“గిరాయిపల్లి ఎన్కౌంటర్ మేం జరిపిన మొదటి విచారణ కాగా, మా రెండో విచారణ చిలకలగుట్ట ఎన్కౌంటర్. చిలకలగుట్ట అనేది వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని పాకాల దగ్గర ఉన్న అడవి. హైదరాబాద్‌లో పాత మలక్‌పేటలో పి.రామనర్సయ్యను, ఆయన సహచరులు జానకి రామరెడ్డి, నారాయణ, శ్రీహరిలను అరెస్టు చేసి, నిండా టార్పాలిన్ కప్పిన వ్యాన్‌లో చిలకలగుట్టకు తీసుకువెళ్ళి అక్కడ కాల్చి చంపేశారు.”
అందరికన్న ఎక్కువగా ఆ రోజుల్లో నాకు సాయం చేసినది రంగనాథం, ఎమర్జెన్సీకి ముందు వెలువడుతుండిన ‘పిలుపు’ పత్రిక సంపాదకుడిగా రంగనాథం ఎమర్జెన్సీలో జైలులో ఉన్నాడు. ఎమర్జెన్సీ తర్వాత కొంతకాలం పౌరహక్కుల సంఘంలో పనిచేశాడు.రంగనాథం బాగా టైప్ చేసేవాడు. ఉదయాన్నే వచ్చేవాడు. బాగా పొద్దు పోయే దాకా పనిచేస్తూ ఉండేవాడు. ఆయనకు ఈ విషయాల్లో చాలా అవగాహన ఉండేది. ఎంతో ఆసక్తి ఉండేది. ఇటువంటి దుర్మార్గమైన, ఆసహ్యకరమైన ప్రవర్తన, పద్ధతులు లేకుండా చేయడానికి మనమేమైనా చేయాలి అనే తపన ఉండేది.ఎన్కౌంటర్ల విషయం తెలిసిన వాళ్ళందరి దగ్గరి నుంచి సమాచారం సేకరిస్తుండే వాళ్ళం. అది మళ్ళీ మళ్ళీ టైపు చేయిస్తుండేవాళ్ళం. వసంత ఇంగ్లీషు సరిచూస్తూ ఉండేది. నేనూ చూస్తుండేవాడ్ని. అదంతా కార్ఖానాలాగా నడిచేది.
గిరాయిపల్లి ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సాక్ష్యాధారాలన్నీ సేకరించడం అయిపోగానే ఒక నివేదిక తయారు చేశాం. ఆ నివేదికను మొత్తం కమిటీ ఆమోదించ డానికి వీలుగా ముసాయిదా రాశాం. కమిటీ అధ్యక్షులు, మిగతా సభ్యులు వేరే చోట్ల ఉండేవాళ్ళు గదా. తార్కుండే గాని, అరుణ్ శౌరి గాని ఈ సమాచార సేకరణలో భాగంగా ఇక్కడికి రాలేదు. వస్తే కమిటీ పని మీద దృష్టి ఎక్కువపడి పోలీసుల నుంచి ఇబ్బందులు వచ్చే వనుకుంటాను. ఇక తార్కుండే, నేను, వర్గీస్, అరుణ్ శౌరి జాగ్రత్తగా పదం పదం చదివి నివేదిక ఎక్కువ మందికి ఆమోదయోగ్యంగా ఉండేలా తయారు చేసేవాడు. వర్గీస్ కూడ నివేదికను మెరుగు పరచడంలో తోడ్పడేవాడు.
ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. గిరాయిపల్లి ఎన్కౌంటర్ సాక్ష్యాధారాలు సేకరిస్తున్నప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. ఈ గిరాయిపల్లి ఎన్కౌంటర్ హతులను, సహనిందితులను మెదక్ జిల్లాలోని ములుగులో నీలగిరి తోట డాక్ బంగళా లో నిర్బంధించారని తెలిసింది. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కో, పిడబ్ల్యూడికో చెందిన బంగళా. అక్కడే ఆ రోజుల్లో ఎస్పీ, డిఎస్పీ, కొందరు పోలీసు అధికారులు బస చేశారు. నేను ఆ గెస్ట్‌హౌస్‌కు వెళ్ళాను. వాచ్‌మన్‌ను గెస్ట్ రిజిస్టర్ తీసుకు రమ్మని అడిగాను. అక్కడి వాచ్మనో, గెస్ట్‌హౌస్ ఇన్‌ఛార్జో ఆ రిజిస్టర్ తీసుకువచ్చాడు. దాంట్లో ప్రత్యేకించి ఆ తేదీల్లో జిల్లా ఎస్పీ సుభాష్ చంద్రబోస్ బస చేసినట్టు నమోదయి ఉంది. నేను ఆ పేరు చుట్టూ గుండ్రంగా గీసి గుర్తు పెట్టాను. ‘తనిఖీ చేసి, పేరు చుట్టూ గుండ్రంగా గీశాను’ అని రాసి సంతకం పెట్టాను. కె.జి.కన్నబిరాన్, కార్యదర్శి, తార్కుండే కమిటీ అని రాశాను. ఆ వాచ్‌మన్‌ను పిలిచి ఆ రిజిస్టర్ కాపీ మీద సంతకం తీసుకున్నాను. ఆ బస చేసిన తేదీ ఏమిటి, అంతకు ముందు పేజీలో ఉన్న అతిథి పేరు ఏమిటి, తర్వాతి పేరు ఏమిటి మొదలయిన వివరాలన్నీ జాగ్రత్త చేసేవాడ్ని. తద్వారా వాళ్ళకు ఆ తర్వాత కాగితాలు చింపేసి, సాక్ష్యాధారాలు మాయం చేయడానికి వీలు లేకుండా చేసేవాడ్ని.
గిరాయిపల్లి ఎన్కౌంటర్ మేం జరిపిన మొదటి విచారణ కాగా, మా రెండో విచారణ చిలకలగుట్ట ఎన్కౌంటర్. చిలకలగుట్ట అనేది వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని పాకాల దగ్గర ఉన్న అడవి. హైదరాబాద్‌లో పాత మలక్‌పేటలో పి.రామనర్సయ్యను, ఆయన సహచరులు జానకి రామరెడ్డి, నారాయణ, శ్రీహరిలను అరెస్టు చేసి, నిండా టార్పాలిన్ కప్పిన వ్యాన్‌లో చిలకలగుట్టకు తీసుకువెళ్ళి అక్కడ కాల్చి చంపేశారు. పి. రామనర్సయ్య అప్పటికి చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో పని చేస్తుండిన విప్లవ గ్రూపుకు రాష్ట్ర కార్యదర్శి. ఈ ఎన్కౌంటర్ హత్యలు 1976 అక్టోబర్ 31న జరిగాయి. ఇక ఈ ఘటన నిజానిజాలు సేకరించడం మొదలుపెట్టాం. ప్రీతం సింగ్ అని ప్రభుత్వ మింట్‌లో పనిచేసే ఉద్యోగి ఉండేవాడు. ఆయనకు పాత మలక్‌పేటలో ఉన్న ఇంట్లో రామనర్సయ్యను అరెస్టు చేశారు.అసలు ప్రీతంసింగ్ ఇంట్లో ఒక పోర్షన్లో ఒక ఆర్టిసి ఉద్యోగి అద్దెకు ఉండేవాడు. ఆయన పేరు రెడ్డి అనుకుంటాను. పోలీసులు ఆ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి రామనర్సయ్యను పట్టుకుని కట్టేసి వ్యాన్‌లో వేసుకుని తీసుకుపోయారు. ఈ సంఘటన తనకు తెలిసిందని అప్పటి సిపిఐ(ఎం) శాసనసభ్యుడు ఎం. ఓంకార్ కూడా ఆ తర్వాతి కాలంలో భార్గవా కమిషన్ ముందర చెప్పారు.
రామనర్సయ్యను, ఆయన సహచరులను చిత్రహింసలు పెట్టారని, చేతి వేళ్ళు నరికేశారని కూడా మా విచారణలో తెలిసింది.నేను ఇంకో సంగతి కూడ విన్నాను. అప్పుడు ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉండే కె.రామచంద్రారెడ్డికి రామనర్సయ్య అరెస్టు గురించి చెప్పారట. నిజానికి రామనర్సయ్య అప్పటికే చాలా సీనియర్ నాయకుడు. చాల గౌరవాభిమానాలు సంపాదించుకున్న వ్యక్తి. బహుశా అందువల్ల నేనేమో ఆయన అరెస్టు జరగగానే పోలీసు ఉన్నతాధికారికి ఆ సమాచారం అందజేసి ఉంటారు.రామనర్సయ్యను న్యాయస్థానంలో హాజరు పరచండి అని రామచంద్రారెడ్డి చెప్పాడంటారు. కాని ఏమయిందో, ఆయనను కోర్టులో హాజరుపరచలేదు.
మొత్తానికి చిలకలగుట్ట సంఘటనలో కూడ నలుగురిని చంపేశారు. మా విచారణలో ముడో హత్యా సంఘటన ఇల్లందులో జరిగిన ‘ఎన్కౌంటర్’. ఆ ఎన్కౌంటర్ 1976 నవంబరు 4-5 తేదీల మధ్య రాత్రి జరిగిందని పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో చంపివేయబడ్డవాళ్ళు ఇద్దరు. నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర ప్రసాద్. నీలం రామచంద్రయ్య ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా కొంతకాలం పని చేశారు. చాలా సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. చండ్ర పుల్లారెడ్డి గారి నాయకత్వంలోని విప్లవగ్రూపులో నాయకుడిగా ఉన్నారు. జంపాల ప్రసాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతూ విద్యార్థి నాయకుడిగా, పిడిఎస్యు నాయకుడిగా రాష్ట్రమంతటా గుర్తింపు పొందాడు. కాని ‘‘గుర్తు తెలియని వ్యక్తుల ఎన్కౌంటర్’’ అని పోలీసులు ప్రకటించారు.
వీళ్ళందరినీ 1976 నవంబర్ 4 సాయంకాలం విజయవాడలో అరెస్టు చేసి ఉంటారనడానకి ఎన్నో సాక్ష్యాధారాలు దొరికాయి. వారిని ఆ రాత్రికే వంద కిలోమీటర్ల దూరంలోని ఖమ్మం జిల్లా ఇల్లందు అడవిలోకి తీసుకువెళ్ళి కాల్చి చంపేశారు. ఈ మూడు ఘటనలను విచారించి అవసరమైన, దొరికిన సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాత ఒక మధ్యంతర నివేదిక విడుదల చేయాలనుకున్నాము. గిరాయి పల్లి, చిలకలగుట్ట, ఇల్లందు ఎన్కౌంటర్ హత్యలలో చంపివేయబడిన పదిమంది విప్లవోద్యమ కార్యకర్తలను ఎప్పుడు ఎక్కడ ఎట్లా అరెస్టు చేసి, ఏ న్యాయ విచారణ లేకుండానే ఎట్లా చంపేశారో, ఎంత చట్టవ్యతిరేకమయిన మారణకాండ సాగిందో. దేశం దృష్టికి తీసుకురావడం తార్కుండే కమిటీ ఉద్దేశ్యం. నిజానికి అప్పటికి మాకు భార్గవ కమిషన్ లాంటి ఒక అధికారిక కమిషన్ ఏర్పడి విచారణ జరపబోతుందనే సూచన కూడ లేదు.
దొరికిన ఆధారాలన్నింటితో మధ్యంతర నివేదిక నేనే రాశాను. ఆ నివేదికను 1977 మే 16న ఢిల్లీలో పత్రికా సమావేశంలో విడుదల చేశాం. పది మంది పౌరులను ఏ చట్టబద్ధ పక్రియ, విచారణ లేకుండా ఇంత క్రూరంగా పోలీసులు హత్య చేశారనే వాస్తవం దేశాన్ని కుదిపేసింది. ఆ నివేదిక విడుదల చేసిన తర్వాత కూడ మిగిలిన ఎన్కౌంటర్ ఘటనలను విచారించడం కొనసాగించాం.ఆ తర్వాత విచారణ ప్రారంభించిన ఘటనలు గుంటూరు జిల్లాలోనూ, ప్రకాశం జిల్లాలోనూ జరిగిన ఎన్‌కౌంటర్లుగా చెప్పబడేవి. ఈ ఘటనలలో మొత్తం తొమ్మిది మంది చంపివేయబడ్డారు. జయరావు, సూర్యవర్మ, సత్యానందం, మల్లికార్జునరావుల హత్యలకు సంబంధించి విచారణ, సాక్ష్యాధారాల సేకరణ ప్రారంభించాను. ఈ నలుగురిలో ఇద్దరు దళితులనుకుంటాను.ఈ ఎన్కౌంటర్ ఒక్కసారి ఒక్కచోట జరిగినది కాదు.ఒక్కక్కరిని ఒక్కో చోట ఎన్నో రోజులపాటు చంపుతూ పోయారు.
ఈ సాక్ష్యాధారాల సేకరణ క్రమంలో నేను తెట్టు అనే ఊరికి వెళ్ళడం నాకింకా గుర్తుంది. అక్కడ కచ్చితంగా ఎక్కడ వారిని చంపారో ఆ ప్రదేశం చూశాం. మంచి ఎండలో టాక్సీ తీసుకుని తెట్టు వెళ్ళాను. అక్కడ టాక్సీ చెడిపోయింది. ఒక లారీ ఎక్కి కావలి వచ్చాను. కెవి రమణారెడ్డి ఇంటికి వెళ్ళాను. ఆయన ప్రత్యేకమైన లక్షణాలు, అలవాట్లు నేను చూసిందక్కడే. ఆ సాయంత్రం నన్ను హైదరాబాదుకు రైలు ఎక్కించాడు. నేను ఎక్కిన రైల్లో ఒక పెద్ద పోలీసు పటాలం ఎక్కింది. వాళ్ళు నన్నేమైనా చేస్తారేమోనని కెవిఆర్ ఆందోళన పడ్డాడు. నా దగ్గర తెట్టు ఎన్కౌంటర్ సాక్ష్యాధారాల రికార్డులు ఉన్నాయి గదా.
‘‘మనం ఏం చేయగలం? ఇట్లాగే వెళతాను. ఒకవేళ వాళ్ళు నన్నేమైనా బెదిరించి ఈ రికార్డులు గుంజుకుంటే మళ్ళీ సాక్ష్యాలు సేకరించవలసిందే’’ అని కెవిఆర్‌కు చెప్పేసి రైలెక్కాను.
-కె.జి. కన్నబిరాన్
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్