జెరంత భద్రం బిడ్డా !

అసలే ఇది జనారణ్యం
అంతటా మానవ తోడేళ్ళు
మాటేసి కాపుకాస్తుంటాయ్‌
‌జఢత్వం వద్దు
జెరంత భద్రం బిడ్డా !

అడుగడుగునా….
కాయాన్ని ఛిద్రం చేసేందుకు

కామ మూకలు కన్నేస్తాయ్‌
అలసత్వం అసలే వద్దు
అప్రమత్తంగుండు బిడ్డా

నిర్జన తావుల్లో…
మేకవన్నె పులులు
వేటాడ పొంచుంటాయ్‌
ఉదాసీనత వద్దు
ఇసుమంత సోయించు

బహిరంగ ప్రదేశాల్లోనే
దేహాన్ని కాల్చి బూడిదచేయ…
ఉన్మాద శాల్తీలు యత్నిస్తాయ్‌
అ‌శ్రద్ధ అసలు వద్దు
కూసింత పైలం బిడ్డా !

నువ్వు మెదిలే ప్రతి చోటా..
నీమీద కన్నేసి విషం చిమ్మ
కాల సర్పాలు బుసకొడతాయ్‌
ఏమరుపాటు వద్దు
కాస్త ఎరుకజేసుకో బిడ్డా

ఉన్నపళంగా…
నీ కంటి రేటినా పొరల్లో …
సూక్స్మగ్రాహ్యత నింపుకోవాలే

నీ నవ నాడుల్లో …
నవ చైతన్యం పొదుపుకోవాలే

నీ గుండె ఒరల్లో …
తెగువ కత్తులు దాచుకోవాలే
మొత్తంగా నీ దేహాన్ని
రక్షక కవచంగా మలుచుకోవాలే…

ఈ కీచక ప్రపంచంలో…
లేడి పిల్లలా జంకకుండా
కొదమ సింహంలా గర్జించాలే
అడ్డొచ్చిన మానవ మృగాలను
ముక్కలుగా చీల్చి చండాడాలే

– కోడిగూటి తిరుపతి :9573929493

Comments (0)
Add Comment