ఉపాధ్యాయుల పై వివక్ష తగునా ! ?

‘‘దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపొందించబడుతుంది, జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం’’. ఇది ప్రముఖ విద్యావేత్త ప్రో.కొఠారి గారు చెప్పిన మాట. ప్రపంచం అంతా అంగీకరించే మాట. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఉపాధ్యాయ వృత్తిని ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తక్కువ చేసి చూడడం అలవాటు చేసుకుంటోంది . ఫిబ్రవరి 10న తెలుగు  ప్రధాన దినపత్రికలన్నీ ఉపాధ్యాయ వర్గం గూర్చి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా పేర్కొంటూ వారి పని దినాలు, వేతనాలు గూర్చి వార్త  ప్రచురించాయి.  ప్రభుత్వ పరోక్ష వ్యాఖ్యలు ఉపాధ్యాయ వృత్తిని అవమానపరచడం మాత్రమే కాకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఉపాధ్యాయుల పని దినాలు మిగతా ఉద్యోగుల పని దినాల కంటే తక్కువగా ఉన్నాయని, సంవత్సరంలో రెండు వందల ఇరవై దినాలకు మించకుండా పని చేస్తారని,  ఉపాధ్యాయులకు మిగతా ఉద్యోగుల కంటే తక్కువ పని ఒత్తిడి ఉంటుందని కాబట్టి మిగతా ఉద్యోగులు తో సమానంగా వేతన సవరణ చేయవలసిన (%=% )అవసరం ఎంతమాత్రం లేదని, మిగతా ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంచవలసిన అవసరం కూడా లేదని  ప్రభుత్వం భావిస్తున్నట్టుగా  వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం నేరుగా ఎక్కడ ప్రకటించనప్పటికీ అన్ని పత్రికలలో ఒకే రోజు ఒకే రకమైన వార్త వచ్చింది కాబట్టి  ప్రభుత్వమే అనధికారికంగా  లీకులు ఇచ్చినట్లుగా భావించవలసి వస్తుంది.

1964లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్‌ ‌దౌలత్‌ ‌సింగ్‌ ‌కొఠారి చైర్మన్‌ ‌గా దేశంలో ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు విద్యాభివృద్ధికి తగిన  విద్యావిధానం రూపొందించడానికి విద్యా కమిషన్‌ ‌వేశారు. ఈ విద్యా కమిషన్‌ 1966 ‌లో  నూతన విద్యావిధానం పేరుతో నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో  డా. కొఠారి గారు చాలా స్పష్టంగా ఉపాధ్యాయ వృత్తి యొక్క ప్రాముఖ్యతను, గొప్పదనాన్ని వివరించారు.  దేశ భవిష్యత్తు తరగతి  గదిలో రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి చాలా బాధ్యతాయుతమైనదని, సమాజ పరివర్తనకు బాటలు వేసేదని పేర్కొన్నారు. దేశానికి భవిష్యత్‌ ‌సంపద అయిన  భావి భారత పౌరులను, మెరుగైన మానవ వనరులను రూపొందించే పక్రియ లో భాగస్వాములైన ఉపాధ్యాయులు  ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటే వృత్తికి న్యాయం చేయలేరని , దీన్ని అధిగమించాలంటే ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలు అందించాలని చెప్పారు. మెరుగైన వేతనాలు అందించడం ద్వారానే మేధస్సు, నైపుణ్యం ఉన్న వారిని ఉపాధ్యాయ వృత్తి వైపు ఆకర్షించగలమని, తద్వారా నాణ్యమైన మానవ వనరులను రూపొందించవచ్చని తెలిపారు. ఇది దేశాభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. దీనితోపాటు విద్యార్థులందరికీ కుల, మత, వర్గ, ఆర్థిక తేడాలు లేకుండా అందరికీ సమాన విద్య అందించాలంటే కామన్‌ ‌స్కూల్‌ ‌విధానం అమలు చేయాలని చెప్పారు. ఈ నూతన విద్యా విధానం ఎంతోమంది మేధావుల ప్రశంసలందుకుంది. కామన్‌ ‌స్కూల్‌ ‌విధానం రాజ్యాంగం లో పేర్కొన్న అందరికీ సమాన అవకాశాలు అనే భావనను సాకారం చేసే  విధంగా ఉందని అందరూ భావించారు. అప్పటి పార్లమెంట్‌ ‌కూడా దీన్ని ఆమోదించింది. ఈ రోజు వరకు  కూడా పాలకులు కామన్‌ ‌స్కూల్‌  ‌విధానాన్ని అమలు చేయకపోయినా దాని ప్రాధాన్యతను మాత్రం కాదనలేకపోయారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో తెలంగాణ ప్రభుత్వం కామన్‌ ‌స్కూల్‌ ‌విధానాన్ని అమలు చేస్తామని, ప్రయివేటు బడులను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చి దిద్దుతామని ప్రకటించింది. ప్రయివేటు పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాల వైపుగా విద్యార్థులు పరుగు పెట్టేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు మార్చివేస్తామని చెప్పింది. తెలంగాణ పౌర సమాజం ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి . విద్యా రంగంలో తెలంగాణ దేశంలోనే తలమానికం అవుతుందని ఆశ పడ్డారు. కానీ కాలక్రమంలో కామన్‌ ‌స్కూల్‌ ‌విధానం మరిచిపోయి అనేక దొంతరలు ఉన్న వివిధ రకాల పాఠశాలను కులాల పేరుతో, మతాల పేరుతో  నెలకొల్పుతూ కామన్‌ ‌స్కూల్‌ ‌విద్యావిధానాన్ని తుంగలో తొక్కింది.

ఈ ఆరున్నరెండ్లలో పాఠశాల మౌలిక వసతుల మెరుగు పరచడానికి ఒక్క రూపాయి కూడా అదనంగా విడుదల చేయలేదు. గడిచిన ఆరున్నరేండ్లలో ఒక్కసారి మాత్రమే ఉపాధ్యాయ నియామకం చేపట్టి 8792 పోస్టులు నింపింది. ఇంకా 10000 వేలకు పైగా %•+•% పోస్టులు, 7000 వేలకు పైగా స్కూల్‌ అసిస్టెంట్‌ ‌పోస్టులు, %+వీ-2000, వీజు-510, , ణ×జు•% లెక్షరర్లు-350,  ఖాళీలు ఉన్నాయి %జీ•%- 4000 కు పైగా ఖాళీలు ఉండగా కాంట్రాక్టు , గెస్ట్ ‌లెక్షరర్‌ ‌లతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. 60 శాతం ఖాళీలతో యూనివర్సిటీలు బోసిపోతున్నాయి.  సంపన్నులు ప్రయివేటు, కార్పోరెట్‌ ‌సంస్థలలో విద్యను కొనుక్కుంటున్నారు. బడుగు, బల హీన వర్గాలకు విద్యనందించే  ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నియామకాలు లేక, మౌలిక వసతులు లేక కునారిల్లు తిన్నాయి. తద్వారా బడుగులకు సంపన్నులతో సమానంగా ప్రమాణాలతో కూడిన విద్య ప్రశ్నార్ధకం అయింది.  అందరికి సమాన విద్య అనే భావన అటకెక్కింది. ఇదిలా ఉంటే 1 జూలై  2018 నుండి అమలు కావాల్సిన కొత్త %=% యింకా కొలిక్కి రాలేదు. 2జూన్‌ 2018 ‌నుండి %×=%,  15ఆగస్టు 2018 నుండి %=% అమలు చేస్తామని ముఖ్యమంత్రి  ఇచ్చిన మాటలు నీటి మూటలయ్యాయి.

ఈ హామీల ఉల్లంఘనను  ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నించడం మొదలు పెట్టాయి. అందరూ సంఘటితమై ఉద్యమానికి పిలుపు నిచ్చారు. ప్రమోషన్లు, కొత్త నియామకాలతో ఖాళీలు నింపాలన్నరు.  గతంలో ఇచ్చిన హామీలు అమలు  చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు.  ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని  తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకుంది. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒకటి కాదని, ప్రభుత్వ ఉద్యోగుల లాగా ఉపాధ్యాయులకు %=% ద్వారా వేతనాలు పెంచాల్సిన అవసరం లేదని వాపోతున్నది. ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని భావిభారత నిర్మాణం దగ్గర నుండి పనిదినాలు లెక్కించి జీతాలు లెక్కగట్టే  దినసరి కూలీలుగా పరిగణించే దశకు ప్రభుత్వం వచ్చింది. కొఠారి గారు 1993 లో మరణించారు. ఒకవేళ ఇప్పుడు ఉండి ఉంటే  ఉపాధ్యాయ వృత్తి పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరి చూసి గుండెపగిలి మరణించేవారు.

పార్ట్ ‌టైం ఉద్యోగాలు తెలంగాణలో ఉండవు అందరినీ పర్మినెంట్‌ ‌చేస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం అని హామీలిచ్చిన  ప్రభుత్వం వాటిని అమలు చేయడం అటుంచితే ఉన్న ఆధారాన్ని కూడా లాగేస్తున్నది. హౌసింగ్‌ ‌కార్పోరేషన్‌ ఉద్యోగులను తొలగించారు , గ్రామాల్లో ఉపాధిహామీ లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌ ‌లను తొలగించారు, ఆర్టీసీ  ఉసురు తీసి  ప్రజల్లో చులకన చేసారు, వీఆర్వోలను ఆరు నెలలుగా విధులకు దూరం పెట్టి  ఇప్పటికి ఎలాంటి విధులు అప్పగించ లేదు. ఇప్పుడు ఉపాధ్యాయులను పలుచన చేయడం మొదలు పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల  పాత్రను ఆకాశానికెత్తిన ఉద్యమ నాయకులు నేడు ప్రభుత్వాధినేతలుగా ఎదిగిన తర్వాత ఉపాధ్యాయులను తూలనాడడం ఏ విధంగా కూడా ఔచిత్యం కాదు.
ఒకే రకమైన విద్యార్హతలు కలిగి ఉండి, ఒకే నియామక పరీక్ష ద్వారా ఎంపిక కాబడి, ఒకే రకమైన విధులు నిర్వహిస్తూ  ప్రభుత్వ,  పంచాయతీ రాజ్‌ ఉపాధ్యాయులుగా వేర్వేరు యాజమాన్యాల కింద వేరు వేరు సర్వీస్‌ ‌నిబంధనలు కలిగి ఉండటం, అందరూ సమాన ప్రయోజనాలు, సమాన అవకాశాలు పొందకపోవడం అనేది వివక్షాపురితం.   దీన్ని అధిగమించడానికి అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా  1998 లో 505,  538 ఉత్తర్వుల ద్వారా ఏకీకృత సర్వీసు నిబంధనలు ఏర్పరిచి ప్రభుత్వ,  పంచాయతీ రాజ్‌ ఉపాధ్యాయులను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం జరిగింది. దాదాపు దశాబ్ద కాలం ఉమ్మడి సర్వీస్‌ ‌నిబంధనలు అమలు లో ఉండి పాఠశాల విద్యా రంగం కొంత గాడిన పడింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల , ప్రభుత్వ అనాసక్తత వల్ల ఈ ఉత్తర్వుల పై కోర్టులలో  స్టే రావడంతో మళ్లీ గందరగోళానికి తెరలేసింది. అప్పటి సమైక్యాంధ్ర ప్రదేశ్‌ ‌పాలకులు ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు నిబంధనల అమలులో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడానికి చొరవ చూపకపోవడం వల్ల విద్యారంగంలో మళ్లీ అనిశ్ఛితి ఏర్పడింది. ఈ సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి పలు సందర్భాలలో తెలంగాణ వస్తే అతిస్వల్పకాలంలో ఉపాధ్యాయుల ఏకీకృతసర్వీస్‌ ‌రూల్స్ ‌కు అడ్డంకులు తొలగించి సమస్యను పరిష్కరిస్తానని అనేక వేదికల మీద వాగ్దానం చేశారు. కానీ తెలంగాణ వచ్చి ఆరున్నర సంవత్సరాలు గడిచినా సమస్యను పరిష్కరించక పోగా ఉపాధ్యాయుల మధ్య,ఉద్యోగుల మధ్య వైషమ్యాలను పెంచే విధంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు కాదని స్థానిక సంస్థలకు అప్పగిస్తామని మాట్లాడడం చాలా బాధాకరం.

అభివృద్ధి చెందిన చాలా దేశాలలో ఉపాధ్యాయ వృత్తి చాలా ఉన్నతంగా భావిస్తారు. వారి జీతాలు కూడా ఇతర ఉద్యోగుల కంటే ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఉపాధ్యాయులు మిగతా ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్నతంగా గౌరవింప బడతారు.ఉపాధ్యాయుల పని దినాలు చాలా దేశాలలో మనకంటే తక్కువగా ఉంటాయి . అమెరికా-175 , ఫ్రాన్స్-162, ‌యూ కె-190 , ఫిన్లాండ్‌-190, ‌జపాన్‌-210,  ‌కెన్యా-190 పనిదినాలు.  ఏ దేశంలో కూడా ఉపాధ్యాయుని సేవలను  పనిదినాలతో కొలవరు. వారిని భావి సమాజ నిర్మాతలు గానే గౌరవిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమాన పరిచి తద్వారా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం చేసి విద్యారంగం నుండి క్రమంగా వైదొలిగే ఎత్తుగడలో భాగంగా ఉపాధ్యాయుల మీదకు బాణం ఎక్కు పెట్టింది. సమస్యలు పరిష్కరించలేని  ప్రభుత్వం ఉపాధ్యాయులతో మైండ్‌ ‌గేమ్‌ ఆడుతోంది. ఉపాధ్యాయులను మొదట ప్రభుత్వ ఉద్యోగుల నుండి వేరు చేసి, అనంతరం సామాన్య ప్రజలనుండి వేరు చేసి దోషులుగా చిత్రీకరించి,  ప్రభుత్వ పాఠశాలల నిర్విర్యానికి ఉపాధ్యాయులను బాధ్యులను చేయాలని కుయుక్తులు పన్నుతోంది. ఉపాధ్యాయుల భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని కాల్చదలచుకుంది. ఇది భవిష్యత్‌ ‌తరాలకు తీవ్ర నష్టం చేస్తుంది.

డి.శ్రీనివాస్‌
‌టీ పీ టీ ఎఫ్‌ ‌జనగామ జిల్లా అధ్యక్షులు
మొబైల్‌: 9848443617 ,    9248033617

Comments (0)
Add Comment