ముట్టడి..

మట్టి బిసికి మెతుకు నిచ్చే రైతును మట్టికి దూరం జేశే కతలు వడ్డ రాజ్జెమేదీ శెరిత్రల బతికి బట్ట గట్టలేదంటరు. గీ ఇగురం సర్కార్‌ ‌కు యెరుక జేశేటందుకే డిల్లీ పట్నంమీదికి ఉత్తరాది రైతుల దండు జేరింది. పయనమైనా,పతనమైనా ఏదో ఓ మూమూల నుంచి మొదలైతది.ఏమూల నుంచి పయనం మొదలయిందో పతనం సుత గా మూల నుంచే మొదలవుడే గీడ ఇచ్ఛంత్రం.పెయిమీద కాషాయం బూస్కోని కార్పొరేట్ల కాల్రెక్కలు పిసికే బాగోతం గిప్పుడిప్పుడే అందరికి మాగ కానత్తాందిబలం,బల్గం బాగున్నయని తొవ్వతప్పి నడుత్తె ‘‘కాట’’గలుత్తరన్న సోయి జరంతన్నలేఠుంటాయె!! యోగులు, సన్నాసులతోని కాషాయం జల్లుకుంట యెనుక మొగాన కార్పొరేటోళ్ళ‘‘మండువా’’ల కూకుంటె దేశబక్తి యెట్లయితది!? మస్తు బలం, పెద్ద బల్గం గిట్ల బాగున్నదని,సూపు నొసలు మీ ద కూసుంటె కాళ్ళు కాల్వల బడుడు కాయం!గీ గల్మన తిని ఆగల్మల కావలుంటె ఇశ్వాసం లేదంటరు.దేశాన్ని అరేకు మాల్‌ ‌తీర్గ అమ్ముడే గిప్పుడు దేశబక్తా!గడ్డ గట్టే ఇగంల వారం సంది వాకిట్ల నిలబడ్డ లచ్చల మంది రైతులది దేశబక్తా! ‘‘నోట్లె తీపి,కడుపుల ఇషం తీర్గ’’ రైతులకు జెప్పేదోటి,యెనుక పొంటి జేశేదింకోటి!.

ఆరేండ్ల సంది సంఘపరివార్‌ ‌రాజ్జెం జేశే ప్రజా వెతిరేక చట్టాలను దేశమంత నిరసించుడు ఒకెత్తయితె,గిప్పుడు రైతులు జేశిన డిల్లీ ముట్టడి ఇంకోయెత్తు. సంఘపరివార్‌ ‌రాజ్జెం గాళ్ళుము జేశిన చట్టాలు రైతులకు మంచిజేత్తయి అని జెప్పుడు శాన మందికి తియ్య గని పిత్తాంది,గని అవి దేశం మొత్తంల యవుసాన్ని బొందబెట్టి రైతుకు మట్టికీ బందం తెంపే తాకట్ల చట్టాలనే యెరుక యెవలికున్నది. ఇప్పటిదాంక రైతులను దోసుకునే చిన్న దళారోళ్ళు బోయి కార్పొరేట్‌ ‌దళారీ దందా మొదలైతదన్న ఇగురం అందరికి యెరుక గావాలె!.

దేశంల అన్ని రంగాలల్ల ప్రజలకు వెతిరేకమైన చట్టాలు దేవులాడి దేవులాడి తెచ్చి పెట్టిన రాజ్జానికి యెదురు జెప్పెటోళ్ళు లేకుంటబాయె! అసలు లొల్లికి దిగే పతిపక్షంగ చేయి గుర్తు పెద్దోళ్ళు ముందుబడాలె! గాళ్ళు శానేండ్ల సంది అన్నింట్ల యెన్కబడుడే తిప్పలుకచ్చింది.’’ ముందుబడెటోళ్ళే యెన్కబడ్తె పక్కనున్నోళ్ళకు సందుబుట్టదా!వందేండ్ల చేయిగుర్తు మసుకబారిందిపడుసోల్లంత పక్కతోవబడ్తాండ్లు. ముసలోల్లు ముచ్చట్లు బందు బెట్టిండ్లు.నాయకత్వం లేని చేయిగుర్తు పార్టీ అధికారం సంగతేందో గని పతిపక్షం జాగల సుత కూసునుడు కానత్తలే!తీరొక్క పాంతీయ పార్టోల్లు గద్దెనెక్కిన రాష్ట్రాలల్ల ముక్కెమంత్రులు,గాళ్ళ పార్లమెంట్‌ ‌సబ్యులెవలు సుత సంఘపరివార్‌ ‌సర్కార్‌ ‌పనితీరు మీద యేనాడు సుత లొల్లికి దిగకపాయె! గాళ్ళ రాష్ట్రాల అవుసరాల కోసం సంఘపరివార్‌ ‌సర్కార్‌ ‌పనితీరుకు యెదురుంగ కొందరు,సాటుకుబోయి కొందరు ఇంకా కొట్టెటోళ్ళందరు జై కొట్టబట్టిండ్లు. నోట్ల రద్దు నుంచి దేశం సర్కార్‌ ఆస్తిపాస్తులన్ని అడ్డికి పావుసేరు లెక్కన అమ్ముకున్న గీళ్ళ దేశబక్తికి అడ్డదుపు లేకుంటబాయె! కార్పొరేట్ల దళారీ దందా గల్లీదాంక జేరుకోని జనం పానాలు దీయబట్టె!లాక్‌ ‌డౌన్‌ ‌కాలంల కార్మిక వెతిరేక చట్టాలు జేశిండ్లు. తొంబ యిగల్ల చట్టాలు తిర్లమర్లేశి కార్మికులను పనికి దూరం జేశిండ్లు. దేశం మొత్తంల కార్మికులంత నెలలసంది సమ్మెలెన్నిజేశినా సర్కార్‌ ‌కత ‘‘దున్నపోతు మీద ఆన కొట్టినట్టే వుండె’’! వరి,గోదుమ పంటలేశే హర్యానా,పంజాబ్‌ ‌రైతుల ముందుండి సర్కార్‌ ‌మీదనే కలబడ్డరు.రైతును ఆగం జేశే మూడు చట్టాలను రద్దు జేశేదాంక డిల్లీ తొవ్వలు ఇడిశిపెట్టమని బరాబరి జెప్పిండ్లు.సర్కార్‌ ‌ను మొసబోయకుంట జేసుట్ల వాళ్ళ ఉడుంపట్టు యెసొంటిదో కానత్తాంది.

సర్కార్‌ ‌జేశిన మూడు చట్టాలతోని యవుసం మట్టిగొట్టుక బోతది, బతుకులాగం జేశే గీ చట్టాలు రద్దు జేయమని అడుగచ్చిండ్లు గని కత్తులు బట్టుకోని కయ్యానికచ్చిండ్లా! పలాన కాడ కూసుంటం!మా తిప్పలేందో జెప్పుకుంటం జెరినుండ్రి అన్నరే గని కాలబెట్టుడు,కూలగొట్టుడేమన్న జేశిండ్లా! గాళ్ళ బతుకులను గాయి బట్టిచ్చే చట్టాలు జేశేది సర్కారే!’’అయ్యా!గిదేందని అడగచ్చిన రైతులమీద పోగ బాంబులేశి,నీళ్ళు మోటర్లేశి,తుపాకులతోని కాల్పులు జేశేది సర్కారే! దేశానికి అన్నం బెట్టే రైతన్న మీద తుపాకి తీశిన గీళ్ళ దేశబక్తి యేపాటిదో సమజయితాంది. దేశానికి యెన్నుపూస బొక్కోలిగె వుండే రైతుల బొక్కలిరిగెటట్టు లాటీలతోని కొట్టుడు యేపాటి దేశబక్తో సమజయితాంది. ఓటేశి గద్దెక్కిచ్చిన రైతు శత్రువైండు. కార్పొరేట్‌ ‌దొరలంత సర్కార్‌ ‌కంసుట్టాలయిండ్లు. అచ్చేదినాలచ్చుడంటె గిదేనానుల్లా! దినాలుగాదు,వారాలు గాదు యెన్ని నెల్లయినా మడిమె తిప్పేది లేదని సల్లటి ఇగంల తొవ్వ మీదనే తిండి తిప్పలర్సుకుంట కూసున్న రైతు మీద కచ్చ గట్టుడెనుక సర్కార్‌ అసలు రూపమేందో దేశానికి సమజైతాందనే అనుకోవాలె! ప్రజల సేవ జేత్తమని గద్దెక్కిన తీరొక్క రాష్ట్రంల ముక్కె మంత్రులు జాడ పత్తాలేరు. దేశంల రైతుకు మద్దతు యిచ్చే లీడర్లు,రాజకీయ పార్టీలు కానత్తలేవు. యవుసం దేశానికి ఊపిరాసొంటిదని నమ్మే ఎర్రజెండానే రైతులకు అండయి నిల్సున్నది. దేశం ల బుద్దిజీవులు,పజాసామ్య వాదులు రైతెంబటే నిల్సున్నరు. కూసాలు లుకలుకమంటె కూలిపోవుడు కాయమన్న సోయి మరిశిన సంఘపరివారపు సర్కార్‌ ‌కార్పొరేట్లఅండతోనే ఆగడాలు జేయబట్టిందని దేశమంత యెరుకజేయాలె! కార్మికులు బుద్దిజీవులు,పంతుళ్ళు విద్యార్థులు రైతుకు మద్దతని అన్ని రాష్ట్రాలల్ల జులుసులు తీయబట్టిండ్లు. దేశమంత సర్కార్‌ ‌తీరును దుమ్మెత్తి పోయబట్టె!.

సంఘపరివార్‌ ‌సర్కార్‌ ఇసొంటి కతలు పడ్తదని ముందేయెరు కున్న కవులు,రాతగాండ్లు, పంతుళ్ళను. ముసలోళ్ళని,కాళ్ళురెక్కలు లేని అవిటోళ్ళని సుత పట్టించుకోకుంట అరెస్టులు లోపటికేశిండ్లు.• సుల్లేవు,ఇచారణల్లేని పజాసామ్యం మన దేశమని అందరికి గిప్పుడన్న యెరుకైతదా!దూరపు దేశంలసర్కార్‌ ‌లే ‘‘అయ్యో! బారతదేశం ల రైతులు గిట్లెందుకు ఆగమైతాండ్లని’’ రంది పడబట్టిండ్లు.మన దేశబక్త సర్కార్‌ ‌మాత్రం కూసోని మాట్లాడుకుందావని పిలిశి రైతు ఉద్దెమంల చీలికెలు పేలికెలు జేశే సాటుమాటు పనిలున్నది. బేశర్తుగ మూడు చట్టాలు రద్దు జేసుడే వున్నొక్క యెజెండా అని రైతులు జెప్పి నంక చర్చలేందుల్లా! యవుసం రాష్ట్రాలు జూసుకునేదుండె! గీ సర్కార్‌ ‌రాష్టాల నుంచి గుంజుకున్న అనేకం లల్ల యవుసం సుత ఓకటి.రాష్ట్రా లకుండేటి అదికారాలు కేంద్రం గుంజుకునుడంటే పజాసామ్యాన్ని పాతరబెట్టి రాజీర్కపు కతలు పడుడే గదా! గి సొంటి కార్పొరేట్ల గల్మ కాడ కావలుండేటి కాషాయం సాములు కార్పొరేట్ల యేళ్ళ మీదాడే తోలు బొమ్మల తీర్గ సర్కార్‌ ‌నడుపుట్ల బాగమే రైతులను శత్రువుజేశి యవుసం మంట్లెగలుపుడని సమజయితాంది..

‘సూడ్రా !బయ్‌!ఇ‌క్రమార్క్’’!
‘‘ఇప్పటిదాంక యింటివి గదా! రైతు బతుకులను దళారులు దోసుకోకుంట గాళ్ళకు మంచి జేశే చట్టాలు జేశినమని సర్కారనబట్టె! సర్కార్‌ ‌ను కూల్చేపని మీదనే పతిపక్షాలు రైతులనెగేశి డిల్లీకి దోలిండ్లని సర్కారనబట్టె! సర్కార్‌ ‌తప్పేడున్నదని గీ బద్నాం జేశే లొల్లి !? నా పశ్నకు జవాబు జెప్పకుంటె రైతులనెగేశింది నువ్వేనని సర్కార్‌ ‌కు జేపుత!పైలం !అని యెప్పటి తీర్గనే బెదిరిచ్చేటి బేతాళుని శవాన్ని బుజాన్నేసుకొని ‘‘ఇను బేతాళ్‌!‌పైకి హిందు మతం వొళ్ళంత బూసుకోని దేశభక్తి పోట్వోలు దిగుడు,సాటుంగ కార్పొరేట్ల కాళ్ళుజేతులూ పిసికే సర్కార్‌ ‌వున్నయన్ని బేరంబెట్టింది.మిగిలిందల్లా గిప్పుడు యవుసమే!యవుసాన్ని కాపాయం జేసుకోకుంటె దేశమాగమయియితది. యవుసాన్ని,రైతు బతుకులాగం జేశే చట్టాలు బెల్లముండల దాశిన పసరు మందోసొంటిది. ఇప్పిజూశి జనానికి సమజయెటట్టు జెప్పేటందుకే రైతులు గుమిగూడిండ్లు. యవుసం ఆగంజేశి దేశాన్ని బొందల బెట్టే పని జేసుడే సర్కార్‌ ‌పెద్ద తప్పని యెరుకైతలేదాయేంది’’!.అని జెప్పుకుంట నడ్వ బట్టిండు..నడ్వ బట్టిండు…
ఎలమంద – తెలంగాణ

Comments (0)
Add Comment