కో‘దండు’ కదిలింది..!

సింహావలోకనం ..8 సంవత్సరాల క్రితం..ఈ రోజు ..
రామాయణంలో సీతమ్మవారు ఆంజనేయస్వామి అభ్యర్థనను తిరస్కరించినట్లే, తెలంగాణ తల్లికూడా న్యాయం, చట్టబద్దంగా, రాజ్యాంగం ప్రకారమే విముక్తురాలు కావాలనుకుంటున్నది. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు సమస్త ప్రజానీకం పార్లమెంట్‌ ప్రక్రియ ద్వారానే తెలంగాణా ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారు. భారత రాజ్యాంగంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి కట్టుబడి తమ హక్కులకు భంగం కలుగరాదని, స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నారు. తమపై ఇతరుల పెత్తనం నడువదంటున్నారు. తమ ప్రాంతాన్ని తామే పాలించుకుంటామంటున్నారు… భారత రాజ్యాంగానికి లోబడే..! దీని కోసం గత 55 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అందులో ఒక భాగమే సెప్టెంబర్‌ 30‌న జరిగిన తెలంగాణ మార్చ్.


‘‘అంజనేయస్వామి లంకకు ఎందుకు పోయిండు..? రాక్షసరాజు రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మను విడిపించుకోవడానికి.. మరి మనం హైదరాబాద్‌ ఎం‌దుకొచ్చినం.. తెలంగాణ తల్లిని వలసవాదుల పాలన నుంచి విముక్తి చేయడానికి.. ఔనా.. కాదా..? తెలంగాణా సంయుక్త కార్యచరణ సమితి (జెఎసీ) ఛైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌సెప్టెంబర్‌ 30, ‌హైదరాబాద్‌ ‌నెక్లెస్‌ ‌రోడ్డుపై జరిగిన తెలంగాణ మార్చ్‌కు హాజరైన లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులను ఉత్తేజపరుస్తూ చేసిన ప్రసంగం. వివిధ ప్రజాసంఘాలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, కార్మికులు, న్యాయవాదులు, వైద్యులు, కళాకారులు, రాజకీయ పార్టీలు భారతకమ్యూనిస్టు పార్టీ, న్యూడెమోక్రసి, భారతీయ జనతాపార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, నగారాభేరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం ఒకే వేదికపైకొచ్చిన అరుదైన సన్నివేశం. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా తెలంగాణా వాదులు హైదరాబాద్‌ ‌బాట పట్టారు. జేఏసీ అంచనాలకు అనుగుణంగా ప్రజలు తెలంగాణా మార్చ్‌కు హాజరుకావడం ఛైర్మన్‌ ‌కోదండరామ్‌కు  ఇతర జేఏసీ సభ్యులకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. భారీగా హాజరైన ప్రజాసమూహం  ముందు ప్రసంగం చేయడానికి నాయకులు ఉత్సాహం చూపించారు. వారిని ఆకట్టుకోవడానికి పిట్టకథలు చెప్పడం  కొందరి స్టైల్‌ అయితే, రెచ్చగొడుతూ మాట్లాడడం మరికొంతమంది వైఖరి.

ఆంజనేయస్వామి లంకలో రావణుడి చెరలో ఉన్న సీతమ్మ వారిని విడిపించడానికే పోయిండు. తన భుజాల మీద అమ్మవారిని కూర్చోబెట్టుకుని లంకను దాటి రాములవారి వద్దకు చేర్చుతానన్నాడు. కాని సీతమ్మ ఒప్పుకోలేదు. ఆ విధంగా రావడం లోకం తప్పుబడుతుందని, తన భర్త వీరుడు, ధైర్యశాలి రాముడు రావణాసురుణ్ణి యుద్ధంలో జయించి తనను చెరవిడిపించడమే ధర్మమని సీతమ్మవారు ఆంజనేయస్వామి అభ్యర్థనను తిరస్కరిస్తుంది.
హైదరాబాద్‌ ‌తెలంగాణ గుండెకాయ..! తెలంగాణ ప్రజలను హైదరాబాద్‌ ‌నుంచి వేరు చేసి చూడలేము. రాష్ట్ర విభజన హైదరాబాద్‌పైనే కేంద్రీకృతమై ఉన్నది. తెలంగాణ వ్యతిరేకులు, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న వాళ్ళ దృష్టి పూర్తిగా హైదరాబాద్‌ ‌నగరంపైనే ఉన్నదన్నది వాస్తవం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగరంలో తెలంగాణ తల్లి బందీ అయిఉన్నదని, ఆమెను వలసవాదుల చెరనుంచి విడిపించడానికి జేఏసీ తెలంగాణ మార్చ్ ‌చేపట్టిందని కొందరు తెలంగాణ వాదుల అభిప్రాయం. రామాయణంలో సీతమ్మవారు ఆంజనేయస్వామి అభ్యర్థనను తిరస్కరించినట్లే, తెలంగాణ తల్లికూడా న్యాయం, చట్టబద్దంగా, రాజ్యాంగం ప్రకారమే విముక్తురాలు కావాలనుకుంటున్నది. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు సమస్త ప్రజానీకం పార్లమెంట్‌ ప్రక్రియ ద్వారానే తెలంగాణా ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారు. భారత రాజ్యాంగంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి కట్టుబడి తమ హక్కులకు భంగం కలుగరాదని, స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నారు. తమపై ఇతరుల పెత్తనం నడువదంటున్నారు. తమ ప్రాంతాన్ని తామే పాలించుకుంటామంటున్నారు… భారత రాజ్యాంగానికి లోబడే..! దీని కోసం గత 55 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అందులో ఒక భాగమే సెప్టెంబర్‌ 30‌న జరిగిన తెలంగాణ మార్చ్.
‌తెలంగాణ సాధనలో ప్రొ. కోదండరామ్‌ ‌నేతృత్వంలోనే జేఏసీ విధానాలను, కార్యక్రమాలను విభేదించిన ఆకుల భూమయ్య నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ (‌గద్దర్‌ ‌వ్యవస్థాపక కన్వీనర్‌), ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌, ‌విమలక్కల ఉమ్మడి నాయకత్వంలో తెలంగాణా యునైటెడ్‌ ‌ఫ్రంట్‌ ‌మార్చ్‌లో పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటారు. మార్చ్ ‌వేదికపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావును ఉద్దేశించి టఫ్‌ ‌కో – కన్వీనర్‌ ‌విమలక్క కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారని కొందరి అభిప్రాయం. ఆత్మగౌరవంతో, పవిత్రంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమం రాజకీయం అయిపోయింది అని విమలక్క ఆవేదన. ఢిల్లీలో ఒకరి చేతులు పట్టుకుంటే తెలంగాణ రాదని, ఇక్కడ రాళ్ళు పట్టుకుంటేనే తెలంగాణా సాధ్యమని విమలక్క అభిప్రాయం. చేతులు పట్టుకున్నా, రాళ్ళు పట్టుకున్నా ఆఖరికి రాష్ట్రం ఏర్పడాల్సింది.రాజ్యాంగం ప్రకారమే. ఒకరి ఇంటిముందు ఊడ్చి చాన్పు జల్లి ముగ్గేసి తెలంగాణా రాష్ట్రం సాధిస్తామంటే, అది ఆత్మాభిమానంలో, పౌరుషంలో ఎవరికీ తీసిపోని తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యంకాదు.
కాని గత పన్నెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న తెలంగాణా మలిదశ ఉద్యమంలో మొదటి స్థానంలో నిలబడ్డ టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌ ‌రావు నమ్ముకున్న సిద్ధాంతం లాబీయింగ్‌..!‘ఒక బొట్టు రక్తం చిందొద్దు.. ఒక లాఠీ దెబ్బ పడొద్దు..’తెలంగాణా రాష్ట్రం సాధించుకోవాలె.. ఇది కేసీఆర్‌ ‌ప్రగాఢ విశ్వాసం. తను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి 2009 వరకూ కేసీఆర్‌ ‌తన ప్రయత్నాలను కొనసాగించారు. తెలంగాణ అంశం ఢిల్లీని తాకడానికి   కారణమయ్యారు. దీంట్లో ఎవరికీ రెండవ ఆలోచన లేదు. ‘నాపార్టీ.. నా ఇష్టం.. నా పద్దతిలో నేను తెలంగాణ రాష్ట్రం సాధిస్తాను.. మీరెవరు నన్నడగడానికి’ అన్న ధోరణి మేధావులు, ఇతరవర్గాలు ఇష్టపడటం లేదు. కోట్లాడి తెలంగాణా తెస్తమన్న మాట నుంచి ఎవరి కాళ్లైనా పట్టుకుని తెలంగాణా తెస్తామనే స్థాయికి టీఆర్‌ఎస్‌ ‌దిగజారడం తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. 2009, డిసెంబర్‌ 9 ‌కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం ప్రకటన లాబీయింగ్‌ ‌వల్ల విడుదల కాలేదు. కేసీఆర్‌ ఆమరణ దీక్ష ఒక కారణమైతే విద్యార్థుల 10 రోజుల ఉద్యమం మరింత దోహదపడింది. ఆ తరువాత సంభవించిన పరిణామాలు రాజకీయ వ్యవస్థ వైఫల్యానికి కారణం అన్నది సుస్పష్టం. భిన్న వాదనలతో అడ్డంగా చీలిపోయిన రాజకీయ పార్టీల వైఖరి కారణంగానే ప్రజలు తమ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి ఉద్యమబాట పట్టవలసి వొచ్చింది. 2009 డిసెంబర్‌ 9 ‌ప్రకటనకు కట్టుబడి, వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు రోడ్‌ ‌మ్యాప్‌ ‌ప్రకటించాలని మూడు సంవత్సరాలుగా ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది. హామీ ఇచ్చిన అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ బాధ్యతగల ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపై ప్రజలకు విశ్వాసం పోయింది. అస్పష్టత లేఖతో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, చర్చల పేరుతో కాంగ్రెస్‌ ‌పార్టీ ఆడుతున్న దొంగాటలో తెలంగాణ రాష్ట్ర సమితి పావుగా మారింది. ఢిల్లీలో కేసీఆర్‌ ‌నెలరోజులుగా కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. సెప్టెంబర్‌ 30 ‌లోగా తెలంగాణాపై స్పష్టమైన ప్రకటన విడుదలవుతుందని భ్రమలు కల్పించిన కేసీఆర్‌, ‌గడువు దాటినా ప్రజలముందుకు రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఆయన పార్టీ, ఆయన ఇష్టం ఎప్పుడైనా ఎవరితోనైనా కలిసిపోవచ్చు. ఆ ఆందోళనతోనే ప్రజలకు ఉద్యమ మార్గం వెదుక్కోవలసి వొచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలపై ఒత్తిడి కేవలం ఉద్యమాల ద్వారానే సాధ్యం అన్న విశ్వాసంతో ప్రజలు వివిధ ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోదే జేఏసీ  ప్రకటించిన కార్యక్రమం సెప్టెంబర్‌ 30, ‌తెలంగాణా మార్చ్.
‌ప్రభుత్వం, పోలీసులు తెలంగాణ మార్చ్‌పై విధించిన ఆంక్షలు, అభ్యంతరాల కారణంగా జనం ఎక్కువగా పాల్గొనలేకపోయినారు. కేవలం 3 నుంచి 4 లక్షల మంది మాత్రమే పాల్గొన్నారు. మార్చ్‌కు రెండురోజుల ముందు లా లండ్‌ ఆర్డర్‌ ఐజీ హూడా విలేఖరుల సమావేశంలోవ్యక్తపరిచిన అభిప్రాయం శాంతికాముకులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మార్చ్‌లో అసాంఘిక శక్తులు చొరబడి, సీమాంధ్రల ఆస్తులపై దాడిచేసే ప్రమాదముందని హెచ్చరించడం ఆయన సమర్ధతను తెలియజేస్తుంది. అసాంఘిక శక్తులను అరికట్టడం, ప్రజల ఆస్తులను కాపాడడం పోలీసుల కనీస బాధ్యత, శాంతిభద్రతల పరిరక్షణ నెపంతో మార్చ్‌కు పోలీసులు సృష్టించినా  అడ్డంకులను అధిగమిస్తూ తెలంగాణా ఉద్యమకారులు మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించారు. రాజకీయపార్టీలకు ధీటుగా కోదండరామ్‌ ‌నేతృత్వంలో, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన మార్చ్‌కు విశేష ప్రజాధారణ లభించింది.
మార్చ్ ‌సందర్భంగా సెప్టెంబర్‌30 ‌నెక్లెస్‌ ‌రోడ్డుపై చోటుచేసుకున్న రెండు, మూడు సంఘటనలను అటు మీడియాలోని ఒక వర్గం, ఇటు పోలీసులు భూతద్దంలో చూపెడుతున్నారు. మార్చ్‌లో మావోయిస్టులు పాల్గొన్నారని దుష్ప్రచారంచేస్తున్నారు. మార్చ్‌లో మావోయిస్టు వ్యవస్థను పూర్తిగా నిర్మూలించామని ఒకవైపు మెడల్స్ ‌పొందుతున్న పోలీసులు మరోవైపు మార్చ్‌లో మావోయిస్టులు ప్రవేశించారనడం విడ్డూరం.ఒక వేళ మావోయిస్టులు మార్చ్‌ను తమ లక్ష్యం కోసం ఎంచుకుంటే మీడియా ఓబీ వ్యాన్‌లను తగులబెట్టారా..? ల్యాండ్‌మైన్‌లలో పదులకొద్ది పోలీసులను హతమారుస్తున్న మావోయిస్టుల రైల్వేస్టేషన్‌ఫర్నిచర్‌ను ధ్వంసం చేస్తారా..? మీడియా ఓబీవ్యాన్‌లు తగులబెట్టడం, రైల్వేస్టేషన్‌ ‌ఫర్నిచర్‌ ‌ధ్వంసం చేయడం,హోటల్‌పై దాడిచేయడం ఇటువంటివి అసాంఘిక శక్తుల చర్యలే. తెలంగాణ వ్యతిరేకులు ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయడానికి, బద్నామ్‌ ‌చేయడానికి చేసిన కుట్ర. మార్చ్ ‌శాంతియుతంగా నిర్వహించినందుకు కేంద్రహోంత్రి సుషీల్‌కుమార్‌ ‌షిండే తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపడం బహుశా రాష్ట్ర పోలీసు అధికారులకు మింగుడుపడకపోవచ్చు.
హింస వాంఛనీయం కాదు. హింసను ఎవరు ప్రేరేపించినా ఖండిచాల్సిందే తెలంగాణ మార్చ్‌లో పాల్గొనడానికి అనుమతించాలని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు  మోకాళ్ళ మీద కూర్చుని అభ్యర్థించినా వినకపోగా, వారిపై దురుసుగా ప్రవర్తించి పోలీసులు ఒక విధంగా హింసను ప్రేరేపించారు. సరిహద్దు భద్రతా దళాలు, ర్యాపిడ్‌ ‌యాక్షన్‌ ‌ఫోర్స్, ‌వజ్రాలు, బాష్పవాయుగోళాలు, నీటి శకటాలు, స్థానిక పోలీసులు.. నిరయుధులైన విద్యార్థులను కట్టడి చేయడానికి ఇన్ని  శక్తులు ఉపయోగించాలా..? తమ ఆకాంక్షను తెలియజేయడం, నిరసనను వ్యక్తం చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు.. దాని కోసం హింసామార్గాన్ని ఎంచుకున్నవారిని పోలీసులు కట్టడి చేయవచ్చు కానీ శాంతియుతంగా, ర్యాలీగా బయలుదేరి మార్చ్‌లో పాల్గొంటామన్న విద్యార్థులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకన్నా వాటిని నిరోధించడం పోలీసుల విధి. పోలీసులు బాధ్యతలు, విధులను మరచిపోయి ఆంక్షలు విధిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు మాత్రం రాజ్యాంగానికి లోబడే తమ నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పార్లమెంట్‌లో బిల్లు ప్రవెశపెట్టేలా… కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికీ, తెలంగాణా తల్లిని విముక్తి  చేయడానికి హైదరాబాద్‌నుంచి ఢిల్లీకి ఉద్యమ వంతెనను నిర్మిస్తున్నారు. రావణ సంహారానికి రామదండు కదిలినట్లు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కో ‘దండు’ కదిలింది..!
దక్కన్‌. ‌కామ్‌
‌దేవులపల్లి అజయ్‌ 

సెప్టెంబర్ 30, 2013 

all political partiesProf. Kodandaramsagara haramsocial organisationstelangana movement
Comments (0)
Add Comment