ముళ్లపాన్పు

తీయని నదులు సముద్రంలో చేరి ఉప్పూరినట్లు
తిన్నది తాగిందంతా చెమట రూపంలో
శ్రమ పన్నీరు గాలికి ఆవిరి
రోజులు గడుస్తున్నాయి
ముళ్ళకంపకు తగులుకున్న దుస్తులు తీయలేక

ధరలు నిచ్చెనలెక్కడం మానేశాయి
లిఫ్ట్ ‌లో పైకెళ్ళిపోతున్నాయి
సామాన్యులెక్కడానికి స్థలం లేదందులో
నిత్యావసరాలు నిండు అమాసలు

రాజ్యానికి తెలుసు ఎక్కడ సురుకుపెట్టాలో
మూలవాసం చమురు ధరలు చుక్కల్లోకి
ఒకటెనుక ఒకటి అదే దారిలో
దిక్కుతోచని జనం దిక్కులు చూడటం

పతంగిలా పైకెగరడం కాదు
రాకెట్‌ ‌వేగంతో ఎదగాలన్న కాంక్ష కొందరిది
ఎందరు అణగదొక్క బడుతున్నారో
ఎందరు బలైపోతున్నారో

చావుకు మంచి తిథికోసం
భీష్ముడు అంపశయ్యపై
బతుకు దారిలో పరుగెత్తడానికి
రోజు ముల్ల పాన్పు పవళింపులే
నిద్ర కుక్క కరిచిన బాధలే ఎందరికో

అంపశయ్య పక్కన దాహం తీర్చేందుకు
గంగను పైకి తెచ్చేందుకు
బాణమేసే అర్జునుడు లేడిప్పుడు
నీళ్ళతోనైనా కడుపు నింపుకుందామంటే
కన్నీళ్లతో కడుపు నిండుతోంది

కొమురవెల్లి అంజయ్య
సిద్దిపేట, 9848005676

bjpCongresslatest newspm modiprajatantra newspaperpresent issuestelugu articlestrs party
Comments (0)
Add Comment