జీవితం సాగిపోతోంది!

విచ్చుకున్న విత్తులన్నీ
వృక్షాలయ్యాయా?
మెరిసిన భావాలన్నీ
కావ్యాలయ్యాయా?

భ్రమపడ్డ ప్రేమలన్నీ
బంధాలయ్యాయా?
ఊరించిన కలలన్నీ
వాస్తవాలయ్యాయా?

విరిసిన విరులన్నీ
వరమాలలయ్యాయా?
చిగురించిన ఆశలన్నీ
విజయాలయ్యాయా?

అవలేదన్నా సమయం ఆగిపోదు!
అక్కరలేదన్నా తరుణం దాటిపోదు!

ఎగిసి పడ్డ కెరటాలన్నీ
తీరాన్ని తాకి తనువు చాలిస్తే!
మిడిసి పడ్డ కోరికలన్నీ
మదిని తాకి మరణించాయి!

ఊహాలన్నీ ఊపిరిలో
ఊగిసలాడితే!
కలతలన్నీ కన్నీళ్ళల్లో
తానాలాడాయి!

భంగపడ్డ తమకాలన్నీ
ఎక్కిళ్ళను ఎగతోస్తే!
భయపడ్డ తనువులన్నీ
గుటకలు వేసాయి!

అయినా…….
జీవితం సాగిపోతోంది!..
కసిరేగిన కాలం
కరుణించి కనికరించక
పోతుందాయని
వేచి చూస్తూ!..
జీవితం జరిగిపోతోంది!

   – ఉషారం
   9553875577

Comments (0)
Add Comment