ధరిత్రిని కాపాడుకుందాం!

పర్యావరణ పరిరక్షణకు మద్దతునిచ్చేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 22న ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ ప్రపంచవ్యాప్తంగా పుడమితల్లిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు.’’భూమాత ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగలదు కానీ వారి కోరికలు తీర్చ లేదన్నారు’’ మహాత్మా గాంధీ.ఈ భూమి సకల జీవులకు నెలవు. భూమి అంటే మట్టి మాత్రమే కాదు ,కోటానుకోట్ల జీవరాశులకు జీవవైవిద్యానికి పుట్టిల్లు.ఇది ఒక మానవులకే సొంతం కాదు.మొక్కలు,జంతువులు, చేపలు, పక్షులు, పురుగులు, వానపాములు, సూక్ష్మజీవులు లాంటి ఎన్నెన్నో జీవులకు ఆవాసం. ఈ భూమిపై అన్నిటికీ హక్కు ఉంది.’లివింగ్‌ ప్లానెట్‌’ ఇండెక్స్‌ ప్రకారం స్తన్యజీవులు,పక్షులు,సరిసృపాలు, జలచరాలు,ఉభయచర జీవుల్లో దాదాపు 68 శాతానికి పైగా 1970-2016 మధ్యకాలంలో కనుమరుగైపోయాయి.ఈ జీవుల జనాభాలో ఏటా సగటున నాలుగు శాతం తగ్గుతూ నమోదవుతున్నవి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 శాతానికి పైగా వృక్షజాతులు అంతరించిపోయే పరిస్థితులు నేడు మనకు కనిపిస్తున్నాయి.

ధరిత్రి జీవవైవిద్యానికి పుట్టిల్లు. ఇది ప్రతి మొక్కను, ప్రతి జంతు వును, సకల చరాచరాలన్నిం టిని పోషిస్తున్నది. మనం త్రాగే నీరు, పీల్చే గాలి, పండిరచే నేల, జీవనోపాధులు వంటి ఎన్నో అంశాలు ధరిత్రితో ముడిపడి ఉన్నాయి. భూమి మన అస్తిత్వానికి ఆధారం.పంచభూతాల సమహారం మన విశ్వం. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఇవన్నీ ఎంత స్వచ్ఛంగా ఉంటే సమాజానికి, మానవాళికి అంత ఆరోగ్యకరం.కానీ మానవుడు ఈ భూమి మీద ఇక మనమే చివరి తరం అన్నట్లు విచక్షణరహితంగా వ్యవహరిస్తూ జీవవైవిద్యాన్ని కర్కషంగా ధ్వంసం చేస్తున్నాడు. భూమి ఉపరితలంపైన,భూమి మీద, భూగర్భంలో ప్రతి చోట తన విధ్వంసాన్ని కొనసాగి స్తున్నాడు. నదులు , సముద్రాలు, చెరువులు, కాలువలు, సరస్సులు, అడవులు, జీవరాశులు,  కొండలు మొదలగు సహజ సంపదలను దేనినీ వదిలిపెట్టడం లేదు.

ప్రకృతి మాత ఒడిలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాల్సిన మానవుడు తన మితిమీరిన స్వార్థ బుద్ధితో, చేష్టలతో తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుంటున్నాడు .భూమిపై గల అన్ని వనరులు సక్రమంగా ఉంటేనే నిజమైన అభివృద్ధి ఆవిష్కృతమవుతుంది. మానవుడు అత్యాశకు పోయి మొత్తం ధరిత్రిని కలుషితం చేసి నేడు తాను సృష్టించుకున్న కాలుష్యానికి తానే బలి అయిపోతున్నాడని చెప్పవచ్చు.ఈ భూమిపై మనం అతిధులం మాత్రమే.అతిధులు అన్నాక  అణుకువగా ఉండాలి.భూమిపై ఉన్నన్ని రోజులు ఉండి సృష్టిలోని అందాలను ఆస్వాదించి తదుపరి తరాలకు జాగ్రత్తగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై కలదు.ఈ భూమిపై తదుపరి వచ్చే తరాలు కూడా హాయిగా,ఆరోగ్యంగా బ్రతకగలిగేలా మన జీవన విధానం ఉండాలి.సహజ వనరులను మితిమీరి ఉపయోగించడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది.ప్రకృతిపై మనం చేస్తున్న విధ్వంసకాండను ఇకనైనా ఆపి   పర్యావరణ హితకరమైన పద్ధతులతో కూడిన జీవనశైలిని ప్రతి ఒక్కరం విధిగా అలవర్చుకోవాలి. నీరు,ఇంధనం, విద్యుత్‌ వంటి విలువైన వనరుల వినియోగంలో పొదుపును అలవర్చుకొని తద్వారా పుడమి పరిరక్షణకు ప్రతి ఒక్కరం పాటుపడాలి.

ఈ సంవత్సరం ధరణి దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ‘‘ప్లాస్టిక్‌ మీద ప్లానెట్‌ యుద్ధం’’ అనే థీమ్‌ తీసుకున్నది. భూమి ఆరోగ్యరీత్యా 2040 నాటికి అన్ని రకాల ప్లాస్టిక్‌ ఉత్పత్తులను నిలిపివేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ వైపుగా ప్రతి ఒక్కరి అడుగులు ఉండాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ప్రస్తుతం ప్లాస్టిక్‌ వినియోగం మానవుని నిత్యజీవితంలో భాగంగా మారింది.మితిమీరిన ప్లాస్టిక్‌ వినియోగం ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని తూట్లు పొడిచి జీవావరణ వ్యవస్థలను కోలుకోకుండా చేస్తున్నది.ప్లాస్టిక్‌ కాలుష్యం అన్నది ప్రపంచ దేశాలన్నింటికీ అతిపెద్ద సమస్యగా మారింది.ప్రజల జీవనశైలి,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన మార్పుల వలన ప్లాస్టిక్‌ వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది.1950 నుండి 1970 మధ్యకాలంలో అతి తక్కువ మొత్తంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తి వినియోగం ఉండేది.కానీ 1970 అనంతరం ప్లాస్టిక్‌ ఉత్పత్తి మరియు వినియోగం అనూహ్యంగా పెరిగిపో యింది. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఒక మిలియన్‌ ప్లాస్టిక్‌ బాటిళ్లు అమ్ముడవుతున్నాయి.ఏడాదికి ఐదు ట్రిలియన్‌ ప్లాస్టిక్‌ సంచులు వినియోగించ బడుతున్నాయి. ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్లో యాభై శాతానికి పైగా ఒకేసారి వాడి పారేసేలా ఉండడంతో అవి పర్యావరణానికి ఎనలేని హానిని కలిగిస్తున్నాయి.భూగర్భాన చేరే ప్లాస్టిక్‌ వ్యర్థాలు దాదాపు నాలుగు శతాబ్దాల పాటు అలాగే ఉండిపోయి మానవాళి ఆరోగ్యానికి అవరోధంగా, జలచరాలకు ప్రాణాంతకంగా మారుతున్నది.నేలను, నీటిని,గాలిని కాలుష్యంగా మార్చడంలో ప్లాస్టిక్‌ కాలుష్యం ప్రధానంగా ఉంటున్నది.మన దేశంలో అయితే ఇప్పటికీ రోజు సగటున 26వేల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నవి. పర్యవసానాలు గుర్తుంచుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో పారేస్తున్న ప్లాస్టిక్‌ సంచులు ఎన్నో మూగజీవుల ప్రాణాలను బలిగొంటున్నవి.

చనిపోయిన ప్రతి గేదె,ఆవు పొట్టల్లో ముప్పై కిలోలకుపైగా ప్లాస్టిక్‌ వ్యర్ధాలు బయటపడుతున్నవి. నదులు,సముద్రాలు, చెరువులు, సరస్సులలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఆహారము అనుకొని అవి  తిని చేపలు,తాబేలు లాంటి ఎన్నో జలచరాలు మృత్యువాత పడుతున్నవి.ఏటా 14 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయి. 2050 నాటికి సముద్రంలో జలచరాల కన్నా ఎక్కువగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉంటాయని ఒక అంచనా! తక్కువ ఖర్చుతో సులభంగా అన్ని అవసరాలకు ఉపయోగపడుతుండడంతో ప్లాస్టిక్‌ బ్యాగులపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్లాస్టిక్‌ కవర్లు మరియు ప్లాస్టిక్‌ వస్తువుల వాడకం వలన పర్యావరణ కాలుష్యం పెరగడమే గాక భూమి మీద నున్న జీవరాశుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కేవలం తొమ్మిది శాతం ప్లాస్టిక్‌ మాత్రమే రీసైక్లింగ్‌ అవుతున్నది.ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ కొంత ఎక్కువగానే ఉండడం ఆనందించే విషయం.ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ కు అధిక ప్రాధాన్యత ఇస్తే కొత్త ఉత్పత్తి కొంతమేర తగ్గే అవకాశం కలదు.ప్రజలు సైతం వస్తువుల కొనుగోలుకు వెళ్లినప్పుడు వస్త్రంతో చేసిన సంచులు తీసుకెళ్లడం ఉత్తమం.ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయుక్తంగా మలుచుకొనుటకు తగిన పరిశోధనలు జరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

ప్లాస్టిక్‌ వ్యర్థాల ద్వారా కలిగే అనర్థాల గురించి తెలిసిన ప్రజలు మనకందుకులే అనే ఉదాసీనదోరణిలో వ్యవహరిస్తున్నారు.కావున ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల కలిగే అనర్ధాల గురించి విస్తృతంగా ప్రచారం కలిగించి ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ చేసే పరిశోధనలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి.ప్లాస్టిక్‌ కు ప్రత్యామ్నాయలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి.  ‘‘సుసంపన్నమైన ప్రకృతి వనరులతో నిండిన ఈ ధరిత్రిని ధ్వంసం చేయకుండా కాపాడుతూ రేపటి తరాలకు సురక్షితమైన భూమిని  అందించడం మన అందరి బాధ్యత కావాలి’’.
-పుల్లూరు  వేణుగోపాల్‌
9701047002

Breaking News NowLet's save earthprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment