అగమ్యగోచరంగా వలస కూలీల బతుకులు

కొరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా వలసకూలీలు కకావికలమవుతున్నారు. చేద్దామంటే పనిలేదు, పిల్లా పాపలతో కలిసి గడిపే పరిస్థితిలేదు, కడుపునిండా తినేయోగం లేదు. పోనీ స్వంత ఊళ్ళకు వెళ్దామా అంటే రవాణా సౌకర్యంలేదు. ఊరు కాని ఊర్లలో పొట్టచేతపట్టుకుని వచ్చి బతుకుతున్నవారి దీనగాథ ఇది. మరోపక్క ప్రపంచాన్ని భయపెడుతున్న వైరస్‌ ‌తమను ఎక్కడ కబళిస్తుందోనన్న భయం మరోవైపు. దిక్కుతోచని స్థితిలో కనిపించిన దిక్కుగా కాలినడకన తమ స్వగ్రామలకు చేరుకునేందుకు వందలాది కిలోమీటర్ల దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఆంక్షలు, అడ్డంకులను దాటుకుంటూ దూసుకు వెళ్ళుతున్నారు మరికొందరు. ఇలా ఎంతకాలం ఉండాలో అర్థంకాని పరిస్థితి వారిది. ఇది ఏదో ఒక రాష్ట్రానికో, ప్రాంతానికో పరిమితమైన వ్యధ కాదు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసిన వివిధ రంగాల్లో వివిధ రాష్ట్రాల నుండి తమ జీవనోపాధికి వచ్చిన వారి సంఖ్య వేలు, లక్షల్లో కనిపిస్తుంది. భాషతో కాని, ప్రాంతంతోగాని సంబంధం లేకుండా కేవలం రోజువారి వేతనం కోసం చిన్న గుడిసెల్లో, ఇరుకు గదుల్లో తమ కుటుంబంతో లేదా సహచరులతో జీవనం సాగిస్తూవస్తున్న వీరి బతుకులు వైరస్‌ ‌కారణంగా చిన్నాభిన్నమవు తున్నాయి. వందలు, వేల కిలోమీటర్ల దూరంలో తమవారిని వదిలివచ్చిన వారిప్పుడు భయాందోళన చెందుతున్నారు. తమ కుటుంబసభ్యుల బాగోగులు చూసేవారు లేరు, చదువులకోసం తమ పిల్లలను ఒంటరిగా వదిలివచ్చినవారు, వృద్ధ తల్లిదండ్రులను వదిలివచ్చినవారు ఇలా అనేకానేక రకాలుగా వారిప్పుడు ఈ కష్టకాలంలో తమ వారిదగ్గరలేమన్న మనాదితో బాధపడుతున్నారు. మొదటివిడుత 21రోజుల లాక్‌డౌన్‌తోనే ఇబ్బందులను ఎదుర్కున్న ఈ వలస కార్మికులు, ఏప్రిల్‌ 14‌తో లాక్‌డౌన్‌ ‌గడువు ముగుస్తుందనుకున్నారు. కాని, దేశంలో కొరోనా వ్యాపిస్తున్న తీరుకు రాష్ట్ర ప్రభుత్వాల కోరికమేరకు కేంద్రం దాన్ని మే మూడవ తేదీవరకు పొడిగించడంతో ఇప్పుడు హతాశుయులవుతున్నారు.

ఏప్రిల్‌ 14 ‌వరకు రాకపోకలపై ఆంక్షలుండడంతో తమ గ్రామాలకు వెళ్ళలేకపోయామని దుగ్ధపడిన కార్మికులంతా ఏప్రిల్‌ 15 ‌నుండి రైళ్ళు యథావిధిగా నడుస్తాయన్న భావనతో ముందుగానే రైల్వే స్టేషన్‌లకు చేరుకోవడం ప్రారంభించడంతో వివిధ రైల్వే స్టేషన్‌లన్నీ వలస కార్మికులతో నిండిపోయాయి. స్టేషన్‌ ‌చేరుకోవడానికి ఎలాంటి రవాణా సౌకర్యంలేకపోయినా చిన్నపిల్లలను చంకనెత్తుకుని, నెత్తిపై మోయలేని భారాన్ని మోస్తూ కాలినడకన బయలుదేరిన సంఘటనలనేకం దేశవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఆర్థిక రాష్ట్రంగా పేరున్న ముంబాయిలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందినవారు బతుకుదెరువుకోసం వెళ్ళడమన్నది సహజం. 21రోజులుగా నిర్బంధాన్ని అనుభవించిన ఇక్కడి వేలాది కార్మికులు తమకోసమే కేంద్రం ప్రత్యేక రైళ్ళను వేస్తున్నదంటూ వచ్చిన పుకార్లతో ముంబాయిలోని బాంద్రా రైల్వేస్టేషన్‌కు వేలసంఖ్యలో చేరుకోవడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఇది ప్రభుత్వం చెబుతున్న వ్యక్తిగత దూరం పాటించే విధానానికి గండికొట్టినట్లైంది. రైల్వే అధికారులు, పోలీసులు నానా అవస్థలు పడి వారిని చెదరకొట్టాల్సివచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే కొరోనా ప్రభావం మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 130 మందికిపైగా మృతిచెందగా, రెండువేల 300కుపైగా కేసులు నమోదై ఉన్నాయి. లాక్‌డౌన్‌ ‌మొదటివిడుత ప్రకటించినప్పుడు డిల్లీ, ఉత్తరప్రదేశ్‌ ‌సరిహద్దుల వద్ద కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. లాక్‌డౌన్‌ ‌కారణంతో ఏర్పడిన కర్ఫ్యూ వాతావరణంలో ఉండి అవస్థలు పడేకన్నా తమ స్వంతగ్రామాలకు వెళ్ళడమే క్షేమమంటూ బయలుదేరిన వేలాదిమంది కార్మికులకు రవాణా సౌకర్యంలేక పోవడంతో రోడ్లపై పడిగాపులు కాయాల్సివచ్చింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మొదట వీరిపట్ల మొండిగా వ్యవహరించినా చివరకు ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసి వారిని సురక్షితంగా వారిగ్రామాలకు వెళ్ళేఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే పొట్టచేత పట్టుకుని చెన్నై వెళ్ళిన అనేకమంది ఒడిషా రాష్ట్రంలోని గంజాంకు బయలుదేరగా రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవడంతో కాళ్ళకు బుద్దిచెప్పారు.

తెలంగాణలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు ప్రభుత్వ అనుమతితో, మరికొందరు వందలాది కిలోమీటర్లు కాలినడకన ఏపి బార్డర్‌ ‌దాటే ప్రయత్నంలో రెండు రోజులపాటు సరిహద్దుల్లోనే నీలుగాల్సివచ్చింది. తెలంగాణలో వలసకార్మికుల సంఖ్య సుమారు నాలుగునుండి అయిదు లక్షలకుపైగానే ఉంటుందన్నది ఓ అంచనా. పక్క రాష్ట్రమైన ఏపితోపాటు, ఒడిశా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ‌కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌తదితర ప్రాంతాల నుంచి ఇక్కడకువచ్చి వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న వారున్నారు. వీరిలో చాలమంది దినసరి, కాంట్రాక్టు కూలీలున్నారు. కొందరు చెరుకు రసాలు, బతాయిరసాలను తీసి రోడ్లపైన అమ్ముకునేవారున్నారు. ఇలాంటి వారంతా రోజువారీ సంపాదనపైనే జీవనం సాగిస్తున్నవారు. కేంద్రం ఇప్పుడు రెండవసారి మరో పందొమ్మిదిరోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగిచ•డంతో ఇక ఎట్టిపరిస్థితిలోనూ తాము ఆర్థిక బాధను తట్టుకోలేమంటున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని కూడా తాము ఆదుకుంటామని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చెప్పినా చాలామంది తమకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక, వస్తు సహాయం అందడంలేదని, చాలీచాలని ఆహారంతో ఇక్కడ ఉండే బదులు తమను తమ స్వగ్రామాలకు పంపే ఏర్పాట్లు చేయాల్సిందిగా వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వీరంతా రాష్ట్ర రాజధానితోపాటు వివిధ ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రకటించిన సహయం వారికి అందే విధంగా యంత్రాంగాన్ని కదిలిస్తే తప్ప వారి ఆక్రందనలు ఆగేట్లులేవు.

మండువ రవీందర్‌ ‌రావు
గెస్ట్ ఎడిటర్‌
mandava ravindhar raomigrant leabors
Comments (0)
Add Comment