పరిశోధనలో ముందడుగు.. మానవాభివృద్ధిలో వెనుకడుగు..!

“దేశంలో ఒక వైపు పెరుగుతున్న సంపద మరొక పక్క పెరుగుతున్న పేదరికం వృద్ధి చెందడం చూస్తు ఉంటే సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతూ ఆదాయ అసమానతలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయనేది స్పష్టం. కోవిడ్‌ ‌మహమ్మారి ఈ అంతరాలను మరింత పెంచేసింది. దేశంలోని పై తరగతి 10 శాతం జనాభా వద్ద 77శాతం జాతిసంపద పోగై ఉంది.”

నవకల్పన, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించే విజయాలపైనే ఒక దేశ అభివృద్ధి ఆధారపడి ఉంది. ఈ మూడు రంగాల రూపు రేఖల్ని సమతూకంగా ముందుకు తీసుకు వెళ్లగలిగినప్పుడే నూతన ఆవిష్కరణలు అవిర్భవిస్తాయి.అయితే ప్రపంచంలో గల వివిధ దేశాలుపై మూడురంగాలను ఉపయోగించుకుంటూ నవకల్పనలు సృష్టించడంలో ఏ విధంగా ముందుకు వెడుతున్నాయి అనేది పరిశీలన చేసి వాటి ప్రగతిని బట్టి వాటికి రాంకులు కేటాయించే ఉద్దేశ్యంతో ప్రపంచ మేధో సంపత్తి సంస్ధ గత14 సంవత్సరాలుగా పని చేస్తూ ఉంది. ఈ విషయమై వివిధ దేశాలు చేపడుతున్న ఆవిష్కరణలను గుర్తించి వాటికి ర్యాంకులు కేటాయిస్తూ ఉంది.వీటిని బట్టి వివిధ దేశాల నవకల్పనల సామర్ధ్యాన్ని మనం అంచనా వేయడానికి వీలు కలుగుతుంది. ఈనాటి విజ్ఞానాధారిత, సాంకేతిక చోదిత ప్రపంచంలో నెగ్గుకురావాలంటే నవకల్పనల ఆవశ్యకతను ఇది ప్రపంచానికి తెలియచేస్తున్నది

ప్రపంచంలో వివిధ దేశాల నూతన ఆవిష్కరణల సామర్థ్యం తెలియచేయడంతో పాటు మిగిలిన దేశాలకు ఇది ప్రేరణగా కూడా నిలుస్తుంది.దేశాల నవకల్పనల సామర్ధ్యాన్ని పెంపుదిం చుకోవాలి అంటే సృజనాత్మకతే మూలమని ప్రపంచ మేధో సంపత్తి సంస్ధ వివిధ దేశాలకు చాటి చెబుతూ ఉంది.ఇది ప్రతీ సంవత్సరం వివిధ దేశాలకు ఇది కేటాయించే ర్యాంకులకు ప్రాతి పదికగా మేధో సంపత్తి ఫైలింగ్‌ ‌రేట్స్ ‌నుంచి మొబైల్‌ అప్లికేషన్‌ ‌సృష్టి, విద్యా వ్యయం వంటి మొత్తం 80 ఇండికేటర్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌ ‌ల నిర్ణయం జరుగుతుంది.వీటితో పాటుఇన్పుట్‌ ‌మరియు అవుట్పుట్‌ ‌ద్వారా కూడా వీటి స్థానాలు నిర్ణయిస్తారు. దీనిలో ఇన్పుట్‌ అం‌టే ఒక దేశం దాని అనుబంధ వనరులు, మానవశక్తి తోపాటు.. పరిశోధన మరియు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం ఎంత ఖర్చు చేస్తోంది.. అదే సమయంలో, ఉత్పత్తి ఎలా ఉంది.. ఎన్ని ప్రాజెక్టులకు పేటెంట్‌ ఇస్తుంది ఇలా అనే అంశాలను ప్రపంచ మేధో సంపత్తి సంస్ధ పరిగణలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తూ ఉంది.దీని ప్రకారంగ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇం‌డెక్స్ 2021‌లో భారత్‌ ‌తన ర్యాంకులను గతం కన్నా మెరుగుపరుచుకుంది. తాజాగా ఈ సంస్థ విడుదల చేసిన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇం‌డెక్స్ 2021 ‌ర్యాంకింగ్స్‌లో భారత్‌ 36.4 ‌స్కోరుతో 46వ స్థానంలో ఉంది. గత ఏడాది 2020 సంవత్సరంలో 48 వ ర్యాంకు వచ్చింది. గతంతో ప్రస్తుతాన్ని పోలిస్తే భారత్‌ ‌రెండు స్థానాలు వృద్ధి కనిపించింది.ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మన దేశం గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇం‌డెక్స్(‌జీఐఐ)లో తన స్థానాన్ని వేగంగా మెరుగుపరుచుకుందనే చెప్పవచ్చు.ఎందుకంటే 2015లో 81 ర్యాంక్‌ ‌నుంచి 2021లో 46కు చేరుకుంది.అంటే ఆరేళ్లలో 35 స్థానాలు ఎగబాకడం విశేషంగానే చెప్పవచ్చు.

నవకల్పనలకు సంబంధించి టాప్‌ 50 ‌దేశాల జాబితాలో 2020 లొనే 48వ ర్యాంక్‌తో భారత్‌స్థానం దక్కించుకుంది.ఈ ర్యాంకులలో మొదటి ఐదు స్థానాలలో స్విట్జర్‌ ‌ల్యాండ్‌ ‌మొదటి స్ధానం,స్వీడన్‌ ‌రెండో స్థానంలో,అమెరికా మూడో స్థానంలో, బ్రిటన్‌ ‌నాలుగో స్థానం లో,రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌కొరియా ఐదవ స్థానంలో నిలచి ఉన్నాయి. వివిధ అంశాల ప్రాతిపదికన చూస్తే నవకల్పనలకు సంబంధించి దిగువ మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో భారత్‌ ‌మూడో స్థానంలో ఉండటాన్ని బట్టి మనదేశం సృజనాత్మకత లో ముందంజలో ఉన్నామని అర్ధం అవుతుంది. కొరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ సమయంలో కూడా భారత్‌ ‌నవకల్పనలలో ప్రగతి సాధించడం అనేది గుర్తించదగిన పరిణామంగా చెప్పవచ్చు అయితే భారత్‌ ‌లో ఈ ప్రగతి సాధనకుదేశంలో అపారమైన విజ్ఞాన సంపత్తి, క్రియాశీలకమైన స్టార్టప్‌ ‌వ్యవస్థ, ప్రభుత్వ.. ప్రైవేట్‌ ‌పరిశోధన సంస్థల కృషి అనేవి ఎంతగానో దోహద పడ్డాయని ఇన్నోవేషన్‌ ఇం‌డెక్స్ ‌తెలిపింది.

భారత ప్రధాని ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్‌ ‌పధకం కూడా ఈ వృద్ధిలో మెరుగుదలకు ప్రధాన కారణం అని అధికార పక్షం నాయకులు ఘనంగా చెప్పుకుంటున్నారు.అంతర్జాతీయంగా మన దేశ పురోగతితో పాటు దేశీయంగా వివిధ రాష్ట్రాలలో నూతన ఆవిష్కరణల పురోగతి పరిశీలించి రాష్ట్రాల వారీగా కూడా నీతి ఆయోగ్‌ ‌ర్యాంకులు ప్రకటిస్తూ ఉంది.దీనివలన రాష్ట్రాల మధ్య కూడా పోటీ ఏర్పడి సృజనాత్మక ఏర్పడి వేగవంతమైన ఆవిష్కరణలు అవిర్భవిస్తాయి.అయితేఇతర అనేక అభివృద్ధి సూచికల విషయంలో మన దేశంలో పెరుగుదల లేకపోగా వెనక్కు పోతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. 2019 ప్రపంచ దేశాల మానవాభివృద్ధి సూచిక ప్రకారం 189 దేశాలలో మన స్ధానం 130 నుంచి 131కి పడిపోయింది. మనకన్నా జనాభా అధికంగా ఉన్న చైనా తన రాంక్‌ ‌ను 97 నుంచి 87 కు మెరుగు పర్చుకుంది.మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌ ‌ర్యాంకు 156 నుంచి 154కు బంగ్లాదేశ్‌ ‌ర్యాంకు 141 నుంచి 133కు పెంచుకోగలిగితే మనం మాత్రం తిరోగమనంలో ఉన్నాం.గత 6 సంవత్సరాలుగా మానవాభివృద్ధిలో మన ర్యాంక్‌ ‌చూస్తే 132-129 మధ్యనే ఉంది దీనిని బట్టి మానవాభివృద్ధిలో మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్ధం అవుతూ ఉంది.

ప్రపంచ ఆకలి సూచిక-2019లో 117 దేశాల జాబితాలో మనది 102 గా ఉండగా శ్రీలంక 66, నేపాల్‌ 73, ‌బంగ్లా 88, పాకిస్తాన్‌ 94‌లో ఉంది. 2020 సూచీ ప్రకారం 107 దేశాల జాబితాలో మన దేశం 94వ స్థానంలో ఉంది. తీవ్రమైన ఆకలి బాధలున్న దేశాల విభాగంలో మన దేశం ఒకటిగా నిలిచింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, ‌మయన్మార్‌, ‌పాకిస్థాన్‌ ఇదే విభాగంలో ఉన్నప్పటికీ.. మన కంటే మెరుగైన ర్యాంకులు సాధించాయి. మన దేశంలో ఆహార నిల్వలు భారీగానే ఉన్నప్పటికీ క్షుద్బాధ, పోషకాహార లోపాలు వంటివి ఇంకనూ చిన్నారులనూ వెంటాడుతూనే ఉన్నాయి.

ఆర్థిక స్వేచ్ఛ సూచికలో మన దేశం 2019 సూచికలో 79వ స్ధానంలో ఉంటే 2020లో 105కు పడిపోయింది. ప్రజాస్వామ్య సూచికలో 2018తో పోల్చితే పది స్ధానాలు దిగజారి 2019లో 51వ స్ధానంలో ఉంది. పత్రికా స్వేచ్ఛలో 142, మహిళలకు భద్రతలో 133, ప్రపంచ సంతోష సూచికలో 133 నుంచి 140కి దిగజారింది. శాంతి సూచికలో ఐదు స్ధానాలు దిగజారి 163 దేశాలలో 141కి, ప్రపంచ పోటీతత్వ సూచికలో పది స్ధానాలు దిగజారి 68కి, స్త్రీ పురుష నమానత్వ సూచికలో 112కు దిగజారింది.దీనికి తోడు ఫోర్బస్ ‌నివేదిక సంపన్నుల సంఖ్య 102 నుండి 140కి పెరిగిందనీ వారివద్ద పోగు పడిన సంపద కూడా 59,600 కోట్ల డాలర్లకు ‘వృద్ధి’ చెందిందనీ పేర్కొంది. సంపన్నులున్న దేశాల్లో అమెరికా, చైనా తరువాతి స్థానం భారత్‌దేనని తెలిపింది.దేశంలో ఒక వైపు పెరుగుతున్న సంపద మరొక పక్క పెరుగుతున్న పేదరికం వృద్ధి చెందడం చూస్తు ఉంటే సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతూ ఆదాయ అసమానతలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయనేది స్పష్టం. కోవిడ్‌ ‌మహమ్మారి ఈ అంతరాలను మరింత పెంచేసింది. దేశంలోని పై తరగతి 10 శాతం జనాభా వద్ద 77శాతం జాతిసంపద పోగుపడి ఉంది.

దేశ జనాభాలో 6.7 శాతం మంది అనగా 73 మిలియన్ల మంది తీవ్ర పేదరికంలో ఉన్నారు.నిరుద్యోగం రేటు నేడు 5.36 శాతంగా ఉంది. 287 మిలియన్‌ ‌మంది విద్యారంగానికి దూరంగా ఉన్నారు. ఇన్ని అసమానతలు సూచీలలో వెనుక బాటు తనం మనకు కనిపిస్తూనే ఉన్నప్పటికీ..ప్రపంచ ఆవిష్కరణల సూచీ లో కానీ ,సెన్సెక్స్ ‌లో కానీ వేగవంతమైన పురోగతి సాధిస్తున్నాం.ఒక వైపు ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి మరొక పక్క శాస్త్రీయ నవకల్పనల్లో పురోగతి కనిపిస్తూ ఉంది.ఎందుకు ఈ వైవిధ్యం అంటే మెజారిటీ పేద వర్గాల వారికి అభివృద్ధి ఫలితాలు చేరువ కాకపోవడమే.సంపద ఆదాయల ప్రవాహం కొద్దిమంది వద్దనే పేరుకు పోవడం ఈ క్రమంలో భాగ్యవంతులు మరింత భాగ్యవంతులుగా పేదవారు మరింత పేదవారుగా రూపు దిద్దబాడుతున్నారు.సంపద కేంద్రీకరణ నివారించడానికి ప్రభుత్వాలు చిత్త శుద్ధి తో ప్రయత్నం చేయనంత కాలం సంపద కొన్ని వర్గాల వారి చేతుల్లోనే పోగు పడటం అనేది అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ అవుతుంది తప్ప పురోగతి అనేది కనిపించదు.

– రుద్రరాజు శ్రీనివాసరాజు..
లెక్చరర్‌.ఐ.‌పోలవరం,9441239578
Bharat Bandh live updatesForward in researchhuman developmentprajatantra newsTelangana news updatestelugu short newstelugu vaarthalutoday breaking updates
Comments (0)
Add Comment