విజ్ఞానంలో అజ్ఞానం అనర్ధం

నేటి మానవ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న విపరీత పోకడలను పరిత్యజించాలి.శాస్త్ర బద్ధమైన ఆలోచనలకు విలువివ్వాలి.విజ్ఞానం ఒక అనంతమైన సాగరం.విజ్ఞాన సాగరాన్ని మధించి విలువైన జ్ఞాన సంపదను వెలికితీసి, జనహితం కోసం వినియోగించడంలోనే మానవ విజ్ఞతకు పరిపక్వత చేకూరుతుంది. విజ్ఞానం మానవ వినాశనానికి దారితీయడం అత్యంత దారుణం.అణ్యాయుధ ప్రయోగాల వలన హీరోషిమా,నాగసాకి వంటి నగరాలు విధ్వంసమైపోయాయి.హీరోషిమా,నాగసాకి  నగరాల్లో జరిగిన అపారనష్టం మన స్మృతి పథం నుండి ఈనాటికీ చెరిగి పోలేదు. ఈనాటికీ ఈ అణు ప్రభావం వలన అక్కడి ప్రజలు దుష్ఫరిణామాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మొదటి,రెండవ ప్రపంచ  యుద్ధాలు సృష్టించిన విలయాన్ని చరిత్ర మరచిపోలేదు.
అయినా ఇంకా ప్రపంచంలో ఆధిపత్యం కోసం అనాగరిక మారణహోమం కొనసాగడం విజ్ఞానమా?అజ్ఞానమా? ఇరు దేశాలకు పరిమితం కావలసిన ఒక చిన్న సమస్య  అమెరికా అరంగేట్రం వలన  భీకర యుద్ధానికి దారితీసింది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఏడాదిగా కొనసాగుతున్న యుద్ధంలో లక్షలాది మంది ప్రజలు,సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ సర్వనాశనమై పోయింది. రష్యా ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయింది. యుద్ధాల వలన ఏ దేశానికి లబ్ధి చేకూరదు.యుద్ధాల్లో ఎవరు గెలిచినా,ఓడినా ఉభయ పక్షాలను పరాజితులు గానే భావించాలి. యుద్దాల్లో అంతిమ బాధితులు ప్రజలేనన్న సత్యం మరవరాదు. ఇలాంటి ఆధిపత్య ధోరణులకు స్వస్తి చెప్పాలి. విజ్ఞానం వలన సమకూరిన ఆయుధాలు మారణ హోమానికి వినియోగించడం అవాంఛనీయం. విజ్ఞానం  మానవాళి జీవితాలను సుఖమయం చేయాలి. ప్రజల అవసరాలకు బాసటగా నిలవాలి. ఆకలి,దరిద్రం,అవిద్య వంటి సమస్యలనుండి గట్టెక్కించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి. భూగోళ,ఖగోళ అధ్యయనాలు,శాస్త్రీయ పరిశోధనా ఫలితాల వలన  ఏర్పడిన నూతన ఆవిష్కరణలు  విశ్వ సమాజ ప్రగతికి దోహదం చేయాలి. నాగరికత పెరిగిన నేపథ్యంలో ప్రపంచం అరచేతిలో ఇమిడి పోయినట్టుగా రూపాంతరం చెందిన వర్తమానంలో సైన్స్  వినియోగం వివేకంతో సాగాలి. సైన్స్ లేనిదే పూట గడవని ప్రస్తుత పరిస్థితులను,గతకాలం నాటి పరిస్థితులను రేఖా మాత్రంగా నైనా ఒకసారి స్ఫృశించి,విశ్లేషిద్ధాం.

అడవుల్లో ఆకులు, అలాలు తింటూ, మనిషికీ, జంతువుకీ మధ్య వ్యత్యాసం లేని రాతి యుగం నుండి, ఆదిమానవ ప్రస్థానం నుండి ఆధునిక మానవ పరివర్తనం వరకు  అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.నేడు మనం అనుభవిస్తున్న సైన్స్ ఫలాల వెనుక ఎంతటి చరిత్ర ఉందో గమనించాలి. నాటి మూఢవిశ్వాసాల నుండి మతాధికారుల దుర్మార్గాల నుండి ప్రజలను కాపాడడానికి ఎంతో మంది శాస్త్ర వేత్తలు అహరహం శ్రమించారు. తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజల జీవితాల్లో విజ్ఞాన కాంతులను విరబూయించారు. సైన్స్ కు మత మౌఢ్యానికి మధ్య జరిగిన సంఘర్షణలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో శిక్షలకు గురైనారు.ఎంతో మంది నిర్దాక్షిణ్యంగా హతులైనారు. నిజం చెబితే దైవద్రోహంగా పరిగణించడం,పరిశోధనలు చేస్తే కఠిన శిక్షలు అమలు చేయడం వంటి అత్యంత దారుణమైన పరిస్థితులున్న నాటి కాలంలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసి, శాస్త్రీయ ఫలితాలతో రాబోయే తరాలకోసం శ్రమించి,దారుణంగా బలై పోయిన అలనాటి శాస్త్ర వేత్తల చరిత్రను పరిశీలించి,శాస్త్రీయ కోణంలో ఆలోచించడం ద్వారా ఈ ఆధునికంలో విస్తరిస్తున్న అంధ విశ్వాసాలకు,మూఢత్వ భావాలకు,మూర్ఖ సిద్ధాంతాలకు స్వస్తి చెప్పవచ్చు.

అరిస్టాటిల్ ను  విజ్ఞానానికే పర్యాయపదం గా అప్పట్లో పేర్కొనేవారు.అరిస్టాటిల్ గ్రంథాలను విమర్శించడం మతద్రోహంగా భావించి శిక్షించేవారు.గురుశిష్యులైన గ్రీకు తత్త్వవేత్తలు ప్లేటో, అరిస్టాటిల్ లు విశ్వానికి భూమి కేంద్రమనే యూడోక్సస్ క్నిడస్ ప్రతిపాదలను బలిపరిచారు.భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని,సమస్త గ్రహాలు భూప్రదక్షిణ చేస్తున్నాయని తెలియచెప్పే “జియో సెంట్రిక్ థియరీ” ని  నికోలస్ కోపర్నికస్ తప్పు బడ్డాడు. విశ్వానికి సూర్యుడు కేంద్రమని, భూమి నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ,సూర్యుని చుట్టూ అనుక్షణం పరిభ్రమిస్తున్నదని తన “హీలియో సెంట్రిక్ థియరీ” ద్వారా కోపర్నికస్ ఆధారాలతో సహా  నిరూపించాడు.అంతకు ముందు భూమి చుట్టూ సూర్యుడు,చంద్రుడు,నక్షత్రాలు,గ్రహరాశులు పరిభ్రమిస్తాయనే జియో సెంట్రిక్ థియరీ అబద్దమని నిరూపితమైనది. టెలీస్కోప్ ను కనిపెట్టడం, కోపర్నికస్ సిద్ధాంతానికి మద్దతునిచ్చాడనే అభియోగంతో గెలిలియోకు దైవద్రోహం పేరుతో, యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.వాస్తవాలను వివరించిన గెలిలియో శిక్షాకాలం లోనే మరణించాడు.విశ్వం అనంతమైనదని, ఇతర గ్రహాల్లో కూడా జీవం ఉండే అవకాశాలున్నాయని, సూర్యుడు విశ్వానికి కేంద్రమని  ఆధునిక విజ్ఞానానికి పునాదులు వేసిన  “బ్రూనో” మత పెద్దల కోపాగ్నికి  గురయ్యాడు.
తర్కానికి,హేతువాదానికి,శాస్త్రీయ దృక్ఫథానికి ప్రాధాన్యత నిచ్చే కోణంలో ఆలోచించాలని పేర్కొంటూ, సత్యం కోసం పోరాడిన బ్రూనో ఒక గొప్ప తత్వ,గణిత శాస్త్రవేత్త. ఆయన సత్య శోధనకు అప్పటి మత మౌఢ్యం అనేక సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అయినా సత్య పథాన్ని విడనాడక పోరాడిన బ్రూనో ను కర్కశంగా సజీవ దహనం చేసారు. బ్రూనో సజీవ దహనమైనా అతని ఆలోచనలు సజీవంగానే ఉన్నాయి. గ్రీకు తత్వ వేత్త, విజ్ఞానగని సోక్రటీస్ ను  కూడా నిజాలను నిర్భయంగా చెప్పినందుకు విషమిచ్చి చంపారు. ఇలా ఒకరు కాదు…ఎందరో…మరెందరో నాటి మతపెద్దల మూఢనమ్మకాలకు బలై పోయి, ప్రపంచానికి తమ త్యాగాల ద్వారా సైన్స్ వెలుగులను ప్రసాదించారు. ప్రస్తుత ప్రపంచంలో ఇంకా పనికిరాని మూఢవిశ్వాసాలు జనజీవితాలను శాసిస్తున్నాయి. ఇకనైనా  శాస్త్రీయత లేని సమాజానికి హాని కలిగించే మూఢ నమ్మకాలను విడిచిపెట్టాలి. మత సంబంధమైన విశ్వాసాలను వ్యక్తిగతమైనవిగా భావించాలి. ఆధ్యాత్మికత విలువలు పెంపొందించడానికి,మంచిని ప్రోది చేయడానికి వినియోగపడాలి. మానవ ఎదుగుదలను ఆపే అంధ విశ్వాసాలను ప్రోత్సహించడం ఆధునిక విజ్ఞానానికి తలవంపులు తెచ్చే అవాంఛనీయమైన పోకడలుగా గుర్తించాలి. మతాల్లోని మంచిని,విలువలను స్వీకరించాలి. ఇదే సందర్భంలో మూఢ భావాలకు చరమ గీతం పాడాలి. శాస్త్రీయ పరిశోధనా ఫలితాలను అనుభవిస్తూ, సైన్సు ను తప్పుబట్టడం అవివేకం,అజ్ఞానం.

సుంకవల్లి సత్తిరాజు.
మొ:9704903463.
prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment