ఇడి సమన్లు కాంగ్రెస్‌కు ప్లస్సా, మైనస్సా

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టర్‌ ‌నోటీసులు జారీచేయడం, రాహుల్‌గాంధీ రెండు రోజులుగా ఇడి ఎదుట హాజరు కావడం, అందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసన వ్యక్తంచేస్తున్నతీరు చూస్తుంటే కొంతకాలంగా స్థబ్దతగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీని కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం కావాలని తట్టిలేపినట్లు అనిపిస్తోంది. నేటికి పదేళ్ళ కింద నామోదు అయిన కేసుకు సంబంధించి ఇడి తాజాగా వారిని స్వయంగా హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచేసింది. అయితే ఆనారోగ్య కారణాల దృష్ట్యా సోనియగాంధీ హాస్పిటల్‌ ‌లో చికిత్స పొందుతూ, తనకు మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరింది. రాహుల్‌ ‌గాంధీ మాత్రం వరుసగా సోమ, మంగళవారాలు ఇడి కార్యాలయంలో వారి అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇదే బిజెపి ప్రభుత్వంలో నరేంద్రమోదీ మొదటిసారిగా ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడే సుప్రీంకోర్టు ఇందులో ఎలాంటి అవినీతి జరుగలేదని తీర్పు చెప్పినప్పటికీ, కేవలం కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలంతో ఇడి నోటీసులు జారీచేసిందని కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకులు పలువురు ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాన్నంతా కాషాయ మయం చేయాలన్న ఉద్దేశ్యంగా ప్రతిపక్షాల గొంతునొక్కడంలో భాగంగానే సిబిఐ, ఇడి సంస్థలను ఉసిగొల్పుతున్నదంటున్నారు. అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు ఇదికొత్తేమీకాదు కాని, గత ప్రభుత్వాలతో పోలిస్తే నేటి బిజెపి ప్రభుత్వంలో ఆ మోతాదు కాస్తా ఎక్కువే అయింది.

గత ప్రభుత్వం తమపై చేపట్టిన చర్యలకు ప్రతిగా కక్ష సాధింపు చర్యలుగానే కనిపిస్తున్నాయిగాని, విశాల భావనన్నది అధికారంలోకి వొస్తున్న ప్రభుత్వాలకు లేకుండా పోతున్నదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇంతకు ముందు యుపిఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేటి ప్రధాని, ఆనాటి గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ఇడి విచారణను అనేక గంటలపాటు ఎదుర్కున్నారు. అలాగే ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్‌షా, అంతకుముందు బిజెపి సీనియర్‌ ‌నేత అద్వాని కూడా ఇడి ముందు హాజరుకాక తప్పలేదని చెబుతున్నారు. దీని దృష్ట్యా ఎవరైనా తమపై వచ్చిన ఆరోపణలకు క్లీన్‌ ‌చీట్‌ ఇచ్చుకోకతప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాంగ్రెస్‌ ‌శ్రేణులు మాత్రం రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రతిపత్తిగల సంస్థలతో తమమీద బిజెపి దాడులు చేయిస్తున్నదని ఆరోపిస్తున్నారు. కాగా రాహుల్‌ ఇడి అధికారులముందు గత రెండు రోజులుగా హాజరవుతున్నారు. అయితే విచారణపేరున రాహుల్‌ను ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న అనుమానం కాంగ్రెస్‌లో ఏర్పడింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఆ పార్టీ వర్గాలు చేపట్టాయి. దిల్లీ నుండి గల్లి వరకు గత రెండు రోజులుగా ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నారు. ఇందులో కిందిస్థాయి కార్యకర్తలు మొదలు జాతీయ స్థాయిలోని సీనియర్‌ ‌నాయకులు పాల్గొంటున్నారు. దిల్ల్లీలోని ఏఐసిసి కార్యాలయంలోకి ఆ పార్టీ నేతలను రాకుండా పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకు దిగిన సీనియర్‌ ‌నేతలు, కార్యకర్తలు వేలసంఖ్యలో ఆరెస్టులయ్యారు. ఈ సందర్భంగా వారు ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌, ‌రాహుల్‌ ‌తుమ్‌ ‌లడో.. హమ్‌ ‌తుమారా సాత్‌ ‌హై, సత్యమేవ జయతే లాంటి నినాదాలు చేశారు. ఈ జరిగిన ఘర్షణలో చిదంబరం లాంటి సీనియర్‌ ‌నాయకుడి భుజం ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తున్నది. మోదీ మరో బ్రిటీషు ప్రభుత్వాన్ని తలపిస్తున్నారని వారు కామెంట్‌ ‌చేస్తున్నారు.

అసలే సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు ఇడి పిలుపు మరో పెద్ద షాక్‌గా మారింది. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎవరినైతే చూపించుకుంటూ ఇంతకాలం రాజకీయం చేస్తున్నదో ఇప్పుడు వారిద్దరిపైన అవినీతి ఆరోపణరావడంతో ఇప్పుడాపార్టీకి కక్కలేక మింగలేని పరిస్థితి ఏర్పడింది. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని కాంగ్రెస్‌ ‌కొట్టిపారేస్తున్నప్పటికీ , రానున్న ఎన్నికలకు ఇది బిజెపికి ఆయుధంగా మారుతుందనడంలో ఏమాత్రం సందేహంలేదు. 2014 నుండి కాంగ్రెస్‌ ‌ప్రతిష్ట రోజురోజుకు దిగజారి పోతున్నది. 2014లో జరిగిన ఎన్నికల్లో కేవలం 44 ఎంపి స్థానాలను మాత్రమే కాంగ్రెస్‌ ‌గెలుచుకుంది. అ తర్వాత 2019లో కేవలం 52 స్థానాలకే పరిమితమయింది. అదికాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికారంలోఉన్న ఆ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ రెండు రాష్ట్రాలకే పరిమితమయింది. అందుకు సంస్థాగతంగా ఆ పార్టీ బలంగా లేకపోవడమే కారణమని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే తాజాగా రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఇటీవల జరిగిన చింతన్‌ ‌శిబిరం ఆ పార్టీకి కొంత స్థైర్యాన్నిచ్చింది. పార్టీని పూర్వ వైభవంలోకి తీసుకురావాలని ఆ సమావేశం దృఢ సంకల్పంచేసింది. ఇందులో భాగంగా రాహుల్‌ ‌కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి యాత్ర చేయడంకూడా ఆ పార్టీకి శక్తినిచ్చే నిర్ణయం. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో రాహుల్‌ ‌గాంధీ తరుచు కేంద్రం తప్పులను ఎత్తిచూపిస్తుండడంతో ఆయన గొంతు నొక్కాలని బిజెపి తప్పుడు కేసులు బనాయిస్తున్నదని కాంగ్రెస్‌ ‌నేతలంటున్నారు. భారత భూభాగాన్ని చైనా చేజిక్కించుకోవడంపైన, ద్రవ్వోల్బణం, ఇందన పెంపు, నిరుద్యోగం, మతపరమైన విషయాలపై ఎప్పటికప్పుడు మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడనే ఈ కేసులద్వారా బిజెపి అడ్డుకోవాలని చూస్తోందంటున్నారు. ఏదిఏమైనా కాగ్రెస్‌ ‌పార్టీకి దేశవ్యాప్తంగా ఈ సంఘటన చెడుకన్న మేలే ఎక్కువ చేస్తుందని, బిజెపి కక్షసాధింపు ఎలా ఉంటుందో దేశ ప్రజలకు తెలియజెప్పే అవకాశంగా ఇది ఒక విధంగా ఆ పార్టీకి మేలే చేస్తుందంటున్నారు విశ్లేషకులు.

ED summons to Congress plus or minusprajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment