‌తనయుడు కీచకుడు.. తండ్రి ధృతరాష్ట్రుడు

  • ఆస్తి కాదు…నా అర్ధాంగిని అడిగాడు
  • ఆర్థిక భారంతో కాదు… అత్మవంచన చేసుకోలేకే ఆత్మహత్య..
  • భవిష్యత్తు భయంతో బూడిదయ్యారు

కొత్తగూడెం, జనవరి 06(ప్రజాతంత్ర ప్రతినిధి) : చితిని చేరేవరకు చేయి విడవను అంటూ ఏడు అడుగులు నడిచి అగ్ని సాక్షిగా ఒక్కటైన జంట అదే అగ్నికి కుటుంబంతో సహా ఆహుతి అయిన ఘటన యావత్‌ ‌తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘట నుండి ప్రజలు తేరుకోకముందే మృతుడు రామకృష్ణ చివరి సెల్ఫీ వీడియో గురువారం సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇప్పుడు ఆ వీడియో అందరి హృదయాలను దహించి వేస్తుంది. బంధువు అంటూ రాబంధువుగా మారిన రాజకీయ కీచకుడు వనమా రాఘవ వ్యవహారం సెల్ఫీ వీడియో బట్టబయలు చేసింది. అందరూ అనుకుంటున్నట్లు ఆర్థిక భారం మోయలేక  కాదు ఆత్మవంచన చేసుకోలేక అగ్నికి ఆహూతులయ్యారు ఆ కుటుంబసభ్యులు అన్న నగ్నసత్యం షాక్‌కి గురిచేస్తుంది.

ఆ నీచుని కామ దాహాన్ని విన్న తన మనస్సు మానాసిక వేదనతో దేహాన్నీ మంటల్లో మాడ్చుకుని మాంసపు ముద్దలు చేసుకునేందుకు వెనుకాడనివ్వలేదు. అకృత్యుని అశుద్ధపు మాటలు కర్ణభేరిని తాకని క్షణం మనస్సులో ఓ కురుక్షేత్ర యుద్ధం జరిగి మది ఎంత క్షోభకు గురై ఉంటుందో ఊహకు అందని యాతన అది. అర్ధాంగిని అప్పగించమని అడిగిన కరుని కౌరవ సైన్యాన్ని ఎదుర్కున లేక, కాకుల్లా దెప్పిపొడిచే సమాజంలో నిందలు మోస్తూ నిలవలేక ఒంటికి నిలువునా నిప్పంటించుకున్నాడు రామకృష్ణుడు. బాధలను భరించలేక బంధాలను వీడలేక బాలవత్మరణానికి ఒడిగట్టాడు. కామ దాహాన్ని తీర్చేది కాదు ఈ దేహం ఒట్టి మాంసపు ముద్ద అంటూ కామంతో కొట్టు మిట్టాడుతున్న చిన్న సారు కళ్ళు తెరిపించాడు మరో కుటుంబం బలికాకూడదని.

ఇంత జరుగుతున్నా తనయుని అకృత్యాలు, అఘాయిత్యాలు చూస్తూ ధృతరాష్టునిలా వ్యవరిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే వనమాను విమర్శిస్తున్నాయి విపక్షాలు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌రోజు రోజుకు పెరుగుతుంది.

అరెస్టులో ఆలస్యం
పాత పాల్వంచలో జరిగిన ఈ దుర్ఘటనలో రాఘవను నిందితునిగా చేర్చారు పోలీసులు. అయితే ఎమ్మెల్యే తనయుడు రాఘవేంద్రరావు పనిమీద బయటికి వొచ్చాను అంటూ, ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని బుకాయిస్తూ మీడియాతో మాట్లాడుతున్నాడు. పరారీలో ఉన్నాడు పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ భిన్న కథనాలు ప్రజలను కన్ఫ్యూజ్‌ ‌చేస్తున్నాయి. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నా అదేమి లేదంటూ కొట్టిపరేస్తున్నాయి పోలీసు వర్గాలు.

దీంతో కేసు దర్యాప్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇదంతా గమనిస్తున్న ప్రజలు కేసు నీరుగారుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో  సెల్ఫీ వీడియో సోషల్‌ ‌మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ ‌లో గురువారం రాఘవను అరెస్ట్ ‌చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

అడ్డు పడ్డ ఆ అదృశ్య శక్తి ఎవరు..?
సంఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా జిల్లా నేతలుగాని, మంత్రులుగాని పెదవి విప్పకపోడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. ఇలా వదిలేస్తే రాఘవ ఆగడాలకు అడ్డు కట్ట వేసేదెన్నడు అని ఆందోళన చెందుతున్నారు. పోలీసు కాళ్లకు బంధం వేస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరని ఆగ్రహిస్తున్నారు జనాలు. నాయకుల కుటుంబాలకు ఈ దుస్థితి ఎదురైతే ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో స్పందించాలని కోరుతున్నారు జిల్లా వాసులు.

కామ పిచాచిని కాల్చి చంపాలి….
ప్రభుత్వానికి చేతకాకపోతే ప్రజలే చూసుకుంటారని, ఇంత జరుగుతున్నా ఇటు అధికారపార్టీ అటు ప్రభుత్వ పెద్దల నుండి ఎటువంటి చర్యలు లేకపోడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం చర్యలు చేపట్టక పోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మండి పడుతున్నారు. కామ వాంఛకు కుటుంబాన్ని బలిచేసిన మానవ మృగాన్ని కాల్చి చంపినా తప్పు లేదని మహిళా, ప్రజా సంఘాలతో పాటు ప్రతిపక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

వత్తాసు పలుకకండి వాస్తవం గ్రహించండి
రామకృష్ణ కుటుంబం సజీవదహనం యువ నాయకుడి కామ కేళికి సాక్ష్యాలుగా నిలుస్తున్నా శవాలపై చిల్లర ఎరుకున్నట్లు కొందరి నాయకుల తీరు ఉంది. ప్రజా ప్రతినిధులం అన్న విచక్షణ మరచి  కామాంధుకిని వత్తాసు పలుకుతు సోషల్‌ ‌మీడియాలో పోస్టులు పెట్టడం అంటే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా ఉంది అధికార పార్టీ నాయకుల తీరు. మృతుడు కంటికి రెప్పలా చూసుకున్న కూతుళ్ళు కళ్ళముందే కాలుతూ చేసిన ఆహాంకారాలు తలుచుకుంటే ఒళ్ళు గగుర్పాటుకు లోనవుతుంది. అలాంటి తండ్రి తన చావుకు ముందు తీసిన సెల్ఫీ వీడియో చూసైనా కళ్ళు తెరచి బాధితుల పక్షాన నిలవాలని నియోజక వర్గ ప్రజలు కోరుకుంటున్నారు.

bjpCongresslatest newspm modiprajatantra newspaperpresent issuestelugu articlestrs party
Comments (0)
Add Comment