల్లశెనపు రాతిపై సమంశ పద్ధతిలో చెక్కబడిన శ్రీరామలక్ష్మణ, సీతాదేవిల విగ్రహాలు మిగుల మనోజ్ఞమై ఉన్నాయి. ధర్మపురి క్షేత్రం మొదట జైన, బౌద్ధ యుగములందు ఆర్ష విద్య ప్రచార కేంద్రమై విదర్భ రాజ్య పోషణలో మున్యాశ్రమంగా ఉండేది. తర్వాత శాతవాహన, బాదామి చాళుక్య, రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్య, కాకతీయ, రేచర్ల వెలమల మరియు నైజాం రాజుల ఏలుబడిలో అద్వితీయ వైభవాన్ని అనుభవించింది. ప్రతాప రుద్రుని కాలంలో ఢిల్లీని ఏలిన అల్లావుద్దిన్‌ ‌ఖిల్జీ సేనాని మాలిక్‌ ‌నాయబ్‌ ‌కాపూర్‌ ‌సైన్యం క్రీస్తు శకం 1309లో ఇందూరు (నిజామాబాద్‌)  ‌మీదుగా కాకతీయులపై దండెత్తిన సమయంలో ఇచ్చటి నృసింహాలయం, రామేశ్వరా లయాలను ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతున్నది. 14వ శతాబ్ది మూడవ పాదంలో నారాయణాశ్రమ స్వామి అనే సన్యాసి, నాటి రామగిరి పాలకుడైన  ముప్ప భూపతి సేనాని కేశనమంత్రి సాయంతో నారాయణ పురమను మఠంను స్థాపించి, బ్రాహ్మణులకు గృహములను నిర్మింపజేసి, అన్నసత్రాన్ని నెలకొల్పారు. 1724-50 మధ్య ధర్మపురివాసులు  తిరిగి నృసింహాలయాన్ని నిర్మించారు.

క్షేత్ర ప్రాశస్త్యం
ఆద్వితీయ మహిమాన్వియైన ధర్మపురి క్షేత్ర మున యాత్రికుల సౌకర్యార్ధం నివాస స్థానములను కట్టించువారు భగవత్కటాక్షమున ఉత్తమ భవనముల పొందగలరని, ఇచ్చటి జీర్ణ మందిరములను ఉద్దరించువారు వైకుంఠ మునందు ఉత్తమ సుఖములను అను భవించగ లరని, శ్రీనృసింహుని పూజ కొరకు పూల చెట్లను పెంచువారు నందనాది వనములతో సౌఖ్యము లను అను భవించ గలరని, శ్రీనృసింహు శౌల్యన్న మును, దధ్యన్నమును మరియు పులిహోరను నైవేద్యమిడు వారు అన్నదాతలై భగవత్కటాక్షమునకు పాత్రు లగుదురని, నృసింహుని ప్రీతికై క్షేత్రమున బ్రహ్మణులకు భూదానం, గోదానం మరియు హిరణ్యాది దానములనొసంగువారు ముందు జన్మమున సార్వభౌములగుదురని, క్షేత్రమున దీనాందులకు, దంపతులకు, బ్రహ్మచారులకు, పశుపక్ష్యాదులకు అన్నదాన మొనర్చినచో, నృసింహ కటాక్షమున వారి వారి పితృదేవతలు మోక్షమును పొందగలరని, శౌనకాది మహర్షు లకు నైమిషారణ్యము నందు శూత పౌరాణికులు వివరించినట్లు స్కంధ పురాణాంతర్గత ధర్మపురి
క్షేత్ర మహత్యం విశదపరుస్తున్నది.

నరసింహ అవతార ప్రత్యేకత
రామకృష్ణాది అవతారములవలె గాక, నిర్యాణములేని శాశ్వత అవతారమైన శ్రీనరసింహుని జయంతి, హిందూ పండగలలో అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత నొందింది. వైశాఖ శుద్ధ చతుర్దశి పుణ్య తిథియందు ఉద్భవించిన నారసింహుని పూజలతో, ఆకాల మృత్యు భయముండదని, దుష్టగ్రహ బాధలు, పైశాచిక చేతబడుల ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి నారసింహ మంత్రానికి గలదని భక్తుల, సాంప్రదాయా చరణాసక్తుల ప్రగాఢ విశ్వాసం. ‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం, నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం’’ మంత్రంతో నరసింహ స్వామిని పూజిస్తే శతృ జయం కలుగుతుంది. పగలు రాత్రి కాని సంధ్యా. సమయాన, నరుడు జంతువు కాని రూపంతో, భూమ్యాకాశాలు కాని తొడలపై, సజీవము నిర్జీవ మూకాని చేతిగోళ్ళతో, హిరణ్యకశిపుని చీల్చి భక్త జన రక్షకుడై, సుదర్శన, శంఖ, చక్ర, ఖడ్గ, అంకుశ, పాశు, పరశు, ముసల, కులిశ, పద్మాదులను కలిగి గదాధరుడై ప్రకాశించిన ఉగ్రనారసింహ అవతార తత్వం మిగతా అవతారాలకు భిన్నం.

నరసింహ నవరాత్రులు
కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి లక్ష్మీ సమేత నారసింహ (యోగ, ఉగ్ర) నవరాత్రి ఉత్సవాలు ఏప్రిల్‌ 26 ‌వ తేదీ నుండి 4వ తేదీ వరకు సాంప్ర దాయ రీతిలో జరుగనున్నాయి. సర్వ దేవతా మూర్తులను కలిగి ‘ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదు’ అని విఖ్యాతి నందిన ప్రాచీన చరిత్ర మరియు పౌరాణిక ప్రాధాన్యత కలిగిన ధర్మపురి క్షేత్రంలో ఏటా వైశాఖ శుక్ల షష్టి నుండి చతుర్దశి వరకు స్థానిక దైవాల నవరాత్రి ఉత్సవాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించడం అనాదిగా ఆచరణలో ఉంది. ఈ సంవత్సరం ప్రధానంగా 30న సహస్ర కలశాభిషేకం, మే 1న చందనోత్సవం, 2న వసంతోత్సవం, పల్లవోత్సవం, అన్న  కూటోత్సవం, నిత్య ఆరాధనలతో పాటు  తులసీ పూజ, సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించ నున్నారు. 4న నర సింహ జయంతి, ప్రత్యేక స్థంభోద్భవ పూజాది కాలు నిర్వహించ నున్నారు. దేవస్థానం ఏసి, ఈఓ సంకటాల శ్రీనివాస్‌, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, ముత్యాల శర్మ, ఇందారపు రామయ్య నేతృత్వంలోని అభివృద్ది కమిటీ, వివిధ ఆలయాల అర్చకులు, సిబ్బంది కార్యక్ర మాల ఏర్పాట్లు, నిర్వహణలలో నిమగ్నమై ఉన్నారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment