అట్లా బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎం. తార్కుండే అధ్యక్షులుగా, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నబకృష్ణ చౌదరి, హిందుస్తాన్ టైమ్స్ మాజీ సంపాదకులు బి.జి. వర్గీస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకులు అరుణ్ శౌరి , అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ప్రొఫెసర్ డా. బల్వంత రెడ్డి, ప్రజా కవి కాళోజీ నారాయణ రావు, సీనియర్ న్యాయవాదులు ఎం.వి.రామమూర్తి, కె. ప్రతాప రెడ్డి, నేను సభ్యులుగా తార్కుండే కమిటీ ఏర్పడింది.
అది నారాయణగూడ వైఎంసిఎలో ఎమర్జెన్సీ అయిపోయిన ఒకటి రెండు నెలలకే జరిగిన సమావేశం. ఎం.వి.రామమూర్తి గారు ఆ సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికి జయప్రకాశ్ నారాయణ నడుపుతుండిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సిఎఫ్‌డి) తరఫున ఆ సమావేశం ఏర్పాటయింది. ఆ సమావేశంలో బలవంత రెడ్డి లాంటి చాల మంది మాట్లాడారు. రామమూర్తి గారు అధ్యక్షత వహించారనుకుంటాను. అక్కడ మాట్లాడే క్రమంలో జ్వాలాముఖి ఒక సూచన చేశారు. ఈ ఎన్కౌంటర్ హత్యల మీద ఒక అనధికార, ప్రజాకమిటీ విచారణ జరిపితే బాగుంటుందని ఆయన అన్నారు.అప్పటికే కమిషన్ ఏర్పాటయింది. అది అధికారిక విచారణ కమిషన్. అది ఆంధ్ర ప్రదేశ్‌లో పనిచేయడం లేదు.అలాంటి అనధికార విచారణ కమిషన్ వేసే ఆలోచన బాగుందని చాలామంది అన్నారు. ఆ కమిషన్‌కు కన్వీనర్‌గా నేనుండాలని సూచించారు.
కన్వీనర్‌గా నా పని ఏమంటే విచారణ కమిటీలో ఎవరెవరు ఉండాలో నిర్ణయించడం. నాకు ఆ పని కొంత ఇబ్బంది కలిగించింది. ఆ కమిటీని ఎవరెవరితో ఏర్పాటు చేయాలని నేను చాల ఆలోచన చేయవలసి వచ్చింది. ఎందుకంటే అప్పుడు సమావేశంలో మాట్లాడిన వారందరూ నక్సలైట్లకు అనుకూలమైన సంస్థలలో ఉన్నవారే. వాళ్ళతోనే, కమ్యూనిస్టులతో, నక్సలైట్లతో సంబంధం ఉన్నవాళ్ళతోనే, నేను ఆ కమిటీని తయారు చేస్తే పని ముందుకు సాగదని నాకు తెలుసు.
మన దగ్గర కమ్యూనిస్టుల మధ్య జ్ఞాతి వైరాల వల్ల వాళ్ళ మధ్య తగాదాలతోనే కమిటీ పని తెల్లవారుతుంది. ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పటికీ నేను ఎవరి సలహా తీసుకోవాలని కూడా అనుకోలేదు. రామమూర్తి గారిని కూడా అడగలేదు.
అలా ఉండగా ఒకరోజు ఒక అనుకోని సంఘటన జరిగింది. నాకు జాహార్ గోహో అని ఒక న్యాయవాది మిత్రుడుండేవాడు. ఆయన కలకత్తాకు చెందిన ఒక బారిస్టర్. ఆయనకు ఇక్కడ ఉండే కేసులు నేను వాదిస్తుండేవాణ్ణి. ఒకరోజు ఆయన కేసు అయిపోయింది. కోర్టు నుంచి ఆయన బస చేసిన రిట్జ్ హోటల్‌కు వెళ్తూ డ్రింక్ కోసం నన్ను కూడా రమ్మన్నాడు. అప్పటికి ఇరవై ఏళ్ళుగా నేను రిట్జ్ హోటల్స్‌కు న్యాయపరమైన సలహాదారుగా ఉన్నాను. సరే, పదండి అని నేనూ ఆయనతో వెళ్ళాను.
అక్కడ ఆయన నన్ను దీపక్ శౌరి కి పరిచయం చేశాడు. దీపక్ మెటల్బాక్స్ అనే కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన అరుణ్ శౌరి కి తమ్ముడు. ఆయన కలకత్తా నుంచి ఆ కంపెనీ పనిమీద హైదరాబాదు వచ్చి ఉన్నాడు. మేం అట్లా కూచుని ఎమర్జెన్సీలో ఏమేం జరిగాయో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరిగిందో మాట్లాడుకుంటుండగా అరుణ్ శౌరి పేరు ప్రస్తావనకు వచ్చింది. అరుణ్ శౌరి అప్పటికి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకుడుగా ఉన్నాడు. ఢిల్లీ పియుసిఎల్డిఆర్ లో ఉన్నాడు. నాకు అరుణ్ శౌరి తో మాట్లాడవలసిన పని ఉందని, ఆయనను పరిచయం చేయమని నేను దీపక్ శౌరి ని అడిగాను. అట్లా నాకు అరుణ్ శౌరి తో సంబంధం ఏర్పడింది.
ఆ తర్వాత రెండు మూడు రోజులకే నేను ఢిల్లీ వెళ్ళి అరుణ్ శౌరి ని కలిశాను. ఆయన ఇంట్లోనే ఉన్నాను. ఆయన ఇంట్లో కారు గారేజ్‌లో ఆయన ఆఫీసు నడుస్తోంది. దాంట్లోనే ఒక చిన్న మంచం. మీ పని అయ్యేదాకా మీరు ఇక్కడే ఉండొచ్చు అన్నాడాయన.
ఆ పని చేయడానికి ఆయన చాలా ఉత్సాహం, ఆసక్తి కనబరిచాడు. ఆ రోజుల్లో పౌరహక్కుల కృషిలో ఆయన అపారమైన శ్రద్ధతో పనిచేసేవాడు. నేను ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఎన్కౌంటర్ల గురించి, వాటిమీద ప్రజావిచారణ జరప వలసిన అవసరం గురించి చెప్పగానే తాను చేయగలిగిన సహాయమంతా చేయడానికి ముందుకొచ్చాడు.
ఇక మేం ఇద్దరం కలిసి ఆ కమిటీలో ఎవరెవరు ఉంటే బాగుంటుందనే ఆలోచన మొదలుపెట్టాం. అప్పటికే నేను హైదరాబాద్ వైఎంసిఎలో జరిగిన మరొక సమావేశంలో విఎం తార్కుండే మాట్లాడగా విని ఉన్నాను. ఆయన రాడికల్ హ్యూమనిస్టు ఉద్యమ నాయకుడు. జయప్రకాశ్ నారాయణతో కలిసి పౌరహక్కుల ఉద్యమంలో కూడా పాల్గొంటున్నాడు. అందువల్ల ఈ కమిటీలో ఉండమని తార్కుండేను అడిగితే బాగుంటుందని నేను సూచించాను.తార్కుండే మంచి వక్త. చాలా హేతుబద్ధంగా మాట్లాడే హేతువాది. ఎమర్జెన్సీలో కుల్దీప్ నాయర్ అరెస్టు సందర్భంగా, సుప్రీం కోర్టు న్యాయవాదిగా తార్కుండే చాలా ప్రాముఖ్యంలోకి వచ్చారు.
ఇక అరుణ్ శౌరి రి, నేను తార్కుండే దగ్గరికి వెళ్ళాం. ఆయనను కలవడానికి మేం సుప్రీం కోర్టుకు వెళ్ళాం. ఆయన అక్కడ ఊపిరి సలపని పనుల్లో ఉన్నప్పటికీ అక్కడ సుప్రీం కోర్టు న్యాయవాదుల సంఘం కార్యాలయంలో ఆయనతో కూచుని మాట్లాడాం.
తార్కుండే అప్పటికే పెద్దమనిషి. ముక్కోపి. అక్కడ ఆయనేదో అన్నాడు. నేనేదో అన్నాను. నేను ఆయనను కలవడం అదే మొదటిసారి. చివరికి ‘మీరు ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉండక తప్పదు’ అన్నాను. ఆయన ఒప్పుకున్నాడు. మాకు చాలా సంతోషం వేసింది. అరుణ్ శౌరి , నేను ఇద్దరం కన్నాట్ ప్లేస్‌కు వచ్చి భోజనం చేశాం.
బి జి వర్గీస్ ఉంటే బావుంటుందన్నాడు. నబకృష్ణ చౌదరి ఉంటే బావుంటుందన్నాడు. అరుణ్ శౌరి రి ఈ కమిటీకి కార్యదర్శిగా ఉంటే బావుంటుందన్నాను. అట్లా మొత్తానికి వి.ఎం. తార్కుండే అధ్యక్షులుగా, ఎనిమిది మంది సభ్యులుగా తార్కుండే కమిటీ ఏప్రిల్ 1977లో రూపొందింది.
ఆ కమిటీ సభ్యుల వివరాలు చెప్పబోయే ముందు కె.ప్రతాప రెడ్డి కమిటీలోకి ఎట్లా వచ్చారో చెప్పాలి. ఆ విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు రికార్డ్ చేసి ఢిల్లీ తీసుకు పోతుండే వాడ్ని. ఆ రికార్డులను సురక్షితంగా ఢిల్లీ తీసుకుపోయి అరుణ్ శౌరి కి చేర్చడం ఇబ్బంది కరంగా ఉండేది. ఆ రికార్డుల అసలు ప్రతులను స్వాధీనం చేసుకుని మాయం చేయడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తుండేవారు.
అట్లా బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎం. తార్కుండే అధ్యక్షులుగా, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నబకృష్ణ చౌదరి, హిందుస్తాన్ టైమ్స్ మాజీ సంపాదకులు బి.జి. వర్గీస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకులు అరుణ్ శౌరి , అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ప్రొఫెసర్ డా. బల్వంత రెడ్డి, ప్రజా కవి కాళోజీ నారాయణ రావు, సీనియర్ న్యాయవాదులు ఎం.వి.రామమూర్తి, కె. ప్రతాప రెడ్డి, నేను సభ్యులుగా తార్కుండే కమిటీ ఏర్పడింది.
జె.పి.ని కలవడానికి మేం ఎదురు చూస్తున్నప్పుడే, ఆ ఆస్పత్రిలోనే నేను మొదటి సారి స్వామి అగ్నివేశ్‌ను కలుసుకున్నాను. అరుణ్ శౌరి యే నన్ను అగ్నివేశ్‌కు పరిచయం చేశాడు. అప్పుడు మేం జెపి ని కలవడానికి వెళ్ళాం. ఆయన చాలా బలహీనంగా ఉన్నారు. మంచం మీదనే మేం-అరుణ్ శౌరి నేనూ – ఆ పక్కా ఈ పక్కా కూచుని మాట్లాడాం. ఆయన ప్రశ్నలడుతుంటే నేను జవాబులు చెప్పాను.
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం