నేను అందరివాడిని… మంత్రి కేటీఆర్‌

  • కులమతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు
  • బిసి కుల సంఘాల బాధ్యులతో, జిల్లా ఆడ్వకేట్లతో మంత్రి కేటీఆర్‌ ‌సమావేశం
  • తనను ఇంత వాణ్ణి చేసిన ఈ గడ ప్రజల రుణం తీర్చుకుంటానన్న మంత్రి

సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‘‌హైదరాబాద్‌లో పెరిగినోన్ని, కాన్వెంట్‌లో చదివినోన్ని. కుల, మత పిచ్చి లేదు. రాజకీయాల్లోకి వొచ్చాకే కులాలు, మతాల గురించి తెలిసింది. పేదరికానికి కులం, మతం ఉంటుందా….? కులమతాలకు అతీతంగా సబ్బండ వర్గాల అభ్యున్నతి నా ధ్యేయం’ అని రాష్ట్ర మున్సిపల్‌శాఖ, ఐటి శాఖల మంత్రి కె తారక రామారావు అన్నారు. కులమతాలకు అతీతంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానని ఆయన తెలిపారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో బిసి కుల సంఘాల బాధ్యులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ…నా కులం అభివృద్ధి, మతం సంక్షేమం. నేను అందరివాడినీ.. అలాగే ఉండాలని అనుకుంటున్నా. మీ అందరి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాయని, సిఎం కేసిఆర్‌ ఆశీస్సులతో మంత్రి నయ్యానని, ఈ స్థాయి ఎదుగుదలకు కారణమైన ఈ గడ్డ, ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ అన్ని కులాలు, మతాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారని, బీసీలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని గౌరవమని, గతంలో సమైక్య రాష్ట్రంలో16 బిసి గురుకులాలు ఉంటే తెలంగాణలో 119 బిసి గురుకులాలను ప్రభుత్వము ఏర్పాటు చేసిందన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం త్వరలోనే చేపెట్టి మిగిలిన అర్హులకు అందజేస్తానని అన్నారు.

భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణా గొల్ల కురుమలకు అధిక లబ్ది జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లాలో పద్మశాలి, రెడ్డి సంఘాలకు ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాలకు స్థలాలను కేటాయించి, ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. అదే మాదిరి ముదిరాజ్‌, ‌గౌడ్‌, ‌గంగపుత్ర, గొల్ల, కుర్మ, మున్నూరు కాపుతో సహా అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాలకు స్థలాలను కేటాయిస్తామన్నారు. కేటాయించిన స్థలంలో ఫంక్షన్‌ ‌హల్‌తో పాటు బాలబాలికలకు హాస్టళ్లను నిర్మించాలన్నారు. ఆత్మగౌరవ భవనాలకు భూమిపూజ కార్యక్రమానికి స్వయంగా ఆహ్వానిస్తే తానే వొస్తానని, వారితో ప్రత్యేకంగా సమావేశమై వారి సాధకబాధకాలను తెలుసుకుంటానని కేటీఆర్‌ ‌తెలిపారు. సమావేశం అనంతరం కుల సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలపై ఇచ్చిన అర్జీలను మంత్రి స్వీకరించారు. అంతకుముందు మంత్రి కేటీఆర్‌ ‌జిల్లాలోని అడ్వకేట్‌లతో కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌లు బి సత్య ప్రసాద్‌, ‌ఖీమ్యా నాయక్‌, ఆర్డీఓ శ్రీనివాసరావు, మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌లు జిందం కళా చక్రపాణి, రామతీర్థపు మాధవి రాజు, పలువురు జిల్లా అధికారులు, మున్సిపల్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ ‌జిల్లా కేంద్రంలో రెడ్డి సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్రంలో ఉన్న రెడ్డీలు పేరుకే అగ్రవర్ణాలు..వీరిలో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. రెడ్డి సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌తో సాధ్యమైనంత త్వరలోనే చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ప్రతి కులంలో పేదవారు ఉన్నారు..అలానే రెడ్డిల్లో కూడా పేదలు ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌ ‌నాయకత్వంలో కులమతాలు ఏవైనప్పటికీ.. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో జరగని అభివృద్ధి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధ్యమైందన్నారు. కేసీఆర్‌ ‌రైతుబిడ్డ కాబట్టే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి రైతుబంధు రైతు ఖాతాల్లో జమ అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌లో భాగంగా నిర్మించిన జలాశయాల తో సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు. సిరిసిల్లలో మెడికల్‌ ‌కాలేజీ నిర్మించుకోబోతున్నామని తెలిపారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో తనకు మంత్రి పదవి వచ్చింది. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ప్రతి కుల సంక్షేమానికి కృషి చేస్తానని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Minister KTR's meeting with BC caste leaders and district advocates
Comments (0)
Add Comment