పేదలు చేసిన నేరాలపట్ల పెట్టుబడిదారీ, ధనస్వామ్య సమాజపు అవగాహన ఏమిటి? న్యాయశాస్త్రం,చట్టం ఆ సమాజాన్ని ఒక మెరుగైన సమసమాజం వైపుగా తీసుకు వెళ్లే క్రమంలో ఆ నేరాలను ఎట్లా చూడాలి? అసలు ఈ విషయాలను మనం ఇంత కాలంగా పట్టించుకోలేదు. ఇవి మారాలి అనీ మనం అనుకోలేదు. సమాజం మారవలసి ఉంది అని మొట్టమొదట గుర్తించిన వాడు, సామాజిక పరివర్తన గురించి మాట్లాడిన వాడు కారల్ మార్క్స్. ‘‘ఇప్పటిదాకా తత్వవేత్తలందరూ సమాజాన్ని వ్యాఖ్యానించారు కాని అసలు జరగవలసింది’’ దాన్ని మార్చడం’’ అని సుప్రసిద్ధ వాక్యం రాసిన వాడు ఆయనే.
ఈ సాంకేతిక అంశాలకు తోడు, అసలు మన న్యాయ వ్యవస్థ మొత్తంగానే పేదవారికి, పేదవారి రాజకీయాలకు వ్యతిరేక అభిప్రాయాలతో నిండి ఉంది. న్యాయవ్యవస్థకు, రాజకీయాలకు సంబంధం లేదని అంటూ ఉంటారు గాని అది వాస్తవం కాదు. న్యాయ వ్యవస్థ చేసేదల్లా కొన్ని రాజకీయ డిమాండ్లు నియంత్రించడం కొరకు కొన్ని తటస్థ సూత్రాలను తయారు చేయడం మాత్రమే. ఈ దేశంలో భూసంస్కరణలు అమలు చేయాలని, ఒక గరిష్ట భూపరిమితి విధించి, అంతకన్నా ఎక్కువ ఉన్న వారి నుంచి భూమి స్వాధీనం చేసుకుని, భూమిలేని నిరుపేదలకు పంచాలని అనుకోవడం ఒక రాజకీయ నిర్ణయం. ఆ రాజకీయ నిర్ణయాన్ని గౌరవిస్తూనే చట్టాలు ప్రవేశపెట్టడం జరిగింది. న్యాయ వ్యవస్థ ఆ చట్టాలను పాటిస్తుంది. వాటికి వ్యాఖ్యానం చెబుతుంది. వాటి ప్రకారమే నడుస్తుంది. కనుక, న్యాయ వ్యవస్థకు రాజకీయాలతో సంబంధం లేదని, అవి తటస్థమైనవని చేసే వాదన ఉందే, అది చాలా కపటత్వంతో కూడుకుని ఉన్న తప్పుడు వాదన.
ఒక న్యాయస్థానంలో నిజమైన తటస్థత ఎప్పుడు కనబడుతుందంటే, ఆ న్యాయస్థానం ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాన్ని పరిష్కరిస్తున్నప్పుడు అది తటస్థంగా ఉండే అవకాశం ఉంది. కాని ఇతర సందర్భాలలో ఆ తటస్థతకు అవకాశమే లేదు. ఆ వివాదంలో రాజ్యం ఒక కక్షిదారుగా గనుక ఉన్నదంటే, న్యాయవ్యవస్థ తప్పనిసరిగా రాజ్యానికే అనుకూలంగా మాట్లాడుతుంది. అన్ని వ్యాఖ్యాన సంప్రదాయాలు, అన్ని పద్ధతులు, అన్ని సూత్రాలు, అన్ని రాజ్యాంగ నియమాలు రాజ్యానికి అనుకూలంగానే మలచబడతాయి.. న్యాయశాస్త్రం, చట్టం సాధారణంగా ప్రజలకు అనుకూలంగానే ఉండవచ్చు. కాని మినహాయింపులు సాధారణంగా ప్రజలకు వ్యతిరేకంగానే ఉంటాయి. అందువల్ల చట్టాలను ఎట్లా వ్యాఖ్యానిస్తారు. ఎట్లా విశ్లేషిస్తారు అనే విషయంలో సమానత్వం గురించి మాట్లాడే సమాజంలో అవి ఎట్లా జరగాలి అనేది పెద్దగా చర్చ జరగలేదు. అసలు న్యాయశాస్త్రమే ఆ రంగంలో తగినంత అభివృద్ధి చెందలేదు.
నియోగి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చూసినప్పుడు నేను అప్పటికి ఏడు సంవత్సరాల కింద కేంద్ర నేర పరిశోధన శాఖకు రాసిన ఉత్తరంలో జరగనున్న విషయాలను ఎంత కచ్చితంగా ఊహించానో చూసి ఆశ్చర్యపోయాను. నేను ముందే చెప్పినట్టు ఆ హత్య 1991 సెప్టెంబర్ 28న జరిగింది. దాని మీద విచారణ జరిపిన దుర్గ్ రెండో అదనపు సెషన్స్ కోర్టు 1997 జూన్ 23న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద అప్పీలును విన్న జబల్పూరులోని హైకోర్టు డివిజన్ బెంచి 1998 జూన్ 26న తీర్పు చెప్పింది. నేను సిబిఐకి రాసిన ఉత్తరం 1998 మార్చి 6న. అప్పటికి నేను హైకోర్టు ముందర వాదించడం అయిపొయింది.. అందుకని సిబిఐకి ఆ విషయం తెలియజేస్తూ కృతజ్ఞతలు చెబుతూ రాసిన ఉత్తరం అది. పైకి పోయినకొద్దీ మన న్యాయస్థానాలు ధనవంతులను, శక్తివంతులను శిక్షించాలని, జైలుకు పంపించాలని ఆలోచించే పద్ధతిలో లేవు అవి నేను రాశాను. కిరాయి హంతకుడు పల్టన్ మల్లాకు శిక్ష విధించవచ్చు గాని ఆ హంతకుడిని కిరాయికి పెట్టుకున్న పారిశ్రామికవేత్తలను శిక్షించే స్థితిలో మన న్యాయస్థానాలు లేవు అని రాశాను. నా మాటలను నిజం చేస్తూ, హైకోర్టు మూడు నెలల తర్వాత ఇచ్చిన తీర్పులో అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. హైకోర్టు పల్టన్ మల్లాను కూడా విడుదల చేసింది. సుప్రీంకోర్టు 2005 జనవరిలో ఇచ్చిన తీర్పులో నా 1998 నిర్ధారణను నిజం చేస్తూ పల్టన్ మల్లాకు మాత్రం శిక్షను ఖరారు చేసి, సంపన్నులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది.
అంటే, మన న్యాయస్థానాలకు చాలా కాలంగా అలవాటయిన సంప్రదాయం ఏమంటే, అసలు మనుషులను శిక్షించడం కాదు, వారి తరఫున పని చేసిన వారిని మాత్రం శిక్షించడం. ఒక పల్టన్ మల్లాను బలిపశువుగా మార్చడం, అతడిని శిక్షించడం మన న్యాయస్థానాలకు చాలా సులభం. పల్టన్ మల్లాతో యజమానులకు సంబంధం ఉన్నదని చూపడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ, వాటిని తోసిపుచ్చి, వారికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవు అనడం న్యాయస్థానాల సంప్రదాయం ప్రకారం సరైనదే అనిపిస్తుంది. అయితే , ఒక నూతన సమాజ నిర్మాణ క్రమంలో మనం ఈ వ్యవహారాలన్నిటినీ ఎట్లా విశ్లేషించాలి అని ఆలోచించాలి.
సామాజిక పరివర్తన ` న్యాయం
పేదలు చేసిన నేరాలపట్ల పెట్టుబడిదారీ, ధనస్వామ్య సమాజపు అవగాహన ఏమిటి? న్యాయశాస్త్రం,చట్టం ఆ సమాజాన్ని ఒక మెరుగైన సమసమాజం వైపుగా తీసుకు వెళ్లే క్రమంలో ఆ నేరాలను ఎట్లా చూడాలి? అసలు ఈ విషయాలను మనం ఇంత కాలంగా పట్టించుకోలేదు. ఇవి మారాలి అనీ మనం అనుకోలేదు. సమాజం మారవలసి ఉంది అని మొట్టవెదట గుర్తించిన వాడు, సామాజిక పరివర్తన గురించి మాట్లాడిన వాడు కారల్ మార్క్స్. ‘‘ఇప్పటిదాకా తత్వవేత్తలందరూ సమాజాన్ని వ్యాఖ్యానించారు కాని అసలు జరగవలసింది’’ దాన్ని మార్చడం’’ అని సుప్రసిద్ధ వాక్యం రాసిన వాడు ఆయనే. అప్పటి వరకూ ఆ వాక్యంలోని రెండో భాగం గురించి పట్టించుకోలేదు. వ్యాఖ్యానం ఏ పద్దతిలో జరపాలంటే, ఆ వ్యాఖ్యానంవల్ల సమాజాన్ని మార్చే అవకాశం కలగాలి. న్యాయం, చట్టం సమాజంలో యథాస్థితిని కొనసాగించడానికే ఉంటుంది. అదేమీ సామాజిక మార్పుకు, పరివర్తనకు సాధనం కాదు. ఆ మాట నిజమే. కాని చట్టాన్ని కూడా ఎట్లా వ్యాఖ్యానించవచ్చునంటే, ఎట్లా అన్వయిం చవచ్చునంటే, అది సామాజిక పరివర్తనకు మార్గం సుగమం చేసే పరిస్థితులు కల్పించగలుగుతుంది.
మనకు స్వాతంత్రం వచ్చిన రోజుల్లో పెట్టుబడిదారీ ఆర్థిక శాస్త్రం కూడా చాలా మార్పులకు గురయింది.. కీన్స్ ప్రవచించిన కొత్త ఆర్థిక సూత్రాలు ప్రచారంలోకి వచ్చాం. పెట్టుబడిదారీ ఆధిపత్యాన్ని, యథాస్థితి వాదాన్ని సమర్థించేదే అయినప్పటికీ, రాజ్యానికి ఎక్కువ వెలుసుబాటును కల్పించింది. సంక్షేమ అర్థశాస్త్ర భావనల గురించి మాట్లాడింది. ప్రధాన ఉద్దేశ్యం పెట్టుబడిదారీ దోపిడీని కొనసాగించడమే అయినప్పటికీ, పేదలకు సంక్షేమం కల్పించడం, పేదల కొనుగోలు శక్తిని పెంచడం అనే భావనలు అమలులోకి వచ్చాయి.
మొత్తం మీద నేను చెప్పదలచిందేమంటే, 1947 తర్వాత మన వ్యవస్థకు పునాదిగా ఉన్నది సంక్షేమ రాజ్య భావన. అసంఖ్యాక పేద ప్రజానీకం ఉన్న చోట ఇటువంటి సంక్షేమ రాజ్య భావనకు, సామాజిక మార్పుకు అవకాశం కల్పించకపోతే, హింసాత్మక మార్పు రాక తప్పదు. ఆ అవగాహన అప్పటి పాలకులకు ఉండింది . మన రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయానికి ప్రపంచమంతటా కమ్యూనిస్టు రాజ్యాలు ఏర్పడుతూ ఉన్నాయి . సోవియట్ యూనియన్ ప్రపంచ యుద్ధాన్ని కూడా దాటుకుని పురోగమిస్తూ ఉన్నది. చైనా విప్లవ విజయంతో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది.. ఆ నేపథ్యంలో ఆ సమాజాలన్నీ సైద్ధాంతికంగానైనా, తమ రాజ్యాంగాలను సమానత్వ ప్రాతిపదికపై ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాయి..
-కె.జి. కన్నబిరాన్
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్