ఒక నిశ్శబ్దపు ఎర్రటి స్తబ్దు మధ్యాహ్నం
ఒక స్టిల్ లైఫ్ పేయింటింగ్
కళ్ళు చిన్నవి చేసి భృకుటి ముడిపడి చూస్తూ
చెట్లు నేల పచ్చిక నుంచి
వేలాడిన కరెంట్ తీగలపై కూర్చున్న పక్షుల నుంచి
నిల్చున్న పడున్న వస్తువుల నుంచి
ఎలాంటి కదలిక లేదు..!
బాల్యం నుంచీ ఎన్నో చుట్టల్లో చుట్టబడి
గుండె అగర్ బత్తీ ఊదు పొగల వాసన పొరల్లో
లోలోతుల్లో దూరదర్శన్ ధ్వనుల్లో
అంతరాంతరాళాల్లో దూరంగా కుక్కల అరుపుల్లో
ఒక దోరగా మళ్ళీ మళ్ళీ పండిన భావాన్ని
పూర్తిగా పెల్లుబికి రానివ్వట్లేదు
చిన్నప్పటి రేడియో స్టేషన్ల బదలాయింపు మాదిరి!
మధ్య మధ్యలో ఒక కందిరీగ చప్పుడో
ఒక గురకో ఒక అరుపో ఒక మోతనో ఒక కూతనో
పాతా ఇన్పా సామాన్ రేకుల్ డబ్బాల్…
మస్తిష్కాన్ని తేరుకునేట్టు చేసి మాటిమాటికీ
ఎదలోతుల్లో అరాచకాన్ని సృష్టిస్తున్నాయ్!
కళ్ళు మూసుకుని ఉన్నా మనోచక్షువు
జ్ఞాపకాల సీలింగును చూస్తూనే ఉంది
అప్పటి రెక్సోనా సబ్బు వాసన గుర్తుకుతెస్తూ…
అసంబద్ధం!!
కాసేపటికి అమ్మో ఇంత మంచి సమయం
కోల్పోబడుతుందని వెంటనే తెరుస్తే-
చిన్నప్పటి జాతరలో కొనిచ్చిన రంగు కళ్ళద్దాల్లోంచి
గడియారం ముల్లు విచిత్రంగా ఎంతో
గడిచిందేమోనని అనుకున్నప్పుడు
గమ్మత్తుగా కొంతే కదిలి…
ఇదేదో బావుంది ఈ సారీ కొంతే
నడిచుంటుందనుకుంటే-
కోణం ఎక్కువ జరిగి తికమక పెట్టి
ఒక అపస్మారక స్థితిలో ఉన్నానన్నట్టు చేసి
మొత్తానికి లోపలికీ బయటకీ లోలోపలికీ
జ్వరం వచ్చినట్టు నోరు చేదుగా వున్నట్టు
ఉప్మా తిన్నట్టు ఏవేవో గుర్తొస్తున్నట్టు…
గొట్టం గోలిలో పసుపు రంగు
గోళీ కాయలో పాలపిట్ట
కరెంటు మీటర్ లో తిరిగే చక్రం
మెయిన్ లో మిణుకు లైటు
ఇవన్నీ తిరుగుతున్నాయ్ కళ్ళకు ఫ్యాన్ కు మధ్య..!!
ఇక ఎప్పటికీ ఈ ఒంటరి మధ్యాహ్నం అయిపోకుండా
ఒక దీర్ఘకాలంపాటు ఇట్టాగే ఉంటే బావుణ్ణు..!
వేరే ఎవరూ ఇందులోకి ప్రవేశించరాదు
అస్సలు లేపరాదు
దూరంగా తచ్చాడనీ…
వాళ్ళ వాళ్ళ అల్లర్లు కొనసాగనీ…
అనుభవిస్తూనే ఉండొచ్చు హాయిగా బాధగా
ఇంకెలానో చెప్పలేని స్థితిలో-
ఒక మధ్యాహ్నపు కాలువలో..!!!
– రఘు వగ్గు