కాలచక్రం

ఉదయమంతా తెల్ల చీర

రాత్రయితే నల్ల చీర కట్టుకుని,

అలవోకగా పయనించే కాలంతో

నుదుటి కాగితం మీద

అది విదిల్చిన

అక్షరాలను కూర్చుకుంటూ

ఆగు కాలమా అన్నాను

ఆగను నాతో సాగమంది

చక్రభ్రమణమే తన ధర్మమంది

వాయిదా వాహనంపై సవారీ

తగదు తగదంది

నిరాశా ఫలాలను అందించి

కర్తవ్యబోధ చేసింది.

వానలెన్నో చూసి,

ఎండలెన్నో కాగి

ఏకాంతం తోడుగా సాగిపోతోన్న

దాన్నిజి

మా బాధలు,గాధలు వినమన్నా

మీ గాయాల్ని

నాలో దాచుకున్నానంది

 

ఆద్యంతాలు లేనిదది

దాని తీరు మారదు…

నేనే మారాలని అర్థంచేసుకొన్నా

ఇప్పుడు

తనతో పోటీపడుతున్నా

విజయతీరాలని చుంబిస్తున్నా

అదెంత విలువో తెలుసుకున్నా

నిందించడం మానుకొన్నా.

 

ఓ కాలమా…

నీకు లేరు బంధువులు

లేవు భవబంధాలు

నీవు స్థిత ప్రజ్ఞురాలివి.

నీ లీలలు వర్ణింపతరమా!

– వేమూరి శ్రీనివాస్‌

9912128967, ‌తాడేపల్లిగూడెం

Comments (0)
Add Comment