ఎమర్జెన్సీ-7

“మనం 1950లో రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నప్పటి నుంచి, మన పాలనా నిర్మాణాలను, రాజ్యాంగ బద్ధంగా కాక పార్టీ బలం పెంపొందించుకోవడానికి పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవడానికి వాడుకుంటున్నాం. రాజ్యాంగం ప్రకారం ప్రజల కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు, ప్రజా సంక్షేమం కొరకు పనిచేయవలసిన పాలక నిర్మాణాలన్నీ అధికారంలో ఉన్న పార్టీ కోసం పనిచేయడం మొదలయింది. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీయే మళ్ళీ గెలవడానికి ఏమి చేయాలని పాలనా నిర్మాణాలు ఆలోచిస్తున్నాయి.”

జస్టిస్‌ ‌భగవతి గారి సంగతే చూడండి. ఆయనకు ఇప్పుడు హఠాత్తుగా రాజ్యాంగం లోని 21వ అధికరణంలో కొత్తకోణాలు కనబడడం మొదలయింది. ఎమర్జెన్సీని సమర్థిస్తూ తీర్పు రాసినప్పుడు అదే రాజ్యాంగ అధికరణంలో కనబడనివన్నీ ఇప్పుడు కనబడ్డాయి. అపసవ్యమైన చట్టం అంటే ఏమిటి అని ప్రశ్నించి అపసవ్యమైన విచారణ జరిగితే అది చట్టపరమైన విచారణ కానట్టే అని చెప్పడం, అధికరణం 14 ప్రకారం నిరంకుశ పాలనకు అవకాశం ఉందని, అది కేవలం వర్గ, సామాజిక న్యాయాన్ని సాధించేది కాదని చెప్పడం-అంటే రాజ్యాంగాన్ని కొత్తగా చూసే వైఖరి మొదలయింది. అవే విషయాలు అంతకు ముందు కనబడలేదు.
క్రమంగా సమానత్వ భావన రాజ్యాంగం నిండా అంతటా పరచుకుని ఉందని గుర్తించారు. అంటే నిబద్ధ న్యాయవ్యవస్థ నుంచి క్రియాశీల న్యాయవ్యవస్థ దాకా ప్రయాణం సాగిందన్న మాట.దీనివల్ల ప్రజలకు జరిగిన మేలేమీ లేదు. ఆ న్యాయమూర్తులకు దండిగా వ్యాసాలు రాసుకునే అవకాశం వచ్చింది. తమను తాము మేమంత చెడ్డవాళ్ళం కాదులే అని ఓదార్చుకుంటున్న పద్ధతిలో రాసుకున్నారు. ఏం జేశారంటే, సునీల్‌ ‌బాత్రా కేసు నుంచి ఆటో శంకర్‌ ‌కేసు దాకా ఈ న్యాయ మూర్తులు న్యాయసూత్రాలు, నీతి వచనాలు వల్లించిందంతా రౌడీలు , గూండాలు, సంఘ వ్యతిరేక శక్తుల విషయంలోనే.

అందువల్లనే నేను ఒక వ్యాసంలో రాశాను. సుప్రీం కోర్టు 1978 తర్వాత దగాకోరుల భజన ప్రారంభించింది అని. ఎందుకంటే ఒక తమాషా అయిన విషయం ఉంది. స్వేచ్ఛ గురించి, హక్కుల గురించి గంభీరమైన తీర్పులు వెలువడినప్పుడల్లా అవి బైట ఉండే మామూలు ప్రజల స్వేచ్ఛ గురించి కాదు. జైలు లోపల ఉండవలసిన వాళ్ళ స్వేచ్ఛ గురించి. అదీ ఎమర్జెన్సీ తర్వాత. ఎమర్జెన్సీ అనుభవం నుంచి మనం గ్రహించవలసిన పెద్ద పాఠమేమంటే ఒక సమాజంలోని పాలనా వ్యవస్థలను, నిర్మాణాలను, అధికార యంత్రాంగాలను అధికారంలో ఉన్నవాళ్ళు స్వప్రయోజనాలకు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఆ దుర్వినియోగం జరగకుండా ప్రజలు, ప్రజా చైతన్యం నిరంతర జాగరూకతతో ఉండాలి. ఆ ప్రజా చైతన్యానికి పూర్తి అవకాశం కల్పించాలి. ఎందుకంటే, ఎటువంటి సమాజానికైనా పాలనా వ్యవస్థలు, నిర్మాణాలు, అధికార యంత్రాంగాలు అవసరం. అది రాచరికం కావచ్చు, బూర్జువా ప్రజాస్వామ్యం కావచ్చు. సోషలిజం కావచ్చు. నియంతృత్వం కావచ్చు – కొన్ని నిర్మాణాల మీద ఆధారపడి ఉండక తప్పదు. ఆ నిర్మాణాలు చాల ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి.ఆ నిర్మాణాలను సాధారణంగా రాజ్యాంగం నిర్దేశిస్తుంది. లేదా ఆ నిర్మాణాల పనితీరును రాజ్యాంగపు విలువలు నిర్దేశిస్తాయి. అందువల్ల పాలన, అధికారం అనేవి రాగద్వేషాలకతీతంగా తటస్థంగా తయారవుతాయి. అదే సమయంలో అవి మానవీయంగా కూడ కావాలి.

మనం 1950లో రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నప్పటి నుంచి, మన పాలనా నిర్మాణాలను, రాజ్యాంగ బద్ధంగా కాక పార్టీ బలం పెంపొందించుకోవడానికి పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవడానికి వాడుకుంటున్నాం. రాజ్యాంగం ప్రకారం ప్రజల కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు, ప్రజా సంక్షేమం కొరకు పనిచేయవలసిన పాలక నిర్మాణాలన్నీ అధికారంలో ఉన్న పార్టీ కోసం పనిచేయడం మొదలయింది. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీయే మళ్ళీ గెలవడానికి ఏమి చేయాలని పాలనా నిర్మాణాలు ఆలోచిస్తున్నాయి. ఈ దృక్పథం వల్ల పాలనా నిర్మాణాలన్నిటినీ పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత ఒకటిగా లోలోపలి నుంచి తొలిచేస్తూ వచ్చారు. ఒక్కసారే దాడి చేసి ఆ నిర్మాణాలను ధ్వంసం చెయ్యలేదు. క్రమక్రమంగా అవి పనికి రాకుండా అయ్యేలా చేశారు. బలహీనం చేశారు. ఏమవుతుందిలే, ఏమీ కాదు అనే పద్ధతిలో అప్పుడొక అధికరణం మార్చడం, అప్పుడొక చట్టాన్ని ప్రవేశపెట్టడం, అప్పుడొక జడ్జీని తనకు కావలసిన వాళ్ళను వేసుకోవడం-ఈ మాదిరి జరిగిపోయింది. ఈ ఒక్క చర్య వల్ల ఏమవుతుందిలే అని ఆలోచనాపరులు కూడ అనుకున్నారు. ఈ చర్యలన్నీ కలిసి కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు తిరిగే సరికల్లా మన పాలనా నిర్మాణాలన్నీ ధ్వంసమైపోయాయి.

మొత్తానికి రాముల వారి పాల సామెత లాగ ప్రతి ఒక్కరూ ఇటువంటి పనే చేస్తూ పోయారు. అందరూ నీళ్లు పోసి, ఎవరూ పాలు పోయని మాదిరి అయిపోయింది. కమ్యూనిస్టులను అధికారంలోకి రానివ్వగూడదనే ఉద్దేశ్యం ఉంటే వాళ్ళ విధానాలను వివరించి ఓడించాలి గాని సంస్థలను, నిర్మాణాలను వాడుకుని బలప్రదర్శన చేస్తే చివరికి రాజ్యాంగం ధ్వంసమై పోతుంది. సోషలిస్టు, కమ్యూనిస్టు రాజ్యాంగమైనా సరే, ప్రత్యర్థులను బలప్రయోగం ద్వారా ఓడించడానికి రాజ్యాంగ సంస్థలను వాడుకోవచ్చు ననుకుంటే రాజ్యాంగమే బలహీన పడుతుంది. అసలు ఈ సమస్య ఎందుకొస్తుందంటే సంస్థలను, నిర్మాణాలను అధికారానికీ, సంపదకూ వనరులుగా చూడడం వల్ల వస్తుంది.అందువల్ల ఆర్థిక పరిస్థితి క్షీణించినప్పుడు దానికి ఆరోగ్యకరమైన ప్రతిస్పందనగా నిర్మాణాలను బలపరచవలసి ఉంటుంది. కాని నిర్మాణాలను దెబ్బతీసి ఆ సమస్య నుంచి గట్టెక్కాలనుకుంటే సమస్య వస్తుంది.

స్వతంత్ర భారతంలో, రాజ్యాంగం తర్వాత మొదటిసారి ప్రివెంటివ్‌ ‌డిటెన్షన్‌ ‌చట్టం- కారణాలు చూపకుండా ఒక వ్యక్తిని నిర్బంధించే చట్టం – ప్రవేశ పెడుతున్నప్పుడు జవహర్లాల్‌ ‌నెహ్రూ దాన్ని సమర్థించాడు. చీకటి బజారు వ్యాపారస్తులను ఒక్కొక్కరినీ ఒక్కొక్క దీపస్తంభానికి ఉరితీయాలన్నాడు. ఆ చట్టం అందుకోసమేనన్నాడు. అయితే ప్రివెంటివ్‌ ‌డిటెన్షన్‌ ‌చట్టం కింద మొట్టమొదలు అరెస్టు చేసిందెవరిని? కమ్యూనిస్టు నాయకులు ఎకె గోపాలన్ను, కృష్ణన్ ను ..! ఆ సమయంలో న్యాయవ్యవస్థ ఒక తప్పుడు అవగాహన ప్రకటించింది. భారత పార్లమెంటుకు, బ్రిటిష్‌ ‌పార్లమెంట్‌ ‌లాగే, సర్వాధికారాలున్నాయని ప్రకటించింది. ఆ అవగాహనను సరిదిద్దుకోవడానికి దేశంలో ప్రగతిశీల రాజకీయ పక్షాలేవీ తోడ్పడలేదు గాని అభివృద్ధి నిరోధక పార్టీలే తోడ్పడ్డాయి. ‘సార్వభౌమాధికారం’ అనేది ప్రజలది మాత్రమే. అది రాజ్యాంగంలో ఉంది. అంతే తప్ప పార్లమెంటుకు ఆ అధికారం లేదు, అని వాళ్ళు చెపితే మనం తెలుసుకోవలసి వచ్చింది.

బ్రిటన్ లో పార్లమెంటుకు అటువంటి సర్వాధికారాలుండేవి. రాజు నిరంకుశత్వాన్ని వ్యతిరేకించడానికి పార్లమెంటుకు నిరంకుశాధికారాలిచ్చారు. అయితే పతంజలి శాస్త్రి లాంటి మేధావి అయిన న్యాయమూర్తి ఒక మాట మనందరమూ గుర్తుంచుకోవాలి అని చెప్పాడు. ఈ రాజ్యాంగం ఒకరు నడిపేది కాదు. పలు రాజకీయ పక్షాలు పదవికి వచ్చి రాజ్యాంగాన్ని నడుపుతాయి తప్ప దాన్ని ఒక రాజకీయ పార్టీ కొరకు వక్రీకరించగూడదు అన్నాడు. మనదేశంలో మత రాజకీయాలు లేవుగాని మొదటి నుంచీ రాజకీయాలు బిజెపి పద్ధతిలోనే జరిగాయి. కొంత ఉదారవాదం, ఒక రకమైన లౌకిక వాదం, ఇదే రాజకీయంగా చలామణీ అయింది. క్రమంగా దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దానికి కోర్టులే బాధ్యత వహించాలన్నట్టు కోర్టులను నిందించడం మొదలయింది. తప్పులన్నిటినీ కోర్టుల మీద నెట్టారు. ఒకరకమైన ప్రజాకర్షక రాజకీయాలు మొదలయ్యాయి.

ప్రజాకర్షక రాజకీయాలు చలామణీ కావాలంటే నిరంకుశాధికారం కావలసిందే. అందువల్లనే 1964లో బాహ్య ఎమర్జెన్సీ వచ్చింది. 1975 లో ఆంతరంగిక ఎమర్జెన్సీ వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌ ‌లో 1968 నుంచే భయానక పరిస్థితులున్నాయి. ఎవరిని ఎప్పుడు ఎత్తుకు పోతారో తెలియని స్థితి వచ్చింది. రాజకీయ హత్యలు సాధారణ పాలనా పద్ధతిగా మారిపోయాయి. ఎమర్జెన్సీలో రాష్ట్రంలో 70 మందికి పైగా బూటకపు ఎన్కౌంటర్లలో కాల్చివేయ బడ్డారు. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే దేశంలో ప్రజాస్వామిక చైతన్యం విస్తృతంగా పెల్లుబికింది. చాలా మందికి ఈ దేశం ప్రజాస్వామిక దేశమని గుర్తు వచ్చింది. ఎన్కౌంటర్‌ ‌హత్యల వంటివి జరగకుండా ఆపడం ఎట్లా అని చాలామంది ఆలోచించడం మొదలు పెట్టారు. చాలా సమావేశాలు జరిగాయి. అయితే ఈ ప్రభావం ఎన్నికల మీద పెద్దగా లేదు. ఇప్పుడు గుజరాత్‌ ‌లో మోడీ తిరిగి గెలిచినట్టుగానే వెంగళరావు కూడా తిరిగి గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజుల్లో ఎమర్జెన్సీ అత్యాచారాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక విలువల కోసం చాలా సమావేశాలు జరిగేవని చెప్పాను గదా, వాటిలో ఒక సమావేశం గురించి ప్రత్యేకంగా చెప్పాలి.
-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

emergency 7prajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment