పత్రికా స్వేచ్ఛపై దాడికి మరొక ఉదాహరణగా పేర్కొన్న పాత్రికేయ సంఘాలు
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, జనవరి 17 : కాశ్మీర్ ప్రెస్ క్లబ్లో పోలీసులు అక్రమంగా చొరబడి ఎన్నికలు జరగకుండానే ఇంటెరిమ్ బాడీ ఏర్పాటు చేయటాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. జనవరి 15న కాశ్మీర్లో పత్రికా స్వేచ్ఛ దాడికి గురైన మరొక ఉదాహరణ చోటు చేసుకుంది. జర్నలిస్టులు, వార్తాపత్రికల యజమానుల బృందాన్ని కాశ్మీర్ ప్రెస్ క్లబ్లో సాయుధ బలగాలు చుట్టుముట్టాయి. కాశ్మీర్ ప్రెస్ క్లబ్(కెపిసి) శ్రీనగర్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ. ఇందులో జర్నలిస్టులు, వార్తాపత్రికల యజమానులు సభ్యులుగా వున్నారు. కెపిసి తన వార్షిక ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో జనవరి 15న, సాయుధ బలగాలు జర్నలిస్టులను, వార్తాపత్రిక యజమానుల బృందాన్ని అదుపులోకి తీసుకుని ఎన్నికలు జరగకుండానే ఇంటెరిమ్ బాడీ ఏర్పాటు చేసి ప్రెస్ క్లబ్ పగ్గాలు టైమ్స్ అఫ్ ఇండియా జర్నలిస్ట్ సలీమ్‌కి కట్టబెట్టాయి. కాశ్మీర్‌లోని పత్రికా రంగంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాశ్మీర్లో అతిపెద్ద జర్నలిస్టుల సంఘం కాశ్మీర్ ప్రెస్ క్లబ్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన కొద్ది రోజులకే వివాదాస్పద పరిణామాలు చోటు చేసుకుంటూ వొస్తున్నాయి. గత ఏడాది జూలై 14న మునుపటి మేనేజిమెంట్ బాడీ తన రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంది. అయితే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో తలెత్తిన అనిశ్చితి కారణంగా కాశ్మీర్ ప్రెస్ క్లబ్ తన సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోలేకపోయింది. గత సంవత్సరం ఏప్రిల్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, జమ్మూ మరియు కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్, కీలక చట్టం రద్దు చేయబడినందున 1860 సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం కింద తమ సంస్థలను తిరిగి నమోదు చేసుకోవాలని జమ్మూ మరియు కాశ్మీర్‌లోని అన్ని సొసైటీలను కోరింది. ఈ మేరకు కాశ్మీర్ ప్రెస్ క్లబ్ గత వారం మేనేజింగ్ బాడీ రీ రిజిస్ట్రేషన్ పత్రం పొందింది. జనవరి 14న, పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో స్థాపించబడిన కాశ్మీర్ ప్రెస్ క్లబ్ ప్రభుత్వ ఖజానా నుండి సంవత్సరానికి నిధులు పొందుతున్నట్లు కూడా ప్రకటించింది. ప్రస్తుత నిర్వహణలో ఉన్న బాడీ కొత్త మేనేజ్మెంట్ బాడీ కోసం ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఇంతలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. కాశ్మీర్ ప్రెస్ క్లబ్‌కి జారీ చేసిన రీ-రిజిస్ట్రేషన్ ఆమోద పత్రం ఉపసంహరించబడింది. గత శనివారం ఉదయం, ఆటోమేటిక్ ఆయుధాలతో, డజన్ల కొద్దీ పోలీసులు, పారామిలటరీ ట్రూపర్లు కాశ్మీర్ ప్రెస్ క్లబ్లో జొరబడ్డారు. అక్కడ ఉన్న జర్నలిస్టులలో ఒక్కసారిగా భయాందోళనలు చోటు చేసుకున్నాయి. కొందరు అక్కడి నుండి నెమ్మదిగా వెళ్లిపోయారు. మరికొందరు జర్నలిస్టులు, వార్తాపత్రిక యజమానుల సమూహం మాత్రం దీన్ని మాములుగా తీసుకున్నారు. ఏం జరుగుతున్నదో గమనించే ప్రయత్నం చేసారు. మధ్యాహ్నం 1:45 గంటలకు, భద్రతా సిబ్బందితో సాయుధ అశ్వదళంలో టైమ్స్ అఫ్ ఇండియాకి పనిచేసే జర్నలిస్ట్ సలీమ్ పండిట్ కాశ్మీర్ ప్రెస్ క్లబ్‌కి చేరుకున్నారు. అనంతరం కాశ్మీర్ ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ పరిపాలన వ్యవస్థ భద్రత కల్పించిన అతికొద్దిమంది కాశ్మిరీలలో జర్నలిస్టు సలీమ్ ఒకరు. తోటి మీడియా వర్గానికి ఇబ్బందులు తెచ్చిపెట్టి నందుకుగాను, నవంబర్ 2019లో సలీమ్ పండిట్ ప్రెస్ క్లబ్ సభ్యత్వం రద్దు చేయబడింది. కాశ్మీర్ ప్రెస్ క్లబ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సలీమ్ జూలై 19, 2019న తన పేపర్లో ఒక ప్రముఖ కాశ్మీర్ ఆంగ్ల దినపత్రిక సంపాదకుడికి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తన వార్తాపత్రిక కోసం రాయడానికి తనకు తెలిసిన ‘జిహాదీ జర్నలిస్టులను’ నియమించుకున్నారని వార్త రాసారు. శనివారం మధ్యాహ్నం సలీమ్ పండిట్ బృందం కాశ్మీర్ ప్రెస్ క్లబ్ కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి కార్యాలయ కంప్యూటర్లు, స్టేషనరీ ఇతర పత్రాలను అందజేయాలని హుకుమ్ జారీ చేసింది. తాము ఇంటెరిమ్ బాడీని ఏర్పాటు చేసామని సలీమ్ పండిట్ ప్రకటించారు.
ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను అనేక మీడియా సంస్థలు ప్రభుత్వం కాశ్మీర్ ప్రెస్‌ను అణిచివేస్తున్నదని చెబుతున్నాయి. జమ్ము మరియు కశ్మీర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద 2018లో రిజిస్టర్ చేయబడిన సొసైటీ కాశ్మీర్ ప్రెస్ క్లబ్‌ను చట్టం అమలు కావటం లేదనే నెపంతో…తిరుగుబాటును అణిచివేస్తాం అనే మాటలు చెబుతూ న్యూ ఢిల్లీ ఆధ్వర్యంలో నడిచే కాశ్మీర్ పరిపాలన వ్యవస్థ కాశ్మీర్ ప్రెస్ స్వేచ్ఛను కాలరాస్తున్నదనే ఆరోపణలను మోస్తూనే ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ‘‘సాయుధ బలగాలతో కాశ్మీర్ ప్రెస్ క్లబ్‌ను స్వాధీనం చేసుకోవటం…స్వయం ప్రకటిత క్లబ్ నిర్వహణ చేపట్టటం వలన కాశ్మీర్ ప్రెస్ క్లబ్ పవిత్రతను సర్వనాశనం చేయటం జరిగింది. ఈ చర్యలు కాశ్మీర్లో కొనసాగుతున్న పత్రికా స్వేచ్ఛ అణిచివేతకు పరాకాష్ట. మరింత కలవరపెట్టే విషయం ఏమిటంటే, పోలీసులు ఎటువంటి వారెంట్ లేదా ముందస్తు నోటీసు ఇవ్వకుండా ప్రెస్ క్లబ్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. అందువల్ల ఈ తిరుగుబాటుకు నిస్సందేహంగా పత్రిక స్వేచ్ఛకు పెద్ద గొడ్డలి పెట్టు’’. అని గిల్డ్ తన ప్రకటనలో పేర్కొంది