అగ్ని కడిగిన అక్షరం…

ముళ్ళడొంకలాంటి బతుకు మీద అక్షరమై పూచి కన్నీటి తెరమీద తడి తపనల్ని అద్ది వెళ్లిపోయిన కవి అలిశెట్టి ప్రభాకర్‌. ‌హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధికావాలి… భారమవుతున్న ఉచ్చ్వాస నిశ్వాసాల మధ్యే మృత్యువును పరిహసించేందుకు ఒకింత సహనం కావాలి అన్న సాహసి. గుండె నిండా బాధ, కళ్ళనిండా నీళ్లున్నప్పుడు కూడా జనమైదానంలోకి అక్షర రవ్వల్ని కురిపించి సామాన్య పాఠకుడికి ప్రాణపదమైన కవి. కవిత్వంలోనూ, జీవితంలోనూ ద్వంద్వ ప్రమాణాలు తెలియని నిఖార్సైన మనీషి. తనదైన దృష్టికోణంతో జీవిత విస్తృతినీ, సమాజపు లోతుల్నీ కవితా మాధ్యమంలో ఇమిడ్చి సమరమే మనిషి అంతిమ చిరునామా అని ప్రకటించారు. అలిశెట్టి మరణం నా చివరి చరణం కాదని రాసుకొని కవిత్వ శక్తిని చాటిన ఒకే ఒక్క ఆధునిక కవి. వర్తమాన కవిత్వానికి రెలవెన్స్ ‌రెఫరెన్స్ ‌చూపాలంటే అలిశెట్టి వైపు చూసి తీరాల్సిందే. మృత్యువును సైతం పరిహసించే సాహసం చేయడం అలిశెట్టికే సాధ్యమైంది.

వేదనతో నిండిన గుండెను తడిమి చూస్తే ఇరువైపులా కన్నీళ్లే మొండిగా సమాధానమిస్తాయని అలిశెట్టి అంటారు. జీవితాన్ని అందంగా మార్చుకోవడానికి నీది కాని రక్తాన్ని ఉపయోగించకొమ్మని పేయింటింగ్‌ అన్న కవితలో చురకలంటిస్తారు. ఆనాటి చరిత్ర కాలిపోయి మిగిలిపోయిన బూడిద అంటూ కాలం ఇనుమును శ్రమతో రంగరించి చక్కని జీవన శైలిని మలుచుకొమ్మని సూచిస్తారు. వృధా మొక్కుల కంటే గారడి ప్రదర్శనలోని ఒక్క ఉపాయం మెదట్లోకి ఎక్కించుకోమంటారు. గుండెల మీద స్టెతస్కోప్‌ ‌పెట్టి చూస్తే తెలిసొచ్చే రోగం ఘోరం కాదని శాపమని చెబుతారు. అజ్ఞానం, సోమరితనం అనే బీడు భూముల్నీ ట్రాక్టర్లతో దున్నాలని అంటారు. కనపడని నిప్పుకళ్ల మంటలు శూన్యపు సముద్రంలో పడి అన్యమనస్కంగా మాసిపోతున్నాయని వేదన పడతారు. చెట్టును మోసే కాండం త్యాగం గొప్పదంటారు. ఖరీదైన శవం దహనదాహం గంధపు చెక్కలతోనే తీరుతుందా అని ప్రశ్నిస్తారు. ధైర్యమే మనిషికి ఆయుధమంటూ పిరికిని పేరుకున్న మురికిగా చెబుతారు. విత్తనం లేకుండా పెరిగిన మొక్క శ్వాసనే ఆశ అన్నారు. నిరాశను ప్రయాసగా చెప్పారు. గులాబీ, మల్లె అందించే పరిమళం ఒకటేనని గమనించమంటారు. గుండెల్లో రక్తాశ్రవులే తన కవితలు అని నిర్వచించుకున్నారు. తను శవమై ఒకరికి వశమై.. తను పుండై.. ఒకరికి పండై.. ఎప్పుడూ ఎడారై.. ఎందరికో ఓయాసిస్సై అన్న మాటలు అలిశెట్టిలోని వేదనకు ప్రతీకలుగా కన్పిస్తాయి. వర్తమానానికి, భవిష్యత్తుకు మధ్య ప్రగతి వంతెన కట్టే వెలుతురు కవిత కావాలని ఆకాంక్షించారు.

సమాజ శిథిలాలను చూడమంటారు. మహానగరం మురికి చిత్రమని తెలిపారు. గుండెను నిద్రపట్టని అలారమని, ఆయువు పోసే తనమే సంతృప్తి అంటారు. విత్తనమే సంగ్రామానికి సత్తా అన్నారు. ఎప్పటికఫుడు అమీబాలా చచ్చి బ్రతికేది మధ్య తరగతి మనిషే అంటారు. ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస ఉంటుందంటారు. ఆకలి చిలుములో ఎన్నో అస్తిపంజరాలు కృషించిపోతున్నాయో చూసేందుకు హృదయపు మైక్రోస్కోప్‌ను వాడమంటారు. ప్రతీ వ్యక్తికి హృదయం ఉండదంటారు. గుండె రభసల్లోకి చొరబడేదే సభలు అని నిరసి స్తారు. కరువుకు చెరువులు ఎండాయని బాధపడతారు. ఓటంటే కాగితం మీదే గుర్తు కాదు అని గుర్తించమంటారు. సమరమే కిరీ టమని అని చె బుతారు. అద్దంలోని రెండు వైపులను పారదర్శకంగా చూడగలగడమే వివేకమంటారు. దేశం కోసం ఒక్క చుక్కనై మెరవాలని ఆశప డతారు. నిజం ఖనిజం లాంటిదంటారు. సాధన గొప్పదని భావిస్తారు. పేదోని గుండె గదిలో మండేది పాదరసం కాదు భాస్వరం అంటారు. రేపు పూసే చిగురికి సరికొత్త ఊపిరిలను కోరుకున్నారు. సమాజం పెద్ద సౌండ్‌ ‌ప్రూఫ్‌ ‌గది అని అన్నారు. సుచరిత్రకు మురికి గీతలేమిటని ప్రశ్నించి ఇంకిపోనిచైతన్య ఊటలా ప్రవహిం చాలన్నారు. ఎవడిది వట్టిడాబో/ ఎవరూ దొరబాబో అంతు చిక్కదు/ అన్నీ ప్లాస్టిక్‌ ‌సర్జరీ చేసుకున్న ముఖాలే అంటారు. నగరం అర్థం కాని రసాయన శాల/ అందమైన స్మశానవాటిక అని చెబుతారు. చెమట బిందువును విపులీకరిస్తే కళాఖంఢాలు ప్రతిఫలి స్తాయంటారు. సమాజానికెప్పుడూ 103 డిగ్రీల జ్వరం అంటూ అసహ్యకర వాతావరణాన్ని ఈసడించారు. గొర్రెలింకా గొర్రెలూపుతూనే ఉన్నాయంటూ రాజకీయుల కట్టుకథలు విని బలి కావద్దని ప్రజలకు చెబుతారు. డిగ్రీ కాగితాల మీదే ఆధారపడితే భవిష్యత్తు చెదలే అన్న సంగతిని నిరుద్యోగుల్ని గుర్తించుకొమ్మంటారు. పెత్తనం పాతిపెట్టిన విత్తనమే శ్రమ ఫలమని వేదన చెందారు.

సహనం, సాహసం అనే నిప్పుల మీద కాలాన్ని ఫలంగా ఒండుకొమ్మంటారు. సూదిమొనమీద ఆవగింజని మోపడం వృధాశ్రమ అని చెప్పారు. తడిలేని నాలుకలు నిజం చెప్పవన్నారు. స్వయం కృషి విస్తరించాలని, కృతజ్ఞతా భావంతో గడియారంలా చేతులు జోడించాలని చెప్పారు. సూర్యుడొస్తే కాంతిమయమంటారు. హృదయపు గది వెలుతురు మయం కావాలని చెప్పారు. వెలిగించుకోవాలంటే గుండెనే ఒక కాగడ, చేతులే ఒక కొరడ అని భావించారు. ఆకలి జ్వరం అందరికీ అర్థం కావాలంటారు. మనిషికో దోసెడు మట్టేసిపోకుంటే ఎందుకీ జీవితమని ప్రశ్నించారు. కాలగర్భంలో పెరిగే ఆశా శిశువు భవిష్యత్తు అన్నారు. వర్తక ప్రపంచంలో మానవ సంబంధాలు ఎక్కడివని అన్నారు. కష్టాల నుండి ఆరితేలి ఎదగడం నేర్చు కొమ్మంటారు. చరిత్రకు ఆకలే ప్రేరణ, చెమట బొట్టే ఆధారమని అన్నారు. చరిత్రకు ఆకలే ప్రేరణ అన్నారు.

అలిశెట్టి చురకల్లాంటి మినీ కవితలు రాశారు. నగరంలోని రోడ్డు మింగేసే కొండచిలువలా మారిందని అంటారు. ఆలోచనల చిత్రవధకి అంతం లేదంటారు. రోజుకో తీరుగా పత్రికల్లో అక్షరాల ఆసనాలు వేసుకునే నియంతృత్వపు పోకడలను ఎండగట్టారు. ఉపమానం కాదు తాను చెప్పేది ఉన్నమాటే అంటూ వీధి దీపాల శోకాలను అక్షరీకరించారు. పొగడ్తల పోషక పదార్థాలకు ఆయన ఉబ్బి తబ్బిబ్బవ్వలేదు. జనమైదానాలలో గాధలే ముడిసరుకులయ్యాయని అంటారు. టోపి ఎన్నికల్లో ఓట్లు అడుక్కునే చిప్ప అని ఎద్దేవా చేశారు. చదువు పొలంలో ఎంత దున్నితే నిరుద్యోగం పంట అంత అధికమౌతుందని చెప్పారు. ప్రగతి వెంట్రుకలు మొలవని బట్టతల శంకుస్థాపన రాయి అని చెప్పారు. అసమర్థుడు పొందితే ప్రైజు, ప్రతిభాపరుడు పొందేది సర్‌‌ప్రైజు అంటారు. ఎవ్వడూ తవ్వలేని వాగ్దానాల విధిగా మైక్‌ను పోల్చారు. సిగిరెట్లకీ, క్యాన్సర్‌కి మధ్యవర్తికి పొగ అంటారు. మేకుకేసి గోడను బాధడంలో సుత్తి వేదననూ చెప్పారు. ఎందర్నో మండిస్తుంది స్లోగన్‌ అం‌టారు. చిన్నింటికి తాళం, గొప్పింటికి కాపలా కావాలి అన్నారు. చెమట చుక్కకి నిరంతర నిర్వచనంగా చీమని చూపారు. పేదరికాన్ని పరిహసించే ఆకాశపు చపాతి చందమామ అన్నారు. గొర్రెల మందతో నడిచేకంటే చీమల బారులో చేరితే మేలు అన్నారు.

సిటీలైఫ్‌ అలిశెట్టి కవితాత్మలోని నిశితత్వాన్ని చూపింది. విద్యావ్యాపారల వ్యవస్థలో నెత్తురోడే నిరుద్యోగులను చూసి వేదనపడ్డారు. చెమటోడ్చినంత కాలం పచ్చదనాన్ని ఆక్టోపస్‌ ‌పీలుస్తూనే ఉంటుందని అంటారు. మెతుకులేరుకోవడం మీ విధి, కడుపుల నిండకుండా చూసే బాధ్యత మాది అని వర్గతత్వాన్ని ఎత్తిచూపారు. ఆకలి అస్తిపంజరాలను చూసి వేదన పడ్డారు. నెత్తికి టోపీ నిత్యావపర వస్తువుల ధరలు బొప్పిపట్టిస్తున్నాయంటారు. ఆమె నెత్తుటి గాయాల సంపుటి, రగిలే బాధల కుంపటి అంటారు. తరతరాలకు తడియారని కన్నీటి బొట్టును గుర్తు చేశారు. ప్రకటనల గాలి నాగరికత సౌధం మీద వీస్తున్నదని అంటారు. నినదించే పేగులుగా జనం మిగిలారని ఆకలిని ఉదాహరిస్తూ చెప్పారు. పట్టణాల చెక్కిళ్లు నల్లధనంతో ఎరుప్పెక్కాయంటారు. క్షతగాత్రుడి నేత్రంలో ఉజ్వల భవితవ్యాన్ని చూశారు. త్యాగాల శిఖరాగ్రమ్మీద మనిషి ముఖాన్ని సైనిక శిబిరంతో పోల్చారు. కన్నీరే పోరాట సూత్రమని అన్నారు. ప్రతిసారి ప్రణాళికల పాకుడు రాళ్ల మీద జారిపడడమే వర్థమాన దేశాల అనివార్య దుస్థితిగా మారిపో యిందంటారు. జీవితమంటే ఊడిగం చేయడం కాదన్నారు. స్వప్నాల్లో పరిభ్రమించకుండా శ్రమిస్తూ సంఘటితం కావా లన్నారు.

తెగిపడ్డ పావురం రెక్క, వాగ్ధానాల ఉలిపిరి కాయ, ఆకాశం గొంతు, అజ్ఞాన పర్వతం, సూర్యుడే నా ముఖచిత్రం, స్వచ్ఛంద స్వప్నాల అంకురం, ప్రచండ సూర్యగోళం, సంక్షోభ గీతం, విషాద సాక్షాత్కారం, భయం అరల్లో, కాలఖడ్గం, కన్నీటి గుళిక, నగారా మోగిందా, నయాగర దూకిందా, ఎన్నికల అట్ట హాసం వంటి ప్రయోగాలు ఆలోచింపజేస్తాయి. నగరంలో/ అటు భవంతులూ/ ఇటూ పూరిల్లూ, దారిద్య్రం/ సౌభాగ్యం/ సమాంత రేఖలు…ప్రతీక్షణం/ రోడ్డు చైతన్యానికి ప్రతీకైతే/ దానిపై పరిగెత్తే మనిషే/ ఒక జడ పదార్థం.. ఒరలో కత్తీ/ గుండెలో కుట్ర రెండు/ పొంచి ఉన్న శత్రువులే… ఈ నిక్రుష్ట సమాజంలో/ నిగనిగలాడే బాపూ నిత్యావసర వస్తువే… చిల్లర తల్లి చిరునామా/ చేజిక్కే వరకు/ భాగ్యనగరంలో రూపాయి తప్పిపోయిన పాపాయి… స్నేహ ప్రపంచంలో/ విహరించే గుండె పక్షికి ఆశలు, ఆకాంక్షలే/ అందాల రెక్కలు అన్నారు. పీడితుడే నా అన్వస్త్రం అంటూ దుర్లభ జీవితాల దుఃఖ సన్నివేశాలను ఆవిష్కరించారు. కన్నీటి లోయలు,కాంతి శిఖరాలను చూపించారు. జీవితాలను వెలిగించే వ్యవస్థ కోసం పరిశ్రమిద్దామన్నారు. ముళ్ళకంచె వీడని, మైలు రాయి అందని జీవితాలలో సూర్యకిరణాలు ప్రసరించాలని భావించి, కాలమే స్వాగత గీతికగా మారి, పీడితుడి పక్షమై గెలిపిస్తుందని అంటారు. సాముహిక శక్తిని విస్తరించాలని ప్రగాఢంగా భావించారు. అక్షరాన్ని ప్రచండ సూర్యగోళంగా మండించిన అలిశెట్టి బహుముఖ ప్రజాకవితా ఉద్యమం.
– తిరునగరి శ్రీనివాస్‌, 8466053933

Fire washed letterprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment