రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా హిమాకోహ్లి ప్రమాణం

  • రాజ్‌భవన్‌లో చేయించిన గవర్నర్‌ ‌తమిళిసై
  • హాజరైన సిఎం కెసిఆర్‌..‌పలువురు మంత్రులు, జడ్జిలు

రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌హిమా కోహ్లీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జస్టిస్‌ ‌హిమా కోహ్లీ చేత గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరుకాగా, శాసనసభ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం జస్టిస్‌ ‌హిమా కోహ్లీకి గవర్నర్‌ ‌తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్‌ ‌హిమా కోహ్లీ తెలంగాణ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నిలిచారు.

1959 సెప్టెంబర్‌లో ఢిల్లీలో పుట్టిన జస్టిస్‌ ‌హిమ కోహ్లీ 1979లో సెయింట్‌ ‌స్టీఫెన్స్ ‌కళాశాల నుంచి బీఏ ఆనర్స్ ‌హిస్టరీలో పట్టభద్రులయ్యారు. తరువాత ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌ ‌లా సెంటర్‌ ‌నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1984లో ఢిల్లీ బార్‌ ‌కౌన్సిల్‌లో సభ్యురాలిగా నమోదై.. న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2006 మేలో ఢిల్లీ హైకోర్టులోనే అదనపు జడ్జిగా నియమితులయ్యారు. సుమారు 15 నెలల తరువాత పూర్తిస్థాయి జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. కోవిడ్‌-19 ‌విస్తరణ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జైళ్లలో రద్దీని తగ్గించేందుకు సుప్రీమ్‌కోర్టు ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీకి హిమా కోహ్లీ చైర్‌ ‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు సీజేగా ఉన్న జస్టిస్‌ ‌రాఘవేంద్రసింగ్‌ ‌చౌహాన్‌ ‌బదిలీపై ఉత్తరాఖండ్‌ ‌హైకోర్టు సీజేగా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో పదోన్నతిపై జస్టిస్‌ ‌హిమా కోహ్లి బాధ్యతలు చేపట్టారు.

first woman Chief JusticeHimakohliHimakohli swornraj bhavanTelangana state high courtThamilisai Soundar Rajants governor tamilisai
Comments (0)
Add Comment