కొరోనా కాలంలో ఇండియాలోనే అధిక మరణాలు.?

ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా

1 జనవరి 2020 నుంచి 31 డిసెంబర్‌ 2021 ‌మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల ప్రజలు కరోనా బారిన పడ్డారని, వీరిలో 1.49 కోట్ల అదనపు మరణాలు (కరోనాకు ముందు నమోదైన మరణాల రేటుతో పోల్చితే) నమోదు అయ్యాయని తాజాగా విడుదలైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌ఓ) ‌తాజా నివేదిక వెల్లడించింది. ఆగ్నేయ ఆసియా, యూరోప్‌, ‌యూయస్‌ ‌దేశాల్లో అత్యధికంగా అదనపు మరణాలు 84 శాతం, వీటిలో కేవలం ఇండియా, రష్యా, ఇండోనేషియా, యూయస్‌, ‌బ్రెజిల్‌ ‌లాంటి 10 దేశాల్లోనే 68 శాతం ఎక్కువ మరణాలు జరిగాయని తెలుస్తున్నది. మొత్తం 14.9 మిలియన్ల అదనపు కోవిడ్‌ ‌మరణాల్లో 81 శాతం మధ్య ఆదాయ దేశాల్లో నమోదు అయ్యాయని తెలుస్తున్నది.

ఇండియాలో అదనపు మరణాల రేటు:
భారత్‌లో తొలి అల (మార్చి 2020 తరువాత) తాకిడికి రోజుకు 90,000 కేసులు బయట పడ్డాయని స్పష్టం అవుతున్నది. భారతదేశంలోని 12 రాష్ట్రాల వివరాల విశ్లేషణలో 2020, 2021 సంవత్సరాల్లో అత్యధికంగా 41 లక్షల అదనపు మరణాలు జరిగాయని ‘ది లాన్సెట్‌’ అధ్యయనం కూడా వెల్లడించగా, డబ్ల్యూహెచ్‌ఓ ‌ప్రకారం 47 లక్షల కరోనా మరణాలు నమోదైనాయని తెలుస్తున్నది. ప్రథమ అలలో భారతంలో అదనపు మరణాల రేటు వెయ్యికి 0.5గా (2019లో మరణాల రేటు 6.0 ఉండగా 2020లో 6.5 నమోదైంది) అంచనా వేయబడింది. ఢిల్లీలో అత్యధికంగా అదనపు మరణాల రేటు 3.8, తమిళనాడులో 2.9, ఆంధ్రలో 2.3, కర్నాటకలో 2.1, గుజరాత్‌లో 2.0గా అంచనా వేయబడింది. అత్యల్ప మరణాలలో తెలంగాణలో -0.05, యూపీలో 0.05 మరణాల రేటు తగ్గడం, ఉత్తరాఖండ్‌లో 0.02 రేటు నమోదు కావడం జరిగింది.

2019 మరణాలతో పోల్చితే 2020లో 7 లక్షల అదనపు మరణాలు నమోదు అయ్యాయని, తమిళనాడులో 2.2 లక్షలు, బీహార్‌లో 1.5 లక్షలు, మహారాష్ట్ర 1.4 లక్షలు, కర్నాటకలో 1.4 లక్షలు, గుజరాత్‌లో 1.3 లక్షలు, ఆంధ్రలో 1.2 లక్షల అదనపు మరణాలు నమోదైనాయని వివరించబడింది. భారత గణాంకాల ప్రకారం 2020లో 1.5 లక్షల అదనపు మరణాలు (డబ్ల్యూహెచ్‌ఓ అం‌చనాల కన్న 4.7 రేట్లు తక్కువగా) మాత్రమే జరిగాయని వెల్లడించింది. కరోనా అలల కాలంలో అదనపు మరణాలకు కారణాలుగా కరోనాతో పాటు టిబి, కాన్సర్‌, ‌హృద్రోగాలు, మధుమేహం లాంటి ఇతర అనారోగ్యాలకు సరైన వైద్యం లభించని కారణంగా సంభవించాయని విశ్లేషించాలి. వీటితో పాటు ఉద్యోగ ఉపాధుల కోతలు, పేదరికం పెరగడం, కరువుకాటకాలు, ఆకలి భూతం లాంటి కారణాలు కూడా అదనపు మరణాలకు ఆజ్యం పోశాయని తెలుస్తున్నది.

భారత ప్రభుత్వ ఖండన:
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వాస్తవానికి దూరంగా ఉందని, తమ వద్ద శాస్త్రీయ అధ్యయన వివరాలు ఉన్నాయని ఖండించింది. భారత అధ్యయన వివరాలు ప్రకారం తక్కువ అదనపు మరణాలు మాత్రమే నమోదు అయ్యాయని, డబ్ల్యూహెచ్‌ఓ ‌విశ్లేషణలు అశాస్త్రీయంగా, అసంబద్దంగా, అతిగా అంచనా వేయబడ్డాయని తెలిపింది. 2019 వివరాలతో పోల్చితే 2020లో అధిక మరణాలు నమోదైన మాట వాస్తవమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం సరియైనది కాదని భారత్‌ ‌నిరసన తెలుపుతూ ఇటీవల జెనీవాలో జరిగిన 75వ ప్రపంచ ఆరోగ్య సదస్సులో ఖండన విడుదల చేసింది.

Breaking News NowCorona periodMost deaths in Indiaprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment