ఎల్లెనా బాద్‌ ఉప ఎన్నిక ఫలితం దేనికి సంకేతం..?

ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమమం దేశంలో నెలకొన్న మోడీ ప్రభుత్వానికి (ఫాసిజం) వ్యతిరేకంగా జరుగుతున్నా పోరాటంగా అభివర్ణించిన వాళ్ళు హర్యానా ఎల్లెనాబాద్‌ ఉపఎన్నికలను పరిశీలించి గుణపాఠాన్ని తీసుకోవలసి వుంది. ఈ ఉపఎన్నికలలో బీజేపీకి డిపాజిట్‌ ‌దక్కకుండా చేయాలనీ నిరసనలో ఉన్న రైతు సంఘాలు ప్రయత్నించి విఫలం అయ్యాయి. అసలు  హర్యానా ఎల్లెనాబాద్‌  ఎన్నికలు ఎందుకు కీలకమో పరిశీలిద్దాం.

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతు సంఘాలు, హర్యానాలోని ఎల్లెనాబాద్‌ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార బీజేపీని చావు  దెబ్బకొట్టాలనే లక్ష్యంతో ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసాయి. ఎల్లెనాబాద్‌ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో బిజెపి-జెజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా గోవింద్‌ ‌కందా నిలబడితే ఆయనకు  వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి బికెయుకి చెందిన రాకేష్‌ ‌టికైత్‌తో సహా పలువురు రైతు సంఘాల నాయకులు హర్యానాలోని సిర్సా జిల్లాలో మకాం వేశారు.

బిజెపి-జెజెపి నాయకులపై జరుగుతున్న ప్రచారంలో భాగంగా  కొన్ని రైతు సంఘాలు పలు నిరసనలు ఇక్కడ స్థానికంగా చేపట్టారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై  నిరసన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలకి పంజాబ్‌ ఎన్నికలకి ముందు వచ్చిన ఈ ఉప ఎన్నికలు చాలా ముఖ్యమైనవిగా కనిపించాయి. అందుకే ఎల్లెనాబాద్‌ ‌నియోజక వర్గంలో బీజేపీకి చావు దెబ్బ కొట్టాలనే  లక్ష్యంతో గట్టి ప్రయత్నం చేసాయి. అయితే సఫలం కాలేకపోయాయి.

ఎల్లెనాబాద్‌ ఉప ఎన్నికలు రైతు సంఘాలకి ఎందుకు  కీలకం  అయ్యాయి..?
ఇండియన్‌ ‌నేషనల్‌ ‌లోక్‌ ‌దళ్‌ ‌పార్టీకి చెందిన ఏకైక శాసనసభ్యుడిగా ఉన్న అభయ్‌ ‌చౌతాలా, రైతులకు మద్దతుగా మ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఎల్లెనాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ పరపతిని పెంచుకునేందుకు, రైతు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు అభయ్‌ ‌చౌతాలా ఈ చర్యకి పాల్పడ్డారు అని రాజకీయ వర్గాలు భావించాయి. మళ్లీ పోటీలో నిలబడిన అభయ్‌ ‌చౌతాలా, ప్రచారం సమయంలో, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గట్టి ప్రచారం చేసారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఎల్లినాబాద్‌ ‌నియోజకవర్గం ప్రధానంగా గ్రామీణ ప్రాంతం, జనాభాలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడిన వారు.

ఈ నియోజక వర్గంలో బీజేపీ అసమ్మతి నాయకుడు పవన్‌ ‌బేనీవాల్‌ను కాంగ్రెస్‌ ‌రంగంలోకి దింపి నిత్యావసరాల ధరలు పెరుగుదల,  వ్యవసాయ చట్టాలపై నిరసన తెలుపుతూ ఉపఎన్నికల్లో ప్రచారం కొనసాగించింది.
హర్యానా లోక్‌ ‌హిత్‌ ‌పార్టీ ఏకైక ఎమ్మెల్యే గోపాల్‌ ‌కందా సోదరుడు, గోవింద్‌ ‌కందా ఈ ఏడాది అక్టోబర్‌ 5‌న బీజేపీలో చేరారు. ఇతనిని బీజేపీ హర్యానా అధికార కూటమిలో భాగస్వామి అయిన జననాయక్‌ ‌జనతా పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఎల్లెనాబాద్‌ ఉపఎన్నికలలో నిలిపారు. గోపాల్‌ ‌కందా సిర్సా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో అన్నదమ్ములకు గట్టి  మద్దతు ఉన్నది.  అయితే, ఉప ఎన్నిక ప్రకటించిన వెంటనే, నిరసనలో వున్నా రైతు సంఘాలు బిజెపికి వ్యతిరేకంగా వోటు వేయాలని పిలుపుని ఇచ్చాయి.

రైతు సంఘాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకం అని ఎందుకు అనుకున్నాయి అంటే 11 నెలల క్రితం రైతుల ఆందోళన ప్రారంభమైన తర్వాత హర్యానాలో జరుగుతున్నా మొదటి ఎన్నికలు ఇవే. ఉపఎన్నికలు అయినప్పటికీ ఇవి కీలకం. ఎందుకంటే హర్యానా ఇటీవల కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నా రైతు  ఆందోళనలకు కేంద్రంగా వుంది. ఇప్పుడు, ఎల్లెనాబాద్‌ ‌నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక ఫలితాలు కీలకం. ఎందుకంటే ఇవి   కొనసాగుతున్న ఆందోళనలు ఎన్నికల రాజకీయాలపై ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయి అనే దానికి రెఫరెండంగా పరిణమించాయి. ఎల్లెనాబాద్‌లో బీజేపీ అభ్యర్థిని భారీ  మెజార్టీతో ఓడించడంలో విజయం సాధించినట్లయితే, అది ఈ ప్రాంతంలో గాలి వీస్తున్న దిశను ప్రతిబింబించే అంశం అవుతుంది అని  రైతు సంఘాలు భావించాయి. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు ఈ ఉపఎన్నిక వచ్చింది. హర్యానాలో అధికార బిజెపి జరుగుతున్నా ఆందోళనకు పిడికెడు మంది ప్రజల మద్దతు ఉందని ప్రచారం చేసింది. మరోవైపు వేలాది మంది రైతులు మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చినప్పుడు ప్రభుత్వం తన నిర్ణయాలను పునరాలోచించవలసిందిగా రైతు సంఘాలు ఒత్తిడి చేసాయి. అందుకే ఎల్లెనాబాద్‌ ఉపఎన్నికలు చాలా కీలకంగా పరిణమించాయి.

జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టాలని రైతు సంఘాలు లక్ష్యంగా పెట్టుకున్నా నిరాశ మిగిలింది.  ఎల్లెనాబాద్‌ ఉపఎన్నికల్లో రైతు సంఘాల నాయకులూ అధికారికంగా ఏ పార్టీ వైపు మొగ్గు చూపలేదు అయితే బీజేపీ అభ్యర్థికి ఓటు వేయవద్దని పట్టుబడుతు తీవ్రంగా ప్రచారం చేసారు. తమ ఉనికిని చాటుకునేందుకు ఎల్లెనాబాద్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో రైతు సంఘాలు తీవ్ర నిరసనలు చేపట్టారు. బీకెయు నాయకుడు గుర్నామ్‌ ‌సింగ్‌ ‌చదుని ఒక రోజులో నాలుగు బహిరంగ సభలలో ప్రసంగించే వారు . ఎలా అయినా బీజేపీని ఓడించాలని రైతు సంఘాలు తీవ్ర ప్రయత్నం చేసి బీజేపీ ని చావు దెబ్బ తీయాలి అని ప్రయత్నం చేసారు. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవాలి అని తీవ్ర ప్రయత్నం చేసింది. రైతు సంఘాల ఆందోళన వెనుక రాజకీయ కారణాలు వున్నాయి అని, ఢిల్లీ శివారుల్లో జరుగుతున్నా నిరసనలు కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టుల మద్దతుతో కూడుకున్నదని బీజేపీ నేతలు ఉపఎన్నికలలో ప్రచారం చేసారు. నిరసనలో ఉన్న రైతు సంఘాలు బీజేపీ అభ్యర్ధికి కనీసం డిపాజిట్‌ ‌దక్కకుండా చేయాలి అని సర్వశక్తులు పెట్టి ప్రచారం చేసారు. ఇలాంటి పరిస్థితిలో బీజేపీ గెలుపు కాకపోయినా అతి తక్కువ ఓట్లతో ఓడిపోవటం కూడా గెలుపే అవుతుంది అని బీజేపీ భావించి ఎల్లెనాబాద్‌ ఉప  ఎన్నికలను ప్రతిష్టాత్మక అంశం అన్నట్టు బీజేపీ తీసుకుంది.

ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి..

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజీనామా చేసి ఉపఎన్నికలకు కారకుడు అయిన ఇండియన్‌ ‌నేషనల్‌ ‌లోక్‌ ‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డి) అభ్యర్థి అభయ్‌ ‌సింగ్‌ ‌చౌతాలా ఎల్లెనాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్ళీ గెలిచారు. అయితే  బిజెపి అభ్యర్థి అయిన గోవింద్‌ ‌కందాపై కేవలం 6,700 ఓట్ల తేడాతో మాత్రమే విజయం సాధించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నా రైతుల ఉద్యమం నేపథ్యంలో, ఆ అంశం మీదే జరిగిన హర్యానా ఉపఎన్నికల్లో  బీజేపీ డిపాజిట్‌ ‌కోల్పోతుందని రాజకీయ వర్గాలలోని కొందరు ఊహాగానాలు చేశారు. అలాగే రైతు సంఘాల నాయకులూ బీజేపీకి డిపాజిట్‌ ‌దక్కకుండా చేద్దాం అనుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వేరుగా వచ్చాయి. బీజేపీ ఎల్లెనాబాద్‌  ఉప ఎన్నికల్లో వోట్లు పెంచుకుని స్వల్ప తేడాతో ఓడిపోయింది. కాంగ్రెస్‌ ‌పార్టీ  డిపాజిట్‌ ‌కోల్పోయింది.

ఒక పక్క రైతు ఉద్యమం జరుగుతున్నా ఎల్లెనాబాద్‌ ‌వ్యవసాయ ఆధారిత ప్రజలు మరింత ఎక్కువగా బీజేపీ దగ్గర అయ్యారు. బీజేపీకి అనుకూలంగా వోట్లు వేశారు. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమమం దేశంలో నెలకొన్న మోడీ ప్రభుత్వానికి (ఫాసిజం) వ్యతిరేకంగా జరుగుతున్నా పోరాటంగా అభివర్ణించిన వాళ్ళు పునరాలోచన చేసుకోవలసిన అవసరం వుంది అని ఎల్లెనాబాద్‌ ఉపఎన్నికల ఫలితాలు ఒక రుజువుగా నిలుస్తున్నాయి.

అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ
prajatantra newsTelangana news updatestelugu short newstelugu vaarthalutoday breaking updates
Comments (0)
Add Comment