ఎమర్జెన్సీ-3

కె జి కన్నబిరాన్‌ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ’24 గంటలు’ను 2005 నుంచి రెండు సంవత్సరాల పాటు ధారావాహికంగాప్రచురించి, పుస్తకంగా కూడ ప్రచురించిన ప్రజాతంత్ర ఆ జ్ఞాపకాలను సవినయంగా గుర్తు చేసుకుంటున్నది. సరిగ్గా అటువంటి పరిణామాలే మళ్లీమళ్లీ జరుగుతున్న ఈ చారిత్రక సందర్భంలో పదిహేను సంవత్సరాల కిందటి ఆ ధారావాహికను మళ్లీ ఒకసారి ప్రచురించాలని తలపెడుతున్నది. ‘వీక్షణం’ సంపాదకులు ఎన్‌ .‌వేణుగోపాల్‌ అక్షరీకరించిన కె జి కన్నబిరాన్‌ ‘24 ‌గంటలు.. ఆత్మకథాత్మక సామాజిక చిత్రం’మళ్లీ ఒకసారి ధారావాహికగా ప్రజాతంత్ర పాఠకుల కోసం..

గత వారం తరువాయి..
‘‘ఈ మౌలిక అధ్యాయాలను పక్కన పెట్టిన శ్రీమతి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రోజులలో కొన్ని బాధ్యతల గురించి కూడ మాట్లాడడం మొదలు పెట్టింది. ఎమర్జెన్సీలో, 1976 డిసెంబర్లో ఆమె రాజ్యాంగానికి 42వ సవరణను ప్రతిపాదించింది. ఆ సవరణ చాల ఇతర అంశాలతో పాటు రెండు ముఖ్యమైన మార్పులను ప్రతిపాదించింది. రాజ్యాంగ ప్రవేశికలో కొత్తగా సోషలిస్టు, సెక్యులర్‌ అనే మాటలను చేర్చింది. దానితో పాటు భాగం IVఎ అనే పేరుతో, అధికరణం 51ఎ గా ప్రాథమిక విధులు అనే పరిచ్ఛేదాన్ని చేర్చింది. అప్పుడు పి.ఎం.భార్గవ ఒక సదస్సును నిర్వహించారు. ఆ సదస్సులో నేనూ ఒక పత్రం సమర్పించాను.’’

రావి సుబ్బారావు వల్ల నేను అప్పటికి ఒక సిపిఐ కార్యకర్త పోషణ బాధ్యత వహిస్తున్నానని చెప్పాను గదా. అప్పటికి నేను బాగానే సంపాదిస్తున్నాను. ఈ కార్యకర్త పోషణ గురించి సుబ్బారావు నన్నడిగాడు. నేను సరేనన్నాను.. కానీ ఎమర్జెన్సీలో నేను పార్టీతో విభేదించాను. చాలా తీవ్రంగా విభేదించాను. నేను ఎమర్జెన్సీని సవాలు చేస్తూ హైకోర్టులో రిట్‌ ‌పిటిషన్లు వేస్తున్నాను. ఆ పార్టీయేమో ఎమర్జెన్సీని సమర్థిస్తూ ఉంది.మేమంతా స్థూలంగా అప్పటికి సిపిఐని సమర్థిస్తూ ఉన్నాం గనుక తమ్మారెడ్డి సత్యనారాయణ గారు మా వకీళ్ళందరినీ ఒక సమావేశానికి ఆహ్వానించారు. క్రొవ్విడి నరసింహం గారింట్లో ఆ సమావేశం జరిగింది. నరసింహం గారు సిపిఐకి చెందిన అడ్వకేటు. వాదారి వెంకట రమణయ్య, నేను, మరికొంతమంది వకీళ్ళం ఆ సమావేశానికి వెళ్ళాం. వాదారి వెంకట రమణయ్య ఉదారవాద న్యాయవాది. సిపిఐకి మద్దతు ఇచ్చేవాడు. ఆయన ఆ సమావేశంలో చర్చల మధ్యలో ‘‘అసమ్మతి తెలిపే, భిన్నాభిప్రాయం ప్రకటించే హక్కు ఉండగూడదా’’ అని ప్రశ్నించాడు.
‘‘ఆ హక్కు ఎవరికి?’’ అని తమ్మారెడ్డి సత్యనారాయణ ఎదురు ప్రశ్న వేశారు.

నాకు దిగ్భ్రాంతి కలిగింది.   ‘‘అడగవలసిన ప్రశ్న ఎవరికి అని కాదు, ఎందుకు అని. భిన్నాభిప్రాయం ప్రకటించడం ఏ ప్రయోజనం కోసం అని’’ నేనన్నాను.అట్లా ప్రశ్నించడం చాలా అప్రజాస్వామికం అని స్పష్టంగా చెప్పాను. దానితో వాళ్ళకు నా మనసెక్కడుందో అర్థమయిపోయింది. ఆ కార్యకర్త పోషణకు నా దగ్గర నుంచి విరాళం తీసుకోవడం మానేశారు. అభిప్రాయ భేదం వచ్చినప్పుడు అది సహజమే అని నేననుకున్నాను. అయితే అట్లని వాళ్ళపట్ల నాకేమీ దురభిప్రాయాలు ఏర్పడలేదు. అప్పటి పరిస్థితులు వాళ్ళను అటువైపు నెట్టాయి. అందువల్ల వాళ్ళు ఎమర్జెన్సీని సమర్థించారు. నేను వ్యతిరేకించాను. అంతే. నిజానికి వాళ్ళు కూడా తమ అప్పటి వైఖరి తప్పని తర్వాతి కాలంలో గుర్తించారు. సరే, ఆ రోజుల్లో అటు సిపిఎం వాళ్ళను, ఇటు నక్సలైట్లను పెద్ద ఎత్తున అరెస్టు చేశారు. మరెంతో మందిని అక్రమ నిర్బంధంలో ఉంచారు.
ప్రతి నిర్బంధం విషయంలోనూ ఇమిడి ఉన్న చట్టపరమైన అంశాలను లేవనెత్తడం నా పని. అది అయితే కొట్టివేయబడేది లేదా ఫుల్‌ ‌బెంచికి రిఫర్‌ ‌చేయబడేది. పెద్దగా విజయం సాధించిందేమీ లేదు గాని రాజ్యాంగం గురించీ, ప్రాథమిక హక్కుల గురించీ చర్చను న్యాయస్థానాలలో ఎడతెగకుండా సాగించడం సాధ్యమయింది.
నిజానికి భారత రాజ్యాంగ యంత్రం నిర్వచనమే దాని పరిమితుల ఆధారంగా సాగింది. భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగ యంత్రం ఏయే పరిమితుల లోపల పని చేయవలసి ఉంటుందో నిర్వచించింది. అంటే సైద్ధాంతికంగా కూడ భారత రాజ్యానికి అపరిమిత అధికారాలు లేవు అనేది నా బలమైన విశ్వాసం.

పరిమితులను రాజ్యాంగం అధికరణం 12 నుంచి ప్రాథమిక హక్కుల అధ్యాయంలో నిర్థారించింది. నిజానికి రాజ్యాంగంలో కీలకమైన అధ్యాయాలు ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు సంబంధించినవి. సరే, ప్రవేశిక ఎట్లాగూ ఉంది. ఇవి రాజకీయ, సామాజిక విలువల గురించి మాట్లాడిన అధ్యాయాలు. ఈ మౌలిక అధ్యాయాలను పక్కన పెట్టిన శ్రీమతి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రోజులలో కొన్ని బాధ్యతల గురించి కూడ మాట్లాడడం మొదలు పెట్టింది. ఎమర్జెన్సీలో, 1976 డిసెంబర్లో ఆమె రాజ్యాంగానికి 42వ సవరణను ప్రతిపాదించింది. ఆ సవరణ చాల ఇతర అంశాలతో పాటు రెండు ముఖ్యమైన మార్పులను ప్రతిపాదించింది. రాజ్యాంగ ప్రవేశికలో కొత్తగా సోషలిస్టు, సెక్యులర్‌ అనే మాటలను చేర్చింది. దానితో పాటు భాగం IVఎ అనే పేరుతో, అధికరణం 51ఎ గా ప్రాథమిక విధులు అనే పరిచ్ఛేదాన్ని చేర్చింది. అప్పుడు పి.ఎం.భార్గవ ఒక సదస్సును నిర్వహించారు. ఆ సదస్సులో నేనూ ఒక పత్రం సమర్పించాను.       రాజ్యాంగంలోకి మీరు ఒక వైపు బాధ్యతలు ప్రవేశపెట్టి, మరోవైపు సోషలిజం ప్రవేశపెట్టారంటే ఇవి రెండూ కలిస్తే నేషనల్‌ ‌సోషలిజం అవుతుంది అని నేనన్నాను. నేషనల్‌ ‌సోషలిజం అంటే నాజీజం. హిట్లర్‌ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఉపయోగించిన నినాదం అది. దాన్ని అవలంబించడం అంత మంచి పనేమీ కాదు అని చెప్పాను.

భార్గవను నేనప్పుడు తరచుగా కలుస్తుండేవాణ్ణి. ఆయన అప్పుడు తయారు చేస్తుండిన జాతీయ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనకు నేను సహకరించాను. అంతకుముందే పరంజపే గారింట్లో నేను ఆయనను కలిశాను. ఆ రోజుల్లో సిపిఐకి దగ్గరగా ఉండిన, ప్రగతిశీల భావాలుండిన చాల మంది పరంజపే ఇంట్లో ప్రతివారం సమావేశం అవుతుండేవారు. సామాజిక, రాజకీయ పరిణామాల మీద చర్చిస్తుండే వారు. నేను ఆ సమావేశాల్లోనే రాజబహదూర్‌ ‌గౌర్ను కలుసుకున్నాను. ఎంతోమంది నాకక్కడ పరిచయమై స్నేహితులయ్యారు.
సరే, ప్రాథమిక విధుల గురించిన చర్చ, పౌరుడి బాధ్యతల గురించిన చర్చ ఎప్పుడు పైకొస్తుందంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు. అణచివేత సాగుతున్నప్పుడు.

సైద్ధాంతికంగా చూస్తే, మీరు మీ ప్రాథమిక హక్కులను వినియోగిస్తున్నారంటే, ఇతరులు వారి ప్రాథమిక హక్కులు అనుభవించడానికి బాధ్యత పడుతున్నారన్నమాట. అంటే ఇతరుల హక్కుల పరిరక్షణ మీ బాధ్యత అవుతుంది. హక్కులకూ బాధ్యతలకూ మధ్య సంబంధాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి.ఎమర్జెన్సీ నిర్బంధాల కేసులు వాదించే సందర్భంలో మళ్ళీ మళ్ళీ బైటపడిన విషయం ఏమంటే రాజ్యాంగంలోని హక్కుల ఆధారిత దృక్పథం క్రమక్రమంగా విచ్ఛిన్నమైపోయింది. సామాజిక జీవనంలో మార్పులు తెచ్చే బాధ్యతను ఏ విమర్శనాత్మక వైఖరి లేకుండా రాజ్యాంగ యంత్రం చేతుల్లో పెట్టడం జరిగింది. దాదాపు ప్రతి రిట్‌ ‌పిటిషన్లోనూ ఈ వాదనే మళ్ళీ మళ్ళీ చేయవలసి వచ్చింది. రాజ్యం రక్షణ విలువలతో సంబంధంలేని విషయం కాదని, ఏ విలువల కోసం రాజ్యం ఆవిర్భవించిందో, ఆ విలువలను గౌరవించాలని నేను వాదించాను. ఆ విలువలు జాతీయోద్యమ, మానవతా విలువలు.

సరే, ఈ అరెస్టు చట్టబద్ధంగా జరగలేదు, ఇది రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి వ్యతిరేకం లాంటి చట్టపరమైన, సాంకేతికమైన అంశాలు కూడ వాదిస్తుండేవాడ్ని. అయితే వ్యక్తుల నిర్బంధం విషయంలో రాజ్యాంగ మౌలిక నిర్మాణం దెబ్బతినడం లేదని సుప్రీం కోర్టు కూడ తీర్పు ఇచ్చింది. ఆస్తి విషయంలో రాజ్యంగ మౌలిక నిర్మాణాన్ని మార్చే పనులు చేయగూడదని తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో మాత్రం దానికీ రాజ్యాంగ మౌలిక నిర్మాణానికీ సంబంధం లేదని అంది.ఆ ధర్మాసనం అభిప్రాయమేమంటే ప్రభుత్వం హక్కులు ఇస్తుంది. రాజ్యాంగం హక్కులు ఇస్తుంది. అందువల్ల ఆ హక్కులను ప్రభుత్వం, రాజ్యాంగం వెనక్కి తీసుకోవచ్చు అని. కాని ప్రాథమిక హక్కులను ఈ రకంగా అర్థం చేసుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఏ పాలకులయినా, ఏ రాజ్యమయినా, ఏ ప్రభుత్వమయినా, ఏ రాజ్యాంగ మయినా మనుషులకు సహజంగా ఉన్న హక్కులను గుర్తిస్తుంది. గౌరవిస్తుంది. వాటిని కాపాడతానని హామీ ఇస్తుంది. అంతేగాని లేని హక్కులను ఇవ్వదు. రాజనీతి శాస్త్రంలో సామాజిక ఒడంబడిక (సోషల్‌ ‌కాంట్రాక్ట్) ‌సిద్ధాంతమే తీసుకోండి. ప్రజలు పాలకులకు, ప్రభుత్వాధికారానికి కొన్ని అధికారాలివ్వడానికి ఒడంబడిక చేసుకుంటారు. ‘‘ఫలాని ఫలాని షరతులకు లోబడి నీకు అధికారం ఇస్తున్నాము’’ అని ప్రజలు ప్రభుత్వానికి అధికారం ఇస్తారు. ఈ సామాజిక ఒడంబడిక పురుషుల మధ్యనే కుదిరినట్టుందని, ఇందులో స్త్రీలకు భాగం ఉన్నట్టు కనబడడం లేదని అద్భుతంగా వాదించిన ఒక స్త్రీ వాద పుస్తకం చదివాను. ఆ వాదన పూర్తిగా నిజమేనని నాకనిపిస్తుంది.

సరే, ఈ లోతయిన విషయాలను పక్కన పెట్టి, ఎమర్జెన్సీ నాటి రాజకీయ నాయకులు ప్రజల హక్కులను హరించడానికి తమకు సర్వాధికారాలు ఉన్నట్టు, శ్రీమతి ఇందిరా గాంధీకి ఇంకా ఎక్కువ అధికారాలున్నట్లు ప్రవర్తించారు. మాట్లాడారు.ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ దేశంలోని మేధావి వర్గం ఈ మొత్తం చర్చలో ఆరోగ్యకరమైన వాదనలు ముందుకు తేవడంలో విఫలమై పోయింది. తత్ఫలితంగా ఈ దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణంలో అనేక వక్రీకరణలు చోటు చేసుకున్నాయి. ఆ వక్రీకరణల వల్ల, అసమ్మతి తెల్పిన వ్యక్తులందరూ, సకారణంగా అసమ్మతి తెల్పినప్పటికీ, జైళ్ళలో తోయబడ్డారు. ఆ సమయంలో మరికొందరు వ్యక్తులు నిర్బంధించవలసిన అవసరం లేకపోయినా నిర్బంధించబడ్డారు. అనవసరంగా జైళ్ళపాలయిన ఆ వ్యక్తులే ఆ తర్వాతి కాలంలో తామేదో గొప్ప త్యాగం చేసినట్టుగా వీరాలాపాలు పలికి, జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ‌భుజాల మీదికి ఎక్కి అధికార పగ్గాలు చేపట్టారు. మతోన్మాద పాలనకు పునాదులు వేశారు. వారిని ఎమర్జెన్సీలో నిర్బంధించడం ద్వారా ఈ దేశానికి ఇందిరా గాంధీ ఇచ్చిన కానుక అది.

 ..వొచ్చే వారం..

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment