రాజ్యసభ సెక్రటరీకి పత్రాలు దాఖలు
బిజెపి, ఎన్డీఎ నేతలు వెంటరాగా ఆర్బాటంగా నామినేషన్
మోడీ తదితరులు ప్రతిపాదన..బలపర్చిన రాజ్‌నాథ్ సింగ్ తదితరులు
బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసిపి
కార్యక్రమంలో పాల్గొన్న యోగి తదితర సిఎంలు
నామినేషన్‌కు ముందు పార్లమెంట్ వద్ద గాంధీ, అంబేడ్కర్లకు ముర్ము నివాళి
న్యూ దిల్లీ, జూన్ 24 : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ వేశారు. బిజెపి అతిరథ మహారథులు వెంటరాగా ఆమె అట్టహాసంగా రాజ్యసభ సెక్రటేరియట్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, యూపి సిఎం యోగి ఆదిత్యానాథ్ సహా బీజేపీ పాలిత సీఎంలు హాజరయ్యారు. ఇక బీజేడికి చెందిన ఇద్దరు మంత్రులు ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతుగా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. మరోవైపు ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతు ప్రకటించారు. నామినేషన్ పత్రాలపై వైసీపీ ఎంపీలు విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి సంతకాలు చేశారు. తొలిసారిగా ఓ గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం రావడం మంచి పరిణామమని జగన్ అన్నారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాల దగ్గర పూలు వేసి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. నామినేషన్ కార్యక్రమం తర్వాత వివిధ రాష్ట్రాల్లో ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. జులై 1 నుంచి రాష్ట్రాల టూర్‌కు వెళ్లనున్నారు. రోజుకు రెండు రాష్ట్రాల్లో పర్యటించేలా షెడ్యూల్ రెడీ చేస్తున్నారు బీజేపీ ముఖ్య నేతలు. జూలై 18 న రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగనుంది.
మొదటగా ప్రధాని ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ తర్వాత నామినేషన్ పత్రాలను 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరిచారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము.. పార్లమెంట్ ఆవరణలో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలకు నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ, డా.బీ.ఆర్. అంబేడ్కర్, బిర్సా ముండా విగ్రహాల వద్ద ముర్ము..అంజలి ఘటించారు. నామపత్రాల దాఖలుకు ఒకరోజు ముందుగా గురువారమే దిల్లీకి చేరుకున్న ముర్ము.. ఒడిశా భవన్లో బస చేశారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో పలు పార్టీల నాయకులు, అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. గిరిజన నృత్యాలతో, సంప్రదాయ దుస్తులతో వొచ్చిన అభిమానులతో అక్కడంతా కోలాహలం కనిపించింది. దిల్లీకి చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాతో ముర్ము భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధానమంత్రి నివాసానికి ఆమె వెళ్లి, తనను దేశ అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె ఎంపికను సమాజంలోని అన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయని ప్రధాని ట్వీట్ చేశారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా.. అదే నెల 21న ఫలితం వెలువడనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24న ముగియ నుంది.