న్యాయవ్యవస్థ -రాజకీయాలు

మొ­త్తం వ్యవస్థను, ఆలోచనలను మొదటి నుంచీ మౌలికంగా పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. అసలు రాజకీయ వ్యవస్థనే హక్కుల ఆధారిత వ్యవస్థగా పునర్వ్యవస్థీకరించవలసి ఉంది. అంటే ప్రతి మనిషికీ హక్కులు ఉన్నాయని గుర్తించవలసి ఉంది. అలా గుర్తించినప్పుడు మన సమాజంలో తోటి మనిషి పట్ల ఉన్నంత దుర్మార్గమైన ప్రవర్తనకు అవకాశం ఉండదు.

అట్లాగే అప్పుడే అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ఉద్దేశ్యాలలో ఒక దాన్ని చూస్తే, నిరంకుశ పాలనలను, విప్లవాలను నిరోధించాలంటే ఇటువంటి అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన అవసరమవుతుంది అని వాళ్లు రాశారు.సరిగ్గా ఆ నేపథ్యంలో, ప్రపంచ జనాభాలో మూడో వంతు జనాభా కమ్యూనిజం పాలన కింద ఉండిన రోజుల్లో మన రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలు వచ్చి చేరాయి ­.

ఇదంతా ఏదో కమ్యూనిజం బూచిని పారదోలడానికి మాత్రమే చేసిన ప్రయత్నమని కూడా అనుకోవడానికి వీలు లేదు. అప్పటికే మన జాతీయోద్యమ నాయకత్వంలో ఉదారవాద, ప్రజాస్వామిక భావాలు ఉన్నాయి ­.
అది కూడా ఒక విచిత్రమైన సన్నివేశం. మన జాతీయోద్యమ నాయకులు బ్రిటిష్‌ సంప్రదాయాల నుంచే ఉదారవాదం నేర్చుకున్నారు. ఆ ఉదారవాదాన్ని మన జాతీయోద్యమంలో చాలా తిరుగుబాటు స్వభావంతో వాడారు.

అలా ఉదారవాద సూత్రాలు ఉన్నాయి ­. కాని అవి ఆ జాతీయోద్యమంలోనే ఉన్న మితవాద, అభివృద్ధి నిరోధక భావాలతో తగినంతగా సంఘర్షించలేదు. ఉదారవాదాన్ని ఎత్తిపట్టవలసినంతగా ఎత్తిపట్టలేదు. అందువల్ల కమ్యూనిస్టు ఉద్యమం మొ­త్తంగానే ఉదారవాద భావాలను తిరస్కరించడం మొదలుపెట్టింది. అది దురదృష్టకరం. ఎందువల్ల నంటే, ఉదారవాద భావాలలో కమ్యూనిస్టులు ఆమోదించి సొంతం చేసుకోవలసిన భావాలు ఉన్నాంయి . సోవియట్‌ యూనియన్‌ పతనానికిగల కారణాలలో ఒకటి అక్కడి కమ్యూనిస్టులకు మానవ హక్కులు వంటి ఉదారవాద భావాల పట్ల గౌరవం లేకపోవడమే. ప్రజలను పూర్తిగా బానిసలుగా, శ్రామికులుగా భావించి పాలన నడపడం అంత ఉపయోగకరం కాదు.

పెట్టుబడిదారీ విధానంలో, బూర్జువా పాలనా పద్ధతులలో, మానవ నాగరికత తప్పని సరిగా గుర్తించవలసిన ప్రయోజనకర అంశం చట్టబద్ధపాలన అనే సూత్రం అని నేను అనుకుంటాను. చట్టబద్దపాలన అనే ఆదర్శం పాలనలో నిరంకుశత్వాన్ని, ఇష్టారాజ్యాన్ని తగ్గిస్తుంది. పాలన నడిపే ప్రతి వ్యక్తీ కూడా ఏ నిర్దిష్ట సూత్రాలను అనుసరించి పని చేయాలో నిర్దేశిస్తుంది. ప్రభుత్వమంటే మనుషులతో ఏర్పడేది కాదు. చట్టాలతో ఏర్పడేది అని సూత్రరీత్యా చెప్పడం ద్వారా పాలనా క్రమంలో అధికారులలో వచ్చే నిరంకుశత్వాన్ని తగ్గించడానికి ప్రయత్నం జరుగుతుంది. సరే, ఈ చట్టబద్ధపాలన అనే ఆదర్శం ఆచరణలో సరిగ్గా జరగలేదనేది, జరగడం లేదనేది, చాలా వక్రీకరణలు వచ్చాయనేది వేరే కథ, చట్టబద్ధ పాలన అమలు జరుపుతామని అధికారంలోకి వచ్చిన వారెవరూ దాన్ని సక్రమంగా అమలు పరచడం లేదనేది పూర్తిగా వేరే విషయం.

ఇందుకు మూలం అధికారంలో ఉన్నదనుకుంటాను. ప్రాచీన కాలంలోని చట్టాల, క్రోడీకరణల నాటి నుంచి ఇవాళ్టి వరకు కూడా అందరి దృష్టి అధికారం మీదనే ఉన్నది. ఆ అధికారాన్ని వాడుకుని, ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి, నిరంకుశులైన వాళ్లు ఎందరో ఉన్నారు. వారిని ఎదిరించి పోరాడిన వాళ్లు కూడా ఎందరో ఉన్నారు. అయి­నా ఇన్ని వేల ఏళ్లు గడిచినప్పటికీ ఇంకా అధికారం అనేదే ప్రధాన ప్రశ్న. అధికారాన్ని అనుభవించడం అనేది చట్టబద్ధ పాలనను వ్యతిరేక ఆలోచనలకు దారి తీస్తుంది. కాని మార్క్స్‌ ఈ అధికారం మీద ఎక్కువ ఆసక్తి చూపించలేదు. హింస మార్పుకు మంత్రసాని అని మాత్రం అన్నాడు. మార్పు మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. అక్కడి నుంచి మనం తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనే దగ్గరికి వచ్చాం. అం­తే ప్రశ్న ఏమంటే, తుపాకి గొట్టానికి ఎటువైపు అధికారం ఉంటుంది అనేదే.

ఇటువంటి స్థితిలో ఆలోచించవలసిన విషయం హక్కుల ఆధారిత దృక్పథం. మన విలువలనూ, పాలననూ ఒక హక్కుల ఆధారిత దృక్పథం మీద పునర్నిర్మించడం సాధ్యమేనా? అసలు మొత్తం సమాజాన్ని అధికారం పునాదిగా కాకుండా హక్కుల పునాది మీద పునర్నిర్మించగలమా? ఈ మధ్య నేను ఒక ఆసక్తికరమైన పుస్తకం చదివాను. సామాజిక కట్టుబాటు ` సోషల్‌ కాంట్రాక్ట్‌ ` మీద సమాజం నిర్మాణమయింది గదా. అసలు ఆ సామాజిక కట్టుబాటు స్వభావం పితృస్వామ్యం కాదా అని ఆ రచయిత ప్రశ్నించారు. ఈ సామాజిక కట్టుబాటు సిద్ధాంతం పురుషుల స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది. అంటే స్త్రీల బానిసత్వం గురించి మాట్లాడినట్టుకాదా? ఆ విశ్లేషణ నన్ను నిజంగా అబ్బుర పరిచింది. ఇంత కాలమూ మనం ఈ విషయం ఎందుకు గుర్తించలేకపోయాం అనిపిస్తుంది. నిజంగానే యురోపియన్‌ ఆలోచనాధార అంతా కూడా సామాజిక కట్టుబాటు సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. మార్క్స్‌ రంగం మీదికి వచ్చే వరకూ ఆ సిద్ధాంతమే కొనసాగుతూ ఉండింది. ఫ్రెంచి విప్లవానికి ఆధారం ఆ సామాజిక కట్టుబాటు సిద్ధాంతమే. సర్‌ హెన్రీ మేయిన్‌ సమాజం హోదా నుంచి కట్టుబాటు వైపు ప్రయాణిస్తున్నాని రాశాడు. ఇదంతా పెట్టుబడిదారీ విధానానికి పునాది వేయడానికి జరిగిన ప్రయత్నం. అం­తే ఇదంతా జరిగేటప్పుడు జనాభాలో సగం మందికి ఆ సిద్ధాంతాలేవీ వర్తించనేలేదు. అసలు ఆ సిద్ధాంతాలు ఆ సగం మంది గురించి ఆలోచించనే లేదు.

భారతదేశంలోనైతే తాత్విక దృక్పథం అనేది ఉందా అని అనుమానించాలి. తాత్విక దృక్పథం గురించీ చర్చల గురించీ ఆలోచిస్తే గౌతమ బుద్ధుడు మినహా మరొకరెవరూ తాత్విక విషయాలు చర్చించనేలేదు. చైనాలో కన్‌ ఫ్యూషియన్‌ గురించి చర్చించారు. ఆసియన్‌ దేశాలలో బుద్ధుడి గురించి చర్చించారు. భారతదేశంలో మొదటి, చివరి తత్వవేత్త బుద్ధుడేననుకుంటాను. అందువల్ల అసలు మొత్తం వ్యవస్థను, ఆలోచనలను మొదటి నుంచీ మౌలికంగా పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. అసలు రాజకీయ వ్యవస్థనే హక్కుల ఆధారిత వ్యవస్థగా పునర్వ్యవస్థీకరించవలసి ఉంది. అంటే ప్రతిమనిషికీ హక్కులు ఉన్నాయని గుర్తించవలసి ఉంది. అలా గుర్తించినప్పుడు మన సమాజంలో తోటి మనిషి పట్ల ఉన్నంత దుర్మార్గమైన ప్రవర్తనకు అవకాశం ఉండదు. ఇన్ని శతాబ్దాలు గడిచి ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రవేశించాం. ఎన్నో తత్వశాస్త్ర ఆలోచనలు వచ్చిపోయాయి ­. మార్క్సిస్టు పాలనలు కూలిపోవడం మాత్రమే కాదు, సమాజంలో ప్రజాస్వామిక వ్యవస్థలూ, విలువలూ ధ్వంసమైపోవడం మనం చూస్తున్నాం. ఇది ఇంకెంత మాత్రమూ వ్యవస్థల మధ్య పోరాటం కాదు, ఇది నాగరికత మధ్య పోరాటం అని హంటింగ్‌ టన్‌ వాదిస్తున్నాడు. ఇది ఇట్లాగే కొనసాగితే అసలు హక్కులు, హక్కుల ఆధారిత సామాజిక వ్యవస్థ అనే ఆలోచనలే విస్మరించబడతాయేమోనని నాకు సందేహం కలుగుతున్నది.
-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Judiciary `Politicsprajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment