29 లోగా పాలక మండళ్ల సమావేశాలు

• మేయర్లు, ఛైర్ పర్సన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్లకు త్వరలో వర్క్ షాప్ 
• వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు
• ప్రతి మున్సిపాలిటీలోనూ కాల్ సెంటర్
• టిడ్కో ఇళ్లను త్వరితగతిన  పూర్తి చేయాలి
• పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ
మున్సిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశం
వేసవిలో  మంచినీటి ఎద్దడి నివారణ, టిడ్కో గృహాల నిర్మాణం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పథకం వంటి ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై సమగ్రమైన కార్యాచరణను రూపొందించడానికి వీలుగా రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకమండళ్ల తొలి సమావేశాలను ఈ నెల 29 లోగా నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్ పర్సన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్ పర్సన్లకు వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు త్వరలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. 
బుధవారం నాడు విజయవాడలోని  ఎఎంఆర్ డిఎ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పలు అంశాలపై ఆయన సమీక్షించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, సిడిఎంఎ ఎం.ఎం. నాయక్ , టిడ్కో ఎండి శ్రీధర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి సంపత్ , ఇంజనీర్ ఇన్ ఛీప్ చంద్రయ్య, మెప్మా ఎండి విజయలక్ష్మి  తదితర ఉన్నతాధికారులు  ఈ వీడియో కాన్పరెన్సులో పాల్గొన్నారు.  పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధంవంతంగా నిర్వహించినందుకు పురపాలక శాఖ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
మంచినీటి అంశంపై సమీక్ష..
వేసవి కాలంలో పట్టణ ప్రాంతాల్లో మంచినీటి కొరత లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలను తీసుకోవాలని, వచ్చే మూడు నెలల కాలానికి అవసరమైన నీటి నిల్వలను ట్యాపింగ్ చేసుకుని ఉంచుకోవాలని కమిషనర్లను ఆదేశించారు. ఏ ఒక్క ప్రాంతంలో కూడా తాగునీటి ఇబ్బంది అనేది ఎదురవ్వకుండా, చూడాలన్నది గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన అని అందుకు అనుగుణంగా  కట్టుదిట్టమైన కార్యాచరణను రూపొందించుకుని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు.
 పాలకమండళ్లలో సమగ్రంగా చర్చించిన తరువాతనే తుది ప్రతిపాదనలు, కార్యాచరణను తయారు చేయాలని స్పష్టం చేశారు. మంచినీటి సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి పేర్కొన్నారు. అన్ని సమ్మర్ స్టోరేజి ట్యాంకుల్లో సమృద్ధిగా నీళ్లు ఉండేలా చూడటంతోపాటు, ప్రతినిత్యం నీటి పంపిణీ, నాణ్యతా పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరమైన బోరింగులు, నీటి సరఫరా కోసం అవసరమైన ట్యాంకర్లను ఇప్పటి నుంచే అందుబాటులోకి ఉంచుకుని ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మంత్రి నిర్దేశించారు. మంచినీటి సరఫరా చేసేందుకు ఉద్దేశించిన పథకాల పనులను వేగవంతం చేయాలని, సంబంధిత ఇంజనీర్లు పనుల పురోగతిని నిత్యం సమీక్షించాలని ఆదేశించారు.  
 టిడ్కో గృహాల పనులు వేగవంతం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా టిడ్కో ఆధ్వర్యంలోని ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన  పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యాన్ని సాధించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభమై వివిధ దశల్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయడంతోపాటు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను సత్వరం చేపట్టాలని నిర్దేశించారు.
టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు మంజూరు కావడంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా, బ్యాంకులతో సమన్వయం చేసుకునేందుకు మెప్మా సిబ్బందితోపాటు, ప్రతి జల్లాలోనూ రిటైర్డ్ బ్యాంకు అధికారులను కూడా నియమించామని, వారందరి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంపై కమిషనర్లందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి వారం సమీక్షిస్తూ, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన కార్యాచరణను, బయోమైనింగ్ తదితర అంశాలపై కూడా సమీక్షించారు.
Comments (0)
Add Comment