అం‌దరి చూపు బూస్టర్‌ ‌డోసు వైపు

ఒమిక్రాన్‌ ‌నుంచి రక్షణకు అదొక్కటే మార్గమంటున్న శాస్త్రవేత్తలు
కేంద్రంపై అన్ని రాష్ట్రాల నుంచి పెరుగుతున్న వొత్తిడి
నిపుణుల శాస్త్రీయ సలహాల ప్రాతిపదికనే నిర్ణయం : కేంద్రం
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : రెండు దశలను దాటి కొరోనాను జయించామని గర్వపడుతున్న మానవాళి ఎదుట కొరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌రూపంలో మరో ముప్పు వచ్చి పడింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ ‌వైరస్‌ ‌బయటపడ్డ కొద్ది రోజులకే 30 దేశాలకు విస్తరించి యావత్‌ ‌ప్రపంచానికి మరో కొత్త సవాల్‌ ‌విసిరింది. భారత్‌లోనూ తొలి కేసు బయటపడ్డ రెండు మూడు రోజుల్లోనే ఎప్పటిలాగానే పెద్ద రాష్ట్రాలను వణికిస్తున్నది. కొరోనా రెండు దశలలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక రాష్ట్రాలలో వేగంగా విస్తరించిన విధంగానే పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ ‌నుంచి రక్షణ పొందడానికి రెండు డోసుల వ్యాక్సిన్‌ ‌తీసుకున్న వారూ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌నుంచి బయటపడాలంటే బూస్టర్‌ ‌డోస్‌ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బూస్టర్‌ ‌డోసు వేసే పక్రియ అమెరికా, బ్రిటన్‌ ‌దేశాలలో ఇప్పటికే కొనసాగుతున్నప్పటికీ ఇంకా భారత్‌లో ప్రారంభం కాలేదు. మన దేశంలోనూ 40 ఏళ్లు దాటిన వయోజనులకు బూస్టర్‌ ‌డోసు అందించే అవకాశాలను పరిశీలించాలని భారత్‌ ‌ప్రభుత్వానికి దేశంలో కొరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్టియం కీలక సిఫారసు చేసింది.

అందులోనూ ముప్పు ప్రమాదం ఎక్కువగా ఉన్న రిస్క్ ‌గ్రూపులకు బూస్టర్‌ ‌డోసు వేసే విషయంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఒమిక్రాన్‌ ‌తీవ్రత బారత్‌లో తక్కువగానే ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నప్పటికీ బూస్టర్‌ ‌డోసుపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం భారత్‌లో విరివిగా వినియోగంలో ఉన్న కోవిషీల్డ్, ‌కోవాగ్జిన్‌ ‌వ్యాక్సిన్లు వేసుకోవడం పూర్తయిన 90 రోజులకు బూస్టర్‌ ‌డోసుగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, వీటిలోనూ వైద్య నిపుణులు బిన్న వాదనలు వినిపిస్తున్నారు. రెండు డోసులు కోవాగ్జిన్‌ ‌తీసుకున్న వారు కోవిషీల్డ్, ‌రెండు డోసులు కోవిషీల్డ్ ‌తీసుకున్న వారు కోవాగ్జిన్‌ ‌బూస్టర్‌ ‌డోసుగా తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకోవాలంటే బూస్టర్‌ ‌డోసును వెంటనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌కర్నాటక రాష్ట్రాలు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాయి. అయితే, దేశంలో 40 ఏళ్లు పైబడిన బూస్టర్‌ ‌డోసు, చిన్నారులకు టీకా అందించే అంశంపై నిపుణుల శాస్త్రీయ సలహాల ప్రాతిపదికనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. ఇప్పటి వరకు దేశంలో 85 శాతం మంది తొలి డోసు, 50 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారనీ, ప్రస్తుతానికి 22 కోట్ల డోసులు అందుబాటులో ఉండగా, డిసెంబర్‌ ‌నెలలో మరో 10 కోట్ల డోసులు సమకూర్చుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

booster
Comments (0)
Add Comment