ముందడుగు??

మేలుకో ఓ యువతా
మార్చుకో నీ నడత!
సామాజిక ప్రగతికి రధ చక్రమైన నీవు
సెల్‌ ‌ఫోన్‌ ‌చెరసాలలో బందీకానేల?
పెడధోరణులతో బజారున పడి
చేజేతులా భవితను
నాశనం చేసుకోనేల?

అనాలోచిత చర్యలతో
నీ భవిత మొదళ్ళు నరుకుతూ,
నీ భుజాలపై
నిరుద్యోగ కావళ్లు మోపుతోన్న
చర్యల్ని గుర్తించు.

రాబందులు రాజ్యమేలుతూ,
విపక్షీయుల అష్టదిగ్బంధనమే
రాజకీయ చతురతగా మారిన
ప్రస్తుత  ధోరణే కొనసాగితే
రాజ్యమేగతి బాగుపడునో యోచించు.
విసిరేయబడుతున్న విలువలు,
కట్టలు తెగిన రాజ్యహింసలు,
తిరోగమ విధానాలను,
ఎండగట్టే సమయం వచ్చిందని గుర్తెరుగు,
ప్రశ్నించే స్థాయి నీదని మరువకు.

అభ్యుదయ భావాలతో
అజ్ఞానుల మనసుల్లో జ్ఞానజ్యోతులు
వెలిగిస్తూ,
కదంతొక్కుతూ అందరినీ కలుపుకుపోతూ,
నిను చూసి ధరిత్రి పులకించేలా
మాతృభూమి యశస్సును
విశ్వయవనికపై నిలిపే తరుణమిది.

తొలి అడుగు నీదైతే
తరలి వచ్చులే జనం అని తెలుసుకో.
ఆ దిశగా అడుగేయి,
అరాచకీయాల్ని ప్రక్షాళన చెయ్యి.

వేమూరి శ్రీనివాస్‌, 912128967
                                      ‌తాడేపల్లిగూడెం

Comments (0)
Add Comment