3‌న అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగం

  • 6న బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టే అవకాశం
  • తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ యోచన
  • అసెంబ్లీ సమావేశాల ఖరారుపై ప్రభుత్వం కసరత్తు
హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి30: తాజా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల్లో మార్పు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాస్తానికి ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినా ప్రస్తుతం షెడ్యూల్‌ ‌మారే అవకాశాలు ఉన్నాయి. 3న అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలను ప్రారంభించి  ఆరోజు ఉభయ సభలన ఉద్దేశించి గవర్నర్‌ ‌ప్రసంగిస్తారు. తరవాత 6న బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. శాసనసభ, శాసన మండలి బడ్జెట్‌ ‌సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం షెడ్యూల్‌ ‌కూడా విడుదల చేశారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టే తేదీని ప్రభుత్వం మార్చుకుంది. 3వ తేదీకి బదులు 6న బ్జడెట్‌ ‌ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. నిజానికి డిసెంబరులో శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచించింది.
కానీ బీఆర్‌ఎస్‌ను విస్తరించే నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ‌దిల్లీ  వెళ్లడంతో సమావేశాలు జరగలేదు. వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 6, 12, 13 తేదీల్లో జరిగాయి. అప్పటి నుంచి ఆరు నెలల్లోపు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కాగా, ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ‌ను ప్రవేశపెట్టనుంది. అందులో వచ్చే నిధులను పరిశీలించి, రాష్ట్ర బడ్జెట్‌ ‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. గత బడ్జెట్‌ ‌సమావేశాలు కూడా గవర్నర్‌ ‌ప్రసంగం లేకుండానే జరగడంతో రాద్దాంతంగా మారింది. రాజ్‌భవన్‌, ‌ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య వివాదాన్ని రాజేసింది. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సి ఉన్నందున.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి అనుమతి ఇస్తున్నట్లు అప్పట్లో గవర్నర్‌ ‌వెల్లడించారు. కానీ అంతకుముందు సమావేశాలకు కొనసాగింపుగానే బడ్జెట్‌ ‌సమావేశాలను ప్రారంభిస్తు న్నామని, ఈ దృష్ట్యా గవర్నర్‌ అనుమతి అవసరం లేదని, స్పీకర్‌ ‌సమావేశాలను ప్రారంభించవచ్చంటూ అప్పట్లో ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి.
నిజానికి బడ్జెట్‌  ‌సమావేశాలను గవర్నర్‌ ‌ప్రారంభించడం సంప్రదాయం. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ‌ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు మాట్లాడతారు. ఇలాంటి వ్యవహారం ఏ లేకుండానే బడ్జెట్‌ ‌సమావేశాలను నిర్వహిస్తుండడం సర్వత్రా చర్చనీయంగా మారుతోంది. ఇకపోతే 3 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలంటూ గవర్నర్‌కు ప్రభుత్వం లేఖ రాసింది.  ఇందుకు రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై ఆమోదం తెలపాల్సి ఉన్నందున అనుమతి కోరుతూ ఈ నెల 21నే గవర్నర్‌కు లేఖ పంపింది. అయితే గవర్నర్‌ ‌తమిళిసై మాత్రం అనుమతి తెలపలేదు. రాజ్‌భవన్‌ ‌నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్‌ ‌న్యాయవాది దుష్యంత్‌ ‌దవేను రంగంలోకి దించింది.
గవర్నర్‌ ‌విషయంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
బడ్జెట్‌పై వేసిన పిటిషన్‌ ‌వెనక్కి తీసుకున్న సర్కార్‌
‌గవర్నర్‌ ‌బడ్జెట్‌ ‌ప్రసంగం ఉంటుందని హైకోర్టుకు వెల్లడి
గవర్నర్‌ను విమర్శించకుండా చూస్తామని వెల్లడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి30: గవర్నర్‌తో పోరు కీలక మలుపు తిరిగింది. గవ్నర్‌ ‌వ్యవస్థను దునుమాడుతూ వచ్చిన కెసిఆర్‌ ‌సర్కార్‌ ఇప్పు‌డు రాజ్యాంగానికి తలొగ్గారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ ‌బడ్జెట్‌  ఆమోదించడం లేదంటూ హైకోర్ట్ ‌లో వేసిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ను  అనూహ్యంగా వెనక్కి తీసుకున్నారు. అంతేగాకుండా బడ్జెట్‌ ‌సమావేశాల్లో గవర్నర్‌ ‌ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్‌ ‌ధవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్‌ ‌ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభ మవుతాయన్నారు. గవర్నర్‌ ‌ను విమర్శించొద్దని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.. గవర్నర్‌ ‌కూడా  తన రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్‌ ‌తరపు లాయర్‌ ‌కోర్టుకు తెలిపారు. బడ్జెట్‌  ఆమోదంపై గవర్నర్‌ ‌తమిళి సై అనుమతి తెలపకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది.
లంచ్‌ ‌మోషన్‌ ‌కు అనుమతించాలని అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌హైకోర్టును కోరారు. ’లంచ్‌ ‌మోషన్‌’ ‌మెన్షన్‌ ‌చేసిన సందర్భంలో న్యాయస్థానం కీలక వాఖ్య చేసింది. ’ఇందులో న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుంది’ అని వ్యాఖ్యానించింది. లంచ్‌ ‌మోషన్‌ అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌చెప్పడంతో అందుకు బెంచ్‌ అం‌గీకరించింది. ఈ క్రమంలో బడ్జెట్‌  ‌సమావేశాలు గవర్నర్‌ ‌ప్రసంగంతోటే మొదలౌతాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో తెలిపింది. దీనికి సంబంధించి హైకోర్టులో లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గవర్నర్‌ను విమర్శించవద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్‌ ‌దవే తెలిపారు. హైకోర్టు సూచనతో ప్రభుత్వ న్యాయవాది, గవర్నర్‌ ‌న్యాయవాది చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా రాష్ట్ర  పైగా గవర్నర్‌ ‌కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్ ‌కమ్యూనికేషన్‌ ‌వెళ్లింది.
బడ్జెట్‌ ‌ను శాసనసభలో ప్రవేశపెట్టేముందు గవర్నర్‌ ‌ప్రసంగం ఉంటుందని, అందుకు సంబంధించిన కాపీ తమకు పంపారా? లేదా? అని గవర్నర్‌ ‌కార్యాలయం సర్కారును కోరింది. దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. దాంతో గవర్నర్‌ ‌కూడా అనుమతి విషయంలో నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఫిబ్రవరి 3 సపిస్తుండటంతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అయ్యింది. చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం లంచ్‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. సుప్రీంకోర్టు సీనియర్‌ ‌న్యాయవాది దుష్యంత్‌ ‌దవేను అందుకోసం రంగంలోకి దించింది. ప్రజాపద్దును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు తక్షణమే అనుమతించేలా గవర్నర్‌కు ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరాలని కోర్టు మెట్లెక్కింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 202 ‌ప్రకారం బ్జడెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ ఆమోదం తెలపాల్సివుంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల్లో గవర్నర్‌ ‌ప్రసంగం ఉంటుంది కనుక సమావేశాల షెడ్యూల్‌ ‌సవరించాల్సి ఉంటుంది. తొలిరోజు గవర్నర్‌ ‌ప్రసంగం ఉంటుంది. తరవాతే బడ్జెట్‌ ‌ప్రసంగం ఉంటుంది.
Comments (0)
Add Comment