పాఠం నేర్పుతున్న మును ‘గోడు’

గత నెల రోజులుగా మునుగోడు లో జరుగుతున్న ప్రచార పర్వం మరికొద్ది గంటల్లో ముగియనుంది. మంగళవారం సాయంత్రం అయిదు గంటల్లోగా ఎంత వీలైతే అంత మంది వోటర్లను స్వయంగ కలుసుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ పరుగులు పెడుతున్నాయి. ఏ పార్టీ ఎంత మందిని ప్రభావితం చేయగలిగింది, దానివల్ల ఎవరు లాభపడేది, ఏ పార్టీ ఏ మేరకు నష్టపోయేదన్న విషయాన్ని వోటర్లు మరో రెండు రోజుల్లో బ్యాలెట్‌ ‌బాక్స్‌లో నిక్షిప్తం చేయబోతున్నారు. మునుగోడు బరిలో మొత్తం నలభై ఏడు మంది అభ్యర్థులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. చివరకు గెలిచేది ఒకే వ్యక్తి అయినా పోటీ పడుతున్నవారు వారి పలుకుబడితో ఎవరి వోట్లను ఎవరు ఎక్కువగా చీలుస్తారన్న లెక్కలు వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్నికల కమిషన్‌• ‌గుర్తింపు పొందిన పార్టీలు సుమారు పది నుండి పన్నెండు వరకున్నాయి. మిగతావారంతా స్వతంత్ర అభ్యర్థులే. కాగా ప్రధానంగా పోటీ పడుతున్నవి మూడు పార్టీలు. వాటిల్లో అధికార టిఆర్‌ఎస్‌, ‌బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు.

వీటితో సమానంగా ప్రచారంలో ఉన్న మరో రెండు పార్టీలు బిఎస్పీ ,తెలంగాణ సమితి.. అయినప్పటికీ పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యే ఎక్కువగా ఉండే అవకాశముంది. ముఖ్యంగా తమకు పోటీదారు టిఆర్‌ఎస్‌ ‌మాత్రమేనని కాంగ్రెస్‌, అం‌టుండగా బిజెపి కూడా టిఆర్‌ఎస్సే తమ పోటీదారంటోంది. గత ఎన్నికల ఫలితాలపైన ఒకసారి దృష్టి సారిస్తే… టిఆర్‌ఎస్‌పైన కాంగ్రెస్‌ ‌మంచి మెజార్టీతో గెలిచింది. కాంగ్రెస్‌కు 97 వేల 239 వోట్లు రాగా, సమీప టిఆర్‌ఎస్‌ ‌ప్రత్యర్థికి 74 వేల 687 వోట్లు వచ్చాయి. అంటే ఆ ఎన్నికల్లో లక్షా 98వేల 843 వోట్లు పోల్‌ ‌కాగా కాంగ్రెస్‌కు 48.90 శాతం, టిఆర్‌ఎస్‌కు 37.56 శాతం వోట్లు లభించాయన్నమాట. ఆ ఎన్నికల్లో బిజెపికి కేవలం 12 వేల 725 అంటే 6.40 శాతం వోట్లు మాత్రమే వొచ్చాయి. కాగా ఆనాడు కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు పదహారు మంది పోటీలో నిలిచారు. వారంతా రెండు నుంచి మూడున్నర వేల వోట్ల కన్నా ఎక్కువ సాధించలేకపోయారు. మునుగోడుకు మొదట్లో కమ్యూనిస్టు ఆ తర్వాత కాంగ్రెస్‌ ‌నియోజకవర్గంగా పేరుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 మొదటిసారిగా ఇక్కడ టిఆర్‌ఎస్‌ ఆ ‌స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్న ముగ్గురు ప్రధాన అభ్యర్థుల్లో ఇద్దరు పాతవారె. అయితే కోమటి రాజగోపాల్‌రెడ్డి మాత్రం గతంలో కాంగ్రెస్‌నుండి పోటీచేసి గెలుపొందగా, ఈసారి ఆయన బిజెపి నుండి రంగంలో ఉన్నారు. ఆయన స్థానంలో అంటే కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొత్తగా పాల్వాయి స్రవంతి రంగంలో ఉంది. స్రవంతి తండ్రి గతంలో ఇక్కడ ఎంఎల్‌ఏగా ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి. ఆయన మరణానంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ‌ప్రభావం బాగా ఉండటంతో గత ఎన్నికల్లో మంచి మెజార్టీతో కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు. అయితే ఆయన తన స్వార్థ ప్రయోజనాలకోసమే పార్టీ ఫిరాయించి ఉప ఎన్నిక ఉపద్రవాన్ని కొనితెచ్చాడన్న ప్రచారం విస్తృతంగా సాగింది.

పార్టీ మారిన రెడ్డి తనకు కోట్లాది రూపాయల విలువజేసే ప్రాజెక్టు వొచ్చిన విషయాన్ని స్వయంగా చెప్పడం అటు కాంగ్రెస్‌ ‌వర్గాల్లో, స్థానిక ప్రజల్లో ఆయనపైన అగ్రహానికి కారణమయింది. బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్న రాజగోపాల్‌రెడ్డిని ఎట్టి పరిస్థితిలోనైనా గెలిపించుకునే బాధ్యతను ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం భుజాన వేసుకుంది. ఆయనతో పోటీ పడుతున్న అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గతంలో రాజగోపాల్‌రెడ్డితో ఓటమి చవిచూసినవాడే అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో మంచి పట్టున్న కమ్యూనిస్టు పార్టీల అండదండలు ఆయనకు మెండుగా లభిస్తున్నాయి. దానికి తగినట్లుగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ దాదాపు ఎనభై ఆరు మంది ఎంఎల్‌ఏలను, మంత్రులను, ఎంఎల్సీలను, ఎంపిలను, పలువురు జడ్‌పి చైర్మన్‌ ‌లను ప్రచార రంగంలోకి దింపింది. ఈ రెండు పార్టీలుకూడా గతంలో ఏ ఎన్నికల్లో చూడనంత డబ్బును గుమ్మరిస్తున్నాయి. దీంతో ఇక్కడ జరుగుతున్నది సాధారణ ఉప ఎన్నికే అయిన అసాధారణ ఎన్నికగా మారింది.

కేవలం నియోజవర్గానికో, జిల్లాకో పరిమితం కాకుండా రాష్ట్రం ఎల్లలు దాటి, జాతీయ స్థాయిలో ఇక్కడి ఎన్నిక ఆసక్తిగా మారింది. గత నెల రోజుల ఇక్కడి ప్రచార సరళిని పరిశీలిస్తే, ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించేదిగా మారింది. ప్రధాన పార్టీలు ఒకదానిపై ఒకటి నిందలు వేసుకోవడం, వ్యంగ్యాస్త్రాలను సంధించడం, గతంలో ఏ రాజకీయ నాయకులు, పార్టీలు వాడని అపశబ్ధాలు వాడడం, ప్రమాణాలు చేయడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ వోటు ఖరీదును కూడా రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా పెంచుతూ పోతున్నాయి. ఒక వోటు విలువ ప్రస్తుతానికి ఇక్కడ ఇరవై నుండి ముపై వేలవరకు పలుకుతుందంటే ఎన్నికలు ఎంత భారం అవుతున్నాయన్నది అర్థమవుతున్నది. రోజువారి కూలీపనులు చేసుకునేవారికి ఈ ఎన్నిక పండుగను తెచ్చిపెట్టింది. పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే తమకు లభించే రోజువారీ కూలీకన్న గిట్టుబాటు ఎక్కువగా ఉందని వారు సంతోష పడుతున్నారు. తాగినంత మద్యం, తిన్నంత నాన్‌ ‌వెజిటేరియన్‌ ‌తిండి అంతకన్నా ఇంకా ఏంకావలంటున్నారు వారు. ఈ పరిస్థితిని చూస్తే రానున్న ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నార్థకంలో పడ్డారు రాజకీయ భవిష్యత్‌ ఆశావహులు. ఇక సామాన్యులెవరూ భవిష్యత్‌లో ఎన్నికల్లో నిలబడే అవకాశంలేదన్నది దీంతో స్పష్టమవుతుంది.

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment