హుజూరాబాద్‌ అభ్యర్థిపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎవరిని పోటీకి నిలుపాలన్న విషయంలో ఇంకా కాంగ్రెస్‌ ‌తేల్చుకోలేక పోతున్నది. ఈ నియోజకవర్గంపై పట్టు సాధించుకోవాలని ఇప్పటికే భారతీయ జనతాపార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇంకా ఈ ఉప ఎన్నికపై నోటిఫికేషన్‌ ఏదీ రాకపోయినా, ఈటల రాజేందర్‌ ‌తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటి నుండే ఇక్కడ మరోసారి ఎన్నికల హడావిడి మొదలయింది. కాగా కాంగ్రెస్‌ ‌నూతన రథ సారథిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వొచ్చిన మొట్ట మొదటి ఎన్నిక కావడంతో ఇక్కడ కాంగ్రెస్‌ ‌పరిస్థితిపై రాష్ట్ర ప్రజల దృష్టి ఉంది. ఎట్టి పరిస్థితిలో ఈ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా పోయిన ప్రతిష్టను నిలుపుకోవాలని కాంగ్రెస్‌ ‌ప్రయత్నాలు మొదలు పెట్టింది. కాని, ఇంతవరకు బిజెపి, టిఆర్‌ఎస్‌ను ఢీ కొనే సామర్థ్యం ఉన్న వ్యక్తి కాంగ్రెస్‌కు లభించనేలేదు.
ఈ విషయంలో ఆ పార్టీ చాలాకాలంగా మల్లగుల్లాలు పడుతూనేఉంది. రేవంత్‌రెడ్డి కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టగానే తీసుకున్నాడు. దీనిపై ప్రత్యేక ఫోకస్‌ ‌పెట్టేందుకు సీనియర్‌ ‌నాయకులతో ఇక్కడి పరిస్థితిపై ఒక కమిటీని కూడా వేయడమైంది. సీనియర్‌ ‌నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సారథ్యంలోని కమిటీ ఇప్పటికైతే అయిదుగురు పేర్లను సూచిస్తూ అధిష్టానానికి పంపించింది. ఈ అయిదుగురిలో ఒకరిని ఖరారు చేయాల్సి ఉండగా, అధిష్టానం దాన్ని పెండింగ్‌లో పెట్టింది. అయితే ఇక్కడి నుండి బరిలోకి దిగాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఉప ఎన్నిక కావడంతో పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తున్నది. అయితే దామోదర రాజనర్సింహ సూచించిన పేర్లలో అందరి నోళ్లలో నానుతున్నది ఇప్పుడు కొండా సురేఖ పేరు మాత్రమే. సీనియర్‌ ‌నాయకులుగా కొండా దంపతులకు వరంగల్‌లో మంచి పేరుంది.
మాజీ మంత్రిగానే కాకుండా ఒకనాడు కాంగ్రెస్‌ ‌ప్రముఖ నాయకుడైన వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెదిలిన సురేఖ అయితేనే హుజూరాబాద్‌ ‌పోరులో తట్టుకుని నిలబడగలదన్న అభిప్రాయం అటు కాంగ్రెస్‌ ‌వర్గాల్లోనూ, ఇటు రాజకీయ పరిశీలకుల్లోనూ ఉంది. ఒక విధంగా అధిష్టానం కూడా ఆమె పేరునే ఖరారు చేస్తున్నట్లు వినికిడి. అయితే ఈ  విషయమై  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం టాగూర్‌ ‌దీనిపై మంగళవారం గాంధీభవన్‌లో కీలక సమావేశాన్ని నిర్వహిస్తే సీనియర్లు హాజరుకాకపోవడం ఆ పార్టీలో లుకలుకలను బయటపెడుతున్నది. దీంతో మరికొంతకాలం అభ్యర్థి ఎవరన్నది తేల్చే విషయం పెండింగ్‌లో పడేట్టుంది. ఇదిలా ఉంటే బిజెపి, టిఆర్‌ఎస్‌లా తొందర పడకూడదని కాంగ్రెస్‌ ‌భావిస్తున్నట్లు కూడా తెలుస్తున్నది.
అధికార పార్టీ ఒక విధంగా ఈ ఎన్నికలను  మరికొంత కాలం వాయిదా వేయాలన్న భావనలో ఉన్నట్లు వార్తలు వొస్తున్నాయి. దీనివల్ల ప్రతిపక్షాలు ప్రచారంలో అలసిపోతారన్న భావన ఉందనుకుంటున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ ‌కూడా అభ్యర్థి ప్రకటన విషయంలో కావాలని జాప్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీనికి తోడు స్థానికత విషయంలో కూడా కాంగ్రెస్‌ ‌దృష్టి సారిస్తున్నదన్న వార్తలు వొస్తున్నాయి. అటు బిజెపి, ఇటు టిఆర్‌ఎస్‌ ‌పార్టీలనుండి పోటీ పడుతున్న ఇద్దరు కూడా స్థానికులే. పోటాపోటీగా సాగుతున్న ఇక్కడి ఎన్నికల ప్రచారంలో స్థానికత కూడా ఒక ఆయుధంగా మారనుంది. కొండా సురేఖ అభ్యర్థిత్వం ఖాయమనుకున్న క్రమంలో ఈ సమస్య ముందుకు రావడంతో కాంగ్రెస్‌ ‌స్థానిక కాంగ్రెస్‌ ‌నాయకులపైన కూడా దృష్టిపెట్టినట్లు తెలుస్తున్నది.
స్థానిక నేతలు కూడా ఇదే విషయమై పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి విజ్ఞపన పత్రాలు సమర్పించారు. దీనికి ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా నేతల మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక వేళ కొండా సురేఖకు టికెట్‌ ఇస్తే, ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా రాజకీయాల్లో తలదూర్చే అవకాశం ఉంటుందన్న భావన సీనియర్లలో ఉన్నట్లు తెలస్తున్నది. ఇప్పటికే సీనియర్లకు, రేవంత్‌రెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ పరంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలకు తమకు ఆహ్వానం ఉండటం లేదంటూ సీనియర్‌ ‌నేతలు ఇప్పటికే అలుగుతున్నట్లు తెలస్తున్నది. ఈ  క్రమంలో రేవంత్‌రెడ్డి సూచిస్తున్న కొండా సురేఖ అభ్యర్థిత్వానికి వారు మద్దతు ఇవ్వకపోవచ్చనుకుంటున్నారు. దీంతో అభ్యర్థి ఎంపికలో మరికొంతకాలం జాప్యం అనివార్యంగా మారనుంది. ఎప్పటిలానే సందిగ్ధంలో పడ్డ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికలో, ప్రచారంలో ఇక్కడ కూడా వెనుక బడినట్టు కనిపిస్తున్నది.
Telangana Congress
Comments (0)
Add Comment