ఎత్తుగడలో దిట్ట..కెసిఆర్‌

‌ప్రతిపక్షాలను పల్టీకొట్టించి, లబ్దిపొందే విషయంలో కెసిఆర్‌ది అందెవేసిన చెయ్యి. రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్నికలు వొస్తున్నాయంటే అందరి దృష్టి కేవలం ఎన్నికలపైనే ఉంటే, ఆయన మాత్రం పథకాల రచనలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తారు. అలా అని ఎన్నికలపై ఆయనకు దృష్టి ఉండదని కాదు. అక్కడ తమ పార్టీని ఎలా గెలిపించుకోవాలి..ఎవరిని ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించాలన్న స్ట్రాటజీలో ఏమాత్రం పొల్లుపోనివ్వడన్నది గత ఎన్నికల్లో ఆ పార్టీ అనుసరించిన తీరే నిదర్శనం. అయితే అక్కడక్కడ ఓటమి కనిపించినా, ఎక్కువ పాలు మాత్రం ఆయన వ్యూహానిదే గెలుపన్నది రుజువవుతూ వొస్తున్నది.

తాజాగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల విషయానికొస్తే, మిగతా పార్టీల వలె ఏదో హడావిడి పడినట్లు కనిపించకపోయినా, ఆయన ఆలోచనంతా దాని చుట్టే తిరుగుతూ ఉంటుందనడానికి అనేక తార్కాణాలు దృష్ట్యాంతరంగా కనిపిస్తున్నాయి. పేరుకు హుజూరాబాద్‌లో జరిగేది ఉప ఎన్నికే అయినా ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి సిట్టింగ్‌ ‌స్థానం కాబట్టి దీన్ని తిరిగి తమ వశం చేసుకోవడమన్నది ఆ పార్టీకి ఎలాగూ ఉంటుంది. అంతకన్నా మించి ఈ స్థానానికి నిన్నటి వరకు ప్రాతినిధ్యం వహిస్తూ వొచ్చిన ఈటల రాజేందర్‌ ‌ప్రతిపక్షంలో చేరడమేగాక, అధికార పార్టీపై ఛాలెంజ్‌ ‌చేయడంవల్ల కూడా టిఆర్‌ఎస్‌కు దీన్ని నిలబెట్టుకోవడమన్నది అనివార్యంగా మారింది. ఈ రెండు పార్టీలను పరిశీలిస్తే ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీ అయితే, మరోటి కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ కావడం కూడా వీరిద్దరి మధ్య జరుగబోయే పోటీ ఉత్సుకతను కలిగించేదిగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈటల రాజేందర్‌ ‌పార్టీ మారిన తర్వాత తాజాగా కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షాను కలువడానికి మరోమారు ఢిల్లీ వెళ్ళడం వెనుక కూడా ఎత్తుగడ లేకపోలేదు. అధికార పార్టీ నుండి అన్యాయంగా బహిష్కరింపబడిన తనను ఎలాగైనా ఈసారి గట్టెక్కించాలని ఆయన అమిత్‌షాను కోరి ఉంటాడన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన ఏ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనని అమిత్‌షా ఈసారి ఈటల కోసం వొస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి. అంటే తమ పార్టీలో చేరిన ఈటలను గెలిపించుకోవడం ద్వారా మరోసారి దుబ్బాకను గుర్తుచేయాలన్నది బిజెపి లక్ష్యంకాగా. గెలిస్తే బిజెపి విజయం, ఓడితే ఈటల దురదృష్టంగా బిజెపి చెప్పుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.

కాగా కాంగ్రెస్‌కు కొత్త సారథిగా వొచ్చిన రేవంత్‌రెడ్డికి కూడా ఇది లిట్మస్‌ ‌టెస్ట్ ‌లాంటిది. ఆయన ఇటీవలనే అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఎంతటి శక్తిమంతుడనడానికి హుజూరాబాద్‌ ఆయనకు పరీక్షగానే నిలుస్తుంది. ఇక కొత్తగా అరెంగేట్రం చేసిన షర్మిల రాజకీయ పార్టీకి కూడా ఇది ఒక సవాల్‌గా నిలువబోతున్నది. గెలువటం పక్కకుపెట్టి, కనీసం డిపాజిట్‌ ‌వొస్తుందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంత రాజకీయ వొత్తిడిని తట్టుకుని టిఆర్‌ఎస్‌ ‌తన అభ్యర్థిని గెలిపించుకోగలుగుతుందా అన్నది కూడా ప్రశ్నే. ఇప్పటికే ఆ పార్టీ పక్షాన నిలబడుతాడనుకుంటున్న అభ్యర్థి విషయం వీడియో రూపంలో లీక్‌ అయింది. పార్టీ మారివొచ్చే కౌశిక్‌రెడ్డికి పార్టీ టికెట్‌ ‌ఖాయమన్న వీడియో వైర)యింది. దీంతో ఆటు కాంగ్రెస్‌ ‌బయటికి పంపిస్తే, ఆదుకుంటుందనుకుంటున్న టిఆర్‌ఎస్‌ ఇం‌కా వాకిట్లోనే నిలబెట్టింది. అధికార పార్టీకి ఇది ఒక జటిల సమస్యగా మారింది. దీంతో కాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఒకపక్క అందరూ హుజూరాబాద్‌పైన దృష్టిని కేంద్రీకరిస్తుంటే టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత మాత్రం పాలనాపరంగా కొత్త పథకాలను రచిస్తూ ప్రజల దృష్టిని అటు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నాడు.

రాష్ట్రంలో కొత్తగా రెండు పాలసీలకు రూపకల్పన చేయడం ద్వారా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నాడన్న అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు కెసిఆర్‌. ‌తాజాగా సమావేశమైన మంత్రి మండలి రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చే కీలక విధానాలను తీసుకోవడంతో ప్రజలంతా ఎన్నికలను కాసేపు పక్కన పెట్టి దాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. ఫుడ్‌ ‌ప్రొడక్షన్‌, ‌సర్వీసు సెక్టార్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్‌లో రాష్ట్రాన్ని ప్రగతివైపుకు మళ్ళిస్తుందన్న నమ్మకాన్ని కలిగిస్తున్నారు కెసిఆర్‌. ‌రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడి నేపథ్యంలో ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌యూనిట్లను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్థాపించాలని నిర్ణయించారు. అలాగే పెరగుతున్న వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులను విదేశీ వినియోగదారుల చెంతకు చేర్చేందుకు లాజిస్టిక్‌ ‌రంగాన్ని ప్రోత్సహించాలన్నది రెండవ నిర్ణయం. మరోవైపు ఇప్పటికే లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలను కల్పించామని, నూతన జోన్ల ఆమోదం తర్వాత 50 వేల ఉద్యోగాల కోసం కార్యాచరణ మొదలుపెట్టామని ఇటీవల సిఎం కెసిఆర్‌ ‌ప్రకటించడం లాంటి చర్యలు పరోక్షంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అంటూ ప్రతిపక్షాలు గోలపెడుతున్నా, వ్యూహ రచనలో ఆయనకు అయనే దిట్ట అన్న విషయాన్ని ఒప్పుకోక తప్పదు.

CR Chanakya Mantraheadlines todayKCR is a smart politicianprajatantra newstelugu short newstelugu stories
Comments (0)
Add Comment