శాస్త్రీజీ సాహసానికి సలాం

(జనవరి 11, లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా)

మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం పొందుతున్న  వర్తమానంలో నేటితరం మరచిన లాల్ బహదూర్ శాస్త్రి గురించి,ఆయన పోరాట పటిమ గురించి, ఆయన నిజాయితీ గురించి తెలుసు కోవాలి. ఉత్తర ప్రదేశ్ లోని మొఘల్ సారై లో జన్మించి,కడు పేదరికం అనుభవించి, మండు టెండల్లో పాద రక్షలు లేకుండా ఎన్నో కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ  పాఠశాలకు వెళ్లి చదువుకున్న లాల్ బహదూర్ శాస్త్రి, చిన్నతనం లోనే మహాత్మా గాంధీ పిలుపందుకుని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడు.స్వామి వివేకానంద, అనీబీసెంట్,గాంధీ వంటి మహనీయుల ఆలోచనలను  ఒంట బట్టించుకున్న శాస్త్రి భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత  ప్రథమ ప్రధాని పండిట్ నెహ్రూ మంత్రి వర్గంలో రైల్వే,హోం, వాణిజ్య శాఖలను సమర్ధవంతంగా నిర్వహించారు. అప్పట్లో జరిగిన ఒక రైలు ప్రమాద సంఘటనకు నైతిక బాధ్యత వహించి, మంత్రి పదవికి రాజీనామా చేసిన మహోన్నత మైన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. నెహ్రూ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో లాల్ బహదూర్ శాస్త్రి భారత దేశానికి ప్రధానిగా పనిచేసి, ప్రజలకు నిస్వార్థ సేవ చేసారు.

ఆహార కొరతను అధిగమించి,భారత దేశాన్ని శస్యశ్యామలం చేయాలని సంకల్పించి పంజాబ్,హర్యానా,ఉత్తర ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో  ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచి, భారత దేశాన్ని  వ్యవసాయరంగంలో స్వయం స్వావలంభన దిశగా నడిపించిన “లాల్ బహదూర్” దూరదృష్టి అనుసరణీయం.”జై జవాన్- జై కిసాన్” నినాదం శాస్త్రీజీ ఆలోచనలకు దర్పణం.  ఇండో- పాక్ యుద్ధం  లాల్ బహదూర్ ధీరత్వానికి నిలువెత్తు నిదర్శనం. శాస్త్రీజీ యుద్ధ వ్యూహాలకు భీతిల్లి శరణు జొచ్చిన పాకిస్తాన్” తాస్కెంట్ ఒప్పందం”తో యుద్ధాన్ని విరమించుకుంది. దురదృష్టవశాత్తూ తాష్కంట్ లోనే లాల్ బహదూర్ హఠాన్మరణం చెందడం భారతీయులకు తీరని వ్యథను మిగిల్చింది. అది సహజ మరణం కాదనే కథనాలు ఈనాటికీ వినిపిస్తున్నాయి. అత్యంత పేదరికంలో జీవించి,ప్రధాని గా బాధ్యతలు చేపట్టినా  పైసా కూడా కూడ బెట్టుకోకుండా, అత్యంత నిజాయితీ పరుడిగా,నిష్కళంక దేశభక్తుడిగా నిరాడంబర జీవితం గడిపిన లాల్ బహదూర్ శాస్త్రి వంటి పుణ్యాత్ముల చరిత్ర ఆచంద్ర తారార్కం. నేటి రాజకీయ యవనికపై లాల్ బహదూర్ శాస్త్రి వంటి నిజాయితీ పరులు కీలక పాత్ర పోషించాలి. లాల్ బహదూర్ శాస్త్రి,అబ్దుల్ కలాం,గుల్జారీ లాల్ నందా వంటి మహనీయులకు జన్మనిచ్చి భారత దేశం చరిత్రలో  ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకుంది. శాస్త్రీజీ గురించి నేటి విద్యార్థులకు అవగాహన కలిగించాలి.

ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, భారతరత్న, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నిజాయితీ గురించి,అంకితభావం గురించి  నేటి తరం తెలుసు కోవాలి.నిజాయితీ,సాహసం,త్యాగం వంటి ఉత్తమ లక్షణాలు మూర్తీభవించిన అరుదైన నాయకత్వం లాల్ బహదూర్ స్వంతం.శాంతి,సహనం వంటి సిద్దాంతాలతో భారత దేశం ప్రపంచ దేశాల్లో విశిష్ఠమైన ఖ్యాతి నార్జించింది. ఇవే సిద్దాంతాలతో  మన దేశం అనేక ఇబ్బందులకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. శాంతి,అహింస వంటి  సిద్ధాంతాలను విడిచి పెట్టకుండానే, దౌర్జన్యాలకు పాల్పడే దేశాలకు బుద్ది చెప్పడంలో లాల్ బహూదూర్ శాస్త్రి చూపిన తెగువను  ప్రదర్శించడం  కూడా అవసరం. యుద్దాలు ఏ దేశానికి మంచి చేయబోవు.గతంలో యుద్ధాలు జరిగితే కొన్ని దేశాల వరకే వాటి ప్రభావం ఉండేది.అయితే నేటి పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి.

ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ గా రూపాంతరం చెందిన నేపథ్యంలో అన్ని దేశాలు ఏదో ఒక రకంగా ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధాలు సంభవిస్తే యావత్ ప్రపంచం స్థంబించి పోయే అవకాశాలున్నాయి. రష్యా,ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వలన తలెత్తిన  ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఇందుకు ఉదాహరణ. అయినప్పటికీ కొన్ని సామ్రాజ్య వాద శక్తులు ప్రపంచ ఆధిపత్యం కోసం ఇతర దేశాల్లో అశాంతిని రగిలిస్తున్నాయి. వీటి  ప్రభావం పేద దేశాలపై విస్తృతంగా  పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ వంటి దేశాలు  ఆధునిక వ్యూహాలను అనుసరించాలి. సార్వభౌమత్వ పరిరక్షణలో   రాజీ పడకూడదు. ప్రపంచ శాంతి విషయంలో అన్ని దేశాలను కూడగట్టాలి. యుద్దాలు, ఉగ్రవాదం వంటి ఇతర దేశాల దుశ్చర్యల వలన భారత్ నష్ట పోకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలి. వీలైతే లాల్ బహదూర్ శాస్త్రి అప్పట్లో పాకిస్తాన్ తో చూపిన తెగువను ప్రదర్శించాలి.  లాల్ బహదూర్ శాస్త్రి భారత మాత ముద్దుబిడ్డ. ఆ మహనీయుని ఆశయాలను మరవకూడదు. నిజాయితీ గా జీవించడం, నిజమైన నాయకత్వ లక్షణాలను అలవరచుకోవడమే జనవరి 11 వ తేదీ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన దివ్య స్మృతికి మనం అర్పించే నిజమైన నివాళులు.


 -సుంకవల్లి సత్తిరాజు,
తూ.గో.జిల్లా, 
మొ:9704903463
Breaking News Nowdeath anniversaryLal Bahadur Shastriprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment