‌ఢిల్లీలో నేడు జవాన్‌, ‌కిసాన్‌ ‌కవాతు

భారత గణతంత్ర వేళ నేడు ఢిల్లీ వీధుల్లో దేశానికి వెన్నముకలైన జవాన్‌, ‌కిసాన్‌లు కవాతు జరుపడం కాకతాళీయమైనప్పటికీ ఇరొక అపురూప దృశ్యంగా మారబోతున్నది. దివంగత లాల్‌బహద్దూర్‌ ‌శాస్త్రి ఇచ్చిన జైవాన్‌, ‌జై కిసాన్‌ ‌నినాదాలు ఈవేళ ఢిల్లీ వీదుల్లో  మారుమ్రోగబోతున్నాయి. దేశ సరిహద్దు రక్షణలో జవాన్‌ల పాత్ర ఎంత కీలకమో, దేశ ప్రజలందరి కడుపు నింపే రైతన్న పాత్ర కూడా అంత ముఖ్యమైనది. భారత దేశమంటేనే వ్యవసాయ దేశంగా పేరు.  దేశంలో నూటికి డెబ్బై శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి ఈ రంగానికి మొదటి పంచవర్ష ప్రణాళికనుండి ప్రభుత్వాలు ప్రాధాన్యనత నిస్తూనే ఉన్నాయి. అయినా ఈ డెబ్బై ఏళ్ళ స్వాతంత్య్రం తర్వాతకూడా రైతులకు సరైన రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతాంగాన్ని మరింత తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ రంగంలో నూతన సంస్కరణలను ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా   అమోదింప చేసుకున్న మూడు చట్టాలపై దేశ వ్యాప్తంగా  రైతులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.  దేశ రాజధాని చుట్టుముట్టి  సుమారు రెండు నెలలుగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు చేపట్టిన ఆందోళనకు పరిష్కారం లభించకపోవడంతో  తమ  ఆందోళనను తీవ్రతరం చేయడంలో భాగంగా పెద్ద ఎత్తున కిసాన్‌ ‌ర్యాలీ చేపడుతున్నారు.  ఒకపక్క రిపబ్లిక్‌ ‌పరేడ్‌కు ఢిల్లీ సిద్దమవుతున్న తరుణంలో కేంద్రానికి తమ ఆందోళనను మరింత చేరువ చేసే ప్రక్రియను కిసాన్‌ ‌సంఘాలు చేపట్టాయి. కిసాన్‌ ‌రిపబ్లిక్‌ ‌పరేడ్‌ ‌పేరున ఢిల్లీ వీదుల్లో చేపట్టే నిరసన ప్రదర్శనకు ముందుగా కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

సుప్రీంకోర్డు కూడా ర్యాలీకి అనుమతిచ్చే నిర్ణయం ఢిల్లీ పోలీసులదని తేల్చిచెప్పడం, రైతు సంఘాలు ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించుకుంటామని ఇచ్చిన హామీ మేరకు చివరకు అనుమతి లభించింది. దీంతో ఢిల్లీ పురవీధుల్లో ఒక వైపు కిసాన్‌ ‌ట్రాక్టర్‌ ‌ర్యాలీలు, మరోవైపు గణతంత్ర వేడుకల సంబరాలు ఒకేసారి చోటుచేసుకోబోతున్నాయి. అయితే ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో  గణతంత్ర వేడుకల అనంతరమే కిసాన్‌ ‌ర్యాలీకి అనుమతిస్తుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశంలేకపోయినా, ఢీల్లీ పోలీసు యంత్రాంగం మాత్రం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే రైతులు కనీసం మూడు లక్షల ట్రాక్టర్లతో నిరసన ర్యాలీని జరుపనున్నట్లు తెలిపడంతో భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్‌, ‌హర్యానా రాష్ట్రాలనుండి భారీ ఎత్తున ట్రాక్టర్లు ఢిల్లీ వైపు ప్రయాణమయ్యాయి.

అయితే నినాదాలు చేయడం, పోస్టర్లను ప్రదర్శించడం లాంటివేవీ చేయవద్దని షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు కిసాన్‌ ‌ట్రాక్టర్‌ ‌ర్యాలీకి ప్రత్యేక రూట్లను ఎంపిక చేసింది. సుమారు వంద కిలోమీటర్ల పొడవున నాలుగు ప్రాంతాల గుండా ఈ ర్యాలీకి అనుమతిలభించింది. పోలీసులు అనుమతించకపోయినా ఈ ర్యాలీ నిర్వహించి తీరుతామన్న పట్టుదలతో రైతు సంఘాలుండడంతో పోలీసులకు కూడా అనుమతివ్వక తప్పలేదు . గత రెండు నెలలుగా జరుగుతున్న  ఈ ఆందోళనలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాల నాయకులకు మధ్య ఇప్పటికీ పదకొండు సార్లు చర్చలు జరిగాయి. చర్చలు ప్రారంభమైనప్పటి నుండీ  చివరిసారి చర్చలు జరిగేనాటికి రైతు సంఘాల నాయకులు ఒకే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. కేంద్రం చేసిన మూడు చట్టాలలో ఎలాంటి సవరణలు, చేర్పులు, మార్పులకు తాము అంగీకరించేదిలేదని, మొత్తానికే చట్టాలను ఎత్తివేయాలన్న డిమాండ్‌ ‌చేస్తుండడం, అందుకు కేంద్రం ససేమిరా అనడంతో ఈ చర్చలు ఏమాత్రం కొలిక్కి రాకుండా పోతున్నాయి.  రైతులకు నమ్మకం కుదిరే వరకు ఏడాదిన్నర పాటు ఈ చట్టాలను అమలు చేయమని కేంద్రం ఇచ్చిన హామీని కూడా రైతు సంఘాలు తోసిపుచ్చాయి.

అయితే చర్చలు ఫలప్రదం కాకుండా ఎదో అదృశ్య  శక్తి అడ్డుకుంటోందని అంటున్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌, ‌కేంద్రం చేసిన ఈ చట్టాలను రైతాంగం అవగాహన చేసుకోవడంలేదని, దీని వల్ల రైతులకు మేలేగాని, కీడులేదంటున్నారు.   చివరగా కేంద్రం అధ్వర్యంలో ఏర్పడిన కమిటీ చర్చలు ఏ మేరకు ఫలిస్తాయోగాని, అప్పుడే కమిటి సభ్యులపై విమర్శలు మొదలైనాయి కూడా. కాగా, నేడు జరిగే కిసాన్‌ ‌ర్యాలీని ఢిల్లీ పోలీసులు డేగకన్నుతో పరిశీలించే ప్రయత్నాలు  చేస్తున్నారు. ఈ ర్యాలీని ఐఎస్‌ఐ , ‌ఖలిస్తాన్‌ ‌తీవ్రవాదులు హైజాక్‌ ‌చేసే అవకాశాలున్నాయన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. ఆ మేరకు కొన్ని ఆధారాలు లభించినట్లు  పోలీసులు తెలుపుతున్నారు. ఏది ఏమైనా అటు జవాన్‌ ‌కవాతులు, ఇటు కిసాన్‌ ‌ర్యాలీతో నేడు ఢిల్లీ పురవీధులు హోరెత్తబోతున్నాయి.

మండువ రవీందర్‌రావు
Farmer's rally in delhiJai javaanJaikisaan
Comments (0)
Add Comment