ఎం.వి.రామమూర్తి గారు వేసిన పిటిషన్ ఇంకా చిత్రమైనది.ఆయన ఏం చేసినాడంటే ఒక రిట్ పిటిషన్ వేసినాడు. ‘నా భార్యతో సంభోగించే హక్కు నాకుంది. ఎమర్జెన్సీ ఆ హక్కును తొలగించడం లేదు. కనుక నా హక్కును పరి రక్షించాలి’ అని. ‘నా భార్యను అప్పుడప్పుడైనా కలుసుకునే అవకాశం ఇవ్వాలి’ అని. ఆయనకు అప్పటికి అరవై ఏళ్ళున్నాయనుకుంటాను. ఆయనకు మంచి హాస్య ప్రియత్వం ఉండేది. ఆ పిటిషన్ జస్టిస్ చెన్నకేశవ రెడ్డి గారి ముందుకు వచ్చింది. వాదారి వెంకట రమణయ్యను అమికస్క్యురి (ధర్మపీఠానికి సలహాదారు) గా నియమించారు. చివరికి పిటిషన్ కొట్టేశారు గాని చాల చర్చ జరిగింది..
వాళ్ళు నిజానికి ఎప్పుడూ జైలు జీవితాన్ని చూసి ఉండలేదు. వాళ్ళు జాతీయోద్యమంలో భాగం కారు. కాని ఇందిరా గాంధీ వారికి ఆ సదవకాశాన్ని ఇచ్చింది.జమాయత్ ఎ ఇస్లామ్ కార్యకర్తలను, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలను కూడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. భవానీ శంకర్ అని ఒక కుర్రవాడుండేవాడు. అతని రిట్ పిటిషనే నా ఆఖరి రిట్ పిటిషన్. ఆ కుర్రవాడికి అప్పటికి పదిహేనేళ్ళో, పదహారేళ్ళో. ఆ తర్వాత భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకుడయ్యాడు. ఆ రోజు నేను జస్టిస్ సాంబశివరావు, జస్టిస్ గంగాధరరావు కోర్టులో ఏదో కేసు వాదించి వస్తున్నాను. హెబియస్ కార్పస్ కేసనుకుంటాను వాదించి బైటకి వచ్చి సిగరెట్ తాగుతూ నిలబడ్డాను. అప్పుడే ఆంతరంగిక భద్రతా చట్టం సరైనదేనని చెపుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వచ్చింది. ఈ భవానీ శంకర్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. ‘‘మీ వకీలెవరు’’ అని జడ్జీలడిగితే ఆ కుర్రవాడు ‘‘కన్నబిరాన్’’ అని చెప్పాడు. జైల్లో చెప్పి పంపించి ఉంటారు. ఇక్కడికొచ్చి అదే పేరు చెప్పాడు. ‘కన్నబిరాన్ ఇప్పుడే బైటికి పోయాడుగదా, పిలవండి’ అన్నారు జడ్జీలు. జవాను బైటికొచ్చి పిలిస్తే నేను కోర్టు హాల్లోకి వెళ్ళాను. ఆ కుర్రవాడికి ఇంకా నూనూగు మీసాలు కూడా సరిగా లేవు. ‘ఈ పసి కుర్రవాడు ఈ దేశ ఆంతరంగిక భద్రతకు ప్రమాదంగా ఉన్నాడంటే, ఆ బోడి, పనికిమాలిన ఆంతరంగిక భద్రత అవసరమే లేదు’ అన్నాను నేను.
ఆ రోజులు ఎట్లా ఉండేవంటే, శంకరాచార్యుడు దేని గురించి చెప్పాడోగాని ‘నహినహిరక్షతి దుక్రిన్ కర్నె’ అన్నది అక్కడ వర్తించింది. అప్పుడే దుక్రిన్ కర్నె అని తెలిసింది. ఈ వ్యాకరణం, ఈ వాక్యనిర్మాణం, ఈ చట్టం ఏదీ పనిచేయడం లేదు అని అర్థమయింది. చాలా బట్టబయలుగా తెలిసింది. అప్పుడే ఓ సారి కె.వి.రమణారెడ్డిని కోర్టుకు తీసుకొచ్చారు. ఆయన విరసం నాయకుడు, వక్త. ఆయన ఒక మంచి ఉపన్యాసం చేశాడు. చివరికి ‘లాంగ్ లివ్ ఈవెన్ బూర్జువా డెమోక్రసీ’ (కనీసం బూర్జువా ప్రజాస్వామ్యమైనా సరే, వర్ధిల్లాలి) అని నినాదం ఇచ్చాడు.
ఈ రకమైన అక్రమ, చట్టవ్యతిరేక పద్ధతుల వల్ల ఎంతో మంది డిటెన్యూల కుటుంబాల ఆర్థిక జీవితం చిన్నాభిన్నమైపోయింది. వాళ్ళు ఆర్థికంగా చితికిపోయారు. పత్తిపాటి వెంకటేశ్వర్లు ఒక ఉదాహరణ. ఆయన అప్పుడప్పుడే పైకి వస్తున్న యువ న్యాయవాది. ఆయనను అక్రమంగా నిర్బంధించి లోపల పడేస్తే ఆయన కుటుంబం ఎట్లా గడుస్తుంది? సంపాదన ఎట్లా వీలవుతుంది? అంతేకాదు. కొందరిని అయితే విడుదల చేయగానే మళ్ళీ మరో కేసు పెట్టి అరెస్టు చేసేవారు.
ఒకసారి ఒక కేసులో నేను వాదించాను. ముక్కు సుబ్బారెడ్డి మీద కేసు కొట్టివేసి విడుదల చేశారు. మళ్ళీ నేను ఇంటికి వ్ళెసరికి సుబ్బారెడ్డి ఇంట్లో ఉన్నాడు. ‘ఏమి ఇట్లా వచ్చావు, ఇక్కడిక్కడ కనబడ్డావంటే మళ్ళీ అరెస్టు చేస్తారు. పరుగెత్తు’ అని పంపించాను. బుర్రా సుబ్బారాయుడు అని జనసంఘ్ నాయకుడుండేవాడు. ఆయనను కోర్టు వదిలేస్తే ఆయన అక్కడి నుంచి ఇంటికి చేరేలోపల మళ్ళీ అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో కూచోబెట్టారు.
ఆయనను మళ్ళీ కోర్టుకు తీసుకొస్తే ఆయన కోసం వాదించడానికి న్యాయవాదులు లేరు. ఆయన బాబుల్ రెడ్డి పేరు చెప్పాడు గాని బాబుల్ రెడ్డి కూడా వాదించడానికి సిద్ధంగా లేడు. ఆ కేసు కూడ నేనే తీసుకున్నాను.
సరే, భవానీ శంకర్ కేసు వచ్చింది.కేంద్ర ప్రభుత్వ ప్లీడర్ లేచి ‘‘అసలింక వాదన లేవీ అవసరం లేదండి. ఆంతరంగిక భద్రతా చట్టం సరైనదేనని సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. కనుక ఈ డిటెన్యూ డిటెన్షన్‌ను మీరు కన్ఫర్మ్ చేయొచ్చు’’ అన్నాడు. జడ్జీలు అడగకుండానే ఈ అభిప్రాయం చెప్పాడు. ‘‘నువ్వింకా జడ్డి కాలేదనుకుంటాను’’ అని నేను చురక వేశాను.ఆ రోజుల్లో ప్రతివాడు అధికారంలో ఉన్నవారి మెప్పు పొందడం కోసం ఇటువంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించేవాడు.
జస్టిస్ తోట లకహొయ్య గారు ఎమర్జెన్సీని పొగుడుతూ పెద్ద తీర్పు రాశారు. అట్లా రాస్తే సుప్రీం కోర్టుకు తీసుకుపోతారేమోనని ఆశ. జస్టిస్ టి.ఎల్.ఎన్.రెడ్డి జిల్లా జడ్జిగా ఉంటూ నంబియార్ కేసులో ఎమర్జెన్సీని పొగుడుతూ పెద్ద తీర్పు రాశారు. అంటే సామాజిక పరివర్తనలో నమ్మకం పెట్టుకోవలసిన మేధావి వర్గం ఏవో వ్యక్తిగత ప్రయోజనాలను, సౌకర్యాలను ఆశించి నిరంకుశాధికారాన్ని సమర్థించడం మొదలుపెట్టింది.ఇదంతా ఆ రోజుల్లో బహిరంగంగా, చూస్తే కనబడేటట్టుగా జరుగుతుండేది. అప్పుడు గార్గ్ ఇక్కడికి వచ్చారంటే సిపిఐ న్యాయవాదులు ఆయన చుట్టూ మూగుతుండేవారు. ఎక్కడో ఒకచోట జడ్జి పదవి రాకపోతుందా అన్నట్టుగా ప్రవర్తించే వారు. ‘వర్గ సమాజంలో న్యాయం వర్గ ప్రయోజనాలకు అతీతంగా ఉండదు’ అని ప్రగతి శీలంగా కనబడే నినాదాలు నాలుగు నేర్చుకుని అవి వల్లిస్తూపోతే చాలు. శ్రీమతి ఇందిరా గాంధీ అటువంటి వాతావరణం తయారుచేసి పెట్టారు. చట్టాన్ని వ్యాఖ్యానించడానికి, న్యాయాన్ని అమలు చేయడానికి వామపక్ష భావాలు గల ఒక జస్టిస్ చిన్నపరెడ్డిని, ఒక జస్టిస్ జీవన్ రెడ్డిని, ఒక జస్టిస్ కృష్ణ అయ్యర్‌ను, ఇట్లా ముగ్గురు నలుగురిని వేసుకున్నారు. రాజ్యాంగానికీ వామపక్ష, ప్రజానుకూల వ్యాఖ్యానం ఇవ్వబోతున్నాననే ఒక అభిప్రాయాన్ని కల్పించారు.
ఆ వ్యవహారంలో కూడా అంతర్గత ఘర్షణలు, విభేదాలు ఉన్నాయనుకోండి. అది వేరే కథ. ఆ రోజుల్లో జనసంఘ్ రంగారెడ్డి నాకు ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పారు. ఆయన చాలా మంచి సంభాషణా చతురుడు. ఎమర్జెన్సీలో నక్సలైట్ నాయకుడు నీలం రామచంద్రయ్యను పోలీసులు పట్టుకుని కాల్చిచంపారు. ఎన్కౌంటర్ కథ అల్లారు. నీలం రామచంద్రయ్య అంతకు ముందు శాసన మండలి సభ్యుడు గనుక శాసనసభా నాయకుడుగా జలగం వెంగళరావు సంతాప తీర్మానం ప్రతిపాదించారు. ‘‘చంపమని ఆదేశం ఇచ్చేది నువ్వే. మరణానికి సంతాపం ప్రకటించేది నువ్వేనా’’ అని రంగారెడ్డి అభ్యంతరం ప్రకటించారు. జైలు నుంచి కోర్టుకు వచ్చినప్పుడు ‘‘కన్నబిరాన్, నేను ఉత్తరం రాశాను. చంపేది వాళ్ళే. సంతాపం ప్రకటించేది వాళ్ళే నా అని రాశాను’’ అన్నారు.
అట్లాగే వి.రామారావు గారు నాకు దగ్గరి స్నేహితుడు. ఇప్పుడు సిక్కిం గవర్నర్ గా ఉన్నారు. ఆయన, అప్పటి సిపిఎం నాయకులు ఓంకార్ ఒక స్పెషల్ రిట్ పిటిషన్ వేశారు.
వాళ్ళిద్దరూ అప్పటికి ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యులు. ‘‘మేము శాసనమండలి లో పాల్గొనడం దేశ భద్రతకు ప్రమాదం కాదు. మేం ఎన్నికైన ప్రజా ప్రతినిధులము కాబట్టి మా వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లదు. మేం శాసనమండలికి హాజరు కావడం ప్రజా ప్రయోజనాల కొరకే’’ అని ఆ పిటిషన్. రెండు రోజులపాటు వాదించాను. జస్టిస్ ఆవుల సాంబశివరావు గారి బెంచి అది. ‘మరి ఎట్లా పంపించాలి’ అంటే ‘మీరు మీ భద్రతా సిబ్బందితో పంపించండి. శాసన మండలి సమావేశం అయిపోగానే జైల్లో పడేయండి’ అని వాదించాను.సరే, మామూలుగానే ఆ రిట్ పిటిషన్‌ను కూడ ఆమోదించలేదు. కొట్టేశారు. అయితే ఈ డిటెన్యూలందరికీ ఏదో ఒక కారణం మీద ఏదో ఒక పిటిషన్ వేసి కోర్టుకు రావాలని ఉండేది. కొన్ని గంటలపాటయినా బైట స్వేచ్ఛా వాయువులు పీల్చ వచ్చు. కొంత మందినయినా కలవవచ్చు అన్నట్టుండేది.
ఎం.వి.రామమూర్తి గారు వేసిన పిటిషన్ ఇంకా చిత్రమైనది.ఆయన ఏం చేసినాడంటే ఒక రిట్ పిటిషన్ వేసినాడు. ‘నా భార్యతో సంభోగించే హక్కు నాకుంది. ఎమర్జెన్సీ ఆ హక్కును తొలగించడం లేదు. కనుక నా హక్కును పరి రక్షించాలి’ అని. ‘నా భార్యను అప్పుడప్పుడైనా కలుసుకునే అవకాశం ఇవ్వాలి’ అని. ఆయనకు అప్పటికి అరవై ఏళ్ళున్నాయనుకుంటాను. ఆయనకు మంచి హాస్య ప్రియత్వం ఉండేది. ఆ పిటిషన్ జస్టిస్ చెన్నకేశవ రెడ్డి గారి ముందుకు వచ్చింది. వాదారి వెంకట రమణయ్యను అమికస్క్యురి (ధర్మపీఠానికి సలహాదారు) గా నియమించారు. చివరికి పిటిషన్ కొట్టేశారు గాని చాల చర్చ జరిగింది. నిజానికి రామమూర్తి గారితో నాకు పరిచయమయింది ఇటువంటి ఎమర్జెన్సీ కేసులతోనే. ఆయనతో భిన్నాభిప్రాయాలుండేవి గాని ఆయన చాలా స్నేహశీలి. సంభాషణా చతురుడు. మాకు బాగా సాన్నిహిత్యం ఏర్పడింది.
సరే, ఆ పిటిషన్ కొట్టివెయ్యడానికి న్యాయస్థానానికి కారణాలున్నాయి. సంభోగ హక్కు అనేది వ్యక్తిగత హక్కు. దాన్ని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రభుత్వం శోభనం జరిపే బాధ్యత తీసుకోదు గదా! ఇట్లా ఏదో ఒక అంశం మీద డిటెన్యూలు కోర్టుకు రావడం మొదలుపెట్టే సరికి కోర్టులు రాజకీయవాదుల సమావేశ స్థలాలయ్యాయి. బైట రాజకీయ చర్చలకు అవకాశం లేదు కాబట్టి కోర్టులలోనే రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. కోర్టు హాళ్ళలోకి పెద్ద ఎత్తున జనం వస్తుండేవారు. నేను ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకు వెళుతుంటే నా వెంట జనం గుంపుగా వచ్చేవాళ్ళు. ఏదో ఒక బెంచి ముందర అట్లా ఎమర్జెన్సీ డిటెన్యూల తరఫున పిటిషన్లు వేస్తూ వాళ్ళు వేసిన పిటిషన్ల మీద వాదిస్తూ ఉండేవాడ్ని.
-కె.జి. కన్నబిరాన్
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్