అమరావతి,జూన్ 25 : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ఎమ్మెల్సీ స్థానానికి మాణిక్య వరప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ ఏడాది ప్రారంభంలో శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అంతకుముందు ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు నామినేషన్ పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరి శంకర్రావు, ఉండవల్లి శ్రీదేవి, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వామిని కావాలని వైఎస్సార్సీపీలో చేరినట్లు డొక్కా ప్రకటించారు. జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నన్ను ఆకర్షించాయని పార్టీలో చేరిన సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.