సమగ్రాభివృద్దికి…తెలంగాణ చిరునామా

  • ఏడేళ్లలో అన్ని రంగాల్లో పురోగతి
  • నీరు, కరెంట్‌ ‌సమస్యలకు ఆస్కారం లేదు
  • మంచిరోడ్ల నిర్మాణంతో గ్రామాలకు రవాణా
  • శాంతి భద్రతలకు అసలు సమస్యే లేదు
  • సమగ్రాభివృద్ధితో భూముల ధరలకు రెక్కలు
  • మూడెకరాలు ఉన్న రైతూ కోటీశ్వరుడే
  • జనగామలో కూడా పెరిగిన భూముల ధరలు
  • హైదరాబాద్‌లో విల్లాలు కొనేందుకు ఇతర ప్రాంతాల వారి ఆసక్తి
  • జనగామ కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్‌

‌ప్రజాతంత్ర, జనగామ, ఫిబ్రవరి 11 : తెలంగాణ సర్వతోముఖాభివృద్దికి కేంద్రంగా నిలిచిందని…అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి మన కళ్లముందు ఉందని సిఎం కెసిఆర్‌ అన్నారు. కరెంట్‌, ‌నీళ్లు, రోడ్లు అద్బుతంగా ఉన్నాయని, శాంతిభద్రతల సమస్య అస్సలు లేదన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల ప్రజలు హైదరాబాద్‌లో ఓ విల్లా కొనుక్కోవాలని చూస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారు. ఢిల్లీ ముంబై నుంచి వొచ్చి హైదరాబాద్‌లో కొంటున్నారు. నీటి వసతి పెరగడంతో భూముల ధరలకు రెక్కలు వొచ్చాయని, మూడెకరాల భూమి ఉన్న రైతు ఇవాళ కోటీశ్వరుడని అన్నారు. ఇదంతా మనం చేసుకున్న అభివృద్ధి కారణంగానే అని అన్నారు. ఒకప్పుడు జనగామ పరిస్థితి చూస్తే కన్నీళ్లువొచ్చేవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గుర్తు చేస్తూ… ఇప్పుడు జనగామలో అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. జనగామ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో కొనసాగుతున్న అబివృద్ధి ఇంకా వేగంగా ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. ఏడు సంవత్సరాల క్రితం ఎక్కడో ఉన్నాం. ఇవాళ అభివృద్ధిలో ఎక్కడికో చేరుకున్నాం. చాలా రకాల వాదోపవాదాలు జరిగాయి. సమైక్యవాదులతో కలిసి చాలా రకాల అపోహాలు, అనుమానాలు సృష్టించారు.

మొండి పట్టుదలతో, మీ దీవెనలతో ముందుకు వెళ్లి తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు తెలంగాణ అద్భుతంగా తయారైందని సీఎం పేర్కొన్నారు. జనగామ మీదుగా వెళ్లినప్పుడు తాను, జయశంకర్‌ ‌సార్‌ ‌చాలా బాధపడేవాళ్లం. చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండేవి. సిద్దిపేట నుంచి ఈ మార్గం గుండా వరంగల్‌కు వెళ్తున్నాను. బచ్చన్నపేట మండల కేంద్రంలో మాట్లాడాలంటే ఆగాను. కేసీఆర్‌ ‌మీటింగ్‌కు చాలా మంది వృద్ధులు వొచ్చారు. 8 సంవత్సరాల నుంచి కరువు ఉంది. మంచినీళ్లు కూడా లేవు. నాలుగైదు కిలోమీటర్ల నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. యువకులు వలస పోయిండ్రు అని చెప్తే ఏడుపొచ్చింది. కానీ ఇవాళ రాష్ట్రం సాధించుకున్నాక. పట్టుబట్టి ప్రణాళిక బద్ధంగా, పూర్తి అవినీతి రహితంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పుడు దేవాదులతో అసలు నీటి సమస్య అన్నది లేకుండా చేసుకున్నామని అన్నారు. దేవాదుల నీళ్లు తీసుకొచ్చే క్రమంలో రాజయ్య, ముత్తిరెడ్డి గొడవ పెట్టుకున్నారు. కానీ పట్టుబట్టి, జట్టుకట్టి అద్భుతంగా దేవాదుల పూర్తి చేసుకుని నీళ్లు తెచ్చుకున్నాం. ప్రజల అవసరాలను తీర్చడానికి నాతో యుద్ధం చేసి పనులు చేయించుకున్నారు. అందుకు అనుగుణంగా ఫలితాలు వొచ్చాయి..వొస్తున్నాయి. జనగామలో ఇవాళ పంటలు అద్భుతంగా పండుతున్నాయి. జులై చివరి నాటి వరకు కూడా వరి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. కరువు నుంచి బయటపడ్డామన్నారు.

ఇదే క్రమంలో జనగామలో భూముల విలువలు పెరిగాయి. ఏడేండ్ల కింద రూ.రెండు లక్షల విలువున్న ఎకర భూమి..ఇప్పుడు రూ. రెండు, మూడు కోట్లకు చేరింది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఎకర పొలం రూ. 25 లక్షలకు తక్కువ పోతలేదు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం జరగుతున్న అభివృద్ది వల్ల మాత్రమే సాధ్యమైంది. అధికారులు కూడా రాత్రింబవళ్లూ కష్టపడి పని చేశారు. సీఎస్‌, అధికారులు, ప్రజాప్రతినిధులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఉద్యోగులు చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తిపోవద్దు. ఉద్యమ సమయంలో ఉద్యోగులకు అండగా నిలిచి..ఇప్పుడు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. మన ఉద్యోగులు ఆర్థికంగా నిలబడుతున్నారు. వరంగల్‌ ‌జిల్లాకు కానీ, తెలంగాణకు కానీ కరువు రాదు. ఆ సమస్య లేనే లేదు. కరెంట్‌ ‌సమస్య ఉండనే ఉండదు. అద్భుతమైన తెలంగాణను నిర్మించుకుంటున్నాం. తెలంగాణ వొచ్చింది..బాగుపడుతుంది..ఇంకా ఇంకా బాగుపడుతది అని స్పష్టం చేశారు. అనేక రంగాల్లో అభివృద్ధి ఉంది. ఈ కలెక్టరేట్‌ ‌మాదిరి ఏ రాష్ట్రంలో కూడా సెక్రటేరియట్‌ ‌లేదు. జనగామలో ఇంత వైభవంగా కలెక్టరేట్‌ను ప్రారంభించుకుంటామని ఏనాడూ కూడ కలలు కనలేదు. యాదగిరిగుట్ట వద్ద భూములకు రేట్లు అమాంతం పెరిగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రగతి ఉంది. గ్రావి•ణాభివృద్ధిలో టాప్‌ ‌టెన్‌లో ఏడు గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి.

ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి, అధికారులను అభినందిస్తున్నాను. అందరికీ సెల్యూట్‌ ‌చేస్తున్నానని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నారు. దేవాదుల ప్రాజెక్ట్‌తో ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాకు సాగు, తాగు జలాలు అందుతున్నాయన్నారు. కరువు ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. జనగామతో పాటు, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్‌ ‌జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ ‌కొరతలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉద్యోగులకు ఇంకా జీతాలు పెరుగుతాయన్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వేర్వేరు కాదని, విద్యుత్‌ ‌శాఖ ఉద్యోగులు కష్డపడి పని చేస్తున్నారన్నారు. దేశంలో 10 గ్రామాలకు అవార్డులు వొస్తే.. అందులో ఏడు తెలంగాణవేనన్నారు. జోనల్‌ ‌వ్యవస్థ ద్వారా అందరికి న్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. కాగా అంతకుముందు సీఎం కేసీఆర్‌ ‌జనగామకు రాగానే అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జనగామ కలెక్టరేట్‌ ‌భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ‌శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సీఎం కేసీఆర్‌ ‌కొబ్బరికాయ కొట్టించారు. తలసరి ఆదాయం త్వరలో రూ.2.70లక్షలకు పెరగబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్యెల్యేలు ముత్తిరెడ్డి యాదవరెడ్డి, రాజయ్య,సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులోకి జనగామ కలెక్టరేట్‌
‌ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందిచేందుకు గాను కలెక్టరేట్‌ ‌భవనాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించారు. రూ. 32 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో మూడంతస్తుల్లో..34 శాఖలు కొలువుతీరేలా సమీకృత భవనాన్ని నిర్మించారు. జిల్లా కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌ ‌రావు, ప్రశాంత్‌ ‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం యశ్వంతాపూర్‌ ‌వద్ద నిర్మించిన టీఆర్‌ఎస్‌ ‌జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

Bhubaneswar MP Komatireddy Venkat Reddyerrabelli dayakar raoIntegrated DevelopmentJanagama CollectorateMinisters Satyavathi Rathore
Comments (0)
Add Comment