ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు.. అందరిదృష్టి బెంగాల్‌ ‌పైనే

ఐదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్నప్పటికీ దేశ ప్రజలందరి దృష్టి మాత్రం పశ్చిమ బెంగాల్‌పైనే ఉంది. బెంగాల్‌ ‌టైగర్‌గా, పవర్‌ఫుల్‌ ‌లేడీగా పేరున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న గర్జనలు అక్కడ జరిగే ఎన్నికలపైన ఏమేరకు ప్రభావాన్ని చూపుతాయన్నదే ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న పశ్చిమబెంగాల్‌ ‌రాష్ట్రంలో ఆపార్టీని మట్టికరిపించిన బెబ్బులిగా ఆమెకు పేరుంది. గడచిన పదేళ్ళుగా తిరుగులేని అధికారంతో పాలనచేస్తున్న మమత ఈఎన్నికల్లో మాత్రం తీవ్ర వొత్తిడిని ఎదుర్కోవాల్సి వొస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ తమ కాషాయ జంఢాను ఎగురవేసే లక్ష్యంతో ముందుకు పోతున్న భారతీయ జనతాపార్టీ ఈ రాష్ట్రాన్ని తమ హస్తగతం చేసుకునేందుకు అనేక ఎత్తుగడలు వేస్తున్నది. ముఖ్యంగా మమత బెనర్జీ పార్టీ అయిన తృణముల్‌ ‌కాంగ్రెస్‌ను బలహీనపర్చడం ద్వారా విజయాన్ని సాధించవొచ్చన్న చాణక్య నీతిని బిజెపి ఇక్కడ అమలు పర్చింది. ఇప్పటికే తృణముల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎంఎల్‌ఏలు ఆ పార్టీని వీడి బిజెపి కండువ కప్పుకునే విధంగా చాలా చక్కగా పావులు కదపడంలో బిజెపి ఒక విధంగా విజయవంతమైంది. గతంలో అధిక ఎంపీ స్థానాలను గెలుచుకున్న బిజెపి అదే ఉత్సాహంతో ఇక్కడ ముందుకు దూసుకుపోతున్నది. అందులో భాగంగా తృణముల్‌ను ఎన్ని విధాలుగా దెబ్బతీయాలో అన్ని విధాలుగా ఆ పార్టీ వొత్తిడి తీసుకువొస్తున్నది బిజెపి.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వొచ్చినప్పటి నుండి బెంగాల్‌ ‌సిఎం మమత బెనర్జీకి ఉప్పులో నిప్పులా తయ్యారైంది. కేంద్రం చేసే చట్టాలు, చేపడుతున్న విధానాలపై ఆమె నిరంతరం విరుచుకు పడుతూనే ఉంది. దానికి తగినట్లు దేశంలో తనతో కలిసి వొచ్చే రాష్ట్రాలు, పార్టీల సమష్టి నాయకత్వంలో బిజెపియేతర ఫ్రంట్‌ను ఏర్పాటుచేసే ఆలోచనలో ఆమె ఉన్నట్లు అప్పట్లో దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగింది. అప్పటినుండి బిజెపి, తృణముల్‌ ‌కాంగ్రెస్‌ ‌మధ్య మరింత దూరం పెరిగింది. ఈ క్రమంలో తాజాగా ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు ఇరుపార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. పదేళ్ళ తృణముల్‌ ‌ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు బిజెపి శక్తిమేర కృషి చేస్తుంది. అందులో భాగంగా మమతకు అత్యంత సన్నిహితుడు, తృణముల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో కీలకనేతగా కొనసాగుతున్న సువేంద్‌ అధికారిని చాకచక్యంగా తమపార్టీలోకి ఆహ్వానించడం ద్వారా మమతను బిజెపి దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ సంఘటన ఆమెను మానసికంగా దెబ్బతీస్తే, ప్రచార కార్యక్రమంలో తనపై బౌతికంగా దాడిచేసిందని దెబ్బతిన్న బెబ్బులిలా ఆమె బిజెపిపై తీవ్రంగా విమర్శలు చేశారు.

తనను చంపేందుకు కుట్ర జరుగుతున్నదన్న తీవ్రతరమైన ఆరోపణలు కూడా చేశారామె. అయితే ఈ దాడికి తమ పార్టీ కారణం కాదని చెబుతున్న బిజెపి, మమత పోటీచేస్తున్న నందిగ్రామ్‌ ‌శాసనసభ నియోజకవర్గం నుండి నిన్నటి వరకు ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉన్న సువేంద్‌ అధికారిని తమ అభ్యర్థిగా నిలబెట్టి మమతకు మరో సవాల్‌ ‌విసిరింది. ఇదామెకిప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది. నిన్నటివరకు తృణముల్‌ ‌కాంగ్రెస్‌లో ఉన్న సువేంద్‌ అధికారికి నందిగ్రామ్తో విడదీయరాని అనుబంధముంది. ఆ నియోజకవర్గ నుండి ఆయన శాసన సభ్యుడిగా గెలువటమే కాకుండా, కమ్యూనిష్టు ప్రభుత్వ కాలంలో జరిగిన భూపోరాటాల్లో ఆయన కీలక పాత్ర వహించిన వ్యక్తి కూడా కావటంతో ఆయన్ను ఎదుర్కోవటం తృణముల్‌ ‌కాంగ్రెస్‌లో మరే నాయకుడికి సాధ్యపడేదికాదు. అందుకే తన నియోజక వర్గాన్ని వొదిలి స్వయంగా తానే అక్కడినుండి పోటీ చేసి సువేంద్‌ అధికారిని ఎదుర్కోవడానికి మమత సిద్ధపడింది. తానింతకాలం సువేంద్‌ అధికారిని, ఆయన కుటుంబాన్ని గుడ్డిగా నమ్మినందుకు బహిరంగంగానే తనను తాను గాడిదతో పోల్చుకుంది.

కాగా వశ్చిమ బెంగాల్‌ల్లో ఎనిమిది విడుతలుగా జరుగనున్న ఎన్నికలు మార్చ్ 27‌న ప్రారంభం కానుండగా ఇరు పార్టీలు విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో మునిగిపోయాయి. బిజెపి పక్షాన ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాలు విడుతల వారీగా ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో మమతపై అనేక వ్యంగ్యాస్త్రాలను వొదిలారు. పదేళ్ళ టిఎంసి పాలనకు ఇక చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని, ఇప్పటివరకు అవినీతి పాలన సాగిందని, ఇకనుండి అభివృద్ధి పాలన సాగుతుందంటూ మోదీ బెంగాల్‌ ‌ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టిఎంసి అంటే ట్రాన్స్ ‌ఫర్‌ ‌మై కమీషన్‌(‌నా కమీషన్‌ను బదిలీ చేయండి) అని మోదీ అర్థం చెప్పుకొచ్చాడు. ఆమె చాలా అసహనానికి గురవుతున్నదంటూ తృణముల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులు మోదీపై వేసిన ఓ వ్యంగ్య చిత్రంపై మాట్లాడుతూ ‘‘దీదీ.. మీరు నాతల పై కాలుపెట్టి నా తలను తన్నవచ్చు.

కాని, బెంగాలీల కలలను మాత్రం చిదిమేయలేరం’’టూ తన ముఖం కూడా చూడాలనిపించడం లేదన్న మమత మాటలకు ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ ముఖ్యంగాని ముఖం కాదని సమాధానమిచ్చాడు. అలాగే మమత కూడా బిజెపి అధికారంలోకి వొస్తే ప్రజాహక్కులు రద్దవుతాయని, తిరోగమనమే ఉంటుందంటూ, ఇటీవల కేంద్రం పెంచిన డిజీల్‌, ‌పెట్రోల్‌, ‌గ్యాస్‌ ‌ఛార్జీలను ఎత్తిచూపుతున్నారు. కాగా కేంద్రం రూపొందించిన మూడు అగ్రి చట్టాలను నిరసిస్తూ నెల రోజులకు పైగా దిల్లీ రోడ్లపై ఆందోళన వ్యక్తంచేస్తున్న రైతు నాయకుడు, సంయుక్త కిసాన్‌ ‌మోర్చ కన్వీనర్‌ ‌రాకేశ్‌ ‌తికాయత్‌ ‌మద్ధతు ఆమెకు లభించింది. అలాగే బిజెపి సీనియర్‌ ‌నాయకుడు యశ్వంత్‌ ‌సిన్హా టిఎంసిలో చేరడంతో పాటుగా జార?ండ్‌ ‌ముక్తిమోర్చ, శివసేన, ఎన్‌సిపి, ఆర్‌జెడి, ఎస్పీ పార్టీల అధినాయకులంతా మమతకు తమ మద్ధతును తెలిపారు. దీంతో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలపై అత్యంత ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఒక విధంగా ఈ ఎన్నికలు దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో ప్రజలందరి దృష్టి కూడా పశ్చిమ బెంగాల్‌పైనే ఉంది.

Bengal Chief Minister Mamata BanerjeeBengal ‌CM Mamata BanerjeeBengal Tiger' and 'Powerful Lady
Comments (0)
Add Comment