‌జగన్నాటకం..!

గుక్కెడు ముర్రు పాలకు
చెంచెడు తులసి తీర్థానికి నడుమ
అవిశ్రాంత ప్రయాణమే జీవితం !

కళ్లు తెరవడానికి
మూయడానికి నడుమ
నడిచేదే క్షణభంగుర జీవితం !

పిరికెడు ఆశలకు
దోసెడు అడియాసలకు నడుమ
కదిలే అలల లయలేగా జీవితం !

దుఃఖ సాగరానికి
ఆనంద బాష్ప జలపాతానికి
నడుమ సయ్యాటేగా జీవితం !

తాత్కాలిక మెలుకువకు
శాశ్విత మౌన నిద్రకు నడుమ
క్షణాలేగా తీపి చేదుల గురుతులు !

ఏడ్వటానికి
ఏడ్పించడానికి నడుమ
నడిచేదే కదా ఈ జగన్నాటకం !

గొంతు పెకలడానికి
స్వర తలుపులు మూయడానికి
నడుమ సాగడమేగా ముచ్చట్ల జీవితం !

కష్టాల కడలికి
సుఖ తీరాలకు నడుమ
ప్రవాహానికి ఎదురీతేగా జీవన క్రీడ !

బొడ్డు పేగు తుంచడానికి
మ్నెలతాడు/పసుపుతాడు తెంచడానికి
నడుమ చదరంగమే కదా జీవిత గాథ !

చంటోడి తొలి అడుగులకు
వయోవృద్ధుడి తడబడే అడుగుల
నడుమ పాదయాత్రేగా జీవన పయనం !

నీతి నియమాలకు
అనైతిక రోత పనులకు
నడుమ ఘర్షనే కదా జీవన గమనం !

విజయ తీరాలకు
అపజయాల అంధకారాలకు
నడుమ దోబూచులాటేగా జీవనయానం !

చిక్కటి చీకటికి
తేజోమయ వెలుగులకు
నడుమ నలగడమేగా బడుగుల బతుకులు !

– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

breaking updates nowheadlines nowJagannatakam kavithasalashortnews in teluguToday telangana news
Comments (0)
Add Comment