నరమేధం చిచ్చుకు ఇండియా ఎంత దూరంలో ఉన్నట్లు ..?

స్టెంటన్‌ ‌చెప్పినట్లు ఇండియాను హిందూ దేశంగా ప్రకటించాలన్న హిందుత్వ వాదుల ఆలోచన ఇండియా చరిత్రకూ..ఇండియా రాజ్యాంగానికీ విరుద్ధం. బీజెపి ఏలుబడిలో దానిని మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. జెనొసైడ్‌ అనేది ఒకేసారి  జరిగేది కాదు. అదొక పరిణామక్రమం..ప్రాసెస్‌ అం‌టారు ప్రొఫెసర్‌ ‌స్టాంటన్‌. ఆ ‌లెక్క ప్రకారం ఇండియాలో ఇప్పటికే ఆ ప్రాసెస్‌ ‌ప్రారంభమయింది.

ప్రొఫెసర్‌ ‌గ్రెగరీ స్టాంటన్‌ అధ్యయనం చేసేది, బోధించేది దేని గురించో వింటే కాస్త విచిత్రంగా ఉంటుంది. ఆయన జెనొసైడ్‌ ఎక్స్ ‌పర్ట్. ‌జెనొసైడ్‌ అం‌టే జాతి విధ్వంసం, సామూహిక హత్యాకాండ,  ఊచకోత, నరమేధం. కొద్ది వారాల క్రితం హరిద్వార్‌ ‌లో హిందుత్వ వాదులు కొందరు పిలుపు నిచ్చారు చూడండి అది.. జెనొసైడ్‌ అం‌టే..! స్టాంటన్‌ ‌జెనొసైడ్‌ ‌వాచ్‌ అనే ఒక సంస్థను స్థాపించి దాని ప్రెసిడెంట్‌ ‌గా కొనసాగుతున్నారు. 1994లో జరిగిన రువాండా ఊచకోతకు అయిదేళ్ల ముందు ప్రొఫెసర్‌ ‌స్టెంటన్‌ అక్కడ ఊచకోత సంభవిస్తుందని హెచ్చరించారు. 1989లోనే స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జువెనల్‌ ‌హబ్యారిమనాను హెచ్చరించారు. 1994లో హబ్యారిమనా హత్యతో ఊచకోత నిప్పంటుకుంది. వంద రోజుల్లో దాదాపు ఎనిమిది లక్షల మంది టుట్సు జాతి పౌరులను హతమార్చారు. ఆ వంద రోజుల్లో రెండున్నర  లక్షల నుంచి అయిదు లక్షల మంది మహిళలను రేప్‌ ‌చేసి ఉంటారని ఒక అంచనా. ఆ ఊచకోతను ముందే ఊహించిన ప్రొఫెసర్‌ ‌స్టెంటన్‌ ఇప్పుడు ఇండియాలో అలాంటి జెనొసైడ్‌ ‌చోటు చేసుకోవచ్చని అంటున్నారు.

గత నెలలో హరిద్వార్‌ ‌లో జరిగిన ధర్మసంసద్‌ ‌లో కొందరు స్వామీజీలు దేశంలో ముస్లింల ఊచకోతకు  పిలుపు నిచ్చిన మీదట మొన్న అమెరికాలోని భారతీయులు, జెనొసైడ్‌ ‌వాచ్‌, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ‌వంటి సంస్థలూ  రంగంలోకి దిగాయి. వాషింగ్టన్‌ ‌లో వారి ఆధ్వర్యంలో మొన్న బుధవారం జరిగిన  కాంగ్రెషనల్‌ ‌బ్రీఫింగ్‌  ‌లో ప్రొఫెసర్‌ ‌స్టాంటన్‌ ‌మాట్లాడారు. ఈ అంశంపై అమెరికా కాంగ్రెస్‌ ‌విచారణ కోసం వీరు ప్రయత్నిస్తున్నారు. హరిద్వార్‌ ‌విద్వేష ప్రసంగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించి ఉన్నట్లయితే మరో విధంగా ఉండేది.
సామూహిక హత్యాకాండ జరిగే అవకాశాలున్న ప్రపంచ దేశాల జాబితాలో ఇండియా రెండవ స్థానంలో ఉంది.  అమెరికా హోలోకాస్ట్ ‌మెమోరియల్‌ ‌మ్యూజియం రూపొందించింది ఈ జాబితా. పాకిస్థాన్‌ ‌మొదటి స్థానంలో ఉంది. కాంగ్రెషనల్‌ ‌బ్రీఫింగ్‌ ‌లో మాట్లాడిన ప్రొఫెసర్‌ ‌స్టెంటన్‌ ‌మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్లో జరిగిన సామూహిక హత్యాకాండ గురించి కూడా ప్రస్తావించారు. తన రాజకీయ పలుకుబడిని పెంచుకోవడం కోసం మోదీ ముస్లిం వ్యతిరేక ప్రచారంపై, ముస్లింల పట్ల భయాన్ని రేకెత్తించే ప్రచారంపై..ఇస్లామోఫోబియా.. ఆధారపడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మన పొరుగున ఉన్న మైన్మార్‌ ‌లో రోహింగ్యా ముస్లింలను ఊచకోత కోసేముందు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు ఇండియాలో ముస్లింలకు సంబంధించి అదే జరుగుతుందని ఆయన అంటారు. స్టాంటన్‌ ‌లెక్క ప్రకారం జమ్ము కశ్మీర్‌ ‌రాష్ట్రం ప్రత్యేక హోదా రద్దు, పౌరసత్వ  సవరణ చట్టం ఆమోదం ఈ దిశగా జరిగిన ప్రయత్నాలు. పౌర•సత్వ సవరణ చట్టం పొరుగున ఉన్న పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ ‌నుంచి వచ్చే హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు వీలు కల్పిస్తుంది. మరోపక్క అస్సాంలో ప్రయోగించి చూసిన ఎన్‌ఆర్సి.. నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌సిటిజెన్స్.. ‌వల్ల 1971కు ముందు నుంచీ తాము ఇండియలో ఉన్నామని నిరూపించుకోలేని వారు పౌరసత్వం కోల్పోతారు. ఇది ప్రధానంగా ముస్లింలను ఏరివేసేందుకు ఉద్దేశించిన ప్రక్రియ. అయితే మోదీ ప్రభుత్వం ఎదురుచూడని విధంగా అస్సాం ఎన్‌ఆర్సిలో తగిన పౌరసత్వం పత్రాలు సమర్పించలేకపోయిన 19 లక్షల మందిలో మెజారిటీ హిందువులు.

సరే.. అదలా ఉంచుందాం..! స్టెంటన్‌ ‌చెప్పినట్లు ఇండియాను హిందూ దేశంగా ప్రకటించాలన్న హిందుత్వ వాదుల ఆలోచన ఇండియా చరిత్రకూ..ఇండియా రాజ్యాంగానికీ విరుద్ధం. బీజెపి ఏలుబడిలో దానిని మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. జెనొసైడ్‌ అనేది ఒకేసారి  జరిగేది కాదు. అదొక పరిణామక్రమం..ప్రాసెస్‌ అం‌టారు ప్రొఫెసర్‌ ‌స్టాంటన్‌. ఆ ‌లెక్క ప్రకారం ఇండియాలో ఇప్పటికే ఆ ప్రాసెస్‌ ‌ప్రారంభమయింది. జెనొసైడ్‌ ‌కు టార్గెట్‌ ‌చేసిన గ్రూప్‌ ‌ను మొదట హేళన చేయడం, వారి పట్ల వివిక్ష చూపడం, వారిపై విద్వేష ప్రచారం చేయడం, వారి పట్ల సమాజంలో నిర్హేతుకమైన భయాందోళనలు రేకెత్తించడం, వారిని ఏకాకులు చేసేందుకు ప్రయత్నించడం, వారిని సమాజంలో భాగంగా కాకుండా విడిగా ఓ మూలకు తోయడం ఈ ప్రాసెస్‌ ‌లో భాగాలు. ముంబై వంటి నగరాలలో ఇప్పటికే ఎక్కడబడితే అక్కడ ముస్లింలకు ఇళ్లు అద్దెకు ఇవ్వడం లేదు. కొన్ని ప్రాంతాలలో మాత్రమే వారికి ఇళ్లు అద్దెకు దొరుకుతాయి. ముస్లింలు అపార్ట్ ‌మెంట్లు కొనుగోలు చేయాలన్నా ఇదే పరిస్థితి. దీనినే ఘెట్టోఐజేషన్‌ అం‌టారు. మైనారిటీలను ఒక ప్రాంతానికి పరిమితం చేస్తే ఆ ప్రాంతాన్ని ఘెట్టో అంటారు. అలా పరిమితం చేయడానని ఘెట్టోఐజేషన్‌ అం‌టారు. నాజీ జర్మనీలో యూదులను ఊచకోత ముందు వారిని ఈ ఘెట్టోలకే పరిమితం చేశారు.

గుజరాత్‌ ‌లో అమలులో ఉన్న ఒక చట్టం గురించి ఎక్కుమందికి తెలియకపోవచ్చు. క్లుప్తంగా పరిచయం చేస్తాను. ఆ చట్టం ప్రకారం కల్లోల ప్రాంతాల్లో..డిస్టర్బడ్‌ ఏరియాస్‌..‌స్థిరాస్తుల క్రయవిక్రయాలు కలెక్టర్‌ అనుమతి లేకుండా జరపకూడదు. ఆ డిస్టర్బడ్‌ ఏరియాలను నోటిఫై చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అపరిమితమైన హక్కులు ఉన్నాయి. 2002 తర్వాత గుజరాత్‌ ‌లో చెప్పుకోదగిన మత కలహాలు లేకపోయినప్పటికీ అక్కడ ప్రస్తుతం 700 కు పైగా ప్రాంతాలు డిస్టర్బడ్‌ ఏరియాలు గా నోటిఫై అయి ఉన్నాయి. ఈ చట్టం ఉద్దేశం ముస్లింలు ఎక్కడ బడితే అక్కడ ఆస్థులు కొనకుండా చూడడమే. తమ ఆస్థులు విక్రయించేందుకు ప్రయత్నించే ముస్లింలు కూడా ఈ చట్టం కింద ఇబ్బందులకు లోనవుతున్నారు. ఇదంతా కూడా ఘెట్టోఐజేషన్‌ ‌లో భాగమే. ఇక ముస్లింల పట్ల హేళన, వివిక్ష, విద్వేషం ఏ విధంగా సాగుతున్నదీ నేను ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.
ఉత్తర భారత దేశంలో 2014 మొదలుకొని మొన్నటి హరిద్వార్‌ ‌ధర్మసంసద్‌ ‌వరకూ క్రమం తప్పకుండా సంభవిస్తున్న పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తే ఇండియాలో జెనొసైడ్‌ ‌ప్రాసెస్‌ ‌ప్రారంభమయిందని చెప్పక తప్పదు. జెనొసైడ్‌ అనే పదాన్ని మొదటిసారిగా పోలెండ్‌ ‌కు చెందిన న్యాయవాది రఫేల్‌ ‌లెమ్కిన్‌ 1944‌లో ప్రయోగించారు.. కాయిన్‌ ‌చేశారు.

నాజీ జర్మనీలో, జర్మన్‌ ఆ‌క్రమిత యూరప్‌ ‌లో సాగిన యూదుల నరమేధం విషయంలో ఆయన ఈ పదాన్ని కాయిన్‌ ‌చేసి వాడారు. హిట్లర్‌ ‌నాయకత్వంలోని నాజీ పార్టీ  ప్రభుత్వ యంత్రాంగం 1941 నుంచి 1945 మధ్య దాదాపు 60 లక్షల మంది యూదులను హతమార్చింది. ఈ ఊచకోతను తర్వాత హోలోకాస్ట్ ‌గా అభివర్ణించారు. ఇప్పటికి కూడా అసలు హోలోకాస్ట్ ‌జరగనేలేదు పొమ్మనే యూదు వ్యతిరేకులు కొందరు ఉన్నారు. అయితే ఇవాళ జర్మనీ చట్టాల ప్రకారం హోలోకాస్ట్ ‌జరగలేదని అనడం కూడా నేరమే. హోలోకాస్ట్ ‌తర్వాత 50 ఏళ్లకు భయంకరమైన నరమేధం జరిగిన రువాండాలో కూడా ఇవాళ జెనొసైడ్‌ ‌సిద్ధాంతాలను నమ్మడం, ప్రచారం చేయడం నేరం. ప్రపంచంలోనే పెద్దదయిన ప్రజాస్వామ్య దేశంలో..విశ్వగురుగా మనం ప్రచారం చేసుకుంటున్న భారత్‌ ‌లో మాత్రం ఇవాళ హిందుత్వవాదులు జెనొసైడ్‌ ‌కు పిలుపునిస్తే దానిని ఖండిచడానికి కూడా పాలకులకు నోరు రావడం లేదు

గెస్ట్ ఎడిట్ ,ఆలపాటి సురేశ్ కుమార్ 
Dr Gregory Stantongenocidegregory stantanharidwar gujaratholocastindiaNRCpredicted Rwandan
Comments (0)
Add Comment