‌రాహుల్‌ అనర్హత విపక్షాలను ఐక్యం చేస్తున్నదా ..!

రాహుల్‌పై చట్టపరమైన చర్యగా చూపిస్తున్నప్పటికీ, ఇది కాంగ్రెస్‌పై బిజెపి కక్షసాధింపన్న విమర్శలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. చెంపదెబ్బకు ఉరిశిక్ష విధించినట్లుగా, చిన్న విషయానికి రాహుల్‌కు పెద్ద శిక్ష పడేట్లుగా తెరవెనుక బిజెపి ప్రమేయాన్ని ఆ పక్షాలు ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికలవేళ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను దెబ్బతీయటంలో  భాగంగానే  రాహుల్‌ను బలిపశువును చేశారని ఆ పక్షాలు ఆరోపిస్తున్నాయి. మోదీ పాలనా విధానాన్ని దేశంలోని పలు విపక్ష పార్టీలు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశాన్ని ప్రజాస్వామ్యం నుండి నిరంకుశత్వంగా మారుస్తున్నారని ఆ పక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.  విచారణ సంస్థలను  రాజకీయ ప్రయోజనంకోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆ పక్షాలు విరుచుకు పడుతున్నాయి.  ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు  గవర్నర్ల పనితీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.  తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఏకంగా  దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళిందికూడా. కాగా  వివిధ రాష్ట్రాల్లో అక్కడి ప్రజాప్రతినిధులపైన ఈడి, ఐటి ప్రయోగిస్తున్న విధానంపైన  తొమ్మిది ప్రతిపక్ష  పార్టీలు  కలిసి ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలియందికాదు.

రాష్ట్రాల్లో  విభిన్న పార్టీల ప్రభుత్వాలున్నప్పటికీ  ఆయా ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పు దృష్ట్యా ఆ ప్రభుత్వాలను లేదా ఆ పార్టీని గౌరవించాల్సిన అవసరాన్ని వారా లేఖలో ప్రధానికి సూచించారు. అదిరించి, బెదిరించి తమ దారికి తెచ్చుకోవాలనుకునే బిజెపి విధానాన్ని వారీ సందర్భంగా తీవ్రంగా  ఖండించారు. వీటన్నిటి దృష్ట్యా  వొచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బిజెపిని మరోసారి కేంద్రంలో అధికారంలోకి రానివ్వవొద్దన్న ఆలోచనలో ఆ పార్టీలు మంతనాలు చేస్తున్న విషయం తెలియందికాదు. అందుకు బలమైన ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నాయికూడా. అయితే ప్రస్తుతం దేశంలో బిజెపికి కాంగ్రెస్‌ ‌పార్టీ ఒక్కటే ప్రత్యమ్నాయంగా కనిపిస్తున్నా, ప్రస్తుత పరిస్థితిలో  ఒక్క కాంగ్రెస్‌ ‌మాత్రమే బిజెపిని ఎదుర్కునే స్థితిలోలేదు. అలాఅని బిజెపిని వ్యతిరేకిస్తున్న  పార్టీలన్నీ కాంగ్రెస్‌కు మద్దతిచ్చేట్లుగా లేవు.  ప్రాంతీయ పార్టీలే అయినా కాంగ్రెస్‌ను కొన్ని పార్టీలు తీవ్రంగా విభేదిస్తున్నాయి. ఉదాహరణకు భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడానికి ముందునుండే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బిజెపి, కాంగ్రెసేతర కూటమి పైనే దృష్టి కేంద్రీకరించాడు. అలాగే బిజెపిని వ్యతిరేకిస్తున్న కొన్ని పార్టీలు కాంగ్రెస్‌ను కలుపుకుని పోవాలని, మరికొన్ని కాంగ్రెస్‌తో ప్రమేయంలేకుండానే కూటమి కట్టాలన్న తమ ఆలోచనలను అప్పుడప్పుడు వెలువరుస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో అభిప్రాయభేదాలున్నప్పటికీ బిజెపిని వ్యతిరేకించే విషయంలో మాత్రం ఆ పార్టీలన్నిటిదీ ఒకే మాటగా ఉన్నాయి.

ఈ పార్టీలు ఇంకా కూటమి కట్టకపోయినా ఐక్య కార్యాచరణను కొనసాగిస్తున్నాయనడానికి  ఇటీవల పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులు, మంత్రులపై ఈడీ•, ఐటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ  కలిసి ప్రధానికి లేఖ రాయడమే  అందుకు నిదర్శనం.తాజాగా రాహుల్‌ను  పార్లమెంటేరియన్‌ ‌పదవికి అనర్హుడిని చేసిన విషయంలోకూడా ఈ పక్షాలు ఐక్యతా గళాన్ని వినిపించాయి. దీన్ని  ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ ఖండించిన వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌పశ్చిమబెంగాల్‌ ‌సిఎం మమతాబెనర్జీ, దిల్లీ సిఎం అరవింద కేజ్రీవాల్‌, ‌తమిళనాడు సిఎం స్టాలిన్‌, ‌కేరళ సిఎం పినరయి విజయన్‌, ‌మహారాష్ట్ర మాజీ సిఎం ఉద్దవ్‌ ‌ఠాక్రే, ఎన్సీపి అధ్యక్షుడు శరద్‌ ‌పవార్‌, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ ‌యాదవ్‌లతో పాటు పలువురు ఇరత పార్టీల నేతలున్నారు.  ఈ సందర్భంగానే పలువురు నేతలు ఇంక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా బిజెపిని వ్యతిరేకించేందుకు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపిచ్చారు.

కాంగ్రెస్‌కూడా కూటమికి నాయకత్వం వహించాలన్న ఆలోచనను పక్కకు పెట్టి కూటమిలో భాగస్వామి కావడంకన్నా గత్యంతరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..  రాహుల్‌ ‌పరిణామం చూసిన తర్వాత కాంగ్రెస్‌కు  ఇప్పుడు అదే సరైందని వారంటున్నారు. బిజెపి ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ఇలాంటి పరిణామాలనే ఎదుర్కోవాల్సి వొస్తుందేమో అన్న ఆందోళన ఇప్పుడు విపక్షాల్లో ఏర్పడిందనడానికి కేజ్రీవాల్‌, ‌తేజస్వీ యాదవ్‌ ‌మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఒక్క తాటిపైకి రావాలని తేజస్వీ యాదవ్‌ అం‌టే, అహంకారంతో వ్యవహరిస్తున్న శక్తులకు వ్యతిరేకండా 130 కోట్ల ప్రజలు ఏకం కావాలని అరవింద కేజ్రీవాల్‌ ‌పిలుపునిచ్చారు. మొత్తం మీద రాహుల్‌ ‌పై చర్య విపక్షాల ఐక్యతకు బిజెపియే పరోక్షంగా తోడ్పడుతున్నట్లు కనిపిస్తున్నది.

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment