జనవరి 18 మూడు దోపిడీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతక్కల ధిక్కారం

“ఈ ‌దేశ పౌరులుగా మహిళలు దేనిలో పాల్గొనాలి- దేనిలో పాల్గొనకూడదు అని ప్రధాన న్యాయమూర్తి ఎలా నిర్ణయిస్తారు? పైకి కనిపించటానికి ఒక మానవతా దృక్పథంతో మహిళలు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపించవచ్చు కానీ, ఆ ఆదేశాల అంతరార్థం మాత్రం మహిళల నిర్ణయాత్మక దృక్పథాన్ని అణిచివేయడమే అవుతుంద భానించాలి! ఇంకో ముఖ్యమైన అంశమేమంటే, మహిళలు లేకుంటే ఎలాంటి హింసాత్మకమైన పద్ధతులను ఉపయోగించైనా సరే ఉద్యమాన్ని అణిచివేయాలనుకునే ప్రభుత్వ ఆలోచనకు ఊతమివ్వటం కూడా!.”

‘‘‌మా అమ్మాయి ఇల్లుదాటి ప్రేమ పేరుతో మాకంటే తక్కువ జాతి అబ్బాయిని పెళ్ళిచేసుకుంటే మేమూరుకుంటామా, మా పరువేం కావాలి, అందుకే అతన్ని చంపాలనుకున్నాము’’ అని కురుమ కులానికి చెందిన చిన ఈరన్న (కర్నూల్‌ ‌జిల్లా, ఎమ్మిగనూర్‌ ‌మండలం, గురజాల గ్రామం) అనే ఒక సాధారణ వ్యక్తి అన్నదానికి, ‘‘స్త్రీలు, వృద్దులు ఈ నిరసనలో ఉండనవసరం లేదు, వాళ్ళని ఇళ్లకు వెళ్ళమని చెప్పండి’’ అని రైతుల ఉద్యమాన్ని ఉద్దేశించి సుప్రీం కోర్ట్ ‌ప్రధాన న్యాయమూర్తి అనటానికి తేడా ఏమన్నా కనిపిస్తోందా????? రెండూ వేర్వేరు సంఘటనలు, కానీ వాటిని నిర్దేశిస్తున్న దుర్మార్గ భావజాలం ఒకటే. ఆడపిల్లలకు స్వేఛ్చ, సమానత్వం, స్వతంత్ర నిర్ణయాలను అంగీకరించని పితృస్వామ్య- కుల- కుటుంబవ్యవస్థ స్వభావమే అత్యున్నతమైన పదవిలో వుండి రాజ్యాంగబద్ధమైన తీర్పులను విచక్షణాయుతంగా ఇవ్వవలసిన న్యాయమూర్తులకు ఉండటం గర్హనీయం. రైతుల ఉద్యమాన్ని ఉద్దేశించి, అందులో క్రియాశీలకంగా పాల్గొంటున్న మహిళల గురించి చీఫ్‌ ‌జస్టిస్‌ ‌చేసిన ఈ వ్యాఖ్య ఏ పురాతన విలువలకు నిదర్శనం!? సమాజంలో వేళ్ళూనుకుని వున్న జెండర్‌ అసమానత, వివక్షలను ప్రశ్నించి, హక్కుల పరిరక్షణకు కట్టుబడాల్సిన వ్యవస్థ ప్రతినిధులు వాటికి పూర్తి భిన్నంగా వ్యవహరించవచ్చా? ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చా?????

దేశవ్యాపితంగా నాలుగు వందలకు పైగా రైతు సంఘాలు, సంస్థలు వున్న ఐక్య వేదిక, ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి సమష్టిగా నాయకత్వాన్ని అందిస్తున్న సంయుక్త కిసాన్‌ ‌మోర్చా జనవరి 18వ తేదీని ‘కిసాన్‌ ‌మహిళా దివస్‌’ అం‌టే మహిళా రైతుల నిరసన దినోత్సవంగా జరపాలని పిలుపునిచ్చింది. వివిధ స్థాయిల్లో రైతులుగా మహిళల పాత్రను గుర్తించాలన్న ఆకాంక్షతో ఆ దిశగా పనిచేస్తున్న ‘మహిళా కిసాన్‌ అధికార్‌ ‌మంచ్‌’ (‌మకాం) వంటి జాతీయవేదిక సంయుక్త కిసాన్‌ ‌మోర్చాలో కీలకమైన భాగస్వామిగా వుంది. కేందప్రభుత్వం రైతు సంఘాలతో జరుపుతున్న చర్చల్లో మకాం ప్రతినిధిగా కవితా కురుగంటి ఒక ముఖ్యమైన సభ్యురాలు. ‘కిసాన్‌ ‌మహిళా దివస్‌’‌ని ఆచరించాలని ఇచ్చిన పిలుపు మహిళలను నామమాత్రంగా, అలంకారంగా చూపించటానికి కాదు. ‘మేము రైతులం’ అంటూ వ్యవసాయంలో తమ న్యాయమైన స్థానాన్ని, హక్కుని, స్వరాన్ని స్పష్టంగా సూటిగా వ్యక్తీకరించడం కోసం. ఇది కేవలం ఒక్కరోజుకి పరిమితమైన విషయం కూడా కాదు, సుదీర్ఘ ప్రయాణంలో ఒక ఘట్టం మాత్రమే. ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ప్రతి రాష్ట్రంలో కూడా మహిళా రైతులు తమ నిరసనని వివిధ రూపాల్లో వ్యక్తం చేయటానికి సమాయత్తమవుతున్న తరుణం.

వ్యవసాయంలో తమదైన స్వతంత్ర గుర్తింపు, హక్కుల కోసం దేశవ్యాపితంగా మహిళలు సంఘటితమవుతున్నారు. వ్యవసాయంలో దాదాపు డెబ్భై శాతం వున్న మహిళా శ్రామికులు కేందప్రభుత్వం ఏ రకమైన చర్చా లేకుండా తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక పక్కన వ్యవసాయ పనుల బాధ్యతను మోస్తూనే వివిధ పద్ధతుల్లో తమకు వీలైన సమయాల్లో ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. గడ్డ కట్టించే ఢిల్లీ చలిని సైతం లెక్కచేయకుండా శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు అన్ని రాష్ట్రాల నుంచీ ఢిల్లీకి తీయబోయే ట్రాక్టర్‌ ‌ర్యాలీలో పాల్గొనటం కోసం ట్రాక్టర్లు నడపటం నేర్చుకుంటున్నారు. మట్టి కాళ్లతో, కొంగు నడుముకి చుట్టి, కొడవలి పట్టిన పిడికిళ్ళతో నినదిస్తున్నారు. తమ మాటా, పాటా, అడుగులతో, రేలారేలా స్వరాలతో, పంటల పండుగ సంక్రాంతిని కూడా ఉద్యమంగా మార్చిన భోగి మంటలతో, పతంగులుగా ఆకాశంలో ఎగురుతున్న ధిక్కారంగా, పొలాలు, అడవులు, చెట్టూ- చేమా, తాము చమటోడ్చి పండించిన ధాన్యపు కంకుల సాక్షిగా దళిత బహుజన, ఆదివాసీ, ట్రాన్స్ ‌జండర్‌ ‌బహుళత్వాలతో అనేక రాష్ట్రాల్లో మారుమోగుతున్న ఈ రైతమ్మల, రైతవ్వల, రైతక్కల ధిక్కారం సుప్రీం కోర్ట్ ‌ప్రధాన న్యాయాధికారులకు నచ్చినట్లు లేదు. అందుకే వారిని ఇంటికి వెళ్లమని చెప్పండి అని ఒక అప్రజాస్వామికమైన ఆదేశాన్ని జారీచేశారు. అంటే, ఇది మహిళలకు నిరసన తెలిపే హక్కుని, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కుని కాలరాయటం కాదా!?. ఈ దేశ పౌరులుగా మహిళలు దేనిలో పాల్గొనాలి- దేనిలో పాల్గొనకూడదు అని ప్రధాన న్యాయమూర్తి ఎలా నిర్ణయిస్తారు? పైకి కనిపించటానికి ఒక మానవతా దృక్పథంతో మహిళలు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపించవచ్చు కానీ, ఆ ఆదేశాల అంతరార్థం మాత్రం మహిళల నిర్ణయాత్మక దృక్పథాన్ని అణిచివేయడమే అవుతుంద భానించాలి! ఇంకో ముఖ్యమైన అంశమేమంటే, మహిళలు లేకుంటే ఎలాంటి హింసాత్మకమైన పద్ధతులను ఉపయోగించైనా సరే ఉద్యమాన్ని అణిచివేయాలనుకునే ప్రభుత్వ ఆలోచనకు ఊతమివ్వటం కూడా!.

నిజానికి భారతీయ వ్యవసాయ రంగంలో గణనీయంగా మహిళా శ్రామికులు పెరిగారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ కూలీలు, సాగుదారులుగా మహిళలు అరవైఐదు శాతం పైనే వున్నారని, పురుష శ్రామికుల సంఖ్య నలభై తొమ్మిది శాతం మాత్రమేనని 2011 జనాభా లెక్కలు తెలియజేస్తున్నాయి. జాతీయ సాంపుల్‌ ‌సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 2011-12 ‌నివేదిక ప్రకారం దేశం మొత్తం మీద మహిళా శ్రామికులలో అరవైమూడు శాతం, గ్రామీణ శ్రామికులలో మహిళలు డెబ్భైఐదు శాతం వ్యవసాయరంగంలో వున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2010 ‌నివేదిక ప్రకారం దళిత, ఆదివాసీ సమూహాల్లో వ్యవసాయం చేస్తున్న మహిళలు ఎనభై ఒక్క శాతం వున్నారు. నిజానికి, దేశ ఆహార భద్రతలో, ముఖ్యంగా పౌష్టికాహారం అందించే చిరుధాన్యాల సాగులో ప్రధాన భాగస్వామ్యం ఏ మద్దతు వ్యవస్థలూ లేని చిన్న, సన్నకారు మహిళా రైతులదే. వాతావారణ ప్రతికూలతలను తట్టుకుంటూ, ఎక్కువ నీరు ఆశించకుండా మనగలిగేవి, భూమి సారాన్ని కాపాడేది ఈ ‘చిరుధాన్యపు’ పంటలే. వాటి గురించి గానీ, వాటిని సాగు చేస్తున్న మహిళా రైతులకు గానీ ప్రభుత్వ పరంగా ఏ మద్దతు విధానమూ వుండదు.

‘‘వ్యవసాయ రంగంలో పెద్ద సంఖ్యలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ రైతులు అనే గుర్తింపు లేక మహిళలు ప్రభుత్వానికీ, వ్యవసాయ విధానాలకూ అదృశ్యంగా, అనామకంగా ఉండిపోతున్నారు. ఈ మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం జరుగుతున్న దేశవ్యాప్త ఉద్యమంలో మహిళలు పెద్ద సంఖ్యలో క్రియాశీలకంగా తమ హక్కుల కోసం నిలబడుతున్నారు. మహిళలు, వృద్దులు ఢిల్లీ సరిహద్దుల నుండి వెనక్కి వెళ్ళిపోవాలి అని ఇచ్చిన ప్రకటనను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఉపసంహరించుకుంటుందని, ఈ దేశ మహిళా రైతుల ప్రయోజనాలకు హానికరంగా వుండే ఇలాంటి ప్రకటనలు భవిష్యత్తులో చేయదని ఆశిస్తున్నామని’’ సుప్రీంకోర్ట్ ‌ప్రధాన న్యాయమూర్తి తాజా వ్యాఖ్యలను నిర్ద్వందంగా ఖండిస్తూ ‘‘మకాం’’ అభిప్రాయపడింది.

విధాన వైఫల్యాల కారణంగా వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న సంక్షోభంతో గ్రామాల నుండి సుదూర నగరాలు- పట్టణ ప్రాంతాల్లోని పారిశ్రామిక, నిర్మాణ, ఇతర సేవారంగాలకు మగవాళ్ల వలస ఏ స్థాయిలో జరుగుతోందో మనం గత సంవత్సరం లాక్‌ ‌డౌన్‌ ‌లో ప్రత్యక్షంగా చూశాం. మరోపక్కన మహిళలు పూర్తిగా కుటుంబ బాధ్యతను, పిల్లల, వృద్ధుల సంరక్షణను, వ్యవసాయాన్ని ఏకకాలంలో నిర్వర్తిస్తున్నారు. సుప్రీం కోర్ట్ ‌న్యాయాధికారికి నిజంగా మహిళల స్థితిగతుల మీద అంత సహానుభూతి వుంటే పైన వివరించిన పరిస్థితుల పట్ల ప్రభుత్వాలు తక్షణం స్పందించి జండర్‌ ‌వివక్ష లేకుండా మహిళల హక్కులు అమలయ్యేలా వ్యవస్థాపరంగా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయొచ్చు. ఏ చర్చా లేకుండా, ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో తొక్కి చట్టాలను ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. అవేవీ చేయకుండా కేవలం శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలను పితృస్వామిక ధోరణితో వెనక్కి అంటే ఇంటికి పంపించివేయమని చెప్పటం ఎంత హాస్యాస్పదం! తరాల వెనక్కి నడవటానికి మహిళలు, ఆడపిల్లలు సిద్ధంగా లేరని మళ్లీమళ్లీ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ, ఈ మూడు చట్టాల్లో సవరణలు మాకొద్దని, నిర్ద్వందంగా వాటిని రద్దుచేయాల్సిందే అని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. తమ యుద్ధం అటు ప్రభుత్వంతో ఇటు సమాజంతో సమాన అస్తిత్వం కోసం అని వారు స్పష్టంచేస్తున్నారు.

indian agriculturesnews agricaltural billsajayasanketham
Comments (0)
Add Comment