‘మనీ’గోడులో కనకవర్షం

మునుగోడు ‘మనీ’గోడుగా మారింది. గతంలో ఏనాడు లేని విధంగా ఇప్పుడా నియోజకవర్గంలో కనక వర్షం కురుస్తున్నది. ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వోట్లకోసం విపరీతంగా డబ్బులు కుమ్మరిస్తున్నాయి. ఇక్కడి సిట్టింగ్‌ ‌శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటినుండే రాజకీయ పార్టీలు నియోజకవర్గంలోని ఊళ్ళను కలియ తిరగడం మొదలెట్టాయి. అభ్యర్థులతో ప్రమేయం లేకుండానే ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చాయి. అభ్యర్థుల పేర్లు ప్రకటించడం, నామినేషన్‌ల ప్రక్రియ పూర్తి అవడంతో ఒక విధంగా నియోజక వర్గ స్వరూపమే మారిపోయింది. నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లోని ప్రతీ గ్రామానికి గతంలో ఏనాడు గ్రామస్తులు చూడనటువంటి ఖరీదైన కార్లు విమానాల్లా దూసుకుపోతున్నాయి. గ్రామం, మండలంకాదు, జిల్లాలో కూడా ఎవరూ గుర్తుపట్టని కొత్త వ్యక్తులు వందలు, వేల సంఖ్యలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలుకూడా వంద వోటర్లకు ఒకరిని ఇన్‌చార్జిగా పెట్టడంతో గ్రామాలన్నీ పోటాపోటీగా ప్రచారకులతో నిండిపోయాయి. తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తామన్న విషయాన్ని వివరిస్తూ వోటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

 

ఎనిమిదేళ్ళుగా అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్న విషయాన్ని వివరిస్తూ, అక్కడ నెలకొన్న సమస్యలను ఏకరువు పెడుతున్నాయి బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు. బిఎస్పీ, ప్రజాశాంతి పార్టీలు కూడా తామేమీ తక్కువ కాదన్నట్లుగా అకార పార్టీపై విరుచుకు పడుతోంది. తనను గెలిపిస్తే ఈ నియోజకవర్గ స్వరూపాన్నే మార్చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాడు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా రంగంలో ఉన్న  ప్రజాశాంతి పార్టీ అధినాయకుడు  కె.ఏ పాల్‌. ‌నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ప్రతీ మండలంలో మండలానికి వెయ్యి చొప్పున ఏడు వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు,  ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్య సౌకర్యం కలిగిస్తానని హామీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ మోడల్‌ ‌నిజస్వరూపం ప్రొగ్రెస్‌ ‌రిపోర్ట్ ‌విడుదల చేస్తూ మలిదశ తెలంగాణా ఉద్యమం జెఏసి చైర్మన్‌ ‌గా అగ్రభాగాన నిలబడి ఉద్యమం ముందుకు నడిపిన ప్రొ.కోదండరాం, తెలంగాణ జన సమితి మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి పల్లె వినయ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తరపున ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు.

 

కాగా, టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని చిన్నచూపు చూడడం వల్లె తన రాజీనామాతోనైనా ప్రభుత్వం కండ్లు తెరుకుంటుందన్న ఆలోచనతోనే అక్కడి సిట్టింగ్‌ ‌శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాచేసిన ఉదంతాన్ని బిజెపి ప్రధాన ప్రచార అస్త్రంగా చేపట్టింది. శాసనసభ్యుడి హోదాలో రాష్ట్ర శాసనసభలో ఈ నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రభుత్వం తనకు అవకాశం ఇవ్వకుండా చేయడంతో విసుగుచెంది రాజీనామా చేయాల్సివచ్చిందంటూ రాజగోపాల్‌రెడ్డి, బిజెపి ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఉప ఎన్నిక రావడంతోనే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకింద ఇంత వరకు మంజూరు చేయని నిధులను మంజూరు చేయడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆ పార్టీ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే రాజగోపాల్‌రెడ్డికి అంత సీన్‌లేదని, కేవలం తన స్వలాభంకోసమే ఆయన పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామాచేసినట్లు చెబుతున్న టిఆర్‌ఎస్‌, ఆయన  బిజెపిలోకి  మారడానికి పద్దెనిమిది వేలకోట్ల రూపాయల కాంట్రాక్టు సంపాదించుకోవడానికే అన్న విషయాన్ని దాదాపుగా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు చేరవేయగలిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఈ జిల్లాలో పెత్తనం చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఏనాడు ఇక్కడి ఫ్లోరైడ్‌ ‌సమస్యను పట్టించుకోలేదు, టిఆర్‌ఎస్‌ ఆ ‌బాధలేకుండా చేసింది. కాని ఇక్కడ ఫ్లోరైడ్‌ ‌రిసర్చ్ ‌సెంటర్‌ ఏర్పాటు చేస్తామంటే ఎనిమిది ఎకరాల స్థలం కేటాయించినా కేంద్రం దాన్ని పట్టించుకోలేదంటోంది టిఆర్‌ఎస్‌. ‌నల్లగొండలో వెయ్యి పడకల హాస్పిటల్‌ ‌ని ఏర్పాటు చేస్తామన్న మాటనుకూడా కేంద్రం నిలుపుకోలేకపోయింది. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి వెయ్యి కోట్లతో ఈ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని టిఆర్‌ఎస్‌ ‌ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్‌ ‌కూడా బిజెపి, టిఆర్‌పై విరుచుకుపడుతున్నది. ఈ రెండు పార్టీలు కలిసి నాటకమాడుతున్నాయని, ఈ రెండు కూడా కాంగ్రెస్‌ను తొక్కేసే కుట్రలో ఉన్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

అందుకు కోట్లాది రూపాయల డబ్బు సంచులను ఈ రెండు పార్టీలు మునుగోడుకు దిగుమతి చేస్తున్నాయంటూ దుయ్యబడుతోంది. దానికి తగినట్లుగా ఇటీవల బిజెపిక చెందినవిగా చెబుతున్న కోటి రూపాయలను ఒక వాహనం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ రెండు పార్టీల మాదిరిగా తమ పార్టీ డబ్బును ఎరచూపే స్థితిలో లేదని, వోటర్లు న్యాయంగా, ధర్మబద్దంగా తమ వోటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికోసమే పార్టీ మారినట్లు చెబుతున్నాడు. అయితే ఆయన మారిన పార్టీకూడా ప్రతిపక్ష పార్టీయే. ఒక ప్రతిపక్ష పార్టీనుండి మరో ప్రతిపక్ష పార్టీలోకి మారినంత మాత్రాన నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని కాంగ్రెస్‌ ‌నేతలు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాకుండా కేవలం తన వ్యాపార అభివృద్ధికోసమే కన్నతల్లిలాంటి కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచి బిజెపి తీర్థం తీసుకున్నాడని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏదిఏమైనా ఇప్పుడు మునుగోడు ముఖ్యమైన ఎన్నికగా మారింది. ఇక్కడ జరిగేది ఉప ఎన్నికే అయినా, ఎన్నిక అయిన వారెవరైనా ఒక ఏడాది వరకే శాసనసభ్యుడిగా కొనసాగుతాడని తెలిసినా, ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ శక్తిమేర కృషిచేస్తున్నాయి.

 

కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని నలుమూలలనుండి తమ పార్టీ శ్రేణులను ఇక్కడి తరలిస్తున్నారు. ఒక్క వోటరునుకూడా విడిచిపెట్టకుండా తమకే వోటువేసి గెలిపించాలని వారితో హామీ తీసుకుంటున్నారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి మందు, విందుతో ఖుషీ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కీలకవేళ ఇతర పార్టీలనుండి ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకోవడంద్వారా ప్రజల్లో తమ పార్టీపట్ల ఇమేజ్‌ ‌పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వార్డు మెంబర్‌, ‌సర్పంచ్‌, ‌జడ్‌పిటిసి, ఎంపిటీసీలు పార్టీ మారితే ఒక్కొక్కరిది ఒక్కో రేటుగా ఉంది. వేల నుండి లక్షల్లోనే వీరి ధర పలుకుతున్నది. ఈ నియోజకవర్గ పరిధిలో దాదాపు 175 మంది సర్పంచ్‌లున్నారు. వీరిలో దాదాపు అరవై శాతం మంది ఇస్తామన్న డబ్బులు ఇవ్వక నానుస్తుండడంతో తిరిగి తమ స్వంత గూటికి చేరుకునే విషయంలో ఊగిసలాడుతున్నవారున్నట్లు తెలుస్తున్నది. కాగా ఇక్కడ వోటర్లతో బాహాటంగానే బేరసారాలు సాగుతుండడం విశేషం. నవంబర్‌ 3 ఎన్నిక రోజువరకు కోట్లాదిరూపాయలను రాజకీయ పార్టీలు మంచినీళ్ళ ప్రాయంగా పంచిపెట్టే కార్యక్రమానికి రంగం సిద్దంచేసుకుంటున్నాయి.

గెస్ట్ ఎడిట్‌… ‌మండువ రవీందర్‌రావు

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment