‘‘ఊడ్చే చీపుర్లు,రాసే చాక్ పీస్ లకు రూపాయి నిధులులేక ఈ విద్యాసంవత్సరం గందరగోళంగా మారింది. డిసెంబర్ మొదటి వారంలో పాఠశాల నిధులు యాభయి శాతం విడుదల చేసి, వాటి వినియోగం పై పలు సూచనలు చేసింది.సెప్టెంబరు వరకు పాఠ్యపుస్తకాలు,అక్టోబర్ వరకు ఏకరూప దుస్తులు బడులకు చేరలేదు.నెల మొదట్లో రావాల్సిన ఉపాధ్యాయుల జీతాలు నెల చివర్లో రావటం,ఇప్పటి వరకూ రావల్సిన 4 డి.ఏ.ల విషయంలో ఇవ్వటాన్ని ప్రభుత్వం,అడగటాన్ని ఉపాధ్యాయులు మరిచిపోయిన దుస్థితి నెలకొంది.’’
నిన్నటి సంచిక తరువాయి …
ఈ కార్యక్రమం అమలులో భాషకు, గణితానికి తొంబయి నిమిషాలు చొప్పునకేటాయించాల్సి ఉంది. రోజు వారి సిలబస్ చెప్పటంతో పాటు రోజు వారి ఎఫ్.ఎల్.ఎన్. బోధనభ్యసనకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారీ,పీరియడ్ బోధన ప్రణాళికలు, లెస్సన్ ప్లాన్ లు రాయటంలో సమయం చాలటం కష్టమవుతుంది.
ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు 18సబ్జెక్టులు,ఎఫ్.ఎల్.ఎన్. క్షేత్ర స్థాయి అమలుతో పాటు, సిలబస్ పూర్తి ఉపాధ్యాయులకు పని ఒత్తిడి పెంచుతుంది. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున లేని పాఠశాలలో పని వత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. రాత పనుల సంసిద్ధతకే మొత్తం సమయం చాలదని తెలుస్తుంది.వారాంతపు మాసాంతపు మూల్యాంకనం, గైరాజరైన విద్యార్థుల సంసిద్ధత, అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులు సంసిద్ధత కోసం ఎఫ్.ఎల్.ఎన్. మరోమారు నిర్వహణ లతో ఉపాధ్యాయులు పాఠశాలలోనే కాకుండా ఇంట్లో కూడా విరామం లేకుండా రాత పని చేయక తప్పటం లేదు. ఎంత ముఖ్యవసరాలున్నా ఉపాధ్యాయులు సెలవు వినియోగించుకునే పరిస్థితి లేదు.ఒక రోజు సెలవు పెడితే మర్నాడు పనిభారం మరింత పెరిగే అవకాశం వుంది. ఇంటిని,ఇంటి పనులను,కుటుంబ అవసరాలను త్యాగం చేస్తున్న ప్రాథమిక స్థాయి బోధనోపాధ్యాయులను ఈ ఎఫ్.ఎల్.ఎన్. ఒత్తిడులకు గురిచేస్తుంది పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులే ఉంటే కనుక వారిద్దరికి రోజు వారి ఎనిమిదేసి పీరియడ్ లతో ఈ ఎఫ్.ఎల్.ఎన్. మరింత భారం అవుతున్నది.
సింగిల్ టీచర్ వున్న పాఠశాలలో బహుళ తరగతి బోధనతో పాటు,బహుళ భాషాతరగతులు బోధనలో ఈ కార్యక్రమం అమలు ఊహించటానికే కష్టంగా వుంది. విద్యా సంవత్సరం ఆరంభమైన ఆరు నెలల వరకూ పాఠశాలలకు రూపాయి నిధులు లేని పరిస్థితుల్లో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారీకి ఉపాధ్యాయులకు ఆర్ధిక భారం కల్పిస్తున్నది.నోడల్ ఆఫీసర్, ఎం.ఇ.వో. జిల్లా, రాష్ట్ర అధికారులు పర్యవేక్షణ బృందాలు మారుమూల పల్లె బడులను కూడా సందర్శిస్తున్నాయి. కానీ ఈ పర్యవేక్షణ బృందాలు పాఠశాల ఆవాస ప్రాంత స్థానిక పరిస్థితులు, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు,పిల్లలు కుటుంబాల నేపధ్యాలు పరిగణనలోకి తీసుకోవటం పై దృష్టి సారించడం లేదు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు స్థిరంగా వుండదనే విషయం తెలిసిందే! పలు కారణాల చేత,కుటుంబ కలహాల చేత,కూలి పనులు చేత, అనారోగ్యం చేత రెగ్యులర్ గా పాఠశాలకు రాలేని విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయుల కృషి సరైన ఫలితాలను ఇవ్వటం ఒకింత అసాధ్యమనే విషయం క్షేత్రస్థాయి ఆచరణలో వెల్లడవుతుంది.! పర్యవేక్షణ అధికారులు ఈ కేటగిరీ విద్యార్థులను పరిశీలించిన నేపధ్యంలో అంకితభావంతో పని చేసే ఉపాధ్యాయుల పనితీరు ప్రశ్నార్ధకమవుతున్నది.
ఎఫ్.ఎల్.ఎన్. క్షేత్ర స్థాయి అమలులో ఇబ్బందులు
తెలంగాణ లో అన్ని రంగాల ప్రగతి లాగే విద్యారంగం అమలు ప్రగతి కూడా అధఃపాతాళానికి చేరువలో వుంది.’’ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టైది ఇంకో దారి’’ అనే సామెత లాగా తెలంగాణలో ఎఫ్.ఎల్.ఎన్. అమలు ఐదవ తరగతి వరకు కొనసాగుతున్నది..రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యల ఫలితంగాఎఫ్.ఎల్.ఎన్. అమలు కత్తిమీద సాము లాగా మారింది.రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాలీలున్నాయి.రాష్ట్ర ఏర్పాటు నుండి ఉపాధ్యాయ నియమకాల నిర్వహణ లేదు కొరోనా సంక్షోభానికి ముందు తీసుకున్న 16500 మంది విద్యా వాలంటీర్ల వ్యవస్థను తిరిగి ఏర్పాటు లేదు.ప్రాథమిక పాఠశాలలో పని చేసే సుమారు ఐదు వేల మంది ఉపాధ్యాయులను ఈ విద్యా సంవత్సరం హైస్కూల్ విధులకు డిప్యుటేషన్ పై పంపించారు.ప్రతి కేడర్ లో ఉపాధ్యాయులు అంత కన్నా పై పోస్ట్ లలో డిప్యుటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారు.ఎస్.జి.టి.లు హైస్కూల్లో,,హైస్కూల్ ఉపాధ్యాయులు ఇంచార్జీ హెడ్ మాస్టర్ లుగా, హెడ్ మాస్టర్ లు డిప్యూటీ ఈ.ఓ.లుగా,ఎం.ఇ.వో లుగా,డిప్యుటీ ఈ.ఓ.లు ఇంఛార్జి డి.ఇ.వో.లుగా డిప్యూటేషన్ల వ్యవహారం నడుస్తుంది. ఏ ఒక్క కేడర్ లోనూ పదోన్నతులు లేక,బదిలీలు లేక పాఠశాల విద్యారంగం కునారిల్లుతూంది. పాఠశాలలలో మౌలిక వసతులు,తరగతి గదులు, వాష్ రూంలు లేని బడులు వేల సంఖ్యలో వున్నాయి.
2014 నుండి వార్షిక బడ్జెట్లో ప్రతియేటా కునారిల్లుతున్న విద్యారంగం నిధులు నేడు 6.26 శాతానికి చేరుకున్నాయి.ఈ విద్యా సంవత్సరం రాష్ట్రంలోని పాఠశాలలకు నిర్వహణ నిధులువిడుదల చేయలేదు.అత్యంత కనిష్ట నామ మాత్రపు పారితోషికంతో పని చేసే స్వచ్ఛ్ వర్కర్లను గత మూడేళ్ళుగా తిరిగి నియమించలేదు.ఊడ్చే చీపుర్లు,రాసే చాక్ పీస్ లకు రూపాయి నిధులులేక ఈ విద్యాసంవత్సరం గందరగోళంగా మారింది. డిసెంబర్ మొదటి వారంలో పాఠశాల నిధులు యాభయి శాతం విడుదల చేసి , వాటి వినియోగం పై పలు సూచనలు చేసింది.సెప్టెంబరు వరకు పాఠ్యపుస్తకాలు,అక్టోబర్ వరకు ఏకరూప దుస్తులు బడులకు చేరలేదు.నెల మొదట్లో రావాల్సిన ఉపాధ్యాయుల జీతాలు నెల చివర్లో రావటం,ఇప్పటి వరకూ రావల్సిన 4 డి.ఏ.ల విషయంలో ఇవ్వటాన్ని ప్రభుత్వం,అడగటాన్ని ఉపాధ్యాయులు మరిచిపోయిన దుస్థితి నెలకొంది.తమ కనీస హక్కుల కోసం చేసే ఉద్యమాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది.ప్రతి పాఠశాలకు తగినంత బోధనా సిబ్బంది ఇవ్వటం, పాఠశాలలకు నిర్వహణ, టి.ఎల్.ఎం.నిధులు ఇవ్వటం,స్వచ్ఛ్ వర్కర్ల నియామకం, అదనపు తరగతి గదులు,వాష్ రూంలో నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు మన రాష్ట్రంలో ఏ స్థితిలో వున్నాయనేది గమనించాలి. పాఠ్యపుస్తకాల రాక, రాని పుస్తకాలు బాధ, ఏకరూప దుస్తుల ఆలస్యం పై దృష్టి పెట్టని ప్రభుత్వంలో ఎఫ్.ఎల్.ఎన్. అమలులో అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ ఉండటం హాస్యాస్పదం! ఈ నేపధ్యంలో బడులు, బడిలో ఉపాధ్యాయ సిబ్బందిపనితీరు వెనుక గల ఇబ్బందులను గమనించాలి. కొరోనా సంక్షోభం పిల్లల చదువులపై తీవ్ర ప్రభావం చూపిందనటంలో శషబిషలు లేవు. ఈ సమస్త గందరగోళం స్థితులలో ఎఫ్.ఎల్.ఎన్. తక్షణ అమలు ద్వారా వంద శాతం ఫలితాలు ఆశించగలమా ? అనేది ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి.
విద్యా పర్యవేక్షణ ఎలా వుండాలి!
విద్యారంగంలో విద్యావేత్తలు,విషయం నిపుణులు, విద్యాధికారులు తరగతి బోధన,అభ్యసన అమలు రీతులను ప్రత్యక్షంగా పర్యవేక్షించటం ఆహ్వానించదగిన పరిణామమే! పర్యవేక్షణలు తరగతి బోధనభ్యసనల పెంపుకు ఎంతగానో దోహదపడతాయి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సూచనల, సలహాలు ఇవ్వటం ద్వారా పర్యవేక్షణ బృందాలు తరగతి బోధన, అభివృద్ధికి దోహద పడాలి. బోధనలో అధునాతన, సులభతర విధా నాలు, వినూత్నవిధానాలను తమ పర్యవేక్షణలో అక్కడి విద్యార్థులు,ఉపాధ్యాయులతో పంచుకోవాలి.ఇందుకు భిన్నంగాఉపాధ్యాయులను,విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయటం గమనార్హం. ప్రాథమిక పాఠశాలలోకి 20మంది అధికారులు ఒకేసారి దాడి చేసినట్లుగా వస్తే పిల్లలు భయభ్రాంతులకు చేయటానికి కొంత ఇబ్బంది పడటం సహజమే! .ఒక్క విద్యార్ధి మధింపును ఐదుగురు అధికారులు పర్యావేక్షించాల్సిన అవసరముందా,? కాబట్టి,పర్యవేక్షణ బృందాలు కొంత సహనం పాటించాల్సిన అవసరం వుందనే విషయం మననంలో వుంచుకోవాల్సి వుంది. నిజంగా విద్యా సామర్ధ్యాల సాధన లక్ష్యాల దిశలో పయనించనున్నాయో చెప్పకనే చెపుతున్నాయి. విద్యారంగంలో ఈ అపసవ్య ధోరణులులు విద్యారంగ అభివృద్ధికి విఘాతం కలిగించే ప్రమాదముందనే స్ఫృహ ఇప్పటికైనా కలిగి వుండాలి.
– అజయ్